5, సెప్టెంబర్ 2020, శనివారం

దూతగా హనుమాన్ - మొదటి భాగం

హనుమంతునికి అనేక నామాలు ఉన్నా, ఆయనను రామదూత అని వ్యవహరించటం ఆయనకు ఎంతో మోదాన్ని కలిగించింది. తానే స్వయంగా దూతోహం, దాసోహం అని చెప్పుకున్నాడు కదా.

దౌత్యం అనేది చాలా కష్టతరమైన విద్య. లోకవ్యవహారములలో వ్యక్తుల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించి వారి జీవితాలను అతికించే సామర్థ్యము కలవాడే దౌత్యములో నేర్పరి. ముఖ్యంగా దూత వినయము కలవాడు, జితేంద్రియుడు కావలెను. హనుమ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం అని పేరుపొందాడు కదా? వాగ్మి అనగా మంచి వాక్కు కలిగిన వాడు కావలెను. దీనికి జన్మ సహజమైన సంస్కారముతో పాటు, చక్కని పాండిత్యము కూడా తోడుండవలెను. "దూతంచైవ ప్రకుర్వీత సర్వశాస్త్ర విశారదాం" అని సమస్త శాస్త్రములు తెలిసినవానినే దూతగా నియమించాలి. మరి వానరం దూత ఎలా అయినాడు? అత్యంత విజ్ఞతతో, విచక్షణతో వ్యవహరించిన వాడు హనుమ. రామునికి మొట్టమొదటి సందర్శనంలోనే హనుమలో ఒక మంచి దూత లక్షణాలు కనిపించాయి. అతని మాటలలో వాక్శుద్ధి, ప్రజ్ఞ గోచరించాయి. అందుకే రాముడు లక్ష్మణునితో హనమంతుని పాండిత్యాన్ని ప్రశంసించాడు. అది పైపై పొగడ్త కాదు. సత్యం. హనుమ యొక్క వైదుష్యాన్ని, బుద్ధి కౌశలాన్ని ప్రశంసించి అటువంటి వ్యక్తి ఒక రాజుకు ఏ విధంగా సహాయకారో తెలియజేస్తాడు.

ఎవరైనా కొత్తగా వ్యక్తులు కలిసినప్పుడు వారి ముఖం మీదే మీరెవరు, మీ పేరేమిటి, ఎందుకు వచ్చారు అని అడగటం అమర్యాదే. రామలక్ష్మణులను తొలిసారి కలిసినప్పుడు హనుమ ఇలా నేరుగా ప్రశ్నించకుండానే ఆ ప్రశ్నలకు సమాధానం రాబడతాడు. ప్రశంసా సంభాషణలలో వారి గోత్రనామధేయాలు బయటపడతాయి. ఇదీ వాక్చాతుర్యము. ఇక్కడ కేవలం మాట పొందికే కాదు, మాట్లాడిన తీరు కూడా అద్భుతం. హనుమంతుని వాకులో శ్రీరామునికి అంతర్వాణి గోచరించించి. ఇవన్నీ గమనించే రాముడు కిష్కింధకాండలోని ఈ సందర్భంలో:

ఏవం విధోయస్య దూతో నభవేత్ పార్థివస్యతు
సిద్ధ్యంతి హి కథం తస్య కార్యాణాంగతయోనఘ

ఏవం గుణగణైర్యుక్తా యస్యస్యుః కార్యసాధకాః
తస్య సిద్ధ్యంతి సర్వార్థా దూతవాక్య ప్రాచోదితాః

ఇటువంటి గుణగుణములు కలిగిన దూత ఉంటే ఆ రాజుకు ఎటువంటి కార్యమైనా సిద్ధిస్తుంది అని స్పష్టంగా పలికాడు రాముడు. ఇక హనుమ ఎటువంటి వాడు?

సమస్తశాస్త్ర విశారదుడు, నవవ్యాకరణ పండితుడు, అవతలివ్యక్తి మనసులో ఉన్నమాటను చెప్పకుండానే తెలుసుకొనగల నేర్పరి. ఇది మనకు సుగ్రీవ రామకార్య నిర్వహణలో సుస్పష్టమవుతుంది. ఇక శుచిత్వం గురించి చెప్పేదేముంది? రావణాంతఃపురంలో స్త్రీల మధ్య సీతాన్వేషణైక చిత్తంతో సంచరిస్తూ సీత జాడ తెలియక ఇతర స్త్రీలను పరికించి చూడవలసి వచ్చినందుకు పరితాపాన్ని ప్రకటిస్తాడు.

తానొక్కడు, పరదేశం, అనంతమైన శత్రుసైన్యం, రాక్షసులు. అయినా కూడా భీతిలేకుండా వెదకటానికి కానీ, తలపడటానికి కానీ, రావణ సభలో తర్కించి దూతను చంపని తర్జనభర్జనలు చేసినప్పుడు గానీ చలించని ధైర్యశాలి. సముద్రం ఎలా దాటాలో, దానిలో ఉన్న కష్టనష్టాలేమిటో, ఎంతదూరం వెళ్లాలో, ఎలా ప్రవేశించాలో ఏమీ తెలియకపోయినా సముద్రతారణ, లంకాభిగమన, సీతాన్వేషణ కార్యాలు అత్యంతావాశ్యకమని సిద్ధపడిన ధీశాలి. ఇది దూతకు మరో ముఖ్యమైన లక్షణం.

దేశకాలాన్ని ఎరిగి మాట్లాడటం - అత్యంత ముఖ్యమైన లక్షణం ఇది. ఎప్పుడు ఎవరి ముందు ఎలా మాట్లాడలో, అనగా సందర్భోచితంగా మాట్లాడటం తెలిసిన వాడే వాగ్మి. ఇది హనుమకు తెలిసినంత మరెవరికీ తెలియదు కాబట్టే సుగ్రీవుడు ఎవరో ఇద్దరు మానవులు వచ్చారు అని అనుమానంతో హనుమంతుని పంపుతాడు. అప్పుడు హనుమ కనబరచిన సందర్భోచిత వాక్పటిమ రాముని ప్రశంసలందుకుంది. ఎంతో సంయమనం కనబరచి మాట్లాడతాడు హనుమ.

హనుమంతుడు రాక్షసీగణ మధ్యంలో సీతను కలుసుకునే ముందు అంతఃపురంలో బాగా శోధిస్తాడు. ప్రతి స్త్రీని ఓపికతో పరిశీలించి, లక్షణాలను బట్టి వివేచించి ఔనా కాదా అని నిశ్చయించుకోవలసి వస్తుంది. దానికి కారణం సీతను తానెరుగకపోవటం. అందువల్ల స్త్రీగణాలను తాను నిశితంగా పరిశీలించాలి. దీనికి జాగరూకత, సంయమనం కావాలి. క్షణకాలం పొరబడే తొలుత మండోదరిని సీత అనుకున్నా, జాగరూకతతో, విశ్లేషణాత్మక ధోరణితో వివేచన చేయగలిగాడు. ఇక్కడ హనుమ కనబరచిన నిగ్రహం శ్లాఘనీయం. స్త్రీగణ మధ్యంలో సంచరిస్తూ ఉన్నా తన బ్రహ్మచర్యవ్రతానికి భంగం కలుగకుండా వ్యవహరించాడు.

ఇక మరో ముఖ్యమైన లక్షణం - నష్టపోయినవి వెదకటానికి ఆ వస్తు జాతిలోనే వెదకాలి అన్న సూత్రం పాటించాడు కాబట్టే స్త్రీగణాలలో నిశితంగా వెదకాడు. ఇది హనుమ శాస్త్ర పారంగతను తెలియజేస్తుంది. అటుతరువాత లంకాదహనానికి కారణం పుచ్చాన్ని కాలచటం, దానికి కారణం వనభంజనం, దానికి కారణం రావణుని చూడాలన్న ఇచ్ఛ, దానికి కారణం కార్యసుగమం. ఆ కార్యమేమిటి? రాముని సీతాన్వేషణ. ఆమె కోసం రాముడు వాలివధ, కబంధ నిపాతనం, విరాధవధ, ఖరత్రిశిరసుల వధ, దూషణ వధ. అన్నీ సీతమ్మ కోసమే కదా? కాబట్టి ఆమెను చూసి రక్షించటం కోసం ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసినా సరే అన్న ధైర్యం, తెగింపు హనుమలో. అందుకే కార్యసిద్ధి హనుమాన్‌గా పేరొందాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మార్లు, ఎన్ని చోట్ల వెదకవలసి వచ్చినా వెనకంజ వేయను అన్న పట్టుదల హనుమది. ఇది సమతుల ఆలోచన. పని సానుకూలం కానప్పుడు ఉద్రేకంతో పనిని పాడు చేయటం మానవసహజం, కానీ హనుమంతుడు తితీక్షతో కార్యాన్ని సానుకూల పరచుకొని తన వివేకాన్ని ప్రదర్శించాదు. మళ్లీ మళ్లీ వదకుతాడు. సాధిస్తాడు.

సీత కనిపించింది. సరే. తరువాత హనుమ కనబరచిన విజ్ఞత ఏమిటి? తదుపరి వ్యాసంలో.

(శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి సుందర మారుతి పుస్తకం నుండి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి