మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినము దుఃఖమొందనేల?
జుట్టెడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి
వట్టి లంపటము వదల నేరడు గాన
అందరిలోపుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పదమందెనటు గాన
మనిషిగా పుట్టి ఇంకొక మనిషిని సేవించి ప్రతి రోజు దుఃఖము పొందుట ఎందుకు? జానెడు కడుపుకోసం పనికిమాలిన పనులు చేసి, పిడికిలి అన్నము కోసం ఇతరులను బతిమాలి, కామముతో మనం జన్మించిన స్థానంపైనే ధ్యాస కలిగి, వట్టి బంధనములను వదలలేడు ఈ మనిషి. అందరిలో జన్మించి, అందరిలోనూ తానే ఉండి, అందరి రూపములు కూడా తానేయై, అందమైన శ్రెవేంకటేశ్వరుని సేవిస్తే దుర్లభమైన మోక్షపదము కూడా అందగలదు.
జుట్టెడు కూటికోసం మనం పడే పాట్లు, శారీరిక సుఖాలకోసం తపన, పనికిమాలిన లంపటాలను వదిలించుకోలేని దుస్థితి..... మనం ఏం చేస్తున్నామో, దేనికోసం వెంపర్లాడుతున్నామో, ఏమి చేస్తే మంచిదో అన్నీ చక్కగా చెప్పేశారు అన్నమయ్య. చేయాల్సింది చేస్తే అందరాని పదములు అందుబాట్లోకి వస్తాయి అని ఒక్క వాక్యంలో తెలిపారు. ఆభోగి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి