3, సెప్టెంబర్ 2020, గురువారం

మరకతవల్లీం మనసా స్మరామి - దీక్షితుల వారి కృతి



మరకతవల్లీం మనసా స్మరామి
మదన జనకాది దేవ పాలినీం

హరహృదయవాసినీం మోహినీం
హరిహర పుత్ర జననీం నళినీం
క్రూర దైత్యాది బృంద మర్దినీం
గురుగుహాది నుత వహ్నివాసినీం

శ్రీహరి మొదలైన దేవతలను పాలించే, మరకతవల్లిగా వెలసిన అమ్మను మనసులో ధ్యానిస్తున్నాను. శివును హృదయములో సంచరించే మోహిని, హరిహర పుత్రుని జనని, నల్లని కలువ వలె ఉన్న అమ్మను, క్రూరులైన రాక్షస సమూహాన్ని సంహరించిన, గురుగుహుడు మొదలైన వారిచే నుతించబడిన, అగ్ని నుండి జన్మించిన అమ్మను నేను ధ్యానిస్తున్నాను.

ముత్తుస్వామి దీక్షితుల వారి కృతులలో సింహభాగం క్షేత్రాలలోని దేవతా స్వరూపాల వర్ణించే కోవకు చెందినవి. అటువంటి కృతే వెల్లూరు సమీపంలోని మార్గబంధీశ్వర క్షేత్రంలోని స్వామి నాయిక అయిన మరకతాంబికను వర్ణించే మరకతవల్లీం. ఈ క్షేత్రంలో ప్రధాన దేవత శివుడు మార్గబంధు లేదా మార్గసహాయేశ్వరుడు కాగా అమ్మ వారు మోహినీ రూపమైన శ్రీహరి. ఆ అమ్మను మరకతాంబికగా పిలుస్తారు. మరకతంతో చేయబడిన విగ్రహం కాబట్టి అమ్మకు ఈ పేరు వచ్చింది. ఈ క్షేత్రం కూడా ఎంతో సనాతనమైనది. దీక్షితుల వారి పూర్వీకుల ఈ విరించిపురానికి చెందిన వారు. తరువాతి కాలంలో తంజావూరు తరలి వెళ్లినా ఆ కుటుంబం ఈ క్షేత్ర దైవాలను కొలిచి అనుగ్రహం పొందారు. ఈ క్షేత్రంలో శివుడు, మోహినితో పాటు గణపతి, కాలభైరవుడు మొదలైన ఎందరో దేవతా స్వరూపాలు వెలసి ఉన్నాయి. బ్రహ్మ కొలిచిన శివుడు కలిగిన ఊరు కాబట్టి దీనికి విరించిపురమని పేరు వచ్చింది. ప్రముఖ యోగి, అద్వైత సిద్ధాంత ప్రచారకులు, పండితులు, శైవాన్ని పరిరక్షించేందుకు కృషి చేసిన మహనీయులు, సిద్ధయోగులు అయిన అప్పయ్య దీక్షితులు ఈ విరించిపురానికి చెందిన వారే. వీరు 16వ శతాబ్దంలో ఇక్కడ నివసించారు.

కాంభోజి రాగం శృంగార మరియు కరుణ రసాలను ఆవిష్కరించటానికి పేరొందిన రాగం. శుభకరమైనదిగా చెప్పబడిన ఈ రాగంలో ఎన్నో అద్భుతమైన కీర్తనలు వచ్చాయి. వాటిలో త్యాగరజస్వామి రచించిన ఓ రంగశాయి, మా జానకి, దీక్షితులవారి ఈ మరకతవల్లీం ప్రసిద్ధి చెందాయి. సొంపైన స్వరములతో సాగే ఈ రాగం ఈ కృతికి ఎంతో శోభనిచ్చింది. దీనిని రంజని గాయత్రి సోదరీమణులు గానం చేశారు.

గమనిక: చాల మంది గాయకులు ఈ కృతిలోని చరణం మొదటి భాగాన్ని హరిహృదయవాసిని, హరిహృదయావేష్టినిగా పాడారు. ఇవి తప్పని నా ఉద్దేశం. హరహృదయవాసిని సరైనది అని కొంత పరిశోధనలో తెలుసుకున్నాను.

కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి