రామభక్తి సామ్రాజ్యంలో త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన నడవడిక, కీర్తనలు రాముని వైభవాన్ని, ఆయన భక్తిని చాటినవే. అటువంటి ఒక కీర్తన శ్రీరమ్య చిత్తాలంకార స్వరూప.
శ్రీ రమ్య చిత్తాలంకార స్వరూప బ్రోవుము
మారారి దేవేంద్ర పితామహాద్యష్ట దిక్పాల సేవ్య
సురేశారి జీవాపహర వర సోదర ధరాప శ్రీప
వరానంద నే నీవలె గానరా త్యాగరాజార్చిత పద
సీతాదేవి చిత్తమును అందముగా అలంకరించే రూపము గల శ్రీరామా! నన్ను బ్రోవుము. మన్మథుని వైరి అయిన శివుడు, దేవేంద్రుడు, బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులచే సేవించబడే శ్రీరామా! నన్ను బ్రోవుము. దేవేంద్రుని శత్రువైన మేఘనాధుని సంహరించిన లక్ష్మణుని సోదరుడవు, భూమండలమునకు చక్రవర్తివి, సీతాదేవికి పతివి, సచ్చిదానందస్వరూపుడవు, నీవంటి దైవమును నేను కానలేను, పరమశివునిచే అర్చించబడిన పదములు గల శ్రీరామా, నన్ను బ్రోవుము.
జయమనోహరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణగారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి