17, జులై 2020, శుక్రవారం

మారకోటి సుందరి - జీ.ఎన్.బాలసుబ్రహ్మణ్యం


మారకోటి సుందరి మానిని మామవ సదా జగన్మోహిని

శారదా విదుసమవదనే నీరజదళ సులోచనీ

నారదాది పూజిత పావని తారక రిపు శుభ జనని
ఘోర పాప సంతాప శమని పారమార్థిక ఫలదాయిని

కోటిమన్మథుల సౌందర్యము గలిగి, జగన్మోహినివయిన ఓ పార్వతీదేవీ! నన్ను ఎల్లప్పుడూ రక్షించుము. శారదా స్వరూపిణివి, ఏనుగు కుంభస్థల మధ్యము వంటి అందమైన ముఖము, కలువరేకుల వంటి అందమైన కన్నుల గల తల్లీ! నన్ను ఎల్లప్పుడూ రక్షించుము. నారదాదులచే పూజించబడిన పావనీ! తారకాసురుని శత్రువైన సుబ్రహ్మణ్యుని జననీ! ఘోర పాపముల వల్ల కలిగే సంతాపములను తొలగించి పారలౌకిక ఫలములనొసగే తల్లీ! నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.

- జీ.ఎన్.బాలసుబ్రహ్మణ్యం

ఇంతకన్నానందమేమి - త్యాగరాజస్వామి


ఇంతకన్నానందమేమి! ఓ రామ రామ!

సంతజనులకెల్ల సమ్మతి యుంటే గాని

ఆడుచు నాదమున పాడుచు ఎదుట రా
వేడుచు మనసున గూడియుండేది చాలు

శ్రీహరి కీర్తనచే దేహాది ఇంద్రియ స
మూహముల మరచి సోహమైనదే చాలు

నీ జపముల వేళనీ జగములు నీపై
రాజిల్లునయ్యా త్యాగరాజనుత చరిత్ర!

ఓ రామయ్యా! ఎల్లప్పుడూ హరికీర్తన చేయు హరిదాసులకిష్టమై యుండుటకన్నా ఆనందమేమున్నది? నాదానందముతో ఆడుచు పాడుచు నిను రమ్మని వేడుకొనుచు వానిపైనే మనసు నిలిపి యుంచుట కన్నా ఆనందమేమి? శ్రీహరివైన నీ నామ సంకీర్తనతో దేహము, ఇంద్రియములను మరచి వానికి తనకు అభేదమైన "సోహం" అనే ఆనందము కలుగును. అంతకన్నా ఆనందమేమున్నది? నిన్ను జపించేవేళ లోకాలన్నీ నీలోనే ప్రకాశించును. శివునిచే నుతించబడిన చరిత్రగల రామా! ఇంతకన్నా ఆనందమేమున్నది?

- సద్గురువులు త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి సజ్జన సాంగత్యములో హరిసంకీర్తనను మించిన ఆనందమేమున్నదన్న అద్భుతమైన భావనను మనకు ఈ కీర్తన ద్వారా వ్యక్తపరచారు. నిరంతర నామస్మరణతో చక్కగా రాగయుక్తంగా ఆడుతూ పాడుతూ మనలను మనం మరచి ఆ హరివైభవాన్ని నుతించి అందులోనే రమించటమనేది ఒక సుకృతం. దానివలన దేహభావనలు తొలగి, మనలోని మలినాలు కఱగి, ఆ పరమాత్మ మనయందే యున్నాడన్న అద్వైత భావము ఎఱిగి సచ్చిదానందము కలుగుతుంది. అంతకన్నా కావలసినదేముంది? ఈ కీర్తనలో భక్తి, యోగము, సత్సంగము, నామ స్మరణ అనే కలియుగంలోని అద్భుత మోక్ష సాధనాలను ఉట్టకించారు త్యాగయ్య. సగుణోపాసనలో ఇవి అత్యంత కీలకమైనవి. బిలహరి రాగంలో అద్భుతమైన శక్తి ఉందని త్యాగరాజస్వామి చరిత్ర మనకు తెలుపుతుంది. మరణశయ్యపైనున్న వానిని బ్రతికించే శక్తి గలిగిన స్వరాలు ఈ రాగంలో ఉంది. ఆరోగ్యాన్ని కలిగించటానికి, మనసును ఉత్తేజపరచటానికి, ఆత్మోద్ధరణకు ఈ రాగం బహుప్రయోజనకరమని పరిశోధనలో తేలింది. సాహిత్యంలోని భావానికి తగిన రాగంలో స్వరపరచారు కాబట్టే త్యాగయ్య మహావాగ్గేయకారునిగా, నాదయోగిగా శాశ్వతంగా నిలిచిపోయారు.

15, జులై 2020, బుధవారం

ఏహి ముదం దేహి - నారాయణ తీర్థులు



ఏహి ముదం దేహి శ్రీకృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ

నంద గోప నందన శ్రీకృష్ణ కృష్ణ యదు నందన భక్త చందన కృష్ణ కృష్ణ

కలభగతిం దర్శయ శ్రీకృష్ణ కృష్ణ తవ కర్ణౌ చలయ శ్రీకృష్ణ కృష్ణ 

ధావ ధావ మాధవ శ్రీకృష్ణ కృష్ణ నవ్య నవనీతమాహార శ్రీకృష్ణ కృష్ణ

విక్రమ బలం దర్శయ శ్రీకృష్ణ కృష్ణ విధి శక్రాది సన్నుత శ్రీకృష్ణ కృష్ణ

భవ్య నటనం కురు శ్రీకృష్ణ కృష్ణ బలభద్ర సహోదర శ్రీకృష్ణ కృష్ణ

సాధు సాధు కృతమిహ శ్రీకృష్ణ కృష్ణ లోక సాధక హితాయ శ్రీకృష్ణ కృష్ణ 

నారదాది ముని గేయ శ్రీకృష్ణ కృష్ణ శివ నారాయణ తీర్థ వరద కృష్ణ కృష్ణ 

గోపాల బాలుడవైన ఓ శ్రీకృష్ణా! నీవే మాకు శరణు, మాకు ఆనందము కలుగజేయుము. నందుని కుమారుడవు, యదు వంశమునకు ఆనందం కలిగించే వాడవు, భక్తుల పాలిట చందనము వంటి వాడవు నీవే మాకు శరణు. ఏనుగువలె చెవులను ఆడిస్తూ అందముగా నడిచే శ్రీకృష్ణా! నీవే నాకు శరణు. లక్ష్మీదేవికి పతియిన శ్రీకృష్ణా! అప్పుడే సిద్ధమైన వెన్నను స్వీకరించుటకు పరుగిడుతూ రమ్ము, నీవే మాకు శరణు. బ్రహ్మేంద్రాదులచే నుతించబడిన శ్రీకృష్ణా! నీ పరాక్రమమును, బలమును ప్రదర్శింపుము. నీవే మాకు శరణు. బలరాముని సోదరుడవైన శ్రీకృష్ణా! నీ భవ్యమైన నాట్యము చేయుము, నీవే మాకు శరణు. లోకంలో సాధకులకు హితుడవైన శ్రీకృష్ణా! నీ సాత్వికమైన చేష్టలను చేయుము, నీవే మాకు శరణు. నారదాది మునులుచే స్తుతించబడిన, శివనారాయణ తీర్థులను కాపాడిన శ్రీకృష్ణా! నీవే మాకు శరణు, మాకు ఆనందము కలుగజేయుము. 

(కృష్ణలీలాతరంగిణి నుండి,  చిత్రం మన్నార్‌గూడి రాజగోపాలస్వామి)

14, జులై 2020, మంగళవారం

మరి మరి నిన్నే మొరలిడ - త్యాగరాజస్వామి


భాగవతంలోని గజేంద్ర మోక్షం గురించి ప్రస్తావించని వాగ్గేయకారులు లేరు. వారు ఎన్నో కీర్తనల్లో కరిరాజుని శ్రీహరి కాపాడిన రీతి గురించి వ్రాశారు. కారణం - ఆ గజరాజు మనందరి లాగానే ముందు అహంకారం, తరువాత నిస్సత్తువ, తరువాత భయం, తరువాత అంతర్మథనం, శరణాగతి....ఈ సోపానాలు చేశాడు, నీవే తప్ప ఇతఃపరంబెరుగ అన్న స్థితికి వచ్చినప్పుడు ఆ పరమాత్మ బిరాన వచ్చి మోక్షమిచ్చాడు. ఆ కరి రాజును బ్రోచినవాడివి నన్ను బ్రోవలేవా అని పరి పరి విధాలా వేడుకున్నారు. నిందాస్తుతి కూడా చేశారు. అటువంటి ఒక కీర్తన త్యాగరాజస్వామి వారిది మరి మరి నిన్నే. భాగవత ఘట్టలు వాగ్గేయకారుల గీతలలో అంతర్భాగం అన్న దానికి ఇటువంటి కృతులు ఉదాహరణ.

మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయ రాదు

కరి మొర విని సరగున చన నీకు కారణమేమి సర్వాంతర్యామి

కరుణతో ధ్రువునికెదుట నిల్చిన కథ విన్నానయ్యా
సుర రిపు తనయునికై నరమృగమౌ సూచనలేమయ్యా
మరచియున్న వనచరుని బ్రోచిన మహిమ దెలుపవయ్యా
ధరను వెలయు త్యాగరాజ సన్నుత తరము గాదిక నే విననయ్యా

ఓ రామచంద్రా! మళ్లీ మళ్లీ నిన్నే మొరలిడుతున్నాను, అయినా నాపై నీ మనసులో దయ ఎందుకు రావటం లేదు? ఆ గజేంద్రుని మొర విని వేగంగా వచ్చావే! నీవు సర్వాంతర్యామివి కదా మరి నా మొరలు వినకపోవటానికి కారణమేమిటి? నీవు కరుణతో బాలుడైన ధ్రువుని తపము మెచ్చి బ్రోచిన కథను విన్నాను, దేవతలకు శత్రువైన హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుని కోసమై నరహరి రూపంలో రావటంలో భావమేమిటయ్యా! వనచరుడైన సుగ్రీవుని బ్రోచిన మహిమ అంతరార్థమేమిటయ్యా? ఈ భూమిపై వెలసి పరమశివునిచే నుతించబడిన రామా! నీవెన్ని చెప్పినను వినుట నా తరము కాదు, త్వరగా నాపై దయ చూపుము. 

13, జులై 2020, సోమవారం

ఉమాసహస్రం - కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని - రమణ మహర్షి


సమస్త వేద ఉపనిషత్ ఆగమ తంత్ర శాస్త్ర రహస్యాలు నిక్షిప్తమై యున్న ఈ ఉమాసహస్రం గణపతిముని భగవాన్ రమణ మహర్షుల వారి మార్గదర్శకంలో కేవలం 20 రోజుల దీక్షలో రచించారు. ఈ దీక్ష పేరు ఉమాసహస్ర స్తబక బంధ దీక్ష. 20-11-1907 నాడు రమణులకు తన సంకల్పాన్ని విన్నవించుకుని చూత గుహలో దీక్ష బూనారు. రమణులు ప్రతి సాయంత్రం గణపతిముని ఆరోజు రచన ముగిసే సమయానికి ఆ గుహ వద్దకు వచ్చి ఆనాటి రచనను ముని నోట విని కాసేపు కూర్చుని వెళ్లేవారు. ఆ విధంగా ముని స్తవకార్య భారం నిర్విఘ్నంగా కొనసాగటానికి రమణుల అనుగ్రహం తోడ్పడింది. ఈ స్తోత్ర కర్మ ఫలంగా గణపతిముని రమణుల సుబ్రహ్మణ్య తత్త్వ దర్శనాన్ని ఆశించారు. ఓ నాలుగైదు రొజుల్లో దీక్ష ముగుస్తుంది అనగా గణపతిమునికి గోరుచుట్టు వచ్చింది. గ్రంథరచన ముందుకు సాగనీయలేదు. 19వ రోజు సాయంత్రానికి 1/4 వంతు గ్రంథం మిగిలి ఉంది. 20వ రోజు వైద్యుడు వచ్చి దానికి చికిత్స చేశారు. ఆ రాత్రి ఐదుగురు లేఖకులను, వ్రాత సామాగ్రిని సమకూర్చుకున్నారు. రమణ మహర్షుల వారు కూడా వచ్చి కూర్చున్నారు. 10 స్తబకములు, ఒక్కొక్కదానిలో 25 శ్లోకములు, అనగా మొత్తం 250 శ్లోకాలు...ఒకే సమయంలో వేర్వేరు వృత్తాలను వ్రాయమని 5 స్తబకాలను పూరించసాగారు. 200 నిమిషాలు, అనగా, 3 గంటల 20 నిమిషాలలో ఆశువుగా 250 శ్లోకాలు పూర్తి చేశారు. అందరూ గణపతిముని ప్రతిభను, ఆయనలోని ఆధ్యాత్మికతను వేనోళ్ల పొగుడుచుండగా అప్పటివరకు గాఢసమాధిలో ఉన్న రమణులు మేల్కొని "నేను చెప్పినదంతా వ్రాసుకున్నారా" అని ప్రశ్నించి అక్కడున్న వారందరికీ గగుర్పాటు కలిగించారు. గణపతిముని మాత్రం ఆశ్చర్యపడకుండా తాను ఆశించిన గుహేశ (సుబ్రహ్మణ్యం తత్త్వం గుహ్యమైనది, అది ఆయనకు ఆ గుహలో రమణుల ద్వారా ఆ విధంగా బోధపడింది) తత్త్వము అవగతమైనదని సంతోషపడి "చిత్తము, నేను మీరు చెప్పినది శ్రద్ధగా గ్రహించి, వెంటనే శిష్యులకు చెప్పి,యిప్పుడే గ్రంథమును ముగించాను" అని మహర్షులకు సమాధానం చెప్పారు. "సరే, మంచిది" అని రమణులు ఆశీర్వదించి ఆ ఆమ్ర గుహను వీడారు. తమాషా ఏమిటంటే గణపతిముని మొదటి 19 రోజులలో వ్రాసిన 750 శ్లోకాలను ఎన్నో మార్లు సరిదిద్దగా, చివరి రోజున వ్రాసిన 250 శ్లోకాలను ఒక్కసారి కూడా దిద్దవలసిన అవసరం రాలేదు. దానికి కారణం గురువరేణ్యులు, గుహావతారి అయిన రమణులే. ఆ విధంగా గురు శిష్య ద్వయం కలిసి తల్లియైన ఉమకు చేసిన స్తోత్రమాలిక, నీరాజనమే ఉమాసహస్రం. ఇది రమణ గణపతుల సమష్టి రచన.

అఖిల జగన్మాతోమాతమసాతాపేనచాకులానస్మాన్
అనుగృహ్ణాత్వనుకంపాసుధార్ద్రయాహసితచన్ద్రికయా

అఖిలజగత్తులకును మాతయైన ఉమాదేవత - తమస్సు చేతను, తాపము చేతను బాధించబడుతున్న మమ్ములను దయామృతస్రవముచే చల్లని వెన్నెల వంటి చిరునవ్వుతో సమనుగ్రహించు గాక!

- గణపతి ముని ఉమాసహస్రం (పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి వ్యాఖ్యానము) నుండి.

11, జులై 2020, శనివారం

నాదసుధారసంబిలను నరాకృతాయెరా - త్యాగరాజస్వామి



నాదసుధారసంబిలను నరాకృతాయెరా! ప్రణవ

వేద పురాణాగమ శాస్త్రాదులకాధారమౌ

స్వరములు యాఱొక ఘంటలు వరరాగము కోదండము
దుర నయ దేశ్యము త్రిగుణము నిరతగతి శరమురా
సరస సంగతి సందర్భములు గల గిరములురా
ధర భజనే భాగ్యమురా త్యాగరాజు సేవించు

ఓ మనసా! ప్రణవనాదమనే అమృతము యొక్క సారము ఈ భూమిపై నరుని రూపములో శ్రీరామునిగా అవతరించినది. ఈ నాదమే వేదశాస్త్ర పురాణములకు ఆధారము. ఆ శ్రీరాముని విల్లులో గల ఏడు ఘంటలు సప్తస్వరములు. శ్రీరాముని కోదండము రాగమునకు సమానమైనది. ఆ విల్లునకు గల మూడు తీగెలు దుర నయ దేశ్యములనే రాగ విభజనలు, నిరాటంకమైన లయ శ్రీరాముని శరములు. శ్రావ్యమైన సంగతులు మరియు నెరవులు శ్రీరాముని మధురమైన పలుకులు. కాబట్టే, పరమేశ్వరునిచే నుతించబడిన శ్రీరాముని భజనే ఈ భువిపై మహాభాగ్యము.

- సద్గురువులు త్యాగరాజస్వామి

రాముడు పరబ్రహ్మ స్వరూపము అని తెలుపటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ప్రణవనాదామృత సారం శ్రీరాముడు అని పలికిన త్యాగరాజస్వామి దానికి కావలసిన ప్రాతిపదికలను అనుపల్లవి మరియు చరణంలో ఆవిష్కరించారు. శ్రీరాముని కోదండము, అందులోని భాగములు, ఆయన పలుకులకు సప్తస్వర రాగ లయాన్వితమైన సంగతులు, నెరవులకు సారూప్యత కనబరచి ఈ సంగీతానికి దివ్యత్వాన్ని చేకూర్చారు త్యాగరాజస్వామి. సమస్తమునకు రాముడే ఆధారము అన్న సంగతి వేద శాస్త్ర పురాణములకు ఆధారమైన ప్రణవ నాదంతో ఉపమానంగా అందరికీ అర్థమయ్యేలా పలికారు త్యాగరాజస్వామి. ఓంకారము నుండి జన్మించిన సప్తస్వరములు, ప్రణవ మంత్ర సారమైన శ్రీరాముడు - ఈ రెండిటినీ ఎంత చక్కగా అనుసంధానం చేసి నాదసుధారసం యొక్క గొప్పతనాన్ని మనకు రామతత్త్వం ద్వారా తెలియజేశారు. ఈ కృతిని మనోజ్ఞమైన ఆరభి రాగంలో స్వరపరచి లోకాభిరాముని తత్త్వాన్ని మన ముంగిట నిలిపారు.

10, జులై 2020, శుక్రవారం

కోరి వచ్చితినయ్యా కోదండపాణి - త్యాగరాజస్వామి


కోరి వచ్చితినయ్యా కోదండపాణి నిన్ను

చూచుటకెంతో సుందరమూర్తివనుచు కోరి వచ్చితినయ్యా

చిత్తానికి నీ కృప విత్తమనుచు చాల కోరి వచ్చితినయ్యా

మెండు గుణములచే నిండు కుండయనుచు కోరి వచ్చితినయ్యా

రాజాధి రాజ త్యాగరాజనుత చరిత కోరి వచ్చితినయ్యా

ఓ కోదండరామా! నిన్ను చూడాలన్న కోరికతో వచ్చితిని. నువ్వు చూచుటకు ఎంతో సుందరమైన వాడవని కోరి వచ్చితిని. ఈ మనసుకు నీ అనుగ్రహమే సంపదలనుకొని చాలా కోరి వచ్చితిని. సమస్త సద్గుణములను కలిగియున్న నిండుకుండవని నిన్ను చూడ కోరి వచ్చితిని. చక్రవర్తివి, శంకరునిచే నుతించిబడిన నీ చరిత్ర తెలుసుకొన కోరి వచ్చితిని. నన్ను అనుగ్రహింపుము.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...