11, జులై 2020, శనివారం

నాదసుధారసంబిలను నరాకృతాయెరా - త్యాగరాజస్వామి



నాదసుధారసంబిలను నరాకృతాయెరా! ప్రణవ

వేద పురాణాగమ శాస్త్రాదులకాధారమౌ

స్వరములు యాఱొక ఘంటలు వరరాగము కోదండము
దుర నయ దేశ్యము త్రిగుణము నిరతగతి శరమురా
సరస సంగతి సందర్భములు గల గిరములురా
ధర భజనే భాగ్యమురా త్యాగరాజు సేవించు

ఓ మనసా! ప్రణవనాదమనే అమృతము యొక్క సారము ఈ భూమిపై నరుని రూపములో శ్రీరామునిగా అవతరించినది. ఈ నాదమే వేదశాస్త్ర పురాణములకు ఆధారము. ఆ శ్రీరాముని విల్లులో గల ఏడు ఘంటలు సప్తస్వరములు. శ్రీరాముని కోదండము రాగమునకు సమానమైనది. ఆ విల్లునకు గల మూడు తీగెలు దుర నయ దేశ్యములనే రాగ విభజనలు, నిరాటంకమైన లయ శ్రీరాముని శరములు. శ్రావ్యమైన సంగతులు మరియు నెరవులు శ్రీరాముని మధురమైన పలుకులు. కాబట్టే, పరమేశ్వరునిచే నుతించబడిన శ్రీరాముని భజనే ఈ భువిపై మహాభాగ్యము.

- సద్గురువులు త్యాగరాజస్వామి

రాముడు పరబ్రహ్మ స్వరూపము అని తెలుపటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ప్రణవనాదామృత సారం శ్రీరాముడు అని పలికిన త్యాగరాజస్వామి దానికి కావలసిన ప్రాతిపదికలను అనుపల్లవి మరియు చరణంలో ఆవిష్కరించారు. శ్రీరాముని కోదండము, అందులోని భాగములు, ఆయన పలుకులకు సప్తస్వర రాగ లయాన్వితమైన సంగతులు, నెరవులకు సారూప్యత కనబరచి ఈ సంగీతానికి దివ్యత్వాన్ని చేకూర్చారు త్యాగరాజస్వామి. సమస్తమునకు రాముడే ఆధారము అన్న సంగతి వేద శాస్త్ర పురాణములకు ఆధారమైన ప్రణవ నాదంతో ఉపమానంగా అందరికీ అర్థమయ్యేలా పలికారు త్యాగరాజస్వామి. ఓంకారము నుండి జన్మించిన సప్తస్వరములు, ప్రణవ మంత్ర సారమైన శ్రీరాముడు - ఈ రెండిటినీ ఎంత చక్కగా అనుసంధానం చేసి నాదసుధారసం యొక్క గొప్పతనాన్ని మనకు రామతత్త్వం ద్వారా తెలియజేశారు. ఈ కృతిని మనోజ్ఞమైన ఆరభి రాగంలో స్వరపరచి లోకాభిరాముని తత్త్వాన్ని మన ముంగిట నిలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి