భాగవతంలోని గజేంద్ర మోక్షం గురించి ప్రస్తావించని వాగ్గేయకారులు లేరు. వారు ఎన్నో కీర్తనల్లో కరిరాజుని శ్రీహరి కాపాడిన రీతి గురించి వ్రాశారు. కారణం - ఆ గజరాజు మనందరి లాగానే ముందు అహంకారం, తరువాత నిస్సత్తువ, తరువాత భయం, తరువాత అంతర్మథనం, శరణాగతి....ఈ సోపానాలు చేశాడు, నీవే తప్ప ఇతఃపరంబెరుగ అన్న స్థితికి వచ్చినప్పుడు ఆ పరమాత్మ బిరాన వచ్చి మోక్షమిచ్చాడు. ఆ కరి రాజును బ్రోచినవాడివి నన్ను బ్రోవలేవా అని పరి పరి విధాలా వేడుకున్నారు. నిందాస్తుతి కూడా చేశారు. అటువంటి ఒక కీర్తన త్యాగరాజస్వామి వారిది మరి మరి నిన్నే. భాగవత ఘట్టలు వాగ్గేయకారుల గీతలలో అంతర్భాగం అన్న దానికి ఇటువంటి కృతులు ఉదాహరణ.
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయ రాదు
కరి మొర విని సరగున చన నీకు కారణమేమి సర్వాంతర్యామి
కరుణతో ధ్రువునికెదుట నిల్చిన కథ విన్నానయ్యా
సుర రిపు తనయునికై నరమృగమౌ సూచనలేమయ్యా
మరచియున్న వనచరుని బ్రోచిన మహిమ దెలుపవయ్యా
ధరను వెలయు త్యాగరాజ సన్నుత తరము గాదిక నే విననయ్యా
ఓ రామచంద్రా! మళ్లీ మళ్లీ నిన్నే మొరలిడుతున్నాను, అయినా నాపై నీ మనసులో దయ ఎందుకు రావటం లేదు? ఆ గజేంద్రుని మొర విని వేగంగా వచ్చావే! నీవు సర్వాంతర్యామివి కదా మరి నా మొరలు వినకపోవటానికి కారణమేమిటి? నీవు కరుణతో బాలుడైన ధ్రువుని తపము మెచ్చి బ్రోచిన కథను విన్నాను, దేవతలకు శత్రువైన హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుని కోసమై నరహరి రూపంలో రావటంలో భావమేమిటయ్యా! వనచరుడైన సుగ్రీవుని బ్రోచిన మహిమ అంతరార్థమేమిటయ్యా? ఈ భూమిపై వెలసి పరమశివునిచే నుతించబడిన రామా! నీవెన్ని చెప్పినను వినుట నా తరము కాదు, త్వరగా నాపై దయ చూపుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి