17, సెప్టెంబర్ 2020, గురువారం

పితృపక్షాలు

రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం
అర్థీనాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్ఠతు

నరకంలో అపుణ్యలోకాలలో పద్మార్బుదములో నివసించే, ఈ నీటి బిందువులను అర్థిస్తూ ఉన్న ఆత్మలకు ఉదకాన్ని సమర్పిస్తున్నాను. అవి అక్షయమగుగాక, వారు శాంతులగుదురు గాక.

ఒక్క శ్రాద్ధం రోజే కాకుండా ప్రతి నిత్యమూ పితృదేవతలను తలచుకోవలసిన విధి మానవునిది. పై మంత్రం అందుకే నిత్యం భోజనానంతరం నీటిని విడిచే విధిలో చెప్పబడింది. ఇవి పితృదేవతల ద్వారా మన పెద్దలకు చేరాలన్నది సారం.

మహాలయ పక్షాలు - మానవాళి అభివృద్ధికి, వంశాభివృద్ధికి, సృష్టి క్రమంలో సహజ పరిణామంగా వచ్చే మరణ బాధ నుండి ఆత్మలకు విముక్తి కలిగి ఉన్నతస్థానం లభించటానికి ఈ పక్షంలో చేసే కర్మలు ఎంతో తోడ్పడతాయి. కర్మ ఫలాలను బట్టి, వాటిని అనుభవించేందుకు అనువైనా పరిస్థితులు దొరికేంత వరకు ఆత్మలు పునర్జన్మ పొందవు. కర్మఫలాలు మంచివైతే ఉన్నత స్థానం, లేకపోతే నీచస్థానంలో వేర్వేరు జీవరాశులుగా జన్మనెత్తుతుంది ఆత్మ. అది మనిషి మరణించిన ఏడాదికి కావచ్చు, ఎన్నో ఏళ్లకు కావచ్చు, దశాబ్దాలకు కావచ్చు. సంవత్సరీకముల వరకు ఉన్న ఏడాది ప్రస్థానం ముగిసిన పిమ్మట ఆ ఆత్మ తిరిగి దేహాన్ని వెంటనే ధరించ గలిగినా, శ్రాద్ధ కర్మ, తర్పణాలు, పిండ ప్రదానాలు ఆ ఆత్మోద్ధరణకు తోడ్పడతాయి. దానిని వెసులుబాటు చేసే వారు పితృ దేవతలు. ఇది పూర్తిగా శాస్త్రీయమైనది.

సృష్టి క్రమంలోని జనన మరణాలనే చక్రంలో చిక్కుకున్న ప్రతి ఆత్మకూ ఉన్నతిని కలిగించేవి మనం సముపార్జించుకున్న పుణ్యఫాములతో పాటు, ఆ ఆత్మలను పితృదేవతలు ఏ విధంగా నడిపిస్తారు అన్నది కూడా. కాబట్టి పితృదేవతలు ఆత్మోద్ధరణకు గేట్‌కీపర్లు. మరి వారు సంతుష్టులైతే కదా ఆత్మోద్ధరణ జరిగేది. ఉద్ధరించబడని ఆత్మ అనేక అసంతులనలకు గురవుతూ ఉంటుంది. కొన్ని మార్లు ప్రేతరూపంలో, ఇతర రూపాలలో సంచరిస్తుంది. అన్నిటికీ కర్మఫలాలే ముఖ్య ప్రాతిపదిక. ఆ ఆత్మకు ఎక్కడో ఒక చోట ఊతం అందాలి కదా? అది మనకు నిర్దేశించబడిన అనేక విధి విధానాల ద్వారా జరుగుతుంది. ఒకటి పైన చెప్పబడిన భోజనకాల ఉదకదానం. అలాగే, నిత్యానుష్ఠానంలో మరెన్నో. వీటిలో మరొక ముఖ్యమైనది మహాలయ పక్షం.

ఈ మహాలయ పక్షంలో పితృదేవతలని సంతృప్తి పరచటానికి అత్యంత అనువైన కాలం. సృష్టిలో ఉత్తరాయణ దక్షిణాయనాలకు వాటి వాటి ప్రాధాన్యతలున్నాయి. దక్షిణాయన కాలంలో సృష్టిక్రమాన్ని సూచించే వర్షఋతువు ముగిసే సమయంలో, అనగా పొలాలు దున్నబడి, తొలకరి వానలు కురిసి, గింజలు నాటబడి, మరల వానల వలన అవి మొలిచి మనకు ఆహారం అందించటానికి పంటలు వేగంగా పెరుగుతాయి. ఈ సమయంలో వచ్చే ఋతువు మార్పునకు కూడా సంకేతం మహాలయపక్షం. వర్షములు ఆగే సమయం, శరదృతువు ఆగమనమునకు ముందు రెండు వారాలు ఈ పక్షం. మానవుని శరీరానికి సంబంధించి చైత్ర మాసం మొదలయ్యే సమయం, అలాగే ఆశ్వయుజం మొదలయ్యే సమయం మధ్య ఉన్న ఆరునెలల సమయమనేది కాలగమనంలో ఓ పెద్ద మైలు రాయి. అలాగే సృష్టిక్రమంలో కూడా మైలురాయి. అందుకే ఈ శరదృతువు ఆరంభానికి మునుపు వచ్చే పక్షాన్ని ఆత్మగమనాన్ని నిర్దేశించే పితృదేవతలకు సంబంధించినదిగా శాస్త్రం నిర్ణయించింది.

మరి ఈ సమయంలో ఏం చేయాలి?

సృష్టి క్రమాన్ని గౌరవిస్తూ, జనన మరణ చక్రంలో చిక్కుకుని క్లేశాల బారిన పడుతున్న ఆత్మలను ఉద్ధరించేందుకు దేహధారణ చేసి ఆ అత్మలతో ముడిపడి ఉన్న మనం మనవంతు ప్రయత్నం చేయాలి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన అంశం - జననమనేది కర్మఫలాలను బట్టి అన్నది. అనగా ఒకేరకమైన కర్మఫలాలను అనుభవించవలసిన ఆత్మలు ఒకే రకమైన పరిస్థితులలో దేహాన్ని ధరిస్తాయి. అనగా ఒక కుటుంబంలో, ఒక వంశంలో, ఒక సామాజిక పరిస్థితులలో. అందుకే మనవాళ్లు భార్య బిడ్డలు, మనతో ఉండే పశువులు ఋణానికి రూపాలు అంటారు -

ఋణానుబంధ రూపేణ పశు పత్నీ సుతాలయా రుణక్షయే క్షయయంతి తత్ర పరివేదనా

పశువులు, భార్య, పిల్లలు, ఇల్లు అన్నవి పూర్వజన్మ ఋణములకు రూపములు. ఈ రుణములు తీర్చుకున్న తరువాత ఆత్మకున్న క్లేశములు నశిస్తాయి.

వీటన్నిటినీ పరిశీలించే శ్రాద్ధ కర్మ, పితృపక్షాలు, తర్పణాలు, పిండప్రదానాలు, దానాలు నిర్వచించబడ్డాయి. ఆత్మోద్ధరణకు ఆ దేహానుబంధమైన వారందరూ ఋణాలను తీర్చుకుని, ఆ ఆత్మలను ఉద్ధరించే పితృదేవతలకు కృతజ్ఞత తెలుపుతూ ప్రాణశక్తికి సంకేతమైన అన్న, ఉదక, తిలములను వినియోగించి ఈ మహత్కార్యానికి తోడ్పడతాం.

సారాంశం: మరణానంతరం కర్మఫలాల ద్వారా బాధలు పడుతూ మరు జన్మ కోసం వేచి ఉన్న, జన్మ పొందిన ఆత్మల ఉద్ధరణకు పితృదేవతలను ప్రీతి పరచి వారి ద్వారా సృష్టి క్రమంలో ఓ ముందడుగు పడేందుకు మనవంతు ప్రయత్నం పితృకార్యాలు. దానికి అత్యంత అనువైన సమయం కాలగమనంలో అతి ముఖ్యమైన మైలురాయైన పితృపక్షం. కావలసింది నమ్మకం, శ్రద్ధ, కృతజ్ఞత. పూర్వీకులు లేనిదే మనం లేము, మన జన్మకు కారణమైన వారి ఆత్మలను ఉద్ధరించేందుకు మనవంతు ప్రయత్నం చేయటం మన ధర్మం.

అక్షయ్యముపతిష్ఠతు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి