5, సెప్టెంబర్ 2020, శనివారం

రాముడు-సీత-రావణుడు: పరమాత్మ-జీవాత్మ-మనసు



మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

మనస్సే బంధములో పడుటకు, బంధము నుండి విడుటకు కూడా కారణము. ఆ మనస్సే రావణుడు. రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇతి రావణః. చెడు పలుకులను పలికించువాడు రావణుడు మనస్సే చెడు పలుకులను పలికించునది. అవి రెండు - 1. అహం 2. మమ. నేను-నాది అనేవి.

అనాత్మన్యాత్మబుద్ధిర్యా అస్వేస్వమితి యా మతిః
అవిద్యా తరుసంభూతి బీజమేతద్ద్విధా స్థితం

తాను కాని శరీరమును తానని అహంకరించుట, పరమాత్మదే అయి తనది కాని వస్తుజాతమును తనది యనుకొనుట అను ఈ రెండే అజ్ఞానమను వృక్షమునకు మూలమగు విత్తనము. ఈ మనస్సు అను రావణునికి కూడా రావణుని వలె పది ముఖములు కలవు. మనస్సు వెలుపలికి ప్రసరించు మార్గములే ఇంద్రియములు. అవి పది - ఐదు జ్ఞానేంద్రియములు (చర్మము, నేత్రము, చెవి, నాలుక, ముక్కు), ఐదు కర్మేంద్రియములు (వాక్కు, చేయి, పాదము, మలద్వారము, మూత్రద్వారము). ఈ పది మనస్సుకు ముఖములు. అందుచేత మనస్సు కూడా దశముఖుడే. అతడు పరిపాలించునది లంక, మనసు పరిపాలించునది శరీరము. శరీరము సంసారమనే సముద్రముచే చుట్టబడి యుండును, లంక నూరుయోజనముల సముద్రముచే చుట్టబడియున్నది. రాజస తామస సాత్విక చిత్త్రవృత్తులే రావణ కుంభకర్ణ విభీషణులు. రాజసవృత్తి గల రావణుడు లంకను పాలించునప్పుడు రాముని భార్యయైన సీత లంకయందు బంధించబడును. రాజసవృత్తి ప్రధానముగానున్నప్పుడు అవివేక పూర్ణమైన మనస్సు రామునికే శేషభూతమైనదియు, రామునిచేతనే రక్షించబడదగినదియు, రామునిచే అనుభూతి చెందబడదగినదియునగు ఆత్మను, అనగా సీతమ్మను, లంకలో బంధించును.

పరమాత్మయే రాముడు, ఆనందము కలవాడు, ఆనందమునిచ్చువాడు. ఆనంద స్వరూపుడగు పరమాత్మయే రామునిగా అవతరించును. రామశబ్దమునకు అర్థమదే. పరమాత్మ వసించు స్థానము, పరమపదము, వైకుంఠము. దానికే అయోధ్య - అపరాజిత అని పేర్లు కూడా కలవు. దేవానాం పూ రయోధ్యా అని వేదము చెప్పుచున్నది. ఆ రామునకు, జనకుని యజ్ఞ క్షేత్రములో దొరకిన సీత భార్యయగును. సీత జీవ స్వరూపమును నటించును. జన్మింపదు, దొరకును. న జాయతే మ్రియతే వా కదాచిత్ అని ఉపనిషత్తు చెప్పుచున్నది. జనకుని యజ్ఞ క్షేత్రము కర్మక్షేత్రమగు శరీరము. ఆ శరీరములో అన్వేషించిన లభించునది ఆత్మ. ఆ అత్మ భగవానునికే చెందినదై భగవానునికి భార్యయై ఉండు. భార్యకు భర్తతో గల సంబంధం జీవాత్మకు పరమాత్మతో గల సంబంధము సమానము. ఈ సంబంధము ఆరు విధాలుగా నుండును.

1. అనన్యార్హ శేషత్వము - వానికే తప్ప ఇతరులకు చెందనిదై యుండుట
2. అనన్య శరణత్వము - వాడే తప్ప వేరొకడు రక్షకుడుగా లేకుండుట
3. అనన్య భోగ్యత్వము - వానిచేతనే తప్ప ఇతరులచేత అనుభవింపరానిదయి యుండుట
4. తత్ సంశ్లేషైక సుఖిత్వము - వానితో కూడి యుండుటే సుఖముగా నుండుట
5. తద్విశ్లేషైక దుఃఖిత్వము - వాని యెడబాటే దుఃఖముగా నుండుట
6. తదేకనిర్వాహ్యత్వము - వాని చేతనే నడిపింపబడుట

ఈ ఆరు లక్షణములు గల భార్యగా సీత రామునితో చేరినది.

ఈ విధంగా పరమాత్మతో నున్న జీవుడు వలె సీతమ్మ రామునితో యున్నది.

అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా! - నేను రామునితో వేరైనదానను కాదు. సూర్యునితో కాంతివలె కలసియే యుందును అని సీతమ్మ సుందరకాండ 21వ సర్గలో పలుకుతుంది.

ఇదే సీతారాముల తత్త్వం, మానవ జీవన రహస్యాన్ని తెలిపేది సీతారాముల చరిత.

(మహామహోపాధ్యాయ, ప్రవచన శిరోమణి శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి సుందరకాండము - తత్త్వదీపిక నుండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి