చక్కని తల్లికి చాంగు భళా తన చక్కెర మోవికి చాంగు భళా
కులికెటి మురిపెపు గుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగు భళా
పలుకుల సొలపుల పతితో గసరెడి చలముల యలుకకు చాంగు భళా
కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు భళా
ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగు భళా
జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు భళా
విందై వేంకట విభు బెనచిన తన సంది దండలకు చాంగు భళా
తీయనైన అధరములు కలిగిన చక్కనైన తల్లికి జయము జయము! మురిపెము కుమ్మరించే కులుకులతో, గుచ్చేటి చూపులు కలిగిన తల్లికి జయము జయము. విముఖమైన పలుకులతో వేంకటపతిని సరసముగా తిరస్కరించే, పట్టుదలతో కూడిన అలకలు కలిగిన తల్లికి జయము జయము. వీణ ధరించి పతి పక్కన నిలచి మెరిసేటి స్తనములు కలిగిన తల్లికి జయము జయము. ఉన్నతుడైన పతిపైకి ఒరిగి నిలిచే సన్నని నడుము కలిగిన తల్లికి జయము జయము. బంగారపు ముత్యాల వరుసల హారములు, చందనపు సువాసనలు కలిగిన తల్లికి జయము జయము. పతియైన వేంకటేశ్వరుని మధ్యలోని దండలతో విందుగా పెనవేసుకుని యున్న తల్లికి జయము జయము.
పాడి రాగంలో కూర్చబడిన ఈ కృతిని సుధా రఘునాథన్ గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి