అగస్త్య మహాముని ఆశీస్సులు పొంది వారి అనుమతితో సీతారామలక్ష్మణులు గోదావరీతీరంలో పంచవటీ క్షేత్రంలో ఒక పర్ణశాల నిర్మించి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఉదయం నదీ స్నానం, మధ్యాహ్నం తత్త్వ జిజ్ఞాస, సాయంకాలం వనవిహారం - ఇలా రోజులు, వారాలు, నెలలు, ఋతువులు సాగిపోతుంటాయి. ఉన్నట్టుండి ఆ హాయికి అంతరాయం కలుగుతుంది. రావణ సహోదరి శూర్పణఖ ఆ పరిసరాల్లో పచార్లు చేస్తూ ఒకనాడు హేమంత ఋతువులో రామలక్ష్మణులను పర్ణశాలలో చూస్తుంది. కామదూరుడైన రాముణ్ణి కామిస్తుంది. సీతను చూసి అసూయ పడుతుంది. రాముడు కాదంటే లక్ష్మణుడైనా సరేనని ఇదరిలో ఎవరినో ఒకరిని తనవానిగా చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. రామలక్ష్మణుల పరిహాసాన్ని అర్థం చేసుకోలేని చుప్పనాతికి తగిన శాస్త్రి జరుగుతుంది. రాముని కనుసన్నలను గమనించిన లక్ష్మణుడు ఆమె ముక్కును, చెవులను కోసి అసలే అనాకారి అయిన ఆమెను మరీ వికారి చేసి పంపుతాడు. దీనితో శూర్పణఖకు అండదండగా సోదరులు ఖరదూషణాదులు రామలక్ష్మణులపై కత్తిదూస్తారు. రాముడు ఒంటరిగా పద్నాలుగు వేల రాక్షసులను సంహరిస్తాడు. శూర్పణఖకు జరిగిన పరాభవం రాముని దాకా వెళుతుంది. సీత అందాన్ని విని రావణుడు చలిస్తాడు. మారీచుని సాయంతో సీతను అపహరిస్తాడు. రామలక్ష్మణులు జటాయువు వల్ల జరిగిన వృత్తాంతం తెలుసుకుంటారు. సీతాపహరణం కంటే జటాయు మరణం రాముణ్ణి ఎక్కువగా బాధిస్తుంది. జటాయువుకు అంత్యక్రియలు చేసి సీతాన్వేషణకై బయలుదేరుతారు రామలక్ష్మణులు.
శూర్పణఖ వచ్చింది రాముని కోసం. కానీ. పర్యవసానం సీతాపహరణం. ఒక విధంగా శూర్పణఖ కోరింది కూడా సీతావియోగమే. రావణుడు సాధించింది కూడా రామవిరహమే. సీతారాములు కలిసి ఉన్నంతవరకు సోదరసోదరీమణుల కోరిక నెరవేరదు. చెల్లెలు రామునిపై చాటలవంటి గోళ్లతో మొరటుగా పర్ణశాలపై విరుచుకు పడుతుంది. అన్న సీతమ్మను అపహరించేందుకు దొంగ పన్నాగంతో సాధువేషంలో వచ్చి ఒంటరిగా ఉన్న సాధ్విని బలవంతంగా తీసుకొనిపోతాడు. శూర్పణఖ వ్యక్తిత్వం ఆమె నఖాల్లో (గోళ్లలో) ప్రతిబింబితమైతే రావణుని దంభం అతని శిరసులో కుంభించి ఉంటుంది. పరమాత్ముని కాలిగోళ్లు పరంజ్యోతిని ప్రసరింపజేస్తాయని ప్రతీతి. శూర్పణఖ చేతిగోళ్లు విషయవాసనలను విరజిమ్మాయి. గోళ్లు వాసనకు, ఉపాసనకు కూడా పనికి వస్తాయి. జీవలక్షణాలు గల నిర్జీవ పదార్థాలలో గోళ్లు కూడా పరిగణించబడతాయి. కండూతికి, పాండితికి రెండిటికీ గోళ్లు వాటంగా, ఘాటంగా ఉపకరిస్తాయి. అలాంటి గోళ్లతో శూర్పణఖ రామచంద్రుని సమీపిస్తుంది. చూడటానికి చక్కగా ఉన్న రాముని చూసి నేను నీకు తగిన దానను అని సిగ్గు లేకుండా చెప్పుకుంటుంది. సీతాసమేతుడైన రామచంద్రుడెక్కడ? కొండల్లో కోనల్లో మానం వదలుకొని మైమరచి విహరించే శూర్పణఖ ఎక్కడ? ఇద్దరి రూపవైరుధ్యాన్ని నిరూపిస్తూ వాల్మీకి అంటాడు:
సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరీ
విశాలాక్షం విరూపాక్షీ సుకేశం తామ్ర మూర్ధజా
ప్రియరూపం విరూపా సా సుస్వరం భైరవస్వనా
తరుణం దారుణా వృద్ధా దక్షిణం వామభాషిణీ
న్యాయవృత్తం సుదుర్వృత్తా ప్రియమప్రియదర్శనా
శరీరజ సమావిష్టా రాక్షసీ రామమబ్రవీత్
శూర్పణఖ రాక్షసి, రాముడు పురుషోత్తముడు. రాక్షసీ రాముల రూప వైషమ్యం గమనించదగినది. ఆమె దుర్ముఖి, అతడు సుముఖుడు, ఆమె మహోదరి, అతడు సన్నని నడుము గల సుకుమారుడు. ఆమె విరూపాక్షి, అతడు విశాలమైన కన్నులు గలవాడు. ఆమెది ఎర్రని రాగి జుట్టు, అతనిది నల్లని జుట్టు. ఆమె వికృతాకారంతో విపరీతంగా పెరిగిన వయోవృద్ధ. అతడు పిన్నవయసులో వెన్నలా కన్నులవిందుగా కనిపించే కమనీయ స్ఫురద్రూపి. ఆమెది కఠోరమైన కంఠం, అతనిది మృదుమధురమైన స్వరం. కట్టె విరిచినట్లు మాట్లాడే గడుసుదనం ఆమెలో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. అతడు అన్నివిధాలా అందరికీ అనుకూలంగా అణకువతో మాట్లాడే ప్రియంవదుడు. ఆమె కామాంధురాలైన కామిని, అతడు న్యాయసమ్మతంగా వ్యవహరించే ప్రియదర్శనుడు.
ఇలాగే, రామ రావణులకు మధ్యగల వ్యత్యాసాన్ని కూడా సీతాదేవి రావణునికి సుస్ఫష్టంగా చెబుతుంది. సింహం ముందు నక్కలా రావణుడు రాముని ఎదుట నిలబడేందుకు కూడా పనికిరాడని ఆమె చెబుతుంది. మురికి కాలువకు మున్నీటికి, ఇనుముకు బంగారానికి, బురదకు గంధానికి. కాకికి గరుత్మంతునికి ఎంత భేదముందో అంత వ్యత్యాసం వారి మధ్య ఉందని ఆమె తనను అపహరించేందుకు వచ్చిన రావణునితో నిర్భయంగా చెబుతుంది. తపస్సు, వర్చస్సు, ఓజస్సు - ఎన్ని ఉన్నా ఒక్క ధర్మం లోపించటం వల్ల కామమోహితుడైన రావణుడు లోకరావణుడవుతాడు. సత్య ధర్మ పరాయణుడైన రామచంద్రునికి దూరమవుతాడు. శూర్పణఖది సుఖప్రధానమైన వ్యక్తిత్వమైతే రావణుడు శిరఃప్రధానుడు. ఒకటికి పది తలలు గల పెద్ద మనిషి. మంచికి చెడుకు కూడా శిరస్సే ఆధారం. మంచి మంచి ఆలోచనలతో మంచి తలపెట్టి ప్రపంచంలో మంచిని పంచగలిగేది తలపులకు నిలయమైన తలయే. ఆ తలకాయలోనే ప్రపంచాన్ని ముంచి వేసే దురాలోచనలు కూడా బయలుదేరవచ్చు. శూర్పణఖ గోళ్లవలె రావణాసురుని తలలు కూడా మంచిని అణచి వేసి చెడును చేరదీస్తాయి. పర్యవసానం రావణ సంహారం, శ్రీరామజయం, సీతావిముక్తి. ఈ శుభాంతానికి బీజం శూర్పణఖ పరాభవం, సీతాపహరణం. శూర్పణఖ లేకుంటే ఆ తరువాతి కథే లేదు, రామాయణ పరమార్థం నెరవేరదు. కాబట్టి శూర్పణఖ వృత్తాంతం రామాయణ కథలో కీలకమైన నాభి స్థానాన్ని పొందుతుంది. కైక వరంతో రామాయణంలోని బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నమైతే శూర్పణఖ పరాభవంతో విష్ణుగ్రంథి విడిపోతుంది. ఇక రుద్రగ్రంథి వైపు రామాయణం పయనిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి