అక్షరరూపమీయలేని మహిమలు గల దేవకీ సుతుడైన బాలకృష్ణుడు ముద్దులొలికే రూపముతో యశోద ముంగిట ముత్యము వలెనున్నాడు చూడండి! అంతటా ఉండే ఆ పరమాత్మ ఈ గోకులం యొక్క అరచేతికి మాణిక్యము వంటి వాడు, దుష్టుడైన కంసుని పాలిట వజ్రము, తన కాంతులతో మూడు లోకాలలోనూ ప్రకాశించే మరకతము వంటి వాడు ఈ కృష్ణుడు చూడండి! రతికేళిలో రుక్మిణీదేవి అందమైన మోమునకు పగడపు కాంతి వంటి వాడు ఈ కృష్ణుడు, గోకులాన్ని ఇంద్రుని బారి నుండి రక్షించ చిటికిన వేలిన ఎత్తిన గోవర్ధన గిరికి గోమేధికము వంటి వాడు. శంఖచక్రాల నడుమ ప్రకాశించే వైఢూర్యమితడు. కలువలవంటి కన్నులు గల ఈ కృష్ణుడే మనకు గతియై కాచే వాడు, చూడండి!. అహంకారముతో విషమును జిమ్మిన కాళింగుని పడగలపై నర్తిస్తూ పుష్యరాగములా ప్రకాశించిన వాడు, శ్రీవేంకటాద్రి ఏలే నల్లనయ్య ఇంద్రనీలము వంటి వాడు. క్షీరసాగరములో పద్మనాభునిగా విడువలేని దివ్యమైన రత్నమైన వాడు బాలునిలా మన ముందు తిరుగాడుతున్నాడు చూడండి!
అన్నమాచార్యుల వారి సాహితీ వైభవానికి ఈ సంకీర్తన గొప్ప ఉదాహరణ. బాలకృష్ణుని మనోజ్ఞమైన అవతార విశేషాలను వర్ణిస్తూనే ఆయనను సర్వాంతర్యామిగా దర్శించి తరించినవారిలో అన్నమయ్య అగ్రగణ్యులు. యశోదకు శిశువై లాలించబడి అల్లరి చేష్టలు చేసిన ఆ బాలుడు బ్రహ్మకు తండ్రి, భూదేవికి రక్షకుడు అని "చేరి యశోదకు శిశువితడు" అనే కృతిలో నుతించిన అన్నమయ్య, ఈ సంకీర్తనలో నవరత్నాలతో పోలుస్తూ బాలకృష్ణుని వైభవాన్ని ఆవిష్కరించారు. ఆయన ఉపయోగించిన పదాలను నిశితంగా పరిశీలిస్తే ఇది కేవలం వర్ణన కాదు, విశ్వాత్మకుని బాలునిలో గాంచిన అనుభూతుల సారం అని అర్థమవుతుంది. దిద్దలేని మహిమలు గలవాడైన పరమాత్మ కారణ జన్ముడై దేవకి గర్భాన జన్మించి, గోకులంలో యశోద వద్ద పెరిగి లోకోద్ధారకుడైనాడు. ముత్యము ఎలా ఏర్పడుతుంది? నీటిలో నత్తగుల్లలు సంరక్షణార్థమై ఏర్పరచుకునే ఆకృతి నుండి ఉద్భవిస్తుంది. సృష్టి స్థితి లయములలో ఈ విశ్వానికి కలిగే గ్లానిని తొలగించటానికి అనేకరూపాలలో అవతరించే పరమాత్మ ధర్మస్థాపనకై ద్వాపరయుగంలో నాటకీయంగా కారాగారంలో ఉన్న దేవకి గర్భాన ఉద్భవిస్తాడు. స్వచ్ఛమై, సహజమై యుండే ముత్యము వంటి వాడు ఆ చిన్నికృష్ణుడని అన్నమయ్య భావం. అంతటి కృష్ణుడు గోకులానికి మాణిక్యం అని పలికారు అన్నమయ్య. మాణిక్యము అనగా కెంపు శాశ్వతమైన ప్రేమకు ప్రతీక. గోకులంలో ఆ బాలుడు పంచింది ప్రేమే కదా? వజ్రం పదునైనది, పటిష్టమైనది, శక్తివంతమైనది. అందుకే దుష్ట కంసుని పాలిట వజ్రంగా వర్ణించారు. గరుడపౘ్చ జ్ఞానానికి, బుద్ధి వికాసానికి ప్రతీక. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముని ముల్లోకాలలోనూ ప్రకాశించే గరుడపౘ్చగా నుతించారు. పగడము శక్తికి, ధాతుపుష్టికి కారకమైన నవరత్నము. అందుకే రతికేళిలో రుక్మిణి మోవికి పగడంగా స్వామిని అభివర్ణించారు. గోమేధికము భీతావహ స్థితినుండి ఉపశమనం కలిగించే రత్నం. రాహుగ్రహ ప్రేరితమైన ఈ రత్నంగా శ్రీకృష్ణుని అభివర్ణించినప్పుడు గోవర్ధనగిరి ఉదంతాన్ని ప్రస్తావించారు అన్నమాచార్యులు. శంఖ చక్రాలు స్వామి యొక్క సృష్టి స్థితి లయములకు సూచికయైన ఆయుధములు కాగా, వాటి మధ్య మెరిసే వైఢూర్యముగా అన్నమయ్య ఎందుకు వర్ణించారు? వైఢూర్యము ఆధ్యాత్మికతకు ప్రతీక. సృష్ట్యాది, ప్రళయము మధ్య ఆధ్యాత్మిక ప్రకాశమైన వానిగా తెలుపటానికి వైఢూర్యాన్ని వినియోగించారు. అందుకే తదుపరి పంక్తిలో గతియై మమ్ము గాచే కమలాక్షుడు (శంఖచక్రములతో యున్న ఆధ్యాత్మికశక్తి) అని శ్రీహరి అవతరమైన బాలకృష్ణుని స్తుతించారు. అహంకారాన్ని నాశనం చేసేది, దుష్టశక్తుల నుండి కాపాడేది, పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టేది పుష్యరాగము. మరి ఈ అహంకారము, దుష్టశక్తి రూపమే కదా కాళింగుడు. వానిని అణచి కాళీయమర్దునిగా లోకఖ్యాతిని పొందిన వాడు కృష్ణుడు. అందుకే అన్నమయ్య పుష్యరాగంగా వర్ణించారు. మరి నల్లనిదేహముతో నీలమణి కాంతితో ఉండేవాడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడు దేనికి ప్రసిద్ధి? మన కర్మఫలములను తొలగించి ఆపదలనుండి కాపాడి రక్షించే వాడు. ఇంద్రనీలమణి ఈ పాపసంచయమును పోగొట్టి సమస్త సంపదలను ప్రసాదించే నవరత్నము. అందుకే ఏలేటి శ్రీవేంకటాద్రి ఇంద్రనీలము అని అన్నమాచార్యుల వారు ప్రస్తుతించారు.
మొత్తం మీద నవగ్రహముల శుభఫలములను ప్రసాదించే నవరత్నములు - మౌక్తికము (ముత్యము), పద్మరాగము (మాణిక్యము/కెంపు), వజ్రము, మరకతము (గరుడపౘ్చ), ప్రవాళము (పగడము),గోమేధికము,వైడూర్యము, పుష్యరాగము, నీలము - వీటి వైశిష్ట్యాన్ని సమస్త సద్గుణ సంపన్నుడు, శుభకరుడు, భవహరుడు, జగన్మోహనుడు అయిన శ్రీకృష్ణుని లీలల వర్ణనలో పొందుపరచి మనకు రత్నశాస్త్రాన్ని, నవగ్రహాల అనుగ్రహము పొందే మార్గాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునిగా అత్యద్భుతంగా పలికారు. అందుకే ఆయన సద్గురువులైనారు. ఒక్కొక్క సంకీర్తన మంత్ర సమానమై శతాబ్దాల అనంతరం కూడా ఆధ్యాత్మిక సుగంధాలు ఈ ప్రపంచమంతా వెదజల్లుతున్నాయంటే అది అన్నమాచార్యుల వారి వైశిష్ట్యాన్ని, వారి దార్శనికతను, భక్తి సంపదను తెలుపుతాయి. నందకాంశగా జన్మించిన ఆయన సంకీర్తనలలోని భావాన్ని పైవివరాలతో తెలిపిన డాక్టర్ శోభారాజు గారికి నా శతసహస్ర వందనాలు. వారి వివరణను నా పదాలలో తెలిపే ప్రయత్నం చేశాను. తప్పులు దొర్లి ఉంటే అన్యథా భావించరాదు. అన్నమయ్య తత్త్వాన్ని అర్థం చేసుకొవటం అంటే మాటలు కాదు. అవి అనుభవైకవేద్యం. కఠోర సాధనతోనే సాధ్యం. ఆ మార్గంలో సఫలీకృతులైన శోభారాజు గారికి ఆ శ్రీనివాసుడు సమస్త శుభములు కలిగించాలని నా ప్రార్థన. వారికి నా ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు.
ముద్దుగారే యశోద సంకీర్తన శోభారాజు గారి పాడిన లింక్ యూట్యూబ్‌లో దొరకలేదు. ఈ లింక్‌లో ఆ పాట క్లిక్ చేసి వినవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి