13, జులై 2020, సోమవారం

ఉమాసహస్రం - కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని - రమణ మహర్షి


సమస్త వేద ఉపనిషత్ ఆగమ తంత్ర శాస్త్ర రహస్యాలు నిక్షిప్తమై యున్న ఈ ఉమాసహస్రం గణపతిముని భగవాన్ రమణ మహర్షుల వారి మార్గదర్శకంలో కేవలం 20 రోజుల దీక్షలో రచించారు. ఈ దీక్ష పేరు ఉమాసహస్ర స్తబక బంధ దీక్ష. 20-11-1907 నాడు రమణులకు తన సంకల్పాన్ని విన్నవించుకుని చూత గుహలో దీక్ష బూనారు. రమణులు ప్రతి సాయంత్రం గణపతిముని ఆరోజు రచన ముగిసే సమయానికి ఆ గుహ వద్దకు వచ్చి ఆనాటి రచనను ముని నోట విని కాసేపు కూర్చుని వెళ్లేవారు. ఆ విధంగా ముని స్తవకార్య భారం నిర్విఘ్నంగా కొనసాగటానికి రమణుల అనుగ్రహం తోడ్పడింది. ఈ స్తోత్ర కర్మ ఫలంగా గణపతిముని రమణుల సుబ్రహ్మణ్య తత్త్వ దర్శనాన్ని ఆశించారు. ఓ నాలుగైదు రొజుల్లో దీక్ష ముగుస్తుంది అనగా గణపతిమునికి గోరుచుట్టు వచ్చింది. గ్రంథరచన ముందుకు సాగనీయలేదు. 19వ రోజు సాయంత్రానికి 1/4 వంతు గ్రంథం మిగిలి ఉంది. 20వ రోజు వైద్యుడు వచ్చి దానికి చికిత్స చేశారు. ఆ రాత్రి ఐదుగురు లేఖకులను, వ్రాత సామాగ్రిని సమకూర్చుకున్నారు. రమణ మహర్షుల వారు కూడా వచ్చి కూర్చున్నారు. 10 స్తబకములు, ఒక్కొక్కదానిలో 25 శ్లోకములు, అనగా మొత్తం 250 శ్లోకాలు...ఒకే సమయంలో వేర్వేరు వృత్తాలను వ్రాయమని 5 స్తబకాలను పూరించసాగారు. 200 నిమిషాలు, అనగా, 3 గంటల 20 నిమిషాలలో ఆశువుగా 250 శ్లోకాలు పూర్తి చేశారు. అందరూ గణపతిముని ప్రతిభను, ఆయనలోని ఆధ్యాత్మికతను వేనోళ్ల పొగుడుచుండగా అప్పటివరకు గాఢసమాధిలో ఉన్న రమణులు మేల్కొని "నేను చెప్పినదంతా వ్రాసుకున్నారా" అని ప్రశ్నించి అక్కడున్న వారందరికీ గగుర్పాటు కలిగించారు. గణపతిముని మాత్రం ఆశ్చర్యపడకుండా తాను ఆశించిన గుహేశ (సుబ్రహ్మణ్యం తత్త్వం గుహ్యమైనది, అది ఆయనకు ఆ గుహలో రమణుల ద్వారా ఆ విధంగా బోధపడింది) తత్త్వము అవగతమైనదని సంతోషపడి "చిత్తము, నేను మీరు చెప్పినది శ్రద్ధగా గ్రహించి, వెంటనే శిష్యులకు చెప్పి,యిప్పుడే గ్రంథమును ముగించాను" అని మహర్షులకు సమాధానం చెప్పారు. "సరే, మంచిది" అని రమణులు ఆశీర్వదించి ఆ ఆమ్ర గుహను వీడారు. తమాషా ఏమిటంటే గణపతిముని మొదటి 19 రోజులలో వ్రాసిన 750 శ్లోకాలను ఎన్నో మార్లు సరిదిద్దగా, చివరి రోజున వ్రాసిన 250 శ్లోకాలను ఒక్కసారి కూడా దిద్దవలసిన అవసరం రాలేదు. దానికి కారణం గురువరేణ్యులు, గుహావతారి అయిన రమణులే. ఆ విధంగా గురు శిష్య ద్వయం కలిసి తల్లియైన ఉమకు చేసిన స్తోత్రమాలిక, నీరాజనమే ఉమాసహస్రం. ఇది రమణ గణపతుల సమష్టి రచన.

అఖిల జగన్మాతోమాతమసాతాపేనచాకులానస్మాన్
అనుగృహ్ణాత్వనుకంపాసుధార్ద్రయాహసితచన్ద్రికయా

అఖిలజగత్తులకును మాతయైన ఉమాదేవత - తమస్సు చేతను, తాపము చేతను బాధించబడుతున్న మమ్ములను దయామృతస్రవముచే చల్లని వెన్నెల వంటి చిరునవ్వుతో సమనుగ్రహించు గాక!

- గణపతి ముని ఉమాసహస్రం (పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి వ్యాఖ్యానము) నుండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి