విన్నపాలు విన వలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్లనంతనింత అదివో వారే
చల్లని తమ్మి రేకుల సారసపు కన్నులు
మెల్లమెల్లన విచ్చి మేలుకొనవేలయ్య
గరుడ కిన్నెర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరి పరి విధముల పాడేరు నిన్నదివో
సిరి మొగము దెరచి చిత్తగించవేలయ్య
పొంకపు శేషాదులు తుంబురు నారదదులు
పంకజ భవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలు మంగను
వేంకటేశుడా! రెప్పలు విప్పి చూచి లేవయ్య
ఓ శ్రీనివాసా! వింత వింతలైన భక్తుల విన్నపాలు వినుటకు ఆ ఆదిశేషుని పడగలనే దోమతెరను పైకెత్తి మేల్కొనవేల? తెల్లవారింది, జాము పొద్దెక్కింది, దేవతలు మునులు అదిగో అక్కడ చేరుకున్నారు. చల్లనైన కలువరేకుల వంటి అందమిన కన్నులను మెల్లమెల్లగా తెరచి మేలుకొనవేల? అదిగో గరుత్మంతుడు, కిన్నెరులు, యక్షులు, అప్సరసలు గుంపుగా విరహపు గీతాలు, వింతైన ఆలపానలతో పరిపరి విధాల నిన్ను నుతించుచున్నారు సిరులొలికించే ముఖముతో వారిని ఆలకించవేల? అతిశయముగా శేషుడు, తుంబురుడు, నారదుడు, బ్రహ్మ మొదలైన వారు నీ పాదాల వద్దకు చేరి వరుసగా నిలుచున్నారు, నిద్దుర లేచి రెప్పలు విప్పి అలమేలుమంగను చూచి మేల్కొనుము వేంకటేశ్వరా!
భూపాల రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి