పాల జలనిధిలో బాయని
నీలవర్ణుడవట నీవా ఇపుడు
వెదజల్లు మణుల వేయి పడగలను
చెదరని మెరుగుల శేషునిపై
మృదువు బరువుగా మెల్లనే పొరలుచు
నిదురవోదువట నీవా ఇపుడు
పరమ మునీంద్రులు పద్మ భవాదులు
ఇరువంకల నుతించగను
అరవిరి మోమున నల్లన నవ్వెడి
నిరత మూర్తివట నీవా ఇపుడు
పగటున సిరియును పరగిన ధరణియు
బిగియుచు అడుగులు పిసుకగను
తగు వేంకటగిరి తనరుచు చెలగెడి
నిగమ మూర్తివట నీవా ఇపుడు
ఓ వేంకటేశా! పాలకడలిలో నీలవర్ణముతో శాశ్వతుడవై యున్నది నీవే. వేయి పడగలపై కాంతులను వెదజల్లే మణులను కలిగిన ఆదిశేషునిపై చెదరని ప్రకాశముతో మృదువుగా, బరువుగా, మెల్లగా పొరలుతూ నిదురించేవట నీవు. పరమయోగులు, కమలభవుడైన బ్రహ్మ మొదలగు వారు ఇరుప్రక్కల నిలబడి నుతించగా వికసిస్తున్న పూవుల వంటి మోముతో అందముగా నవ్వే శాశ్వతమూర్తివట నీవు. లావణ్యముగా లక్ష్మీదేవి, ప్రయుక్తముగా భూదేవి నీ పాదములను ఒకింత బిగువు చేస్తూ వత్తుచుండగా వేంకటాద్రి శిఖరమున అతిశయముతో ప్రకాశించే వేదస్వరూపుడవు నీవే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి