3, సెప్టెంబర్ 2020, గురువారం

శ్రీ స్వామినాథాయ నమస్తే నమస్తే - దీక్షితుల వారి కృతి

 


శ్రీ స్వామినాథాయ నమస్తే నమస్తే

శాశ్వత శివ సుతాయ సర్వ దేవ సహాయ స్వామిశైల స్థితాయ వరదాయ

గజాంబ రమణాయ గణపతి సోదరాయ గుణత్రయాతీతాయ గుహ్యాకారాయ
అజేంద్ర పూజితాయ ఆశ్రిత ఫలదాయ వరశిఖి వాహనాయ గురు గుహ స్వరూపాయ

శ్రీ స్వామినాథునికి పరి పరి వందనములు. శాశ్వతుడైన వాడు, శివుని సుతుడు, సమస్త దేవతలకు సహాయము చేసే వాడు, స్వామిమలై కొండపై స్థితుడైన వాడు, వరములనొసగేవాడైన స్వామినాథునికి పరి పరి వందనములు. దేవసేనకు పతి, గణపతికి సోదరుడు, త్రిగుణములకు అతీతుడు, అగ్రాహ్యమైన అకారము కలవాడు, బ్రహ్మేంద్రాదులచే పూజించబడిన వాడు, ఆశ్రితులకు ఫలములొసగే వాడు, మేలైన నెమలి వాహనముగా కలవాడు, గురుగుహ స్వరూపుడు అయిన స్వామినాథునికి పరి పరి వందనములు.

ఆరుపడై వీడు (అనగా ఆరు క్షేత్రాలు నివాసముగా కలవాడు) క్షేత్రాలలో ఓ ప్రముఖమైనది తమిళనాడు కుంభకోణం సమీపంలో ఉన్న స్వామిమలై క్షేత్రం. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వామినాథునిగా స్వామిమలై కొండపై కొలువబడుతున్నాడు. ఆ స్వామి క్షేత్ర ప్రాధాన్య కృతే ఈ దీక్షితుల వారి రచన. చరణంలో గజాంబ రమణాయ అని దీక్షితుల వారు స్వామిని నుతించటంలో ఓ రహస్యం ఉంది. తమిళంలో దేవసేనను దేవయానై అంటారు. తమిళంలో ఆనై అంటే ఏనుగు. దేవ, ఆనై అన్న పదాలకు సూచికగా సంస్కృతంలో గజాంబ అని దేవసేనను ప్రస్తావించారు దీక్షితుల వారు. వారి బహుభాషా పాండిత్యం ఇలాంటి కృతుల ద్వారా ప్రస్ఫుటమవుతుంది. దీక్షితుల వారి సుబ్రహ్మణ్యస్వామిని ఉపాసన చేసి సిద్ధి పొందిన సంగతి జగద్విదితమే. ఆ స్వామి కృపతోనే ఆయన గురుగుహ అన్న పదాన్ని తన ముద్రగా కృతులలో ఉపయోగించారు. ఖమాస్ రాగంలోని ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

చిత్రంలోని స్వామి మూర్తి నల్లూరు కందస్వామి (యళ్పణం, శ్రీలంక)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి