4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సాంగోపాంగ సంధ్యావందనం - ఎందుకు?


ఉద్యంతమస్తంయంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వణ్ బ్రాహ్మణో విద్వాన్ సకల భద్రమశ్నుతేऽసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద

ప్రొద్దున సూర్యుడుదయించుటకు ముందు, సాయంకాలము సూర్యుడస్తమించుటకు ముందు, సూర్యమండలమందు బ్రహ్మరుద్రవిష్ణు రూపములతో వెలయుచున్న పరబ్రహ్మచైతన్య స్వరూపిణి యగు సంధ్యాదేవతను ద్విజుడు అసావాదిత్యో బ్రహ్మ+సాऽహమస్మి అనే మంత్రములతో సంధ్యాదేవతను నేనే అనుకొనుచు ధ్యానింపవలెను. దానికి ముందు ఆ మంత్రముల యొక్క అర్థము చక్కగా తెలిసికొని, ఆ అర్థమును ఆ ధ్యానములో భావింపవలెను. ఈ విధముగా సంధ్యాదేవతను ధ్యానము చేసినచో బ్రాహ్మణుడు బ్రహ్మ జ్ఞానమును పొందును.

ఎలా?

బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి అన్న మంత్రములో దీనికి సమాధానం ఉంది. మానవుడు వాస్తవములో తాను పరబ్రహ్మయే అయియున్నను మాయచేత (అజ్ఞానమే మాయ) తాను జీవుడని దృఢమైన భ్రాంతిలో యుంటాడు. కానీ, సంధ్యాధ్యాన మంత్రము యొక్క అర్థము చక్కగా తెలుసుకొన్నచో ఆ అజ్ఞానము సగము తొలగి పోవును. ధ్యానము చేయగా చేయగా ఆ అజ్ఞానము పోయి, తాను పరబ్రహ్మ స్వరూపుడనే దృఢమైన జ్ఞానం కలిగి, తద్వారా మరింత తీవ్రముగా ధ్యానము చేయగా పరిపూర్ణ శుద్ధ అంతఃకరణముతో ఏదో ఒకనాడు పూర్వపుణ్యపరిపక్వము చేత హఠాత్తుగా బ్రహ్మసాక్షాత్కారము కలుగును. అదే జీవబ్రహ్మైక్యము అనగా మరుజన్మ లేని మోక్షం.

అసావాదిత్యో బ్రహ్మ సాऽహమస్మి అన్న మంత్రములో అసౌ+ఆదిత్యః, బ్రహ్మ, సా+అహం+అస్మి అన్న ఆరు పదముల యొక్క అర్థం తెలుసుకున్నందువలన తప్పక అజ్ఞానము తొలగి పోవును. మన అంతఃకరణము అనేకానేక పూర్వజన్మలలో చేసిన పాపములతో నిండియుంది కాబట్టి ధ్యానములో ఏకాగ్రత, మంత్ర భావము గోచరించుట కష్టం. అందుకే అంతఃకరణములోని పాపాలు పోవుటకు సంధ్యాదేవత ఉపాసనలో ధ్యానమునకు ముందు తరువాత ఆంగిక కర్మలను ప్రతిపాదించారు. దీనినే సాంగోపాంగ సంధ్యావందనమంటారు. దీని ప్రధాన ఉద్దేశం మన పాపములను తొలగించుకొని అంతఃకరణమును శుద్ధి చేసుకొనుట, తద్వారా సంధ్యాదేవత ధ్యానమును సాఫల్యము చేసుకొనుట, జీవబ్రహ్మైక్యము సాధించుట.

ఈ సాంగోపాంగములు రెండు రకాలు 1. పూర్వాంగములు 2. ఉత్తరాంగములు.

పూర్వాంగములు ఐదు 1. ప్రథమ మార్జనము 2. అబ్భక్షణము 3. పునర్మార్జనము 4. పాపపురుషదహనము 5. అర్ఘ్య ప్రక్షేపము.

పూర్వాంగ  కర్మల వివరాలు
-----------------------------------

సంధ్యావందనములో సంధ్యాదేవత ఉపాసన ముందు వెనుకల చేయబడే కర్మలను అంగములంటారు. ముందు చేయబడేవి పూర్వాంగములు, తరువాత చేయబడేవి ఉత్తరాంగములు. పూర్వాంగములు అయిదు 1. ప్రథ మార్జనము 2. అబ్భక్షణము (మంత్రాచమనము) 3. పునర్మార్జనము 4. పాపపురుష దహనము 5. అర్ఘ్య ప్రక్షేపము

1. ప్రథమ మార్జనము - ఓం ఆపో హి ష్ఠా మయో భువః తా న ఊర్జే దధాతన మొదలైన మంత్రములు చెప్పుచు తలమీద నీళ్లు చల్లుకొనుట. దీని వలన రజస్తమోగుణములచేత చేసిన పాపములము చాలామటుకు తొలగి పోవును.

2. అబ్భక్షణము (మంత్రాచమనము) - సూర్యశ్చ మామన్యుశ్చ మొదలైన మంత్రములచేత అభిమంత్రించిన జలమును త్రాగుట వలన లోపల సూక్ష్మ శరీరము చేత చేసిన పాపములు నాశనమగును.

3. ద్వితీయ మార్జనము - ఈ రెండవసారి చేయు మార్జనము చేత వెలుపలి శరీరము పూర్తిగా శుద్ధమగును.

4. పాపపురుష దహనము - లోపలి సూక్ష్మ శరీరములోని పాపములను ఒక పురుషాకృతితో వెలుపలకు తెచ్చి ఆ పాపపురుషుని దహించి వేయుట ఈ కర్మ. దీనిచేత లోని పాపములు నశించిపోవును.

5. అర్ఘ్య ప్రక్షేపము - ఈ విధముగా, లోపల మరియు బయట శుద్ధుడై మందేహ రాక్షసులతో సూర్యునకు కలిగిన యుద్ధోపద్రవమును పోగొట్టుటకు మూడు మార్లు అర్ఘ్యములు విడువవలెను. గాయత్రీ మంత్రము చేత అభిమంత్రించుట వలన బ్రహ్మాస్త్రముతో సమానమైన అర్ఘ్యములు ఆ రాక్షస నాశనము చేయగా సూర్యుని ఉపద్రవము తీరి సూర్యుడు స్వస్థ్యుడగును.

(మందేహారుణులు బ్రహ్మనుగూర్చి తపము ఆచరించి సూర్యునితో పోరాడునట్లు వరము పొందినవారు. వీరి సంహారార్థము త్రిసంధ్యలయందును బ్రాహ్మణులు గాయత్రిచే అభిమంత్రించిన అస్త్రములను అర్ఘ్యమూలముగా విడుతురు. వారు ఆయస్త్రములచేత సంహరింపబడినా వరదానమహిమచే పునర్జీవితులు అగుదురు)

తరువాత ప్రదక్షిణాచమనములు చేసి ఆ విధముగా స్వస్థమైన సూర్యమండలము లోపల హంసవాహన బ్రహ్మరూపముతోను, మధ్యాహ్న సమయమున వృషభవాహన రుద్రరూపముతోను, సాయంకాల సమయమున గరుడవాహన విష్ణు రూపముతోను, స్త్రీయాకారముతో వెలసే బ్రహ్మచైతన్య స్వరూపిణి యగు సంధ్యాదేవతను "అసావాదిత్యో బ్రహ్మ సऽహమస్మి" అనే మంత్రములతో మంత్రార్థమును బాగా భావన చేసుకొనుచు, ధ్యానించవలెను. ఈ ధ్యానమునే ఉపాసన అందురు. సంధ్యాదేవత పరబ్రహ్మస్వరూపిణి కనుక ఈ ధ్యానము బ్రహ్మ ధ్యానమగును. ఇది బ్రహ్మ ధ్యానము కాబట్టే ఈ ధ్యానము వలన బ్రహ్మజ్ఞానము కలిగి పరబ్రహ్మ సాక్షాత్కారమగును.

ఇక్కడ విశేషమేమిటంటే, ప్రతి కర్మలోని మంత్రానికి ఒక ఋషి, దేవత, ఛందస్సు, ఆ కర్మ యొక్క వివరములు కలిగిన వినియోగమును ముందు పఠించటం.

తొలుత మార్జన మంత్రానికి "ఆపోహిష్ఠేతి త్యచస్సాంబరీషః సింధుద్వీపఋషిః ఆపోదేవతా గాయత్రీ ఛందః మార్జనే వినియోగః: అన్నది,

తరువాత మంత్రాచనమునకు "సూర్యశ్చేతస్య మంత్రస్య యాజ్ఞవల్క్య ఉపనిషద్ ఋషిః సూర్యమన్యు మన్యుపతిరాత్రయో దేవతాః ప్రకృతిశ్ఛందః మంత్రాచమనే వినియోగః" అన్నది,

తరువాత పునర్మార్జనమునకు "ఆపోహిష్ఠేతి నవర్చస్య సూక్తస్య సింధుద్వీపో అంబరీషో వా ఋషిః ఆపో దేవతా గాయత్రీ ఛందః ద్వనుష్ఠుబంతం పంచమీ వర్ధమానా సప్తమీ ప్రతిష్ఠా అంతే ద్వే అనుష్టుభౌ మార్జనే వినియోగః" అన్నది,

తరువాత పాపపురుష దహనమునకు "ఋతంచ సత్యంచేత్యస్య మంత్రస్య అఘమర్షణ ఋషిః భావవృత్తో దేవతా అనుష్టుప్ ఛందః మమ పాపపురుష జల విసర్జనే వినియోగః" అన్నది,

తదుపరి అర్ఘ్యప్రదానానికి "ఓం తత్సవితురిత్యస్య మంత్రస్య గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా గాయత్రీ ఛందః ప్రాతః సంధ్యార్ఘ్య ప్రదానే వినియోగః"

అని వినియోగాలు ఋషులు, దేవతలు కర్మలతో స్పష్టంగా నిర్వచించబడ్డాయి. ఈ ఋషులు, మంత్రాలు ఆయా వేద శాఖలను బట్టి, ప్రాతః, మధ్యాహ్న, సాయం సంధ్యా కర్మ సమయమును బట్టి మారతాయి. ఉదాహరణకు నేను మాది ఋగ్వేదం కాబట్టి ఋగ్వేద మంత్రాలను ప్రస్తావించాను.

వీటి అర్థం ఏమిటి? నిత్యము - ఋషిప్రోక్తమైన మంత్రములను ఆయా దేవతలను తలచుకుంటూ, మనలను మనం శుద్ధి చేసుకుని ఉపాసనకు సిద్ధం చేసుకోవటమే. ఈ విధంగా, సంధ్యోపాసనలో మంత్రార్థము గ్రహించి, సాంగోపాసనలోని పూర్వభాగ కర్మలను శుచిగా అనుష్ఠించటం వలన మనలోని అంతర్బహి పాపములను తొలగించుకొని, సూర్యమండలమున సంధ్యాదేవతను ఉపాసన చేయటంతో బ్రహ్మజ్ఞాన ప్రాప్తి, పరబ్రహ్మ సాక్షాత్కారమునకు అర్హత కలుగుతుంది.

ఉత్తరాంగ కర్మల వివరాలు
----------------------------------

సంధ్యాదేవి ధ్యానము తరువాత పాపనివృత్తి కొరకు, దేవతల అనుగ్రహము కొరకు ఉత్తరాంగములను ఆచరించవలెను. ఇవి ఐదు.

1. గాయత్రీ జపము 2. సూర్యోపస్థానము 3. దిగ్దేవతా నమస్కారము 4. భూమ్యాకాశ వందనము 5. అభివాదనము.

1. గాయత్రీ మంత్ర జపము
====================

గాయత్రీ మంత్రమంతటి గొప్ప మంత్రం ఇంకొకటి లేదు అని అనేక శ్రుతి స్మృతి పురాణములు చెప్పుచున్నవి. ఈ గాయత్రీ మంత్ర జపంచేత పంచమహా పాతకములు కూడా పోతాయని శాస్త్రములు చెప్పుచున్నాయి. పగటి పాపములను పగలే, రాత్రి పాపములు రాత్రియే పోతాయని గాయత్రీ హృదయమే చెప్పుచున్నది. గాయత్రీ మాత సంధ్యాదేవతకు ప్రధానమంత్రిణి వంటిది. గాయత్రీదేవి ప్రసన్నురాలైనచో సంధ్యాదేవత శీఘ్రముగా ప్రసన్నురాలగును. బ్రహ్మవిష్ణు శివాత్మాత్మకమైన గాయత్రీ ధ్యానము అత్యంత శ్రేష్ఠము, సమస్త పాపహరణము.

ఈ గాయత్రీమంత్ర జపం అంగన్యాస కరన్యాసములతో 24 అక్షరాలకు 24 ముద్రలతో అనుస్ఠానం చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక సంపత్తిగా మనకు ఋషులు అందించారు. న్యాసము చేసేటప్పుడు బ్రహ్మాది దేవతలను తలచుకొనుచు మన దేహములో ఆ శక్తిని ఆయ స్థానములలో ఉంచి జపం చేస్తే వచ్చే ఫలితాలు అనుభవైకవేద్యం. బ్రహ్మచేత గ్రహింపబడిన ఋగ్యజుస్సామవేదములనే మూడు వేదములను మూడు పాదములుగా జేచి త్రిపాద గాయత్రీ మంత్రము కూర్చబడింది. అందుకే గాయత్రీ మంత్రము మూడు వేదముల సారము, గాయత్రీ మాత వేదమాతగా శ్రుతులు చెబుతున్నాయి.

గాయత్రీ మంత్రార్థమేమిటి? ఏ సూర్యుడైతే మా బుద్ధులను ప్రచోదనము చేయునో, ప్రకాశించేవాడైన ఆ సూయుని యొక్క శ్రేష్ఠమైన తేజస్సును ధ్యానము చేసెదము.అనగా, ప్రత్యక్ష దైవమైన సూర్యుని మన బుద్ధిని ప్రేరేపించుటకు ధ్యానించి మనలను సరైన మార్గమును అనుసరించేలా కోరుకోవటం.

2. సూర్యోపస్థానం
=============

మిత్రస్య చర్షణీ (ప్రాతః సంధ్యలో) అన్న మంత్రములతో కూడినది సూర్యోపస్థానము.

ఇది సూర్యదేవుని స్తుతి. ఇందులో సూర్యుని మహిమ అపారముగా వర్ణించబడింది. సూర్యమండలములో సంధ్యాదేవతను ఉపాసించుచున్నాము కాబట్టి సూర్యుని అనుగ్రహము వలన సంధ్యాదేవత అనుగ్రహము కలుగును. సూర్యుడు ప్రత్యక్ష దైవము, కర్మసాక్షి. ఈ ఉపస్థానము వలన ఆరోగ్యము, ఆయుష్యము, పాపనాశనము, అంతఃకరణశుద్ధి మొదలైన ఉత్తమ ఫలములు కలుగును.

3. దిగ్దేవతా నమస్కారము
===================

ఓ నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యే తాభ్యశ్చ నమో నమః అని తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర,ఊర్ధ్వ, అధో దిక్కులలో ఉన్న దేవతలకు, గంగ, యమున నదుల మధ్య నుండే నిర్మలమైన మనస్సు గలవారికి, మునులకు, సావిత్రికి, గాయత్రికి, సరస్వతికి, సకల దేవతలకు ఋషులకు, మునులకు, గురువులకు, పితృదేవతలకు నమస్కారములు సమర్పించి మన ఆయుష్షును పెంచేవారికి కృతజ్ఞత తెలుపుకోవటం ఈ దిగ్దేవతా నమస్కారములు.

దిగ్దేవతలకు, దిక్పతులకు భక్తి శ్రద్ధలతో నమస్కరించటం వలన సాధకుడు వారి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలగు దిక్పతులు గొప్ప బ్రహ్మవేత్తలు. వీరి అనుగ్రహము వలన అంతఃకరణము శుద్ధమై శీఘ్రముగా బ్రహ్మజ్ఞానము కలుగును.

4. భూమ్యాకాశవందనము
===================

ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు అనే మంత్రముతో పితృమాతృ వందనం చేస్తాము. సమస్త ప్రాణులకు భూమ్యాకాశములు తల్లిదండ్రులు. వీరి అనుగ్రహము వలన సుఖజీవనము కలుగును. సుఖమయమైన జీవితముంటేనే కదా సంధ్యోపాసనాది కర్మలను శాంతమైన మనసుతో చేయగలిగేది. అందుకే ఆ జనని పృథివికి, జనకుడు ఆకాశునికి మన కృత్జతలు తెలియజేసుకుంటాము.

5. అభివాదనము
=============

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవంతు అనే వాక్యములు అభివాదనము. దీనిలో తొలుత సమస్తమైన వారియొక్క క్షేమమును కోరుకుంటాము. సర్వేజనాస్సుఖినోభవంతు అన్నది మన భారతీయ సత్సాంప్రదాయం. ఆ విధంగా అభివాదములో మన గోత్రమును స్థాపించిన మహర్షులను, మన వేదమును, వేదశాఖను, మన సూత్రకర్తయగు మహర్షిని భక్తిశ్రద్ధలతో తలచుకుంటాము. ఇలా చేయటం వలన మన మహోన్నతమైన పరంపర జ్ఞాపకమునకు వచ్చి మనకు ఉత్సాహము కలుగును. ఆ తరువాతా ఆ బ్రహ్మలోకాదాశేషాత్ అనే శ్లోకాన్ని పఠిస్తాము. పదునాలుగు లోకములలోనున్న దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరిస్తాము.

ఈ విధంగా పూర్వాంగ ఉత్తరాంగ కర్మలతో కూడిన సంధ్యోపాసన ద్వారా వేద సారమును గ్రహించే అర్హతను పొంది, నిరంతర గాయత్రీ మంత్రానుష్ఠానము ద్వారా సంధ్యాదేవత అనుగ్రహము పొంది, సమస్త దేవతల అనుగ్రహము పొంది బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అందుకే సంధ్యోపాసన అత్యంత ఆవశ్యకమైనది.

శ్రీగురుభ్యోనమః

(తైత్తరీయ బ్రాహ్మణము, ఇతర మూలాల నుండి సారం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి