13, సెప్టెంబర్ 2015, ఆదివారం

బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా!


బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా!

ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా!
నీ చరితము పొగడలేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమె నను

సీతాపతే! నాపై నీకభిమానము లేదా?
వాతాత్మజార్చితపాద! నా మొరలను వినరాదా?
ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవె కదా
పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక నను 

మైసూర్ వాసుదేవాచార్యుల వారు 20వ శతాబ్దపు వాగ్గేయకారులలో ప్రముఖులు. త్యాగరాజస్వామి వారి శిష్యపరంపరకు చెందిన వీరు మైసూరులో జన్మించినా సింహభాగం కృతులు తెలుగు సంస్కృత భాషలలోనే రచించారు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు వద్ద సంగీతం నేర్చుకొని మైసూరు మహారాజుల సంస్థానంలో విద్వాంసులుగా ఎంతో పేరొందారు వీరు. వీరి కృతులలో బ్రోచేవారెవరురా ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ రచించిన ఎన్నో కీర్తనలకు ఆయన సంగీతం కూర్చారు. ఆయన సంస్కృతంలో, కర్ణాటక సంగీతంలోఎంతటి విద్వాంసుడో అంతే వినయ సంపన్నుడు. ఆయన తన చివరి సంవత్సరాలను చెన్నై రుక్మిణీదేవి అరుండేల్ కళాక్షేత్రలో గడిపారు. అక్కడ ఒకసారి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు వచ్చి బ్రోచేవారెవరురా కీర్తన అద్భుతంగా గానం చేస్తే "నేను నా కూతురని గుర్తు పట్టలేదు, ఇంత అందంగా ఆభరణాలతో అలంకరించుకొని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గళంలో వస్తే..." అన్నారుట.200కు పైగా కృతులను రచించిన ఆయన అభినవ త్యాగరాజుగా పిలువబడ్డాడు. తన ముద్రగా 'వాసుదేవ' అనే పదాన్ని ఉపయోగించారు.  బ్రోచేవారెవరురా అనే కృతిలో ఆయన రాముని ఇలా వేడుకుంటున్నారు:

"ఓ శ్రీరామా! నువ్వు కాక నన్ను కాపాడేవారు ఎవ్వరు? ఓ బ్రహ్మాది దేవతలచే పూజించబడిన రామా! నీకు పరాకు ఎందుకు? నీ వైభవాన్ని పొగడలేను నేను. నా చింతలను తీర్చి, వరాలిచ్చి త్వరగా నన్ను బ్రోవుము!

ఓ సీతాపతీ! నీకు నాపై అభిమానము లేదా? ఓ హనుమంతునిచే కొలువబడిన పాదాములు కలవాడా! నా ప్రార్థనల్ను వినుము! ఆ గజేంద్రుడు ప్రార్థించగానే ఆత్రముగా వచ్చి బ్రోచిన శ్రెహరివి నీవు కదా! నా పాపాలన్నిటినీ పోగొట్టి నా చేయిని గట్టిగా పట్టుకొని నన్ను విడువకుము!"



మానవుడు శరీరంలో శక్తి, వయసు ఉన్నంత కాలం అహంకారం విర్రవీగి భగవంతుడు గుర్తుకు రాడు. కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, శరీరం క్షీణించినప్పుడు, ధైర్యము కోల్పోయినప్పుడు పరమాత్మను తలచుతాడు. దీనికి చక్కని ఉదాహరణ భాగవతంలోని గజేంద్ర మోక్షం. మదగజం ఆడ ఏనుగులతో సరససల్లాపాలాడుతూ సరస్సులో క్రీడిస్తుండగా స్థానబలిమి కలిగిన మొసలి ఆ కరిరాజు కాలిని పట్టిన సన్నివేశంలో ఆ ఏనుగు శరీరంలో శక్తిని నశించి, ప్రాణములు పట్టుకోల్పోయి, మూర్ఛ వచ్చే పరిస్థితులలో పరమాత్మను దీనంగా ప్రార్థిస్తాడు. అపుడా అ హరి పరుగు పరుగున వచ్చే సన్నివేశాన్ని మహాకవి  పోతన ఎంతో అద్భుతంగా వివరించారు:

సిరికింజెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం
తరధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై

"గజేంద్రుని ప్రాణములను రక్షింపవలెనను ఉత్సాహము ఉరకలు వేస్తుండగా ఆ శ్రీహరి, శ్రీదేవికైన చెప్పడు, శంఖచక్రములను ధరించడు, అనుచరులనెవ్వరిని పిలువడు, పక్షిరాజైన గరుడుని సిద్ధపడుమని తెలుపడు. చెవుల వరకు జాలువారిన కేశములనైనను సవరించడు. తనవ్రేళ్లకు చుట్టుకొనిన శ్రీదేవి యొక్క పైటచెంగును కూడా విడిచి పెట్టకుండా అట్లే లేచి వడి వడిగా ఆకాశ మార్గమున నడచి పోసాగెను"

ఆ విధంగా హరి వచ్చి మకరిని చక్రంతో సంహరించి కరిని కాపాడుతాడు. ఈ ఘట్టాన్ని కృతికర్త బ్రోచేవారెవరురాలో ప్రస్తావించారు. వాగ్గేయకారులు మన శ్రుతి స్మృతి పురాణాలను తమ సంకీర్తనలలో ప్రస్తావించటం వారి సనాతనధర్మ బద్ధతను, జ్ఞానాన్ని సూచిస్తుంది. వాసుదేవాచార్యుల వారి రచనా శైలి భక్తిమార్గాన్ని ప్రబోధించే భాగవతంలోని భక్తుల శైలికి సారూప్యత కలిగింది. గజేంద్రుని శ్రీహరి కాపాడిన వృత్తాంతము దాదాపుగా ప్రతి వాగ్గేయకారుడూ ప్రస్తావించాడు. త్యాగరాజ స్వామి తన కృతులు 'మరి మరి నిన్నే', 'ఈ మేను కలిగినందుకు ', 'మురిపెము కలిగ గద ', రామదాసు 'ఏమయ్య రామ ', 'పాహిమాం శ్రీ రామా ' అన్న కీర్తనలలో,  అలాగే అన్నమాచార్యుల వారు ఎన్నో సంకీర్తనలలో  దీనిని ప్రస్తావించారు. కారణం - అందులో జీవి ప్రవృత్తి, పరమాత్మ కరుణ చాలా అద్భుతంగా వివరించబడటం వలన. సారాంశం - వాసనలు తొలగి, వికారములు నశించి, భక్తితో కూడిన శరణాగతితో ప్రార్థించినపుడు పరమాత్మ తప్పక అనుగ్రహిస్తాడు. మన సంకల్ప లోపము, ప్రయత్న లోపము తప్ప ఆయన అనుగ్రహానికి లోపమే లేదు. బ్రోచేవారెవరురా అని ఇంత అద్భుతంగా నుతించిన వాసుదేవాచార్యుల వారిని కూడా శ్రీరాముడు అలాగే అనుగ్రహించాడు.

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో బ్రోచేవారెవరురా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి