3, సెప్టెంబర్ 2020, గురువారం

రాజగోపాలం భజేహం - దీక్షితులవారి క్షేత్ర కృతి


 

రాజగోపాలం భజేహం రమా లీలం

తేజోమయ మోహనకరం దివ్యాంబరాది ధరం
గజరాజ పూజిత పదం గుణిజన నత గోవిందం

నారదాది కృత భజనం నాద లయాయుత సదనం
హరిద్రానదీ తీరం హత్యాది పాప హరం
పారిజాత తరు మూలం పంకజ నయన విశాలం
గురుగుహ నుత వనమాలం గోపీజనమాలోలం

భావం:

లక్ష్మీదేవితో కూడి లీలలు చేసే రాజగోపాలుని నేను భజించుచున్నాను. తేజోమయుడైన వాడు, అందమైన చేతులు కలవాడు, దివ్యమైన వస్త్రములు, ఆభరణములు ధరించినవాడు, గజేంద్రునిచే పూజించబడిన పదములు కలవాడు, సజ్జనులచే నుతించబడిన వాడు అయిన గోవిందుని నేను భజినంచుచున్నాను. నారదాదులచే భజింప్బడినవాడు, నాదము మరియు లయలో నిమగ్నుడై నిలచినవాడు, పారిజాతవృక్ష మూలమున నివసించేవాడు, కలువలవలె విశాలమైన కన్నులు కలవాడు, గురుగుహునిచే నుతించబడిన వాడు, తులసీమాల ధరించిన వాడు, గోపకులాన్ని రంజిల్లజేసేవాడు అయిన రాజగోపాలుని నేను భజించుచున్నాను.



క్షేత్ర వివరాలు:

దీక్షితుల వారు క్షేత్ర కృతులకు ప్రసిద్ధి అని గతంలో ప్రస్తావించాను. దక్షిణ భారత దేశంలో ఆయన చేయని తీర్థయాత్రలేదు, నుతించని దేవతాస్వరూపం లేదు. ఆయన జీవితమంతా ఇటువంటి అద్భుతమైన వివిధ దేవతల స్మరణతో, ఉపాసనలోనే సాగిపోయింది. అటువంటి ఒక కృతే ఈ రాజగోపాలస్వామిపై రచించినది. తిరువాయూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నార్‌గూడి ఓ అద్భుతమైన దేవాలయానికి ప్రసిద్ధి. అదే 10వ శతాబ్దంలో మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించిన రాజగోపాలస్వామి దేవస్థానం. మనోజ్ఞమైన శిల్పసంపదతో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఈ మందిరాన్ని తరువాత చోళ రాజులు మరియు తంజావూరు నాయకులు పునరుద్ధరించి పోషించారు. ఈ దేవాలయంలో 16 గోపురాలు, 7 ప్రాకారాలు, 7 మంటపాలు, 9 తీర్థాలు ఉన్నాయి. అన్నిటికన్నా ప్రసిద్ధి చెందినది ప్రధాన పుష్కరిణి హరిద్రానదీ తీర్థం. 1150 అడుగుల పొడవు, 830 అడుగుల వెడల్పైన ఈ తీర్థం ఈ క్షేత్రానికే తలమానికం. అలాగే వేయికాళ్ల మంటపం. ఇక్కడ స్వామి చేతిలో కొరడా కలిగిన గోవులను కాచే కృష్ణుడు, అమ్మవారు సెంగమల తాయార్ (లక్ష్మీదేవి). ఉత్సవ విగ్రహాలు శ్రీవిద్యారాజగోపాలుడు, రుక్మిణీ సత్యభామలు. ఫాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ రాజగోపాలుడు రాజమన్నార్‌గా కూడా పేరొందాడు.

మోహన రాగంలోని ఈ కృతిని అరుణా సాయిరాం గారు గానం చేశారు.

(చిత్రాలు మన్నార్‌గూడి రాజగోపాలుడు, ప్రధాన గోపురం, హరిద్రానదీ పుష్కరిణి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి