దేవ! యీ తగవు దీర్చవయ్యా! వేవేలకునిది విన్నపమయ్యా!!
తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికి బోవునయా!
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడికేగుదురయ్యా!!
పొడుగుచు మనమున బొడమిన యాసలు అదననెక్కడికి నరుగునయా!
వొదుగుచు జలములనుండు మత్స్యములు పదపడి యేగతి బాసీనయ్యా!!
లలినొకటొకటికి లంకెలు నీవే అలరుచునేమని యందునయా!
బలు శ్రీవేంకటపతి నాయాత్మను గలిగితివెక్కడి కలుషములయ్యా!!
దేవా! నీకు వేవేల విన్నపాలు, ఈ తగవు కాస్త తీర్చవయ్యా! ఈ దేహములో మొలిచిన ఇంద్రియములు, ప్రేగులు క్షీణించి ఎక్కడికి పోవును? తల్లి చుట్టూ తిరిగే బిడ్డలు విడిచి ఎక్కడికేగుదురు? మనసులో మొలకెత్తిన ఆశలు పెరుగుతూ ఆ తరువాత ఎక్కడికి వెళతాయి? దాగుతూ నీటిలో ఉండే మత్స్యములు ఆ తరువాత ఏ గతి పొందును? క్రమక్రమముగా ఒకటికొకటి లంకెలు వేసేది నీవే, నేనేమని చెప్పేది? ఓ వేంకటనాథా! నీవే నా ఆత్మయైనప్పుడు ఈ కలుషములు ఎలా కలిగినాయి?
సావేరి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి