గంగాపుత్రుడు, అగ్నిగర్భుడు,రెల్లుగడ్డిపై జన్మించిన వాడు, జ్ఞానశక్తి కలిగిన కుమారుడు, పరబ్రహ్మ స్వరూపుడు, స్కందుడు, గుహ్యమైన తత్త్వముతో నిర్మలమైన గుణములు కలవాడు, రుద్రతేజస్వరూపుడు, సేనాపతి, తారకాసురుని సంహరించినవాడు, గురువు, అచంచలమైన బుద్ధి కలవాడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యుడూ, మయూరవాహనుడు, రథసహితుడైన దేవదేవునికి నమస్కారములు.
గత వారంలో సుబ్రహ్మణ్య తత్త్వం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు స్వామి ముఖ్యమైన క్షేత్రాల వివరాలు. సుబ్రహ్మణ్యుడు ఆరుముఖములతో, పన్నెండు చేతులతో కొలువబడుతున్నాడు. ఆరుపడైవీడు అని పేరొందిన ఆరు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. ఇవి తిరుప్పరన్‌కుండ్రం, తిరుచెండూరు, పళని, స్వామిమలై, తిరుత్తణి, పళముదిర్చోళై.
1. తిరుప్పరన్‌కుండ్రం
ఇది మదురైకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఉంది. శూరపద్ముడు హతుడైన తరువాత స్కందుడు దేవతాసమూహంతో కలిసి తిరుచెండూరునుండి తిరుప్పరన్‌కుండ్రం వెళ్లాడు. ఇక్కడ ఇంద్రుని కోరికపై దేవసేనను వివాహమాడాడు. ఈ ప్రదేశంలోని పరాశరుని కుమారులు స్కందుని అనుగ్రహంతో విముక్తి పొందారు. పాండ్యరాజులు ఈ దేవాలయాన్ని 6వ శతాబ్దంలో కట్టించారు. ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యునితో పాటు శివుడు, విష్ణువు, దుర్గ, గణపతి ప్రధాన దేవతలు.
2. తిరుచెండూరు
తిరునెల్వేలికి 50 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు తూరుపు తీరాన ఉంది తిరుచెండూరు. స్కాందపురాణం ప్రకారం స్కందుడు, దేవతా సేనలతో ఈ ప్రదేశాన్ని తన స్థావరంగా చేసుకున్నాడు. ఇక్కడినుండే వీరభద్రుని తన దూతగా శూరపద్ముని వద్దకు పంపాడు. శూరపద్ముని సంహరించిన తరువాత ఇక్కడే నివసించాడు. స్కందషష్టి ఇక్కడి ప్రధాన ఉత్సవం. ఆ ఆరురోజుల సమయంలో భక్తులు ఇక్కడే ఉండి స్వామిని కొలుస్తారు. శూరపద్ముని సంహరించిన తరువాత స్కందుడు తన తండ్రిని కొలువాలని అభిలషించగా మయుడు ఇక్కడి దేవాలయం కట్టించాడని పురాణం చెబుతోంది. ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది డచ్ దొంగలు 17వ శతాబ్దంలో ఇక్కడి సుబ్రహ్మణ్యుని, నటరాజుని విగ్రహాలు బంగారంతో చేయబడినవని తలచి వాటిని దొంగిలించి కరిగించ ప్రయత్నం చేయగా అవి కరుగలేదు. వారు ఆ విగ్రహాలను సముద్రంలో తీసుకు వెళుతుండగా సముద్రం అల్లకల్లోలమవుతుంది. అప్పుడు ఆ నావికులు ఆ విగ్రహాలను సముద్రంలో పడవేస్తారు. విగ్రహాలు అపహరించబడ్డాయని అక్కడి ప్రాంతీయ పాలనాధికారి వడమలయప్ప పిళ్లయన్ తిరిగి కొత్తగా పంచలోహ విగ్రహాలు సిద్ధం చేయిస్తాడు. ఒకరోజు రాత్రి ఆయనకు కలలో స్వామి కనిపించి సముద్రంలో ఎక్కడైతే నిమ్మకాయ తేలుతూ కనబడుతుందో, గరుడుని ధ్వజము ఎగురుతూ ఉంటుందో అక్కడ వెదకమని చెబుతాడు. పిళ్లయన్ అక్కడ వెద్కించగా విగ్రహాలు దొరుకుతాయి. ఆనందంతో అతడు విగ్రహాలను పునః ప్రతిష్ఠ చేయిస్తాడు. తిర్చెండూరు అత్యంత మహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతోంది.
3. పళని
దిండిగల్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో కొండపై వెలసిన సుబ్రహ్మణ్య క్షేత్రం పళని. దండాయుధపాణిగా ఇక్కడ స్వామి కొలువబడుతున్నాడు. నవపాషాణాములచే ప్రత్యేకముగా చేయించబడిన విగ్రహం స్వామిది. ఒకసారి నారదుడు కైలాస పర్వతముపై ఉన్న పరమశివుని వద్దకు జ్ఞానఫలాన్ని తీసుకు వెళతాడు. పరమశివుడు తన కుమారులతో మూడు మార్లు ఎవరు ముందర ముల్లోకాలను చుట్టి వస్తారో వారికి ఆ ఫలాన్ని ఇస్తానని చెబుతాడు. వాయువేగంతో సుబ్రహ్మణ్యుడు తన నెమలి వాహనంపై మూడు సార్లు లోకాలను చుట్టి వస్తాడు. అప్పటికే గణపతి ఆ కార్యం పూర్తిచేశాడని తండ్రి చెప్పగా స్థూలకాయుడైన గణపతి అది ఎలా సాధ్యమైందని అని సుబ్రహ్మణ్యుడు ప్రశ్నిస్తాడు. తల్లిదండ్రుల ప్రదక్షిణ ద్వారా గణపతి దానిని సాధించాడు అని చెప్పి శివుడు ఆ ఫలాన్ని గణపతికి ఇస్తాడు. దీనితో సుబ్రహ్మణ్యుడు తన అహంకారానికి చింతించి తన వేషభూషలు వదిలి కౌపీనము, కర్రతో పళని కొండపై కఠోరమైన తపస్సు చేస్తాడు. గౌరీశంకరులు అతని తప్పసుకు మెచ్చి పళని ఓ భవ్యమైన క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని సుబ్రహ్మణ్యుని అనుగ్రహిస్తారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు కైలాసానికి తిరిగి వస్తాడు.
4. స్వామిమలై
కుంబకోణం సమీపంలో ఉన్న కొండ పేరు స్వామిమలై. భృగు మహర్షి శాపాన పరమశివుడు తన జ్ఞానశక్తిని కోల్పోగా సుబ్రహ్మణ్యుడు తండ్రికి గురువై శివగురునాథునిగా పేరొంది ప్రణవ మంత్రార్థాన్ని ఉపదేశించాడని, దానికి ప్రతీకగా చోళ రాజులు ఈ దేవాలయాన్ని 2వ శతాబ్దంలో నిర్మించాడు. 18వ శతాబ్దంలో ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధంలో ఈ దేవాలయం హైదర్ ఆలీ చేత పూర్తిగా ధ్వంసం కాగా తరువాత దానిని పునర్నిర్మించారు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు స్వామినాథునిగా కొలువబడుతున్నాడు.
5. తిరుత్తణి
వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యుడు చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో తిరుత్తణి క్షేత్రం ఉంది. ఇంతకు ముందు వ్యాసంలో చెప్పబడిన వల్లీసుబ్రహ్మణ్యుల గాథ జరిగింది ఇక్కడి సమీపంలోని వల్లిమలై కొండపైనే. వల్లితో వివాహం తరువాత దేవసేనతో కలిసి స్వామి ఇక్కడ తణిగై కొండపై నివసించాడు. ఈ క్షేత్రం సనాతనమైనది. విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని పోషించారు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారికి సుబ్రహ్మణ్యుడు ఓ ముసలివాని రూపంలో వచ్చి ఇక్కడి క్షేత్ర ప్రసాదాని తింపించాడుట. ఆ జ్ఞానశక్తితోనే దీక్షితులవారు గురుగుహ అన్న పదాన్ని తన ముద్రగా చేసుకున్నారు. ఇక్కడి స్వామిపైనే "శ్రీనాథాది గురుగుహో జయతి జయతి అని కృతిని రచించారు. ఇక్కడి బంగారు గోపురం ఎంతో ప్రసిద్ధి.
6. పళముదిర్చోళై
మదురైకి 20కిలోమీటర్ల దూరంలో ఉన్న విష్ణు క్షేత్రం అళగర్ కోయిల్. అక్కడి సమీపంలో దట్టమైన అడవుల మధ్య కొండపై సుబ్రహ్మణ్యుడు వల్లీదేవసేనా సమేతుడై వెలసిన క్షేత్రం ఇది. వల్లీ దేవితో వివాహానికి పూర్వం జరిగిన గాథలో కొంతభాగం పళముదిర్చోళైలో కూడా జరిగింది. ఈ క్షేత్రానికి శోలమలై అని కూడా పేరు. ఇక్కడ స్వామిని కురింజి నిళక్కిళవన్ అంటారు. ఇక్కడే స్వామి ప్రఖ్యాత యోగి అవ్వయ్యార్‌కు జ్ఞానబోధ చేశాడు. ఈ కొండకు వృషభాద్రి అని పేరు. తొలుత ఇక్కడ ఉన్న స్వామిని అళగర్ కోయిల్‌లోనే అర్చించి తరువాత పళముదిర్‌చోళైలో ప్రతిష్ఠించారు.
మొత్తం ఆరు క్షేత్రాలు కూడా కొండలపై పచ్చని ప్రకృతి మధ్య నిర్మించబడినవే. జ్ఞానసముపార్జనకు ఇటువంటి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నది ఆరుపడై వీడు క్షేత్రాల దర్శనం ద్వారా భక్తులు పొందిన అనుభూతులు, అనుభవాలు చెబుతున్నాయి. సంతాన ప్రాప్తికై, జ్ఞానప్రాప్తికి, ఆటంకాలు తొలగటానికి ఈ క్షేత్రాలలోని స్వామి ప్రసిద్ధి.
ఓం శరవణభవ!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి