4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మంత్రము - అర్థము - గురువు - మంత్ర చైతన్యము

మంత్రము శబ్ద విశేషము. దేనిని మననము చేయుటచే పరిత్రాణము కలుగునో అదే మంత్రము. మంత్రములో ప్రతిపాదించబడిన శ్రేష్ఠమైన అర్థమే గురువు. ఈ అర్థము వల్ల కలుగు అనుభవమే చైతన్యము. అదే ఇష్ట దేవత. ఈ విధముగా మంత్రము, గురువు, ఇష్ట దేవతను మూడిటిని ఏకము చేయుటచే మంత్రచైతన్యమగును. చిన్న ఉదాహరణలు రెండు:

చింతపండు అని ఒక మాట ఉంది. ఇదే మంత్రము అనుకుందాం. ఆ పదానికి అర్థం తెలియనంత వరకూ, చింతపండేమిటో మనకు తెలియదు. కాబట్టి అది మృతశబ్దంగానే పరిగణించబడుతుంది. నోటితో లక్షల మార్లు చింతపండు అని పఠించినా దాని గురించి అవగాహన రాదు. తరువాత ఎవరైనా (గురువు) వచ్చి చింతపండు రూపము, రుచి, ఉపయోగాలు మొదలైనవి చక్కగా తెలియజేసినప్పుడు "చింతపండు" అనే దాని అర్థజ్ఞానము మనకు కలుగుతుంది. ఈ అర్థము పేరే గురువు. తరువాత "చింతపండు" అన్నమాట ఉచ్చరించగానే దాని రూపము, దాని పులుపు రసము మొదలైనవి జ్ఞానము మనలో పెల్లుబుకుతుంది. ఇంకెప్పుడైనా సరే చింతపండు అనగానే, దానిని చూడగానే, దాని రుచి మొదలైన వాని జ్ఞానము అనుభవపూర్వకమై వికసించి మన నోరూరుతుంది. అదే చైతన్యము. ఇదే విధముగా అంతటా.

"అమ్మ దయామయి" అన్న పదములు పరిశీలిద్దాం. ఈ పదములు పలుకగానే దయానుభవముతో మన హృదయము నిండిపోయినప్పుడు ఆ దయామయి అన్న పదము యదార్థముగా పలుకబడినదని గ్రహించాలి. మనము అమ్మ అనుచున్నాము కానీ అమ్మ ఎవరో తెలియకున్నాము ఎందుకంటే అమ్మ అనే మాటకు అర్థము తెలియదు. ఈ బాల్యావస్థలో అమ్మ అనునది ఒకరకంగా మృతశబ్దమే. వేరే వ్యక్తి, అనగా గురువు, అమ్మ అనగా పరిపూర్ణ స్నేహమునకు ఆధారమైన జగద్వ్యాపి చైతన్యము, ఆమెయే ఆత్మ అని చెప్పగానే, ఆ గురు కృపచేత అమ్మ అన్న శబ్దం ఉచ్చరించగానే స్నేహఘనమును, చైతన్యమయమైన ఆత్మానుభవము మనలో ఏనాడు పెల్లుబుకుతుందో ఆనాడే మనకు ఆ మాతృ మంత్రము (అమ్మా అని మనము ఉచ్చరించేది) చైతన్యమయమైనదని తెలుసుకుంటాము.

అర్థముననుసరించి అనగా గురువుననుసరించి రసముతోను, భావముతోను మనము రసికులము, భావుకులము అవుతాము. మంత్ర స్తుతిని స్వయంగా, యాంత్రికంగా ఉచ్చరించటం వలన మనకు యథార్థ ఫలము లభించదు. పైన చెప్పబడిన మంత్ర చైతన్యమనెడి వస్తువు లేకపోవటం చేతనే సాధన మార్గము దుర్గమము, అంధకార బంధురముగా తోచును. కాబట్టి ఏ స్తోత్రమైనా, విశిష్ట మంత్ర జపమైనా, నామ సంకీర్తనైనా చేయు వేళ మనము ఆధ్యాత్మిక ప్రగతికి సాయపడే సదర్థము (అనగా గురువును) ఎఱిగి అర్థానురూప భావముతో స్వయం సంవేదితులమగుటకు ప్రయత్నించాలి.

శ్రీగురుభ్యోనమః.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి