రారా చిన్నన్నా రారోరి చిన్నవాడ
రారా ముద్దులాడ రారోరి బాలకృష్ణ రారా! కృష్ణ రారా!!
కిందిచూపుల గిలిగించి ఆలమంద గొల్లెతల మరగించి
సందడి వలపించి జవరాండ్ల ఊరవిందవైనయట్టి వేడుక కాడ!
కొదలు మాటలనె గొణకుచు భూమి సుదతుల శిగ్గులు చూరాడి
చిదుకు చేష్టలనె చెణకుచు ముద్దు పెదవి చవులు చూపిన జాణకాడ!
కలికితనమునె కరగించి కాచి చెలులకాగిటనె చెలగి
లలనామణి యైన లక్కిమమ్మ తలచుక్క శ్రీవేంకటనాథుడైనవాడ!
చిన్ని నా బాలకృష్ణయ్యా! రారా! నిన్ను ముద్దాడాలని ఉంది రారా! నీ కొంటె కింది చూపులతో మమ్మల్ని గిలిగింతలు పెట్టేవు, గోకులాన్ని మైమరపిస్తూ, గోపికలను ఆకర్షించెదవు. సందడి చేస్తూ అందరినీ మురిపిస్తూ స్త్రీలకు కనువిందైన వేడుక వాడా రారా. తీయని మాటలతో చిన్నగా మాట్లాడుచు, గోపకాంతల చీరలు దోచి, చేత కర్రతో చేష్టలుడిగించుచు, ముద్దులను దోచుకునే నేర్పరి రారా! చక్కదనముతో గోపస్త్రీలను కరగించి, వారిని కౌగిట తమను తామే మరచేలా చేసే, నారీరత్నమైన లక్ష్మీదేవికి పూజనీయుడైన శ్రీవేంకటేశ్వరా రారా!
జంఝూటి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి