ఇటు గరుడని నీవెక్కినను
పట పట దిక్కులు బగ్గన పగిలె
ఎగసిన గరుడని యేపున 'ధా' యని
జిగిదొలక చబుకు చేసినను
నిగమాంతంబులు నిగమ సంఘములు
గగనము జగములు గడ గడ వడకె
బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నఖిలములు జర్జరితములై
తిరువున నలుగడ దిర దిర దిరిగె
పల్లించిన నీ పసిడి గురుడనిని
కెల్లున నీవెక్కినయపుడు
ఝల్లనె రాక్షస సమితి నీ మహిమ
వెల్లి మునుగుదురు వేంకటరమణా
ఓ వేంకటేశ్వరా! నీవు గరుత్మంతుని ఎక్కినపుడు దిక్కులన్నీ పటపటలాడుచు పగిలినట్లుగా పెద్ద శబ్దములు చేసేను. ఎగసిన గరుత్మంతుని విజృంభించి ధా అని కొరడా మెరుపులు మెరిసినట్లు ఝళిపించగా, వేదవేదాంతములు, ఆకాశము, ముల్లోకములు గడ గడ వణికెను. కాఠిన్యముతో నీవు గరుడుని వేగముగా తోలుచు కోపించితే అన్నియు ఢక్కము తిరిగినట్లు శబ్దము చేయుచు నాలుగుదిక్కులా తిరిగెను. జీనువేసిన బంగారు గరుడుని నీవు విజృంంభించి యెక్కినపుడు రాక్షసమూహము భయపడి నీ మహిమయనే ప్రవాహము మునిగెదరు.
(ఈ సంకీర్తన శ్రీహరి కల్క్యావతారము గురించి అని అర్థమవుతోంది. అధర్మము పేట్రేగినపుడు శ్రీహరి కోపోద్రిక్తుడై ధర్మస్థాపనకై ఉద్యుక్తుడైనప్పటి సన్నివేశం ఇది. ఇక్కడ వాహనంగా గరుత్మంతుడని చెప్పినా కూడా కీర్తనలో ఉపయోగించిన చబుక, పల్లించిన మొదలైన పదాలు కల్కి అవతారములోని అశ్వమునే సూచిస్తున్నాయి)
నాట రాగంలో కూర్చబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి