అన్నమాచార్యుల వారు రచించిన అద్భుతమైన శృంగార సంకీర్తనలలో ఒకటి ఈ సంస్కృత భాషలో వెలువడిన "నాలం వా తవ నయ వచనం". ప్రఖ్యాత కర్ణాటక శాస్త్రీయ సంగీత మరియు లలిత సంగీత విదుషీమణి శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారు ఎంతో అందంగా ఆలపించి బహుళ ప్రాచుర్యం కలిగించగా ఇటీవల విదుషీమణి శ్రీమతి శ్వేతా ప్రసాద్ గారు పాడితే మళ్లీ విన్నాను. పైకి శృంగార సంకీర్తన అనిపించినా, మధురభక్తిలోని ఆధ్యాత్మిక తత్త్వం ఈ కృతిలో నిబిడీకృతమై ఉంది. జయదేవుని అష్టపదులలోని భావానికి పరిపూర్ణమైన సారూప్యత ఈ అన్నమాచార్యుల వారి కృతిలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. చాలా పరిమితమైన సంస్కృత భాషా అవగాహనతో యథాతథం అనువదించే ప్రయత్నం చేశాను. తప్పులుంటే పెద్దలు మన్నించి సరిదిద్దగలరు.
స్వామీ! నీ మోసపు మాటలు చాలు, నా కొంగు విడిచిపెట్టు, నేను నీకు దాసినై ఉన్నాను. వజ్రము వలె కఠినమైన హృదయము కలవాడా! ఈ విధంగా దగ్గర వస్తావెందుకు? దూరంగా వెళ్లు. నీ అనేక గుణ వైభవములతో నా తనువు పులకరించి, చెమటలను విసర్జిస్తూ మలినమైపోయింది. సజ్జనుడువైన నీవు నీకు ప్రియమైన సతుల వద్దకే వెళ్లు. నీవు వారితో ఎంతటి రతి సుఖములను అనుభవించావో నీ భుజాలపై గోటికొనలతో ఏర్పడిన రేఖలే చెబుతున్నాయి. రతిభోగములో నీకు విజయము కలుగుగాక. ఈ విరహం నా విధి అని నన్ను నేను సమాధాన పరచుకుంటాను. చేసినదంతా చేసి ఎంత బాగా నన్ను ఓదార్చుతున్నావు? ఈ నీ పద్ధతులు నీ ప్రియసతులకు బాగా నచ్చి వారిలో ప్రేమను కలుగ జేస్తాయి. నా భయాలను తొలగించే శ్రీనివాసా! నీవు నాకు మాత్రమే ప్రియుడవు అయితే నేను సంతోషిస్తాను. నీ మోసపు మాటలు చాలు, నా కొంగు విడిచిపెట్టు, నేను నీకు దాసినై ఉన్నాను.
బృందావన సారంగ రాగంలో కూర్చబడిన ఈ కృతిని శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి