పది వేల శేషుల పడగల మయము
అదె వేంకటాచలమఖిలోన్నతము
అదివో బ్రహ్మాదులకపురూపము
అదివో నిత్య నివాసమఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము
చెంగట నల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిటనల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
కైవల్య పదము వేంకట నగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావనమయము
ఆ వేంకటాచలము అన్నిటికన్నా ఉన్నతమైనది. ఇక్కడ వేంకటాద్రి శిఖరపు యెత్తు అన్న భావన కన్నా స్వామి సన్నిధి అన్నిటినీ మించి ఉన్నతమైనది అన్నది అన్నమాచార్యుల వారి అంతరార్థం. ఆ హరి నివాసము బ్రహ్మాది దేవతలకు ఎంతో అపురూపమైనది. మా గురువు గారు చెప్పినట్లు వేంకటాద్రి మునులకు ఆలవాలము. ఎక్కడ పరమాత్మ ప్రజ్జ్వలమైన తేజస్సుతో సగుణరూపుడై మూర్తిగా వెలసాడో అక్కడ మునులు తప్పక ఉంటారు. వారి అర్థం, పరమార్థం ఆయనే కదా! ఆ వేంకటనాథుని సన్నిధిని చూసి, మొక్కితే కలిగే ఆనందం శాశ్వతమైనది. అందుకే దానికి ఆనందనిలయంగా పేరు వచ్చింది. ఆ వేంకటాద్రి సమీపంలోనే శేషాచలము, ఆకాశంలో నున్న దేవతలకు నివాసమది. దేవతలు ఎక్కడ పవిత్రత ఉంటుందో ఎక్కడ ప్రశాంతత ఉంటుందో, ఎక్కడ ప్రకృతి పులకరించి ఉంటుందో అక్కడ నివసిస్తారు. అందుకే శేషాచలము అడవులు దేవతలకు నివాసంగా అన్నమయ్య చెప్పారు. వీటి మధ్య ఉన్న మూలధనం స్వామి సన్నిధి, బంగారు శిఖరాలతో వెలిగేది. పరబ్రహ్మతత్వంతో ప్రకాశించేది. ఆ వేంకటాద్రి శిఖరము కైవల్యాన్ని ప్రసాదించేది, శ్రీనివాసునికి సంపదలనిచ్చేది. మనం భావిస్తే చాలు సమస్త సంపదలకు రూపము ఆ క్షేత్రము. పరమ పవిత్రమైనది.
మనం శుద్ధ అంతఃకరణముతో భావిస్తే సమస్త సంపదలకు రూపము ఆ తిరుమల శ్రీనివాసుని సన్నిధి అన్నారు అన్నమాచార్యుల వారు. అది అత్యంత పవిత్రమైనది. నిజంగా ఈ భావన రావాలంటే అన్నమాచార్యుల వారికి ఎన్ని అనుభూతులు కలిగి ఉండాలి? ఇప్పటికీ తిరుమలలో ఉన్న పాపవినాశనం, ఆకాశగంగ మొదలైన తీర్థాలలో యోగులు, సిద్ధ పురుషులు అదృశ్య రూపంలో వచ్చి స్నానమాచరిస్తారని మా గురువుగారు చెబుతారు. అన్నమాచార్యుల వారికి 16వ ఏట స్వామి స్వప్న సాక్షాత్కారమిచ్చిన సంగతి నిన్న ప్రస్తావించాను. అటు తరువాత తిరుమల పయనమైన ఆయన ఆ సప్తగిరులను చూడగానే భక్తి భావం హృదయాంతరాళమునుండి సురగంగలా పొంగి మనసు ఉప్పొంగి కనులునుండి ఆనందబాష్పాలు రాలగా, తనను తాను మరచి అదివో అని ఎలుగెత్తి పాడి ఆ శ్రీహరి వాసాన్ని వర్ణించారు.
తనను కరుణించి కలలో కనిపించిన స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన అన్నమయ్య హృదయ కమలం ఆ ఏడు కొండలను చూచినంత సూర్యుని చూసిన కమలంలా వికసించింది. పదివేల శేషుల పడగలమయంగా గోచరించింది. భగవంతుడు భావగోచరుడు. మనం ఎలా భావిస్తే అలా కనబడతాడు. అన్నమయ్య తన కళ్ల ఎదుట ఉన్న తిరుమల వైభవాన్ని ఆ విధంగా అదివో అల్లదివో శ్రీహరివాసము అనే కృతి ద్వారా మనకు తెలియజేశారు. ఎప్పుడైనా పసిపిల్లవాడు అమ్మను కోసం ఎదురు చూసిన పిమ్మట, అమ్మ కనబడగానే ఎలా ఉత్సాహంగా అమ్మా అని పలుకుతూ వెళతాడో అదే విధంగా అన్నమయ్య ఆ సప్తగిరులపై ఉన్న శ్రీనివాసుని నివాసాన్ని చూసి పులకరించి పాడాడు. మరి అందరికీ ఎందుకు అనిపించదు అలా? భావించాలి. మనసులో నిరంతరం కోరుకోవాలి. సంకల్పము, ఆలోచన, మాట ఆయనపైనే ధ్యాసగా ఉండాలి. దానికి కావలసిన సాధన చేయాలి. అప్పుడు తప్పకుండా మనం కూడా ఆ సప్తగిరుల పవిత్రతను, స్వామి మహిమను, క్షేత్ర వైభవాన్ని అనుభూతి చెంది తీరుతాము.
తిరుమల అంటే విహారయాత్ర కాదు, వెళ్లి అక్కడ మనకు నచ్చిన హోటల్లో భోజనం చేయటమూ కాదు. అణువణువున నిండి ఉన్న స్వామి తత్వాన్ని కొంతైనా అనుభూతి చెందే పవిత్రత మనలో ఉండాలి. త్రికరణములు - మనసు, వాక్కు, కర్మలు - ఆయనపైనే దృష్టి పెట్టేలా ఉండాలి. పవిత్రతకు ఆహారము, వ్యవహారము రెండూ తోడ్పడతాయి. అందుకే తిరుమల కొండలపికి ఎక్కేటప్పుడు, తిరుమలలో ఉన్నప్పుడు ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని విస్మరిస్తే మన మనసు చంచలమై స్వామిని కాంచలేక ఎటువంటి చిన్న సమస్య వచ్చినా ఆందోళన చెంది స్వామి నన్ను కరుణించలేదు అన్న అశాంతికి గురవుతుంది. కట్టు, బొట్టు, ఆహారము, మాటలు అన్నీ స్వామిని కాంచటానికై వినియోగిస్తే స్వామి తప్పక కనబడతాడు. సప్తగిరులలోని దివ్యకాంతుల ప్రకాశాన్ని కాంచగలము, అక్కడ నిండి ఉన్న ఆధ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించగలము. మధ్యమావతి రాగంలోని ఈ కృతిని డాక్టర్ శోభారాజు గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి