3, సెప్టెంబర్ 2020, గురువారం

ఇప్పుడిటు కల గంటి - అన్నమాచార్యుల వారి కృతి

ఇప్పుడిటు కల గంటినెల్ల లోకములకు
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి

అతిశయంబైన శేషాద్రి శిఖరంబు గంటి
ప్రతి లేని గోపుర ప్రభలు గంటి
శత కోటి సూర్య తేజములు వెలుగగ గంటి
చతురాశ్యు పొడగంటి చెయ్యన మేలుకొంటి

కనక రత్న కవాట కాంతులిరుగడ గంటి
ఘనమైన దీప సంఘములు గంటి
అనుపమ మణిమయమగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గ్రక్కున మేలుకొంటి

అరుదైన శంఖ చక్రాదులిరుగడ గంటి
సరిలేని అభయ హస్తము కంటి
తిరువేంకటచలావిభుని చూడగ గంటి
హరి గంటి గురు గంటి నంతట మేలుకొంటి

సమస్తలోకములకు తండ్రియైన శ్రీవేంకటాద్రీశుని ఇప్పుడే ఇక్కడే కలలో దర్శించినాను. ఎంతో ఉన్నతమైన శేషాద్రి శిఖరమును, అనుపమానమైన గోపురపు కాంతులను, వందకోట్ల సూర్య తేజములు వెలిగిన దృశ్యమును, నాలుగు చేతులు కలిగిన స్వామి రూపమును కాంచి ఇంతలో మేల్కొన్నాను. రెండు పక్కల రత్నములతో పొదగబడిన బంగారు ద్వారముల కాంతులను, గొప్ప దీపసమూహములను, సాటిలేని మణులతో పొదగబడిన కిరీటమును, బంగారు చేలములను కలిగిన స్వామిని దర్శించి, వెంటనే మేల్కొన్నాను. రెండు పక్కల అరుదైన శంఖచక్రములను, తిరుగులేని అభయ హస్తమును, శ్రీవేంకటాద్రీశుని రూపమును దర్శించినాను, ఆ శ్రీహరిని, మంత్రోపదేశము చేసిన గురువులు శఠగోప యతీంద్రులను కాంచినాను, అంతలోనే మేల్కొన్నాను.

అన్నమాచార్యుల వారికి స్వప్నంలో స్వామి సాక్షాత్కారమైన సందర్భంలో ఆయన నోట వెలువడిన సంకీర్తన ఇది. ఎంతటి సుకృతము ఆ వాగ్గేయకారునిది? నందకాంశులైన అన్నమయ్య భావపుష్పం ఇంత అద్భుతంగా వికసింది కాబట్టే మనకు దాదాపు 600 ఏళ్ల నాటి అనుభూతులు ఇంకా ఈ కర్మభూమిలో అలా ఆధ్యాత్మిక సుగంధాలు అలదుతూనే ఉన్నాయి. తీవ్రమైన ఆధ్యాత్మిక తాపము, దైవానుగ్రహ్ము ఉంటే తప్ప స్వప్న సాక్షాత్కారము కలుగదు. అందులోనూ కలియుగ దైవమైన శ్రీనివాసుని దర్శనం బహు దుర్లభం. చిన్న వయసులోనే అన్నమాచార్యుల వాఇర్కి ఆ దివ్యానుగ్రహం కలుగటం, దానిని ఆయన మనతో ఈ విధంగా పంచుకోవటం మన సుకృతమే. తిరుమల స్వామి వైభవాన్ని దర్శించి, దానిని మరింత పరిపుష్టం చేసి, ఆ క్షేత్ర ప్రాధాన్యతను ముందుండి నడిపించిన వారిలో భగవద్రామానుజులు, అన్నమాచార్యుల వారు, శ్రీకృష్ణ దేవరాయలు, హాథీరాం బాబా వంటి వారు అగ్రగణ్యులు. సంకీర్తనల ద్వారా స్వామి వైభవాన్ని మనకు సహస్ర విధాలా తెలియజేసిన అన్నమాచార్యుల వారికి ఈ జాతి ఎంతో ఋణపడి ఉంది. ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి