కదిరి నృసింహుడు కంభమున వెడలే
విదితముగా సేవించరో మునులు
ఫాలలోచనము భయదోగ్ర ముఖము
జ్వాలామయ కేసరములునూ
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలాగతి ధరియించుక నిలిచే
ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడ నదరెడి కటములునూ
నిడుత నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసే
సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూనీ
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివో
ఓ మునులారా! కదిరి నరసింహుడు స్థంభంలో ప్రఖ్యాతముగా వెలసినాడు, స్వామిని సేవించండి! జ్వలించే కన్నులు, భయమును కలిగించే ఉగ్రమైన ముఖము, ప్రకాశించే జూలు, కాలరుద్రునివంటి పదునైన దంతములు, అద్భుతమైన రూపవిన్యాసములతో నారసింహుడు వెలసినాడు, సేవించండి. ముడిపడే కనుబొమ్మలు, దీర్ఘమైన నిట్టూర్పులు, గడగడ అదిరే చెక్కిళ్లు, పొడవైన నాలుక, నిక్కబొడిచిన చెవులు కలిగి విలక్షణ రూపములో నారసింహుడు వెలసినాడు, సేవించండి. సమస్త ఆయుధములు, ఎనలేని చేతులు, భయంకరమైన గోళ్లు కలిగి వింత చేష్టలతో వేగముగా వేంకటేశ్వరుడు దుష్టనాశనానికై ఆవిర్భవించినాడు, సేవించండి.
అఠాణా రాగంలో కూర్చబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి