ప్రచార మాధ్యమాల విప్లవం రాక మునుపు ఆకాశవాణిలో కొందరు విద్వాంసులు ఆకాశవాణి ద్వారా అద్భుతమైన సంగీత ప్రస్థానం చేశారు. వారిలో బాలమురళీకృష్ణ గారు, వోలేటి వేంకటేశ్వర్లు గారితో పాటుగా శ్రీరంగం గోపాలరత్నం గారు కూడా ఉన్నారు. ఆవిడ గళంలో ఉండే మాధుర్యం అంతా ఇంతా కాదు. ఆవిడ గాత్రసౌరభం తేనె జాలువారినట్లే ఉంటుంది. ఎంతో విలక్షణమైన గాత్ర ధర్మం ఆవిడను సంగీత ప్రపంచంలో ప్రత్యేకమైన కళాకారిణిగా నిలిపింది. ఆవిడ స్వరాలు పలికించే రీతి, బహుభాషా పటిమ, శృతిలయలపై పట్టు అనుపమానం. అంతటి ప్రతిభ ఉన్న సంగీత విద్వాంసురాలు మళ్లీ తెలుగుగడ్డపై ఇంకా పుట్టలేదనటంలో అతిశయోక్తి లేదు. పెళ్లి పాటలు, అన్నమయ్య సంకీర్తనలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజనలు, తరంగాలు, లలిత భక్తి గీతాలు, కూచిపూడి నాట్య సంగీతం, యక్షగానాలు, జావళులు, యెంకిపాటల రూపంలో నాలుగు దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాలను తన అసమానమైన ప్రతిభతో మురిపించారు గోపాలరత్నం గారు.
1939వ సంవత్సరంలో విజయనగరం జిల్లాలో సుభద్రమ్మ, వరదాచార్యులు దంపతులకు గోపాలరత్నం జన్మించారు. వరదాచార్యుల వారి పూర్వీకులు శ్రీరంగం నుండి విజయనగరానికి తరలివచ్చారు. తల్లికి మేనమామ అయిన అప్పకొండమాచార్యులు రాసిన రెండు హరికథలను పాలకొల్లు సభలో తొమ్మిదేళ్ళ వయసులో గానం చేయడమే వీరి తొలి ప్రదర్శన. కవిరాయని జోగారావు గారు వీరి ప్రధాన సంగీత గురువు. ద్వారం వెంకటస్వామి నాయుడు, శ్రీపాద పినాకపాణి వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించారు. 17 ఏళ్ల పిన్న వయసులోనే కర్నాటక శాస్త్రీయ సంగీత గాత్రంలో డిప్లొమా పూర్తి చేశారు. తొలిసారిగా విజయవాడ ఆకాశవాణిలో 1957 సంవత్సరం నిలయ విద్వాంసురాలిగా చేరారు. అప్పటినుండి రెండు దశాబ్దాల పాటు శాస్త్రీయ, లలిత సంగీత బాణీలతో శ్రోతలకు విందు చేశారు. ఎందరో ప్రముఖ సంగీత సాహిత్య ప్రముఖులతో కలిసి ఆమె ఎన్నో కార్యక్రమాలను సమర్పించారు. భామా కలాపం యక్షగానం, నౌకా చరితం ఆవిడ ప్రతిభకు గీటురాళ్ళు. ఆవిడకు అత్యంత కీర్తిని తెచ్చినది సంగీత ప్రధానమైన రేడియో నాటకం మీరాబాయి.ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారిణిగా, విజయనగరం మహారాజా కళాశాల మరియు హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలల ప్రధానాధ్యాపకురాలిగా తన సేవలను అందించారు. ఆకాశవాణిలో భక్తిరంజని కార్యక్రమంలో ప్రసారమైన అనేకానేక గీతాలను ఆవిడ ఆలపించారు. ఎన్నో అన్నమాచార్యుల వారి సంకీర్తనలను స్వరపరచారు కూడా. గోపాలరత్నం గారు పాడిన తిరుప్పావై, నారాయణ తీర్థుల వారి తరంగాలు ఆరోజుల్లో తెలుగు లోగిళ్లలో మారుమ్రోగాయి. ఆవిడ తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా కూడా పనిచేశారు. ఆవిడ గాత్రంలో గమకాలు, భావానికి సముచితమైన ఉచ్చారణ ఆవిడ ప్రత్యేకతలు.
గోపాలరత్నం గారు సినీ గీతాలు కూడా ఆలపించారు. శ్రీవేంకటేశ్వర వైభవం చిత్రంలోని ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా పాట ఆంధ్రద్దేశమంతటా పేరొందింది. బికారి రాముడు చిత్రంలో ఆవిడ పాడిన నిదురమ్మా నిదురమ్మా గీతం బహుళ పాచుర్యం పొందింది. గోపాలరత్నం గారు 1969లో తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా సేవలందించారు. 1977లో హైదరాబాదు లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్బావంతో లలిత కళా పీఠానికి ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. మధుర గాయకి, గాన కోకిల, సంగీత రత్న మొదలైన ఎన్నో బిరుదులను పొందారు. 1992వ సంవత్సరంలో భారత ప్రభుత్వం గోపాలరత్నం గారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1993 మార్చి 16న చిన్న వయసులోనే పరమపదించారు.
ప్రముఖ రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల గారు సంగీత చూడామణి శ్రీరంగం గోపాలరత్నం (జీవితం- సంగీతం) అన్న పుస్తకం ద్వారా గోపాలరత్నం గారి జీవిత విశేషాలను తెలీయజేశారు. ఆవిడ ఆలపించిన కొన్ని అద్భుతమైన గీతాలు - సకలం హే సఖి జానామి, ఎవ్వడెరుగును నీ ఎత్తులు, కస్తూరి రంగయ్య కరుణించవయ్య, శరణం భవ కురు దీనదయాళో, అలమేలుమంగా నీ అభినవ రూపము, నల్లని మేని నగవు చూపులవాడూ, నమో నారాయణా, కలయ యశోదే తవ బాలం, ఏమని పొగడుదు ఇట్టి నిపుణము...ఇలా కొన్ని వందలు. ఈనాటి కళాకారులతో పోలిస్తే ఆవిడ ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఎమ్మెల్ వసంతకుమారి, డీకే పట్టమ్మాళ్ మొదలైన వారి స్థాయికి ఏ మాత్రం తగ్గని ప్రతిభ శ్రీరంగం గోపాలరత్నం గారిది. తెలుగునాట పుట్టడం ఒకరకంగా కొందరు అసమాన ప్రతిభ గల కళాకారుల పట్ల శాపమేమో అనిపిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి