5, సెప్టెంబర్ 2020, శనివారం

రుక్మిణీ కల్యాణం చదివితే పెళ్లవుతుందా? తప్పక

రుక్మిణీ కల్యాణం చదివితే పెళ్లవుతుందా? ఈకాలంలో కూడానా? ఏం మాట్లాడుతున్నారండీ! ఇలాంటివి చేస్తే పెళ్ళిళ్లు అయితే ఇంకేముందండీ, అందరు కన్యలకు కృష్ణ పరమాత్మలాంటి భర్త లభించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంసారాలు సాగిస్తారు కదా? నేటి ప్రపంచంలో ఇలాగ మన పురాణేతిహాసాలను అపహాస్యం చేయటం ఓ ఆనవాయితీ అయ్యింది. ఆ భాగవత గాథల మహత్తు నిజమే. ముమ్మాటికీ నిజమే. అదే భాగవతంలో ఉన్న గొప్పతనం. శ్రధాసక్తులతో, భక్తితో భాగవత గాథలను చదివితే ఈ అద్భుతాలు నిజమని నమ్మకం కలుగుతుంది. పోతన భాగవతం మామూలు కథల సంపుటి కాదు. పరమ భాగవతోత్తములవి. వారిలో రుక్మిణి కూడా ఒక ఉత్తమ భక్తురాలు. శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని దశమ స్కంధములో ఈ రుక్మిణీ కల్యాణ గాథ మనోజ్ఞంగా వివరించబడింది.

యుక్త వయసులో ఉన్న స్త్రీకి భర్త గురించి దృఢమైన అభిప్రాయాలుంటాయి. అలానే, రుక్మిణికి కూడా. విదర్భదేశంలో కుండిన నగరానికి భీష్మకుడు ప్రభువు. అతను వీరుడు, గొప్ప రాజు. అతనికి ఐదుగురు కుమారులు - రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే వారు. వీరి తరువాత ఒక కుమార్తె జన్మించింది. ఆమే రుక్మిణి. ఆ శ్రీకృష్ణుని కోసమే జన్మించింది.

యుక్త వయసులో ఆ స్వామిని వివాహమాడవలెనన్న కోరిక ఆమెలో ఎంత బలంగా ఉందంటే - "సన్నగా కొనసాగినట్లు ఆమె దేహము కూడా కోమలమైన తీగవలె వృద్ధి చెందింది. ఆ గోవింది హృదయ కమలము విప్పారేలా ఆమె ముఖపద్మము కాంతితో వికసించింది. ఆ శౌరి మనసు ఆమెపైనే ఉండే విధంగా ఆమె నడుము సన్నని ఆకృతిని పొందింది. ఆ గోవిందునిలో ప్రణయ భావనలు స్థిరమయ్యేలా ఆమె ఫాల భాగం విశాలమైంది. ఆ స్వామికై ఆమె యవ్వనము వికసించింది" - అని పోతన వర్ణించారు.

మరి ఆ రుక్మిణికి శ్రీకృష్ణుని గుణగణాలు ఎలా తెలిశాయి? తండ్రి యింటికి వచ్చే అతిథుల నోట ఆ స్వామి గొప్పతనం, సౌందర్యం, శౌర్యం విని ఆతడే నా ప్రభువు అని గట్టిగా నిర్ణయించుకుంది. అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా బంధువులు, స్నేహితుల ద్వారా ఆమె శుభలక్షణాలు, సత్ప్రవర్తన, రూపము, వివేకము గురించి విని ఆమెనే వివాహము కోవాలని నిర్ణయించుకున్నాడు. వీరి మనోరథము తెలుసుకున్న బంధుజనం కూడా ఈ వివాహము జరగాలని ఆశించారు. కానీ మూఢుడైన రుక్మి మాత్రం తన చెల్లెలిని చేది రాజైన శిశుపాలునకిచ్చి వివాహం చేయాలని సంకల్పించాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి బాధపడి అగ్నిద్యోతుడనే బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునికి సందేశం పంపించింది. బ్రాహ్మణోత్తముడైన అగ్నిద్యోతుని ఎన్నుకోవటంలో రుక్మిణి మనోరథం, ఆమె వివేకము మనకు తేటతెల్లమవుతాయి. ఆ అగ్నిద్యోతుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి మనసారా "పెండ్లికొడుకువు కమ్మని" ఆశీర్వదిస్తాడు. మీరు సద్బ్రాహ్మణులు మీ వాక్యము సత్యమగును అని శ్రీకృష్ణుడు సమాధానం చెబుతాడు. అప్పుడు అగ్నిద్యోతుడు రుక్మిణి సందేశాన్ని తెలుపుతాడు:

"ఓ మంగళమూర్తీ! పురుషులలో సింహము వంటి వాడవు నీవు. నీ చరణ సరోజములను స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు వివాహము చేసుకును అపహరించుటకు ప్రయత్నము చేయుచున్నాడు. అతడు నీ పరాక్రమము ఎఱుగడు. నేను పూర్వజన్మలో వ్రతములు, గురుసేవ, దానధర్మములు చేసితినేని వసుదేవ కుమారుడవైన నీవే నాకు ప్రాణేశ్వరుడవుతావు, శిశుపాలాదులు యుద్ధములో పరాజితులవుతారు. ఇక్కడ నీ పరాక్రమమునకు అడ్డులేదు, రేపే రథ గజ తురగ పదాతులనే చతురంగబలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను ఉగ్రరణములో ఓడించి. రాక్షస వివాహపద్ధతిలో నన్ను తీసుకుని వెళ్లు. నేను నీ వెంట వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను."

అని అంటుంది రుక్మిణి. అంతటితో ఆగదు. "నేను అంతఃపురములో ఉంటాను కాబట్టి ఎలా తీసుకు వెళ్లటం అని ఆలోచించకు. పెళ్లికి ముందు మా ఇలవేల్పు మంగళగౌరిని కొలిచేందుకు మా వారు నన్ను పంపుతారు. నేను ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి మొక్కు చెల్లించడానికై బయలుదేరుతాను, ఆ సమయంలో నన్ను నిరాటంకముగా నీ వెంట తోడ్కొని పొమ్ము" అంటుంది. అంతటితో ఆగిందా? "నాథా! ఏ పరమపురుషుని పాదపద్మాలలో ప్రభవించిన గంగాజలాలో ఓలలాడాలని మహాత్ములు తపిస్తారో అట్టి తీర్థపాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే బ్రహ్మచర్య వ్రతదీక్ష వహించి నూరుజన్మలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు నీకే అర్పిస్తాను. అది నా మనోనిశ్చయం" అని పలుకుతుంది.

ఈ సందేశం వినిపించిన తరువాత అగ్నిద్యోతుడు రుక్మిణి గుణగణాలను, రూపలావణ్యాలను, ఆమె ఆరాధనను మనోజ్ఞంగా వర్ణించి "ఓ కృష్ణా! మీరిద్దరూ ఈడూ జోడుగా ఉంటారు, మీకు వివాహం తప్పక జరుగుతుంది. ఆలస్యము వలదు, వెంటనే బయలుదేరి లోకకల్యాణమొనరించు" అంటాడు.

అప్పుడు కృష్ణుడు అగ్నిద్యోతునితో "ఓ పండితోత్తమా! నాకు కూడా రుక్మిణిపై గాఢమైన ప్రేమ కలదు. ఆమె నన్ను కోరుకుంటున్న విషయము కూడా తెలుసు. మీ సందేశము ద్వారా దానిని నిశ్చయం చేసుకున్నాను గాన ఇప్పుడు ఆమె కోసమై వచ్చి, విరోధులను ఓడించి ఆమెను స్వీకరించెందను" అని పలుకుతాడు.

రుక్మి, భీష్మకుడు వివాహానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. శిశుపాల జరాసంధులు బంధుమిత్ర సమేతంగా కుండిన నగరానికి చేరుకున్నారు. బలరాముడు సోదరుడొక్కడే వెళుతున్నాడని గ్రహించి ఆతనికి దన్నుగా తన సైన్యంతో విచ్చేశాడు.

ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రుక్మిణి మనసులో ఆందోళన పెరిగింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్లాడో లేదో? నందనందనుడు నా సందేశాన్ని తప్పుగా భావించిలేదు కదా? పరమేశ్వరుడు ఈ కార్యానికి అనుకూలిస్తాడో లేదో? ఆ పార్వతి నన్ను కాపడుతుందో లేదో? ఇలా పరి పరి విధాల ఆలోచించసాగింది. తల్లికి కూడా తన మనోభావనలు తెలుపలేదు. ఆమె దుఃఖించుచుండగా, అగ్నిద్యోతుడు వస్తాడు. అతని ముఖలక్షణాలు గమైంచి చిరునవ్వుతో అతనిని వివరాలు అడిగింది. శ్రీకృష్ణుని మనోభీష్టాన్ని ఎరిగి సంతోషపడి, ఆ బ్రాహ్మణునికి నమస్కరిస్తుంది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి స్వయంవరానికై విదర్భకు చేరుకున్నాడు. ప్రజలంతా ఆ గోవిందుడే రుక్మిణికి భర్త కావాలని పలికి దృఢంగా ఆకాంక్షించారు.

రుక్మిణి గౌరీపూజకై పరమేశ్వరి సన్నిధికి చేరుకొని:

నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్మి
మ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె
ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ! హరిం బతి సేయుమమ్మ నిన్న
మ్మినవారి కెన్నడును నాశము లేదు గదమ్మ యీశ్వరీ!

అని ప్రార్థించింది. దుర్గకు నమస్కరించి భర్తృసమేతలైన బ్రాహ్మణ పత్నులకు తాంబూలములు, మంగళ సూత్రములు, చెరకుగడలు మొదలైనచి ఇచ్చి పూజించింది. ఆ ముత్తైదువలు ఉత్సాహంతో దీవెనలిచ్చి రుక్మిణి తలపై అక్షతలుంచారు. తిరిగి రాజప్రాసాదానికి వస్తున్నప్పుడు ఆమె అందచందాలు చూసి అందరూ ముగ్ధులైనారు. వీరుల మనసులు చలించాయి, వారు ఆయుధాలు వీడి సమ్మోహితులైనారు. అప్పుడామె శ్రీకృష్ణుని చూసింది:

కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం గంఠీరవేంద్రావల
గ్నునవాంభోజదళాక్షు జారుతరవక్షున్ మేఘసంకాశ దే
హునగారాతి గజేంద్ర హస్తనిభబాహుం జక్రి బీతాంబరున్ఘ
నభూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్

చంద్రబింబము వంటి మోము, సింగము వంటి నడుము, క్రొత్త తామరలవంటి కన్నులు, అత్యంత రమణీయమైన వక్షము, నీలమేఘము వంటి మేను, ఐరావత గజతుండము వంటి బాహువులు, పీతాంబరము ధరించి చక్రాయుధము కలవాడు, వీజయమునందు ఆసక్తి గలవాడు, జగత్తును మోహింపజేసే వాడు అయిన శ్రీకృష్ణుని దర్శించింది.

అప్పుడు కృష్ణుడు ఆమె మనోభీష్టం నెరవేర్చటానికి అక్కడి వీరులపై యుద్ధం చేసి ఆమెను తీసుకొని పోవుచుండగా రుక్మి తన చెల్లెలిని అపహరించినందుకు శ్రీకృష్ణుని తూలనాడుతాడు. అతనిని నిరాయుధుడిని చేసి సంహరించబోగా రుక్మిణి అనన్ను చంపవద్దని అతనిని క్షమించమని వారిస్తుంది. బలరాముడు కూడా ఆమె మాటకు సమ్మతించి కృష్ణునితో రుక్మిని సంహరించవద్దని పలుకుతాడు. బంధుజనులు కొనియాడగా శ్రీకృష్ణుదు రుక్మిణిని ద్వారకకు తీసుకు వచ్చి వివాహం చేసుకుంటాడు.

అంతరార్థం:

దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటి? రుక్మిణి మనోభీష్టము, అది నెరవేరాలన్న సంకల్పము, దానిని వ్యక్తపరచి సాధించుకునే యత్నము, దానికై దైవప్రార్థన. ఇవే ఆ వివాహానికి కారణాలు. ఆమె భావనలు స్వయంగా తెలుసుకున్న తరువాత, ఆమె కోరిక మేరకే శ్రీకృష్ణుడు ఆమెను రాక్షస పద్ధతిలో కొనిపోయి వివాహము చేసుకుంటాడు. తాను స్వయంగా చేసినది కాదు.

మరి ఈ రుక్మిణీ కల్యాణం చదివితే యువతులకు వివాహమెందుకు అవుతుంది అని మన పెద్దలు నిర్ణయించారు?

1. యువతి మనోభీష్టం ముఖ్యం. ఆమె కామ్యము ఎంత గట్టిదైతే అంత త్వరగా సఫలమవుతుంది. తాను ఆ శ్రీకృష్ణుని తప్ప వేరెవరినీ చేసుకోనన్న నిర్ణయాన్ని స్వయంగా పలికింది.

2. తన సంకల్పానికై దైవాన్ని ప్రార్థించింది. తన కులదైవమైన గౌరిని పూజించి, మంగళప్రదమైన ఫలితాలు కలిగించే కర్మలను నిర్వర్తించింది.

3. తన సంకల్పం నెరవేరటానికి ఆమె వివేకాన్ని, ప్రదర్శించింది. ఉత్తముడు, వచనుడు అయిన అగ్నిద్యోతుని దూతగా ఎన్నుకోవటం దీనికి సూచిక. ఇతరుల శుభము కోరుకుని, లోకకల్యాణార్థమైన కార్యములను సఫలం చేయటానికి తమ బుద్ధిని, శక్తిని వినియోగించేవారు బ్రాహ్మణులు. అదే అగ్నిద్యోతుడు చేశాడు.

4. తన సంకల్ప సిద్ధికై సమయస్ఫూర్తితో వ్యవహరించి శ్రీకృష్ణునికి ఉపాయాన్ని కూడా సూచించింది రుక్మిణి.

5. తన మనోభీష్టాన్ని మొదటి సారి అగ్నిద్యోతుని ద్వారా కాదు, అంతకు మునుపే హితుల ద్వారా శ్రీకృష్ణునికి చేరేలా పలికింది.

అన్నిటినీ మించి, తన నడవడిక, తన వ్యక్తిత్వం, తన గుణగణాలు జగద్విదితమై శ్రీకృష్ణుని మనసు దోచుకునేలా జీవించింది. చివరకు అన్నను సంహరించకుండా సోదరి ధర్మాన్ని కూడా నిర్వర్తించింది. ఇక అటు తరువాత కృష్ణ పరమాత్మ పట్టపురాణిగా రుక్మిణి ఎంత పేరొందిందో మనకు తెలిసిందే.

ఆమె కనబరచిన సంకల్పబలం, వివేకం, దైవభక్తి, శ్రీకృష్ణునిపై అవ్యాజమైన ప్రేమ..ఆమె అభీష్టాన్ని నెరవేర్చి ఆమెకు సరైన నాథుడైనాడు కృష్ణుడు. ఇవీ రుక్మిణీ కల్యాణ గాథ ద్వారా అవివాహితులైన యువతులకు పాఠాలు. అవి అర్థమై, వారు తగిన విధంగా నడచుకుంటే వివాహం తప్పక జరిగి తీరుతుంది.

1 కామెంట్‌: