4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఇతడొకడే సర్వేశ్వరుడు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు

పరమ యోగులకు భావ నిధానము అరయ నింద్రాదులకైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము సిరులొసగేటి ఈ వేంకటేశుడు

కలికి యశోదకు కన్న మానికము తలచిన కరికిని తగు దిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు చెలరేగిన ఈ శ్రీవేంకటేశుడు

తగిలిన మునులకు తపము సత్ఫలము ముగురు వేల్పులకు మూల మీతడె
ఒగి నలమేల్మంగకొనరిన పతియై జిగి మించిన ఈ శ్రీవేంకటేశుడు

వికసించిన కమలముల వంటి కన్నులు గల ఈ శ్రీవేంకటేశ్వరుడే సర్వేశ్వరుడు. శ్రేష్ఠులైన యోగులు భావించే పెన్నిది, అనుభూతి చెందగా ఇంద్రాదులకు నిధియైన వాడు, ఉత్తములైన గోపికల కౌగిటి సౌఖ్యము, సమస్త సంపదలనొసగే ఈ వేంకటేశ్వరుడే. మనోజ్ఞమైన యశోదకు మాణిక్యము వంటి కుమారుడు, ఆపదలో తలచిన గజేంద్రునికి దిక్కు, కురు సభలో శరణాగతితో ఆలపించిన ద్రౌపదికి చీరలిచ్చి మానము కాపాడిన ఆపద్బంధువు, ఈ దివ్యంగా ప్రకాశించే వేంకటేశ్వరుడే. కఠోరమైన తపస్సు చేసే మునులకు సత్ఫలమైన వాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలమైన పరమాత్మ, చక్కనైన అలమేలుమంగకు తగిన పతియై అనంతమైన కాంతి కలవాడు ఈ వేంకటేశ్వరుడే. 

ఏమైనా తిరుమల శ్రీనివాసుని వైభవమే వైభవం. అందుకే అన్నమయ్య జిగి మించిన శ్రీవేంకటేశుడు అన్నాడు. ఆ జిగి అంతా ఆయన మహత్తుల వల్లే. అనేక ఉదాహరణలతో, ఆయా సందర్భాలలో మహిమలను ఉట్టంకిస్తూ శ్రీనివాసుడే సర్వేశ్వరుడని మనోజ్ఞంగా స్వామి గుణవిభవములను ఆవిష్కరించారు అన్నమాచార్యుల వారు. మోహన రాగంలో కూర్చబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి