1, సెప్టెంబర్ 2020, మంగళవారం

పంచభూతలింగ కృతి - ఆనంద నటన ప్రకాశం - ముత్తుస్వామి దీక్షితుల వారు



ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం ఆశ్రయామి శివకామవల్లీశం

భాను కోటి సంకాశం భుక్తి ముక్తి ప్రద దహరాకాశం
దీనజన సంరక్షణ చణం దివ్య పతంజలి వ్యాఘ్రపాద దర్శిత కుంచితాబ్జ చరణం

శీతాంశు గంగాధరం నీలకంధరం శ్రీ కేదారాది క్షేత్రాధారం
భూతేశం శార్దూల చర్మాంబరం చిదంబరం భూసుర త్రిసహస్ర మునీశ్వరం విశ్వేశ్వరం (నవ)
(నవ)నీత హృదయం సదయ గురుగుహతాతమాద్యం వేద వేద్యం
వీత రాగిణం అప్రమేయాద్వైత ప్రతిపాద్యం సంగీత వాద్య వినోద తాండవ జాత బహుతర భేద చోద్యం

ఆనంద తాండవములో ప్రకాశించే, చిత్సభకు ఈశుడైన, శివకామసుందరి పతియైన చిదంబర నటరాజస్వామిని నేను ఆశ్రయించుచున్నాను. కోటి సూర్యులకు సమానమైన ప్రకాశము గల, భుక్తి, ముక్తి ప్రసాదించే, హృదయ కమలంలో ఉన్న చిదాకాశుడైన, నిరంతరం దీనజనులను రక్షించే, పతంజలి, వ్యాఘ్రపాదాది యోగులచే దర్శించబడిన ఎత్తిన పదకమలము గల చిదంబర నటరాజస్వామిని నేను ఆశ్రయించుచున్నాను. చంద్రుడు మరియు గంగను శిరసున ధరించిన, నీలకంఠుడు, కేదారనాథ్ మొదలైన క్షేత్రాలలో దైవమైన, సమస్త భూతములకు ఈశ్వరుడైన, పులి చర్మమును ధరించిన, చిదంబరుడైన, బ్రాహ్మణులు మరియు మూడు వేల మునులచే పూజించబడిన, సమస్త విశ్వమునకు ఈశ్వరుడైన, వెన్నవంటి హృదయము కలిగిన, సుబ్రహ్మణ్యుని తండ్రియైన, ఆదియోగియైన, వేదవేదాంతములలో నుతించబడిన, రాగద్వేషములకు అతీతమైన, అగోచరుడైన, అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించిన, సంగీత వాద్యము, తాండవములో అనేక విభిన్న అద్భుత లీలల ద్వారా సృష్టి పరిణామమును విశదీకరించే చిదంబర నటరాజేశ్వరుని నేను ఆశ్రయించుచున్నాను.

దీక్షితుల వారి క్షేత్ర కృతులలో, పంచలింగ స్థల కృతులు ప్రత్యేకమైనవి. నిన్న తేజోలింగ రూపమైన అరుణాచలేశ్వరునిపై రచించిన కృతి వివరాలు తెలుసుకున్నాము. ఆనందనటన ప్రకాశం అనే కృతి చిదంబరంలో ఆకాశలింగ రూపమైన నటరాజస్వామిని దీక్షితుల వారు అద్భుతంగా కొనియాడారు. చిదంబరం దేవాలయంలోని చిత్సభలో నటరాజుడు శివకామసుందరీ దేవిల వైభవం కళ్లారా చూడవలసినదే. అద్భుతమైన శైవక్షేత్రం చిదంబరం. తమిళనాడులో చెన్నైకి దక్షిణాన 231 కిలోమీటర్ల దూరంలో కడలూరు జిల్లాలో చిదంబరం ఉంది. సనాతనమైన ఈ దేవాలయాన్ని చోళులు, పాండ్యులు, చేరులు, విజయనగర రాజులు పోషించారు. ఇప్పుడున్న కట్టడం 12వ శతాబ్దం నాటిది. 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అనేకదేవతా సమూహమై యున్న ఈ దేవాలయం పంచభూత స్థలములలో ఆకాశాన్ని సూచించేది. శివరాత్రికి జరిగే నాట్యాంజలి ఉత్సవాలకు ఈ దేవస్థానం పేరొందింది. నాలుగు వైపుల నాలుగు గోపురముల ద్వారా ఈ దేవస్థానంలోకి ప్రవేశించ వచ్చు. ఐదు సభలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి - చిత్సభ (గర్భగుడి), కనకసభ (నిత్యసేవలు జరిగే మంటపము), నాట్యసభ, వేయి స్థంభములతో సహస్రార చక్రాన్ని సూచించే రాజసభ, దేవసభ (గణేశుడు, సోమస్కందుడు, శివానందనాయకి, చండికేశ్వరులకు నిలయమైన సభ). 14వ శతాబ్దంలో హిందూ ద్వేషి అయిన ఇస్లాం రాజు మాలిక్ కఫూర్ దాడులలో ఈ గుడిని కూడా ధ్వంసం చేయగా తరువాత దానిని పునరుద్ధరించారు. దీక్షితుల వారు తమ శైలికి అనుగుణంగానే ఈ కృతిని కేదార రాగంలో స్వరపరచి ఆ రాగ నామాన్ని కృతిలో సముచితంగా ప్రస్తావించారు. దీక్షితుల వారు ఈ క్షేత్రంలో శివకామేశ్వరీ అమ్మను ఉపాసన చేశారని ఆయన చరిత్ర తెలుపుతుంది. మీరు దీక్షితుల వారి చరిత్రను నిశితంగా పరిశీలిస్తే ఆయన జీవితమంతా అనేక క్షేత్రాలను సందర్శించి అక్కడి దేవతను ఉపాసన చేసి అనన్యమైన ఆధ్యాత్మిక సంప్దను మూటగట్టుకున్న విషయం అర్థమవుతుంది. ఆనంద తాండవంలో ప్రకాశించే ఆ నటరాజుని వైభవం తనివితీర అనేకమార్లు ఆయన అనుభూతి చెందారు. ఆయన ఉపయోగించిన పద సంపుటిని గమనించండి - దహరాకాశం, వీతరాగిణం, అప్రమేయం, అద్వైత ప్రతిపాద్యం, సంగీత వాద్య వినోద తాండవ జాత బహుతర భేద చోద్యం. లయకారకుడైన శివుడు ఆనంద తాండవ హేలలో ఏ విధముగా సంగీత వాద్య నృత్యములను ఆనందిస్తూ ఈ సృష్టి క్రమమును ముందుకు సాగిస్తున్నాడో అద్భుతంగా పలికారు. దీక్షితుల వారి కృతులలో మరో ప్రత్యేకత ఆయా దేవతా స్వరూపాన్ని వర్ణిస్తూ మహిమలను, వైభవాన్ని తెలియజేయటం. ఈ రెంటిని అద్భుతమైన సమన్వయంతో ప్రతిపాదించటం ఆయన ఘనత. ఈ కృతిలో కూడా ఆయన అదే శైలిని కనబరచారు. శివతత్వాన్ని, రూపాన్ని, మహిమలను క్షేత్ర వర్ణన చేసే కృతిలో మనోజ్ఞమైన పద ప్రయోగముగా మలచి మనకు శాశ్వత ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా అందజేశారు. అందుకే, ఆయన సాహిత్యం వెలకట్టలేనిది, మహత్కరమైనది. ఈ కృతి భరతనాట్య ప్రదర్శనలలో చాలా అందంగా కళాకారులు ఆవిష్కరించే సాహిత్యం కలది. తదనుగుణంగా గాయకులు నృత్యరీతికి సంబంధించిన స్వరాలను ఈ కృతితో ఆలపిస్తారు. కేదార రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాంబే జయశ్రీ గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి