4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

హెచ్చరికగా రారా హే రామచంద్ర - త్యాగరాజస్వామి కీర్తన


హెచ్చరికగా రారా హే రామచంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర

పచ్చవిల్తుని కన్న పాలిత సురేంద్ర

కనకమయమౌ మకుట కాంతి మెరయగను
ఘనమైన కుండల యుగంబు కదలగను
ఘనమైన నూపుర యుగంబు ఘల్లనగ
సనకాదులెల్ల గని సంతసిల్లగను

ఆణిముత్యాల సరులల్లలాడగను
వాణీపతీంద్రులిరు వరుస పొగడగను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణ పలుకులు వినుచు వేడ్క చెల్లగను

నిను జూడ వచ్చు భగిని కరంబు చిలుక
మనసు రంజిల్ల నీ మహిమలను బలుక
మిను వాసులెల్ల విరులను చాల జిలుక
ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక

సుగుణములకు నెలవైన ఓ శ్రీరామచంద్రా! హెచ్చరికగా వేంచేయుము. మన్మథుని కన్న తండ్రివి, ఇంద్రాదులను పాలించే వాడవు, హెచ్చరికగా వేంచేయుము. బంగారు కాంతులతో కిరీటము మెరయగా, శ్రేష్ఠమైన కుండలములు కదలగా, గొప్పవైన కాలి యందెలు ఘల్లనగా, సనకాదులు నిన్ను జూసి సంతోషించగా హెచ్చరికగా వేంచేయుము. మేలైన ముత్యాల సరులు అల్లలాడగా, బ్రహ్మేంద్రులు ఇరువైపుల పొగడుచుండగా, మాణిక్యములు పొదగబడిన మెట్లు ఎక్కి మెల్లగా వీణావాయిద్యములు వినుచు ఎంతో వేడుకగా హెచ్చరికగా వేంచేయుము. నిన్ను చూచుటకు నీ కొలువుకు వచ్చిన సోదరి పార్వతీదేవి కరమున చిలుక మనసునకు మోదము కలిగించేలా నీ మహిమలను పలుకుచుండగా, ఆకాశములో దేవతలు నీపై పుష్పవర్షము కురిపించగా, ఈ మనోహరమైన దృశ్యమును పరమేశ్వరుడు కాంచగా ముద్దులొలుకుచు హెచ్చరికగా వేంచేయుము శ్రీరామచంద్రా!

(శ్రీరామచంద్రమూర్తి తన కొలువునకు వచ్చే సమయములో ఇరువైపుల వంధిమాగధులు స్వామికి జయము పలుకుచు హెచ్చరికగా రమ్మని స్వాగతమిచ్చే అద్భుతమైన ఘట్టాన్ని త్యాగరాజస్వామి అనుభూతి చెంది ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు)

యదుకుల కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి