22, సెప్టెంబర్ 2020, మంగళవారం

కొలువుదీరెనే రాముడు - వాసుదాసస్వామి గారి కృతి

వాసుదాసస్వామిగా పేరొందిన వావిలికొలను సుబ్బారావు గారి పరిచయం వనం జ్వాలా నరసింహారావు గారి మాటల్లో. ఆ తరువాత వారు ఒంటిమిట్ట రాములవారిపై రచించిన ఒక కృతి. శ్రవణం ఆకాశవాణి విజయవాడ వారి సౌజన్యంతో.

వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా, పూర్వకాండలతో సహా ఉత్తరకాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు. ఆ మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగు నేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్నాయి. కానీ, కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. వాల్మీకి రామాయణ క్షీరసాగర మథనాన్ని చేసి "మందర" మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, ఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, ఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లం చేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి వారు.

వాసుదాసు గారి కీర్తికి ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం. ఆంధ్ర భాషలో అంతకుముందు రామాయణానికి యథామూలాలు లేవని, అర్థ పూర్తి కలిగి, కావ్య-ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై, ప్రామాణికమై, మూలానుసరమైన రామాయణం తెలుగులో వుండడం లోకోపకారంగా భావించి రచించారీ గ్రంథాన్ని వాసుదాసు గారు. ఎనిమిదేళ్లలో రామాయణాన్ని తొలుత నిర్వచనంగా ఆంధ్రీకరించి, అలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం చేశారు. తర్వాత, శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం "మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం వ్రాశారు వాసుదాసు గారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం. తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు వాసు దాసుగారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థతాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి"కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది.

ఆంధ్ర వాల్మీకి రామాయణం వ్రాయడానికి ప్రేరణ-స్ఫూర్తి, భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన సంకల్పం ద్వారానే తనకు లభించిందంటారు వాసుదాసుగారు. వావిలికొలను సుబ్బారావుగారు, కడప జిల్లా జమ్మలమడుగులో 1863లో జన్మించి 1939లో పరమపదించారు. ఎఫ్‌.ఎ చదువు పూర్తిచేసి, పొద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి, రెవెన్యూ ఇనస్పెక్టర్‌ హోదాకెదిగారు. ఆ విధంగా 1893-1904 మధ్య కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం మొదట్లో చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత, మద్రాస్‌ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్య కాలంలో పనిచేశారు. వాసు దాసుగారి తర్వాత ఆ పదవిని అలంకరించింది అక్కిరాజు ఉమాకాంతం గారు. కళాశాలలో చేరక ముందే, పినతండ్రి మీద తనకున్న కృతజ్ఞతకు గుర్తుగా, "శ్రీ కుమారాభ్యుదయం" అనే ప్రబంధ గ్రంథాన్ని రచించి, ఆయనకు అంకితమిచ్చి శాశ్వత స్వర్గ సుఖాన్ని ఆయనకు కలిగించారు. ఆంధ్ర పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, భార్యావియోగం కలగడంతో, వాసు దాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, బిక్షాటనచేసి లభించిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం 1900-1908 మధ్య. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో వున్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేశారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. విడిగా వాసు దాసుగారు, గాయత్రీ రామాయణం, శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం అనువాదమైనా, స్వంత రచన-స్వతంత్ర రచన అనిపించుకుంది.

వావిలికొలను సుబ్బారావుగారు పండిత పదవీ విరమణ చేసిన అనంతరం, తన జీవితమంతా, భక్తి మార్గంలోనే గడిపారు. వాసు దాసుగారు కౌసల్యా పరిణయం అనే ప్రబంధం, సుభద్రా విజయం అనే నాటకంతో పాటు, హిత చర్యలు, ఆధునిక వచనరచనా విమర్శనం, పోతన నికేతన చర్చ, పోతరాజు విజయం, రామాశ్వమేథం, ఆంధ్రవిజయం కూడా వ్రాశారు. ఆర్యకథానిధులు అన్న పేరుతో ఆయన వ్రాసిన సులభ వచన గ్రంథాలు తెలుగువారందరికి అత్యంత ఆదరణీయమైనాయి. సులభ వ్యాకరణం తెలుగు వ్యాకరణాన్ని నిజంగానే సులభం చేసింది. ఆయన రచించిన కృష్ణావతార తత్వం ప్రశస్త కృతి పాండిత్యంతో, ఆధ్యాత్మికభావనతో, పాఠకులలో ఆంధ్ర భాషాభిమానాన్ని ఉద్దీపించ చేసి-తాను తరించి, ఇతరులను తరింపచేసిన ధన్యాత్ముడు.

వాసుదాసుగారు ఆంధ్ర వాల్మీకిగా లబ్ద ప్రతిష్టులయ్యారు. రామాయణ క్షీర సాగరాన్ని మందరం మథించి, మనకందరికీ ఆప్యాయంగా అందించింది. భాష, శైలి, అర్థం, తాత్పర్యం కాలక్రమంలో పరిణామం చెందుతున్నాయి. వాసు దాసుగారు మారిపోతున్న తరాలకు గుర్తురావడం కూడా కష్టమైపోతున్నది. వారి ఆర్యకథానిధులతోనూ, హితచర్యల పరంపరలతోనూ, పరవశించిపోయిన తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వాసుదాసస్వామి.

కొలువుదీరెనే రాముడు కొలువుదీరెను

కొలువుదీరెను నేడు కోసలాధీశుడు
జలజాతలోచన జానకితో గూడి

కనకసింహపీఠి కమలాక్షులందరు
మనసార వింజామరములు వీవగా

హరిహయ హరముఖ సురవరులెల్లరు
కరములు జోదించి కరము భక్తి గొలువ

నృపముఖ్యులెల్లరు కపివరులతోడుత
చపలత లేకుండ సన్నిధి నిలుచుండ

వాసుదాసుడు తన పాటలు పాడగను
ఆశతోడ నిలుచు హర్షమునొందుచును

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి