నందుని కుమారుడవై, అనేకులైన యోగులు, దేవతల చేత నుతించబడిన శ్రీకృష్ణా! నాకు పరమానందమనే అమృతమును ప్రసాదించుము. గుణించలేనన్ని గుణములకు నెలవు నీవు, నా కామ్యములను తీర్చే అపరిమిత పరాక్రమము కలవాడవు, సమస్త వేదవేదాంగములు చెప్పిన పరమపదము నీవు, సమస్త మోహములను దూరము చేసేవాడవు. మందర పర్వతమును ధరించినవాడవు, దట్టమైన మేఘముల వంటి దేహఛాయ కాలవాడవు, నుతించే జనులనే నీటి కలువల పట్ల చంద్రుని వంటి వాడవు. సమస్త పాపములను హరించేవాడవు, అందరి పట్ల సమధర్మము కలిగిన వాడవు, రాక్షస సమూహాన్ని నాశనం చేసిన పరాక్రమవంతుడవు నీవు. నాకు పరమానందమనే అమృతమును ప్రసాదించుము. ప్రకాశించే ముత్యములు కలిగిన హారమును ధరించిన నందుని కుమారుడవు, సంసార బంధనములను తొలగించి, రక్షించి, సుఖములనొసగే వాడవు, నమస్కరించే వారికి ఆధారమైన వాడవు, అనంతమైన శుభలక్షణములు కలవాడవు, నవనీత చోరుడవు, నరుని రూపములో నారాయణావతారుడవు నీవు. నాకు పరమానందమనే అమృతమును ప్రసాదించుము. శరదృతువులో చంద్రునికి సమానమైన ముఖము కలవాడవు, వంద మన్మథుల వంటి మనోహరమైన రూపము కలవాడవు, సర్వోన్నతమైన ఆనందాన్ని ప్రసాదించేవాడవని పేరొందినావు, మొల్లలవంటి అందమైన పలువరుస కలవాడవు, శత్రు సమూహమును నాశనము చేసి సమస్త లోకములను పాలించేవాడవు, నారాయణ తీర్థులకు సమీపములో నుండి నిజమైన ఫలములనొసగేవాడవు.
కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మల్లాది సోదరులు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి