25, జనవరి 2011, మంగళవారం

సాధనకు త్యాగరాజు సూత్రము - మనసా ఎటులోర్తునే

మున్నుడి:
  
సాధనా మార్గములో మనసు పరి పరి విధాల అనేక దిక్కుల పరిగెడుతుంది. అట్టి పరిస్థితిలో, తాత్కాలిక మనో స్థితిపై నియంత్రణ లేక,  గొప్ప గొప్ప వారే మార్గం తప్పి భ్రష్టులైనారు. త్యాగయ్య ఆ కోతి మనసును ఉద్దేశించి స్వానుగతము ఈ కీర్తన ద్వారా భావ గర్భితంగా చెప్పారు. ఎంతటి వారినైన త్వరగా తనవైపు ఆకట్టుకునేవి  చెడు, విషయ వాంఛ, వ్యసనములు. అందుకే వాటిని ప్రలోభములు అని అన్నారు. సామాన్యునికి వస్తువు, విషయము - మంచా, చెడా అన్న జ్ఞానము ఆ సమయములో పని చేయదు. ఆ విచక్షణ, వివేచన సరిగ్గా పనిచేయాలంటే ఇంద్రియ నిగ్రహము, స్థితప్రజ్ఞత, జ్ఞానము, విద్య, దైవ బలము ఎంతో అవసరం. వీటిని సాధించటానికి భక్తి అనేది చాలా సులభమైన మార్గము. ఈ మార్గములో శరణాగతి అనేది ఆవశ్యకము.   ఈ కీర్తన ద్వారా త్యాగరాజు ఈ సందేశాన్ని ఎంతో ఆర్తితో చెప్పారు త్యాగయ్య. మనసా ఎటులోర్తునే సాహిత్యము, అర్థము.

 
సాహిత్యము: 

మనసా ఎటులోర్తునే నా  మనవిని చేకొనవే

దినకర కుల భూషణుని దీనుడవై భజన చేసి
దినము గడుపు మనిన నీవు వినవదేల గుణవిహీన |మనసా|

కలిలో రాజ తామస గుణముల కలవారి చెలిమి
కలసి మెలసి తిరుగుచు మరి కాలము గడపకనే
సులభముగా కడతేరను సూచనలను తెలియజేయు
ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణవిహీన  |మనసా|

భావము:

ఓ మనసా! నిన్ను ఎట్లా ఓర్చుకొనేది?  నా మనవిని విను.

గుణవిహీనవైన ఓ మనసా! సూర్యవంశమునకు భూషణుడు అయిన శ్రీరాముని దీనత్వముతో భజన చేస్తూ దినము గడుపుము అంటే మాట వినకున్నావు ఎందులకు?

గుణవిహీనయైన ఓ మనసా! ఈ కలియుగములో రాజస తామస గుణములు కలవారితో స్నేహితము చేసి, వారితో కలిసి మెలిసి తిరుగుచు కాల వ్యర్థా చేయక, సంసారమనే సాగరమును సులభముగా దాటే సూచనలు తెలియచేసే త్యాగరాజు మాట వినవెందులకు? (వినుము అని అర్థం).


పరిశీలన: 

సాధనలో విశ్వాసము, ఏకాగ్రత నెమ్మదిగా అలవడుతాయి. అంతవరకూ మనసు ఎన్నో దిక్కుల పరుగెడుతూనే ఉంటుంది. కొన్నాళ్ళు యాంత్రికంగా అయినా, మనసుకు కళ్ళెం వేసి సాధనలో కూర్చో బెడితే, అటు తరువాత అది స్వయంగా సహకరిస్తుంది. పరిగెత్తేటప్పుడు కళ్ళెం వేయటానికే మనకు మంత్ర జపము, పూజ విధానము, స్తోత్రములు, ఉపచారములు (అత్యుత్తమైనది, అతి కష్టమైనది ధ్యానము)  ఆగమాలు నిర్వచించాయి. అటువంటి పదహారు ఉపచారములలో ఒకటి కీర్తన చేయటం. అలాగే నవ విధ భక్తులలో కూడా కీర్తన ఒకటి. అటువంటి కీర్తన ద్వారా త్యాగయ్య మనసును స్వాధీనములో ఉండమని, సరియైన మార్గములో నడువుమని ఉద్దేశించి ఈ కృతి చేశారు.

కలియుగ లక్షణము మూడు పాళ్ళు అధర్మము, ఒక పాలు ధర్మము. అంటే నలుగురిలో ముగ్గురు అధర్మ పరాయణులే. కాబట్టే, త్రిగుణములైన సాత్త్వికము, రాజసము, తామసములలో ఈ యుగములో రాజస తామస గుణములు కలవారే ఎక్కువ. కానీ, భవత్ప్రాప్తికి కావలసినది సత్సాంగత్యము. అంటే సాత్త్విక గుణములు కలవారి చెలిమి. పరమ భాగవతుని ముఖ్య గుణము సత్త్వము. అంటే సత్యమును అన్వేషించుట, అనుభూతి పొందుట, ఆచరణలో పెట్టుట, ఇతరుల పట్ల హింసను విడనాడుట, కరుణ దయ కలిగి యుండుట. ఈ సత్త్వమును జీవితములోని ప్రతి క్రియలో అమలు పరుస్తాడు సాత్త్వికుడు, నిజ భక్తుడు. అన్నిటికన్నా ఉన్నతమైనది భగవంతుడని నమ్మి కర్మలను చేస్తూ, ఫలితం ఆశించక, వచ్చిన దానితో తృప్తి చెంది ధర్మమును నిర్వర్తిస్తాడు భాగవతుడు. ఇతరులను నొప్పించడు, తాను నొచ్చుకోడు సత్త్వికుడు. ఈ లక్షణాలు కలవారిని వెదికి వారితో సాంగత్యము చేయుమని మనకు శృతి, శాస్త్ర పురాణేతిహాసములు ఘోషిస్తున్నాయి. అదే సందేశాన్ని త్యాగరాజు ఈ కీర్తనలో చెడు గుణములు కలవారి స్నేహితములో కాలము వృథా చేయకుండా భక్తి, జ్ఞాన వైరాగ్యములు కలిగిన సత్త్వసంపన్నుల సంగతి కలిగి పరమాత్మను కనుటలో కాలం గడుపుము, నా మాట వినుము అని నివేదిస్తాడు.

ఇంత కన్నా గొప్ప ఆధ్యాత్మిక సందేశము ఏముంటుంది?. అందుకే ఆయన స్వామి, మహానుభావుడు, ఋషి, పరమ భక్తుడు అయ్యాడు. మనసా ఎటులోర్తునే మల్లాది సోదరుల గళంలో వినండి, చూడండి.

త్యాగయ్య రామభక్తి - బంటు రీతి కొలువు


రాముని పట్ల అనుపమానమైన భక్తి, అచంచలమైన విశ్వాసము కలిగిన వారు త్యాగరాజ స్వామి. రామతారక మంత్రాన్ని గురువుల వద్దనుండి పొంది, దానిని సాధన చేసి మంత్ర సిద్ధి పొందిన తరువాత రాముని గుణవైభవములను వర్ణిస్తూ వేల కీర్తనలను రచించారు. పరిపూర్ణమైన యోగులు ఆయన. పోతన గారి లాగానే రాజాశ్రయాన్ని తిరస్కరించి రామచరణాలే శరణు అన్న మార్గాన్ని ఎన్నుకొని తరించారు. తద్వారా వచ్చిన దారిద్య్రం వారిని ఏ మాత్రం చలింపజేయలేదు. ఉంఛవృత్తి, అందులోనూ భుక్తి దొరకక పోతే తులసిదళములు, నీళ్లు ఇదీ ఆయన జీవితం. మరి రామభక్తి సామ్రాజ్యంలో ఊరికే ఉన్నతమైన స్థానం లభిస్తుందా? ప్రేయమైనవన్నీ వదులుకొని శ్రేయమైన రాముని నామాన్నే ఆశ్రయించిన ఆయన ఈ భువిని వదిలి ఎంతో కాలం కాలేదు. కేవలం 169 ఏళ్లు మాత్రమే.

ఆయన ద్వైత భావమునుండి అద్వైతానికి ఏ విధంగా సోపానం చేశారో ఆయన కీర్తనలలోనే అర్థమవుతుంది. భక్తిలో రూపలక్షణాల వర్ణన ఒక ఎత్తైతే, ఆ దివ్యత్వంతో రమించటం, దానికి మార్గాలను చెప్పగలగటం మరింత ఉన్నతమైన మెట్టు. దీనికి ఒక మచ్చుతునక బంటురీతి కొలువీయవయ్య రామా అనే కృతి. ఉత్తముడైన ఆ హనుమంతునివలె రామభక్తి సామ్రాజ్యంలో తనకు కూడా కొలువు ఈయవయ్యా ఎంత ఆర్తితో వేడుకున్నాడు? రాముని నామము జపిస్తుంటే హనుమంతునికి రోమాంచమట. రోమాలు నిక్కబొడుచుకొని, ఆనందబాషాపాలు రాలాయట. ఆ రోమాంచమే ఆయనకు గొప్ప రక్షణ కవచం, హనుమంతుడికి చిరునామ ఏమిటి? రామభక్తి. రామనామమే అన్నిటికి కన్నా పెద్ద ఆయుధమట. ఇవన్నీ ఇచ్చింది ఆ రాముడే కదా?  ఇలా ఒకటా రెండా? వేల కృతులు ఆ రమునిపై, రామభక్తిపై...

హనుమంతుని బలము ఏమిటి? కేవలం రామభక్తి, ఆ ప్రభువుకు పూర్తి దాస్యము. ఆ నిరంతర రామ నామ కీర్తనా బలంతో హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, లంకను గెలిచాడు, సంజీవనిని తెచ్చాడు. అంతటి మహత్తు గల రామ భక్తి, అటువంటి దాస్యము తనకు అనుగ్రహించ వలసిందిగా  త్యాగయ్య ఆ రాముని వేడుకునే కీర్తన బంటు రీతి.  ఈ కీర్తన సాహిత్యము, అర్థము, పరిశీలన.


సాహిత్యము: 

బంటు రీతి కొలువీయవయ్య రామా ||బంటు||

తుంట వింటివాని మొదలైన మదా
దుల బట్టి నేల కూలజేయు నిజ ||బంటు||

రోమాంచమనే ఘన కంచుకము
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు
రామనామమనే వరఖడ్గమీవి
రాజిల్లునయ్య త్యాగరజునికే ||బంటు||

భావము: 

ఓ రామా! నీ కొలువులో నీ బంటుగా సేవించుకునే భాగ్యము కలిగించు స్వామీ!

మన్మథుడి ప్రభావము వలన కలిగే కామము, మరియు - లోభ, మోహ, మద, మాత్సర్యములనే నా శత్రువులను బట్టి నేల కూల్చు నిజమైన భక్తి వలన కలిగే శక్తిని నాకు ప్రసాదించు నీ బంటుగా నన్ను అనుగ్రహించుము.

నీపై కల భక్తితో కలిగే రోమాంచము (రోమములు నిక్కబొడుచుట) గొప్ప కవచమై, 'రామ భక్తుడు' అనే ముద్ర బిళ్ళ (చిహ్నము/చిరునామా) ధరించి, రామనామము అనే వరము ఖడ్గముగా ధరించి  నీ రామభక్తి సామ్రాజ్యమునందు రాజిల్లుదును. నాకు (త్యాగరాజునకు) అంటి బంటు వంటి కొలువు ఈయుము రామా!

పరిశీలన:
 
సంపదలను, లౌకిక సుఖాలను వదులుకుని  పరదైవాన్ని పరమావధిగా సాధన చేయటానికి త్యాగరాజు భక్తి, కీర్తన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ మార్గమేమి పూల బాట కాదు. విషయ వాంఛలను వదులుకొనుట మానవ జీవితానికి ఆధ్యాత్మిక మార్గములో అతి కష్టమైన పరీక్ష. తన విద్యకు మహారాజులు గుర్తింపు, సన్మానాలు, సత్కారాలు మొదలైనవి ఇంటికి వచ్చినా కూడా వాటిని తిరస్కరించి, పూట గడవటానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కూడా ఆయన రాముని పాదములను విడువలేదు. ఈ మనుజుల కాళ్ళ పట్టుకోలేదు, తన నైతిక విలువలకు పూర్తిగా కట్టుబడి ఆదర్శ ప్రాయుడైనాడు. అందుకే ఆయన కీర్తనలలో అంత భక్తి, అసామాన్య వర్ణన, సంపూర్ణ నిజ దాస్యము, శరణాగతి కనిపిస్తాయి. ఎందరు వాగ్గేయ కారులు వచ్చిన, త్యాగయ్య భక్తి, వినమ్రత, దాస్య చిత్తము ముందు దిగదుడుపే.

అటువంటి బంటు లాంటి కొలువు తనకు ఆ శాశ్వత రామ భక్తి సామ్రాజ్యములో ఇవ్వమని ఆ త్యాగబ్రహ్మం హంసనాద రాగంలో కృతి చేశారు. ఎంతోప్రాచుర్యం పొందిన ఈ కీర్తన రామభక్తిని చిహ్నముగా, రామనామమును ఒక మహత్కరమైన ఖడ్గముగా, ఆ భక్తిలో మునుగుట కలిగిన రోమాంచమును  ఒక గొప్ప కవచముగా వర్ణిస్తారు. అరిషడ్వర్గములు అనే శత్రువులను నాశనము చేయుటకు రామభక్తి సామ్రాజ్యానికి దాస్యమే ఏకైక సాధనము అని మనకు సందేశాన్ని ఇచ్చారు త్యాగయ్య.

ఈ త్యాగరాజ స్వామి కీర్తన (ఆలాపన కూడా ఉంది) డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి (సహకార గాత్రం ఆయన ప్రియ శిష్యులు శ్రీ డి.వి. మోహన కృష్ణ గారు).కొంత తెలుగు ఉచ్చారణలో లోపమున్నా, మహారాజపురం సంతానం గారు రాగాన్ని శ్రావ్యంగా ఆలాపించారు. 

24, జనవరి 2011, సోమవారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - ఎందరో మహానుభావులు

సంగీత త్రిమూర్తులు ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు, శ్యామ శాస్త్రి




పంచరత్న కీర్తనలలో ఆఖరిది ఎందరో మహానుభావులు. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ఆణిముత్యము. మరి చివరిది ఖచ్చితంగా అతి మధురమైనది, అత్యంత ప్రజాదరణ పొందినదే. ఎందుకంటే అందులో భక్తులు, భగవంతుడు - ఇద్దరినీ పూర్తి నిజ దాస భావనతో నుతించారు త్యాగరాజు.  కీర్తన సాహిత్యము, అర్థము, పరిశీలన.

ఎందరో మహానుభావులు అందరికి వందనములు

చందురు వర్ణుని అంద చందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారు (ఎందరో)

సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులు (ఎందరో)

మానస వన చర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారు (ఎందరో)

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారు (ఎందరో)

పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను
బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగములు దెలియు వారు (ఎందరో)

హరి గుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో
చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వారు (ఎందరో)

హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక
శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు (ఎందరో)

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపుసుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక (ఎందరో)

నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవుయను
వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల
జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు వారు (ఎందరో)

భాగవత రామాయణ గీతాది శ్రుతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల
గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి భావ రాగ లయాది
సౌఖ్యముచే చిరాయువుల గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారు (ఎందరో)

ప్రేమ ముప్పిరి గొను వేళ నామము దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన వారు (ఎందరో)


అర్థము: 

ఎందరో మహానుభావులు. వారందరికీ నా నమస్కారములు.

పూర్ణ చంద్రుని వలె అందము చందము కల్గిన శ్రీ రాముని తమ హృదయ కమలమున కాంచి ఎల్లప్పుడూ ఆ బ్రహ్మానందమున మునిగి యుండు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

సామగాన లోలుడు, మన్మథుని సౌందర్యము కలిగిన వాడును అయిన శ్రీరాముని సౌందర్యమును చూసే ధన్యతను పొందిన ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

మనస్సు అనే కోతి యొక్క చంచలమైన స్వభావాన్ని, ఆలోచనలను స్థిరము చేసి, శ్రీరాముని దివ్య రూపమును దర్శనాన్ని బాగుగా పొందేవారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

వేరే ఆలోచన చేయక, తన హృదయమనే కమలమును ఆ శ్రీ రాముని పాదములకు సమర్పణ చేసే వారెందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

పతితపావనుడు, పరాత్పరుడు అయిన శ్రీ రామచంద్రుని పరమార్థమైన సన్మార్గముతో భక్తి కలిగి, స్వరము, లయ మొదలగు సంగీత జ్ఞానముతో కీర్తిస్తూ, భజన చేసే వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

శ్రీహరి గుణ గణముల కీర్తనలనే మనులచే పొదగబడిన హారములను గళములో ప్రకాశింప చేసుకొనుచున్న భక్త కోతులు, ఈ భూమిపై కరుణతో, స్నేహ భావముతో ఈ జగమునంతా తీయని చల్లని చూపులచే రక్షించు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

సొగసుల, హొయల నడకలు కలిగినవాడు , సరసుడు, వెన్న వంటి హృదయము కలవాడు అయిన శ్రీరాముని ఎల్లప్పుడూ కన్నులతో చూస్తూ, శరీరము పులకించి, ఆనందమనే సాగరములో ఓలలాడుచు యశము కలవారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

పరమ భక్తులు, మునులు, మహర్షులు, సూర్య చంద్రులు, సనక సనందులు, దిక్పాలకులు, దేవతలు, కింపురుషులు, ప్రహ్లాద, నారద తుంబురులు, హనుమంతుడు, శివుడు, శుకుడు, బ్రహ్మ, బ్రాహ్మణులు, పరమ పవిత్రులు, శాశ్వతులు, ఘనులు, శ్రీరామ నామమును చేయుచు బ్రహ్మానందమును ఎల్లపుడు పొందేవారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

 నీ శరీరము, నామము యొక్క వైభవము, నీ శౌర్యము, ధైర్యము, శాంత హృదయము, దాన గుణము మొదలైన వేవ వాక్కుల వంటి నిజాములు నీ యందు అపారమైన భక్తిని కలుగ చేయునవి. నాస్తికులను సైతం ఆస్తికులుగా, శ్రీరామ భక్తులుగా మార్చుతున్నవి. అటువంటి నీ మనస్సును తెలిసి సంతోషముతో నీ గుణగణములను కీర్తించుచు, భక్తి పారవశ్యములో పాడుచు, భజనానందమున, సంతృప్తి పొందే వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

భావతము, రామాయణము, భగవద్గీత, వేదములు, శాస్త్రములు, పురాణములు, వాటి రహస్యములు, శైవము, శాక్తేయము, కుమారము, గణపతి, విష్ణు, సూర్య మొదలగు దేవతా విధానములను పాటించే మతముల యొక్క పరమార్థములను, రహస్యములను తెలిసి, సకల దేవతల అంతరంగముల భావములను తెలిసి, సంగీతము, లయ భావముల ఆనంద సాగరములో మునకలు వేయుచు, చిరంజీవులై నిరవధికమైన సుఖము కలిగిన వారి, త్యాగరాజునికి ఆప్తులైన వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

ప్రేమ పరిపూర్ణము చెందిన భక్తులు, శ్రీరాముని నామ స్మరణ చేయుచు, శ్రీ త్యాగరాజునిచే నుతింప బడిన, శ్రీ రాముని నిజదాసులైన  వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.


పరిశీలన:

ఈ కీర్తన పూర్తిగా రామ భక్తి సామ్రాజ్యములోని దైవము, దాసుల మహత్త్వమును గురించే. ఆ రాముడి గుణాలు, మహిమల వర్ణన, ఆ రాముని కొలిచే భక్త కోటి యొక్క గొప్పతనం అద్భుతమైన పదజాలంతో, అసామాన్యమైన భక్తి, వినమ్ర భావనతో త్యాగయ్య ఈ కీర్తన రచించారు. రామభక్తిలో మునిగితేలే భక్తుల గుణాలను వివరముగా పది చరణాలలో వర్ణించారు త్యాగయ్య.

అనుపల్లవి, మొదటి చరణం - ఆ రాముని అందమును తమ హృదయములలో చూసి బ్రహ్మానందము పొందేవారు, ధన్యతను పొందేవారు కొందరట. హృదయాన్ని కమలముతో పోల్చటం కవులకు పరిపాటి. ఆ ఉపమానాన్ని అద్భుతంగా తన కీర్తనలలో ఉపయోగించారు కవి త్యాగరాజు. భక్తి పారవశ్యంలో మునిగితే మరి అటువంటి పదాలు ముత్యాల పేర వస్తాయేమో?

మూడవ చరణం గమనించండి. స్వాంతమను సరోజమును సమర్పణము - ఎంత అందమైన భావ వ్యక్తీకరణ? ఎంత మానసిక వికాసము, దైవానుభూతి ఉంటే ఈ పవిత్రమైన శరీరమును, దాని హృదయమును రాముని అర్పించగలము?

నాలుగవ చరణంలో - జీవన సత్యమైన, పరమార్థమైన ఆ రాముని గూర్చి పూర్తి శరణాగతితో రాగము, శృతి, లయలతో పాడుతూ, ఆడుతూ నుతించే వారు ఎంతోమంది. ఈ భావము మీకు ఇప్పుడు కూడా కొంత మంది కళాకారులలో స్పష్టంగా అగుపిస్తుంది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, బాలమురళీ కృష్ణ వంటి కళాకారులు గానం చేసిన దృశ్య శ్రవణం చూడండి. వారిలో ఇదే తాదాత్మ్యత, కదలికలు, సుస్వర శృతి బద్ధ లక్షణాలు నూరు శాతం కనిపిస్తాయి. అటువంటి మహానుభావులకు ఈ కీర్తన ద్వారా వందనాలు సమర్పించారు త్యాగయ్య వారు.

ఐదవ చరణంలో - ఇటువంటి మహానుభావులు తమ స్నేహ భావముతో, మేధస్సుతో, కరుణతో ఈ కల్లోలిత ప్రపంచముపై చల్లని చూపులు ప్రసరిస్తారుట. ఎంత నిజం చెప్పారు త్యాగయ్య?. భక్తి పారవశ్యంలో మునిగిన ఒక సుబ్బులక్ష్మి వంటి కళాకారిణి కళ్లలో, పాటలో శిలనైనా కరిగించే కరుణ, ప్రేమ కనిపిస్తుంది మనకు.

ఆరవ చరణంలో - సకల సుగుణాభిరాముని, సౌందర్య మూర్తియైన రాముని కదలికలు కళ్ళతో చూస్తూ, శరీరము పులకించి ఆనంద సాగరంలో మునిగి కీర్తి పొందేవారు ఎంతో మంది కళాకారులు. భక్తిలో ఇటువంటి భావన ఎంతో సులభం. సర్వం బ్రహ్మమయం అని భావించి నుతిస్తే ఆ ఆనందం వర్ణనాతీతం అని త్యాగయ్య ఈ చరణంలో హృద్యంగా చెప్పారు.

ఏడవ చరణంలో - ఇక ఎవరూ ఆ మహానుభావులు?  - భక్తులు, మునులు, ఋషులు, దేవతలు, దిక్పాలకులు, వివిధ దేవ సమూహము, స్వయముగా శివుడు, బ్రహ్మ మొదలగు వారు. వీరంతా ఆ శ్రీహరి భక్తి సామ్రాజ్యంలో సేవకులే. ఇటువంటి వారు మరి ఘనులు, శాశ్వతులు, బ్రహ్మానందులు అని మనోజ్ఞమైన పదములు, భావనతో నుతించారు త్యాగయ్య.

ఎనిమిది, తొమ్మిది చరణాలు - ఇంత గొప్ప వైభవమున్న ఆ పరమాత్ముని లక్షణములు ఆస్తికులకు, చెడ్డవారికి కూడా భక్తి భావన కలిగిస్తాయిట. దీనికి మన శృతి శాస్త్ర పురాణాలలోని ఎన్నో గాథలు నిదర్శనము. భాగవతము, రామాయణము, గీత మొదలైన శాస్త్రముల సారము, రహస్యములు, వివిధ మతముల రహస్యములు, ముక్కోటి దేవతల అంతరంగములు తెలుసుకుని రాగము, లయలతో కీర్తించి, నుతించే వారు దీర్ఘాయుష్షు కలిగి త్యాగరాజునికి ఆప్తులు.

మరి త్యాగయ్య, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, వీరి కన్నా  ముందు పురందరదాసు, భక్త రామదాసు, వ్యాసరాయలు - ఇలా ఎంతో మంది పరమాత్మ గుణ కీర్తన చేస్తూ భక్తి సామ్రాజ్యంలో తరించారు. వారందరికీ ఈ కృతి ద్వారా వందనములు. ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో, అనిర్వచనీయమైన అనుభూతిలో, పదాలు ఆ రామునిచే రాయబడినవా అనేంత రమ్యంగా, శ్రావ్యంగా త్యాగరాజు కృతి రచన చేశారు. అందమైన శ్రీరాగంలో ఈ కీర్తన కూర్చబడినది.  హైదరాబాద్ సోదరులు శేషాచార్యులు, రాఘవాచార్యులు గారి గళంలో ఈ కీర్తన విని ఆనందించండి. ఎందరో మహానుభావులు అందరికి వందనములు.

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - కన కన రుచిరా

శ్రీ రఘురామ చారు తులసీ దళదామ శమక్షమాది శృం
గార  గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో 
త్తారక నామ భద్ర గిరి దాశరథీ! కరుణా పయోనిధీ!

భద్రాచల రామదాసు ఈవిధముగా వంద శ్లోకములతో దాశరథి శతకము రచించి ఆ భద్రాద్రి రాముని నుతించాడు. అదే విధముగా, పంచరత్న కీర్తనలలో నాలుగవది అయిన కన కన రుచిరా పూర్తిగా శ్రీహరి అవతారమైన శ్రీరాముని గుణ రూప మహిమా వర్ణనలో సాగుతుంది. వరాళి రాగం ఆది తాళంలో కృతి చేయబడినది.


సాహిత్యం:

కన కన రుచిరా కనక వసన నిన్ను

దిన దినమున మనసున చనువున నిన్ను (కన)

పాలుగారు మోమున శ్రీయపార మహిమ దనరు నిన్ను (కన)

కళకళమను ముఖకళ గలిగిన సీత కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను (కన)

బాలార్కాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర
సరసిజాక్ష వరకపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ (కన)

సాపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాట వీనుల
జురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖింపగ లేదా అటు (కన)

మృగమదలలామ శుభనిటల వర జటాయు మోక్ష ఫలద
పవమానసుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను (కన)

సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస
విహారా ఆప్తసురభూజ మానిత గుణాంగ చిదానంద!
ఖగ తురంగ ధృత రథాంగ పరమ దయాకర
కరుణారస వరుణాలయ భయాపహరా శ్రీ రఘుపతే (కన)

కామించి ప్రేమమీర కరముల నీదు పాద కమలముల
బట్టుకొను వాడు సాక్షి, రామనామ రసికుడు, కైలాస
సదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శౌనక
పురందర నగజా ధరజ ముఖ్యులు సాక్షి గాదా
సుందరేశ సుఖ కలశాంబుధి వాసాఽశ్రితులకే (కన)

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత ముఖజిత కుముదహిత వరద నిన్ను (కన)

అర్థము:



బంగారు వస్త్రములు (పీతాంబరములు) ధరించిన ఓ రామా! నీ సౌందర్యము ఎంత చూస్తే అంత రుచి. నీ యందము ప్రతి దినము నీ యందు గల చనువుతో ఎంత చూసినాను తనివి తీరదు.పాలు గారు మోము గల, అపారమైన మహిమ కలిగిన నీ మోము ఎంత చూస్తే అంత రుచి.కళ కళలాడు సుందరమైన ముఖ కళ కలిగిన సీతా దేవి నిన్ను వాలు చూపుల చూసినప్పుడు నీ సౌందర్యం ఎంత చూస్తే అంత రుచి. ఉదయ సూర్యుని ప్రకాశము కలిగి, పట్టు వస్త్రములు ధరించి, మణులతో పొదిగిన హారములు ధరించి, కమలముల వంటి కన్నులు, అందమైన బుగ్గలు కల, మెరిసే కిరీటమును ధరించిన శ్రీరామా! నిను సంతోషముతో మనసారా ఎంత చూస్తే అంత రుచి. ఉత్తానపాదుడి రెండవ భార్యయైన సురుచి తన సవతి కుమారుడైన ధ్రువుడు తన తండ్రి తొడపై కూర్చొని నందుకు 'నీకు ఆ అర్హత లేదు' అని దుర్భాష లాడెను. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని గూర్చి తపస్సు చేసెను. ఆ తపస్సుకు మెచ్చి నీవు శాశ్వతమైన ధ్రువ పదమును ప్రసాదించితివి. ఆ నీ శ్రీ హరి సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి. ఓ శ్రీ రామా! నీవు శుభప్రదమైన నుదురుపై కస్తూరి తిలకము ధరించి యున్నావు. రావణుని చేతిలో హతుడైన జటాయువుకు మోక్షము ప్రసాదించినావు. హనుమంతుడు దూతయై లంకకు వెళ్లి నీ మహిమను సీతకు తెలపగా, ఆమె అది తెలుసుకొని, ప్రేమతో బాధ పడెను. ఆ విధముగా నిన్ను ఎంత చూస్తే అంత రుచి. ఓ రామా! సౌఖ్యములకు నిలయమా! రాక్షసులను హతమార్చిన వాడా! సీతాదేవి మనసునందు విహరించే వాడా! భూసురులైన బ్రాహ్మణులకు ఆప్తుడా! సాటిలేని సౌందర్యము, సుగుణములు కలవాడా! చిదానంద స్వరూపా! గరుత్మంతుని వాహనముగా కలవాడా! చక్రమును ధరించిన వాడా! పరమ దయాకరా! కరుణా రసమును వర్షించే మేఘము వలె కురిపించే వాడా! భయమును పోగొట్టే వాడా! రఘు వంశములో శ్రేష్ఠుడా! నీ సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి. నీపై భక్తి ప్రపత్తులతో బ్రహ్మానందము పొంద వచ్చును అనుటకు భక్తితో నీ పాదములు పట్టుకున్న హనుమంతుడు సాక్షి, రామ నామాన్ని రమించే కైలాస వాసి శివుడు సాక్షి, నారద, పరాశర, శుక, శౌనక మహర్షులు సాక్షి, ఇంద్రుడు సాక్షి, పార్వతీ దేవి సాక్షి. నీ పత్ని సీతా దేవి సాక్షి. ఈ మహాభక్తులు, దేవ ఋషి సమూహము సాక్షి గాదా! ఓ సుందరేశా! ఆనందమనే సాగరములో నివసించే వాడా! నీ ఆశ్రితులకు నీ సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి. అన్ని వేళల పరిపూర్ణమైన ప్రేమగల శంకరునిచే నుతించబడిన ఓ శ్రీరామా! చంద్రుని మించిన నీ ముఖ సౌందర్యమును, చూచుట, వరదుడవగు నిన్ను చూచుట, తనివితీరా ఆనందించుట భక్తుల అదృష్టము. నీ సౌందర్యము ఎంత చూస్తే అంత రుచి.

నీపై భక్తి ప్రపత్తులతో బ్రహ్మానందము పొంద వచ్చును అనుటకు భక్తితో నీ పాదములు పట్టుకున్న హనుమంతుడు సాక్షి, రామ నామాన్ని రమించే కైలాస వాసి శివుడు సాక్షి, నారద, పరాశర, శుక, శౌనక మహర్షులు సాక్షి, ఇంద్రుడు సాక్షి, పార్వతీ దేవి సాక్షి. నీ పత్ని సీతా దేవి సాక్షి. ఈ మహాభక్తులు, దేవ ఋషి సమూహము సాక్షి గాదా! ఓ సుందరేశా! ఆనందమనే సాగరములో నివసించే వాడా! నీ ఆశ్రితులకు నీ సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి.

అన్ని వేళల పరిపూర్ణమైన ప్రేమగల శంకరునిచే నుతించబడిన ఓ శ్రీరామా! చంద్రుని మించిన నీ ముఖ సౌందర్యమును, చూచుట, వరదుడవగు నిన్ను చూచుట, తనివితీరా ఆనందించుట భక్తుల అదృష్టము. నీ సౌందర్యము ఎంత చూస్తే అంత రుచి.


పరిశీలన: 


ఈ కీర్తన పూర్తిగా రాముని సాకారమును వర్ణనలా కనిపించినా ఆ శుద్ధ చైతన్య స్వరూపుని అగణిత గుణ గణములను, అపార కరుణా రసమును, దయావ్రుష్టిని, ఆశ్రిత జన వాత్సల్యమును ఉదాహరణలతో చెపుతుంది. ధ్రువుని చరిత ఒక చరణంలో ఎంతో అందముగా చెప్పారు త్యాగయ్య వారు. తన భక్తునికి శాశ్వతమైన ధ్రువ పదము ప్రసాదించిన ఆ శ్రీహరి వాత్సల్యము భాగవతములో పోతనగారు అద్భుతముగా వర్ణించారు. ఆ భక్త శిరోమణి ధ్రువుని ప్రస్తావించటం ఈ కీర్తన ద్వారా త్యాగయ్య వ్యక్తపరచిన సందేశానికి పతాకం.

తన భక్తుడైన జటాయువు రావణునితో వీరోచితముగా పోరాడి, కీలకైన ఆ రావణుని వృత్తాంతము రామునికి తెలిపే వరకు కోన ప్రాణములు నిలుపుకొని ఉంటాడు. రెక్కలు తెగి మరణ శయ్యపై ఉన్న ఆ జటాయువుపై రాముడు కరుణించి ఆ పక్షిరాజుకు మోక్షము ప్రసాదిస్తాడు. ఎంతటి అదృష్టము ఆ జటాయువుది?

సీతా మనోహరుడు అయిన శ్రీరాముడు ఆయన సీత కొరకు వెదుకుతూ దుఃఖిస్తూ అడవుల తిరుగుతుంటే ఆయన భక్తుడైన హనుమ ఆయన పాదములను ఆశ్రయించి సీతాదేవిని వేడుకు బృహద్కార్యమును స్వామి ఆశీర్వాదముతో చేపడతాడు. అనన్యసామాన్యమైన సాగర తారకాన్ని రాముని భక్తితో వాయువేగముతో పూర్తి చేసి అరి వీర భయంకరులైన రాక్షసులను ఎదిరిస్తాడు. ఆ సందర్భంలో రెండు మహత్తు గల శ్లోకాలను హనుమంతుని నోట మనకు వాల్మీకి మహాముని వినిపిస్తారు.

జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహా బలః 
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః 

దాసోహం కోసలేన్ద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః 
హనుమాన్ శత్రు సైన్యానం నిహంత మారుతాత్మజః 

ఆ రాముని పై భక్తి ఆ హనుమంతునికి కొండంత బలము ఇచ్చి ఆ రామ కార్యమును సాధించుటలో ముందుకు నడిపింది. ఆ కార్యములో భాగముగా ఆ హనుమంతుడు సీతామాతను చూచుటే గాక, మహా వీరులైన అక్ష కుమారుడు మొదలగు రావణ సంతతిని సంహరించి ఆ రాక్షస రాజుకు రాముని బల పరాక్రమాల రుచి చూపుతాడు. ఇక తరువాత శత్రు జన సంహారము, అరి వీర భయంకర రామ రావణ యుద్ధము. అట్టి మహత్తు కలది రామ భక్తి.

సీతామాత రాముని నుండి దూరము తాళలేక రావణుడు పెట్టే బాధలు భరించ లేక ప్రాణ త్యాగానికి సిద్ధమైనప్పుడు హనుమంతుడు వచ్చి ఆ రాముని మహిమను కీరిస్తాడు. ఆ మాట రామునితో తన గుర్తులను చెపుతూ కాకాసురుడు మొదలగు విషయాలను ప్రస్తావిస్తుంది. ఆ సందర్భముగా ఆమె చెప్పిన మాటలు రామునిపై ఆమెకు గల అవ్యాజమైన ప్రేమానురాగములకు నిదర్శనము. ఈ మొత్తాన్ని త్యాగయ్య వారు అందముగా ప్రస్తావించారు.

ఈ కీర్తన ద్వారా భక్త జన పరిపాలన, ధర్మ సంరక్షణ, దాసుల పాలిటి దయ, కరుణ, ధర్మ పత్ని పై ప్రేమ ఇలా ఎన్నో ఎన్నలేని గుణములకు నిలయమైన రాముని ఎంతో అందముగా నుతించారు త్యాగరాజు.

ఆ కోదండరాముని స్తుతులతో వేల కృతులు రచించి రామభక్తి సామ్రాజ్యములో తనకు శాశ్వత స్థానం ఏర్పరచు కున్నారు త్యాగ బ్రహ్మ. ఆ మహానుభావునికి మరొకమారు నీరాజనములు.

ఈ పంచరత్న కృతి బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి.

23, జనవరి 2011, ఆదివారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - సాధించెనే ఓ మనసా

ఘన రాగ పంచ రత్న కీర్తనలలో మూడవది సాధించెనే ఓ మనసా.  ఈ కీర్తనలో త్యాగరాజు వారు శ్రీ కృష్ణుని నిందా స్తుతి  చేస్తున్నట్టు అనిపిస్తుంది. కృష్ణావతారములో ఆ శ్రీహరి ఎన్నో లీలలను దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు నాటకీయంగా, సామాన్యులకు అందని పద్ధతిలో సాగిస్తాడు. సామ దాన భేద దందోపాయములతో సందర్భోచితంగా మాయా వినోదం చేస్తాడు ఆ కృష్ణుడు. లీల ఏదైనా, సందేశం మాత్రం ధర్మ సంస్థాపనే. అందుకనే, త్యాగరాజు వారు ఈ కృతిలో కొంత నింద, కొంత గుణగణ వర్ణన చేశారు (మన తెలుగు భాషలో సాధన అనే పదానికి ఎన్నో అర్థాలు - అనుకున్న పని చేయుట, ఏదో ఒక కారణముతో ఆడిపోసుకొనుట, ఆధ్యాత్మిక సాధన మొదలైనవి. వీటిలో మొదటిది, రెండవది ఈ కృతికి ఉచితం).  ఆరభిరాగం ఆది తాళంలో ఈ కృతి కూర్చబడినది.


సాహిత్యము:

సాధించెనే ఓ మనసా

బోధించిన సన్మార్గ వచనముల బొంకు జేసి తా బట్టిన పట్టు

సమయానికి తగు మాట లాడనే

దేవకి వసుదేవుల నేగించినటు

రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు

గోపి జన మనోరథ మొసంగ లేకనే గేలియు జేసే వాడు

వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడదియు గాక
యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి

పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండా జన్మ మనఘు డీ కలి
బాధలు దీర్చు వాడనుచు నే హృదంబుజమున జూచు చుండగ

హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష
శేష శయన పర నారి సోదర అజ విరాజతురగ రాజ
రాజనుత నిరామయా అపాఘన సరసీరుహ దళాక్ష
యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను

శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస
నికేతన కనకాంబర ధర లసన్మకుట కుండల విరాజిత
హరే అనుచు నే పొగడగ త్యాగరాజ గేయుడు
మానవేంద్రుడయిన రామచంద్రుడు

సద్భక్తుల నడత లిట్ల నెనే
అమరికగా నా పూజ కొనెనే, అలుగ వద్దననే
విముఖులతో జేర బోకు మననే వెత గలిగిన తాళుకొమ్మననే
దమశమాది సుఖ దాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే
 

అర్థము:

ఓ మనసా! శ్రీ కృష్ణుడు తాను తలపెట్టిన కార్యములను సాధించెనే.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో సన్మార్గమును బోధించెను. కానీ తానే ఆ మాటలను కల్లచేసి, వాటికి భిన్నముగా తాను పట్టిన మొండి పట్టును సాధించుకునెను .

శ్రీ కృష్ణుడు అవసరానికి తగినట్లు, సమయానుకూలముగా మాట్లాడుచు, రాజకీయమును, తన లీలను ప్రకటిస్తున్నట్లు పైకి కనిపించును. (కానీ, దుష్ట శిక్షణ/శిష్ట రక్షణలో తాను తలచిన పనిని నిర్విఘ్నముగా కొనసాగించు కొను సామర్థ్యము కల వాడు). 

కారాగారములో దేవకీ వసుదేవుల బాధకు కారకుడైనట్లు తోచును కాని అది సత్యము కాదు. అది కేవలం దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగం మాత్రమే.

శ్రీ రంగనాథుడు, గంగానదికి జనకుడు అయిన విష్ణువు సంగీత సాంప్రదాయము కలవాడు.

గోపికల మనోరథం తీర్చకుండా (శ్రీ రాముని కౌగిలించుకోవాలన్న మునుల కోరికను ఆయన మరు జన్మలో, వారు గోపికల అవతారము ఎత్తినప్పుడు తీరుస్తానని వాగ్దానం చేస్తాడు. శ్రీ కృష్ణావతారములో గోపికల ఆ కోరిక తీర్చవలసినది), తిరిగి అపహాస్యము చేసాడు. ఆ విధముగా శ్రీ కృష్ణుడు సమయానికి తగు మాటలాడి తన తలపులను సాధించు కొనెను. (అని త్యాగరాజుల వారు శ్రీకృష్ణుని నిందాస్తుతి చేశారు ఈ చరణంలో)

శ్రీకృష్ణుడు గోపికలను శృంగార పరమైన ఆశలతో అలసిపోవునట్లు చేసి, అలాగే, తాను యశోద తనయుడు కాదు అనే సత్యము తెలిసి కూడా యశోద తనను తల్లిలా భావించి ముద్దు పెట్టగా శ్రీ కృష్ణ పరమాత్మ యశోద అమాయకత్వమును చూచి నవ్వుచుండును.

శ్రీకృష్ణుడు తన భక్తులను వాత్సల్యముతో కాపాడుతున్నాడు. సుగుణముల సాగరమైన వాడు, జన్మ జన్మలకు పుణ్యమూర్తి, కలియుగములో మన బాధలను తీర్చేవాడు  అని మనమందరమూ మనసులో భావిస్తున్నప్పుడు, దానికి భిన్నముగా ఆయన మనలను కాపాడుట లేదు (అని త్యాగరాజు నిందాస్తుతి చేస్తున్నాడు).

ఓ శ్రీరామా! నీవు పాపలను హరించే వాడవు. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, వెలుగును ఇస్తూ చంద్రునిలా ప్రకాశించే వాడవు. రఘువంశమునకు నాయకుడవు. మృదు భాషివి. ఆదిశేషుని పై శయనింతువు. పరస్త్రీలను సోదరుని వలె కాపాడుడువు. పుట్టుక లేని వాడవు. వాహనమైన గరుత్మంతునిపై విహరిస్తూ ప్రకాశించేడవు. రారాజులచే పొగడబడిన వాడవు. అసమానమైన శరీర కాంతి కలవాడవు. కమలదలముల వంటి కనులు కలవాడవు అని అనేక విధముల నేను నిన్న వేడుకొనుచుండగా నీవు నన్ను రక్షించక సాధించుచున్నావు.

ఓ రామా! నీవు వేంకటేశ్వరుడవు. సుప్రకాశకుడవు. సర్వోన్నతుడవు. మంచివారి హృదయములలో నివసించే వాడవు. పీతాంబరమును ధరించిన వాడవు. మెరిసే కిరీటము, కర్నాభారమునులు కలిగి ప్రకాశించువాడవు. ఓ శ్రీహరీ! నిన్ను పైవిధముగా అనేక విధముల నిత్యము కీర్తించు చున్నాను. నీవు నా కీర్తన రూపుడవు. మానవులలో శ్రేష్ఠుడవు. ఇట్టి నా కీర్తనలు నీవు పెడచెవిన పెట్టి నన్ను సాధించుచున్నావు.

శ్రీరాముడు త్యాగరాజుని దగ్గరకు రాక, దూరముగా ఉండి, ఎన్నో బోధనలు చేసి, త్యాగరాజు యొక్క ప్రవర్తనను మెచ్చు కొనెను. సద్భక్తుడని మెచ్చు కొనెను. అలుగవద్దని చెప్పెను. నాస్తికులతో కూడవద్దని, శాంతము, ఇంద్రియ నిగ్రహము కలిగియుండమని, కష్టమును ఓర్చుకోమని శ్రీరాముడు స్వయముగా త్యాగరాజు తో మాట్లాడినట్లు భావము.


పరిశీలన: 

నిందాస్తుతి కావ్య, కృతి రచనలో ఒక శైలి. మానవునిలో సహజమైన ద్వంద్వ భావమునకు అక్షర రూపము ఈ నిందాస్తుతి. సాధనలో ధ్యేయ ప్రాప్తి ఆలస్యమవుతున్న కొలదీ ఆవేదన, అసహనము, ప్రశ్న మొలకెత్తటం  మానవ జన్మకు సహజం. అది కావ్య రూపములో ఒక పక్క ప్రశంస మరొక పక్క ప్రశ్నార్థకమైన నింద. ఈ ప్రక్రియను త్యాగరాజు వారు ఈ   కృతిలో ఉపయోగించారు.

ఆ శ్రీ కృష్ణుని పుట్టుకే ఒక నాటకం. కంసుని చంపటానికి దేవకికి ఏడు గర్భములు, ఆ బిడ్డల చంపబడుట ఏల? చెల్లెలి అష్టమ గర్భము తనను చంపుతాడనే భయముతో మొత్తము మధురా పట్టణములో ఆ వయసు పిల్లలను చంపించుట ఏల?  అసలు దేవకీ వసుదేవలంతటి మంచి వారికి కారాగార వాసమేల?  ఇన్ని జరిగిన తరువాత - నడి రేయి వసుదేవునిచే మోయబడి యమునను దాటి నందగోకులం చేరుట ఏల?. ఒక్క కంసుని చంపుట అనే దుష్ట శిక్షణకు ఇంత రంగము ఎందుకో? ఇవన్నీ మానవాళికి పాఠములే. భూమి, మానవాళి భరించలేని క్రౌర్యము, దౌష్ట్యము, రాక్షసత్వమును అంతమొందాలంటే దానికి అవతారము, సరైన పరిస్థితులు కావాలి. అవి ఆయన స్వయంగా కావలసినట్టుగా ఏర్పరచుకుంటాడు. దానికి ప్రతి అవతారము ఒక ఉదాహరణ.

ఒక పక్క ఆ శ్రీ కృష్ణుని, రాముని గుణ గణములను, మహిమలను వర్ణిస్తూనే  మరొక పక్క నేను ఎన్నో విధముల పొగడుతున్న నన్ను బ్రోవుట లేదు అని నిందిస్తున్నారు త్యాగరాజుల వారు.మాయ మానుష రూపుడైన శ్రీ కృష్ణుడి లీలను ఎన్ని? విశ్వాత్మ యైన శ్రీ హరి బాలుడిలా యశోదను మురిపిస్తూ, అల్లరి పనులు చేస్తూ, తల్లిచే దండను పొంది, మరల వెంటనే లాలన పొంది, మరల అంతలోనే నోట విశ్వమును చూపించి ఆ యశోద జన్మను ధన్యము చేసినాడు. అట్టి లీలను చూస్తే ఆయన అంతరార్థము తెలుసుకొనుట ఎంతో కష్టం. పాలు తాగుతున్నట్టు నటిస్తూ పూతనను సంహరించటం, తల్లి తన అల్లరిని భరించలేక రోకటికి కట్టి వేస్తే, రోకటితో సహా పాకుతూ వెళ్లి సాల వృక్షములను కూల్చి నలకూబరుల శాపము తీర్చాడు.

అలాగే, గోపికలు, గోపబాలకులు, గోప స్త్రీలతో రాసలీలలు, వస్త్రాపహరణము, కాళీయ మర్దనం, గోవర్ధనోద్ధరణ, ద్రౌపదీ మాన రక్షణ - ఇలా, ఎన్ని లీలలో? చేసే పని ఒకటి వాటి వెనక కార్యం, అంతరార్థము ఇంకొకటి. అందుకనే ఆయనను లీలా వినోదుడు అయ్యాడు. ఈ లీలను తెలియాలంటే ఆ పరమాత్మను తెలుసుకోవాల్సిందే. భాగవత, మహాభారతాల్లో ఆ శ్రీకృష్ణుని అంతరార్థము మనకు పూర్తిగా చెప్పబడింది. ఇన్ని జరిగిన తరువాత కూడా, అర్జునుడు తన కర్తవ్యమును మరచి యుద్ధభూమి నుండి వెను దిరిగే సమయములో, ఆయన పూర్తి కర్తవ్య బోధ, జనన మరణ రహస్యము, యోగము, సిద్ధి గురు రూపములో 'గీత'గా తెలిపి, విశ్వరూపమును చూపిస్తాడు.  అందుకే కృష్ణ తత్త్వము తెలుసుకుంటే మోక్షము ముంగిట ఉన్నట్లే అని పెద్దలు చెప్పారు.

ఈ భావనను నిందాస్తుతి రూపంలో అందంగా కృతి రూపం చేశారు త్యాగయ్య. కీర్తన చివరలో, మళ్లీ ఆ శ్రీరాముడే తనకు మార్గము చూపినట్లుగా, తనను ఉద్ధరించినట్లుగా ముగిస్తారు త్యాగయ్య.  ఒకరకంగా ఈ కీర్తన పూర్తి మాయా మానుష తత్త్వమును వివరిస్తుంది. ఆ మహానుభావునికి మరోసారి నీరాజనాలు.  ఈ కీర్తనను మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి.

(తెలుగు తెలియని చాలా మంది కళాకారులు 'సమయానికి తగువు మాటలాడెనే' అని ఆలపిస్తారు. అది అర్థాన్ని పూర్తిగా మార్చేసి విపరీతార్థం తెస్తుంది. కాబట్టి, తెలుగు భాష నేర్చుకుని,  'సమయానికి తగు మాటలాడెనే' అని పాడవలసినదిగా విజ్ఞప్తి).

22, జనవరి 2011, శనివారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - దుడుకు గల నన్నే

ఎన్నాళ్ళైనా ఆ రాముడు తనను బ్రోవుట లేదని త్యాగరాజ స్వామి తనలో ఏమైనా లోపముందేమో అని బాహ్య ప్రపంచములో ఉన్న మానవులు చేస్తున్న తప్పిదాలను తనకు ఆపాదించుకుని ఈ కీర్తన రాసినట్టు కనిపిస్తున్నది. ఈ సమాజంలో ఉన్న దుర్విషయములు, వ్యసనములతో ఇతరులు చేస్తున్న కాల వ్యర్థమును ఈ కీర్తనలో తనను పాత్రధారిగా చేసుకుని త్యాగయ్య అద్భుతంగా వివరించారు. లేకుంటే రాముని సేవ కొరకు మహారాజుల కానుకలు, ఆస్థాన మర్యాదలు, భోగములు వదులుకున్న మహానుభావుడు దుడుకుగల వ్యక్తి ఎలా అవుతాడు?.

నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగా బల్కు మనసా అని తన మానసిక భావాన్ని వ్యక్త పరచిన వాగ్గేయకారుడు పేదరికంలో రాముని సేవయే పెన్నిధి అని జీవించి తరించాడు. ఆ రాముడు తనను ఇంకను కరుణించ లేదని దుర్లక్షణాలను తనలో ఉన్నాయేమో అని ఈ కీర్తనలో చెపుతున్నారు త్యాగయ్య. గౌళ రాగం ఆదితాళం తో కట్టబడింది ఈ పంచ రత్న కీర్తన.


సాహిత్యము:

దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో

కడు దుర్విషయాకృష్టుడై గడియ గడియకు నిండారు

శ్రీ వనితా హృత్కుముదాబ్జ అవాంగ్మానస గోచర |దుడుకు గల|

సకల భూతముల యందు నీ వైయుండగ మదిలేక పోయిన |దుడుకు గల|

చిరుత ప్రాయము నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన |దుడుకు గల|

పర ధనముల కొరకు నొరుల మది కరగబలికి కడుపు నింప తిరిగినట్టి |దుడుకు గల|

తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే అనుచు సదా దినములు గడిపే |దుడుకు గల|

తెలియని నటవిటక్షుద్రులు వనితలు స్వవశమగుట కుపదేశించి 
సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై సుభక్తులకు సమానమను |దుడుకు గల|

దృష్టికి సారంబగు లలనా సదనాఽర్భక సేనాఽమిత ధనాదులను
దేవాది దేవ నెరనమ్మితిని గాక నీ పదాబ్జ భజనంబు మరచిన  |దుడుకు గల|

చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ లేక నే
దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి
దుర్విషయ దురాశలను రోయలేక, సతతమపరాధినై, చపల చిత్తుడనైన |దుడుకు గల|

మానవతను దుర్లభ మనుచు, నెంచి, పరమానందమొందలేక
మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక
నరాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు |దుడుకు గల|

సతులకై కొన్నాళ్ళాస్తికై సుతులకై కొన్నాళ్ళు ధన
తతులకై తిరిగితినయ్య త్యాగరాజాప్త ఇటువంటి |దుడుకు గల|


అర్థము:
దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?  అనుక్షణము, ఎడతెగక, చెడ్డ పనులతో నా మనస్సు నిండి యున్నది. ఈ చెడ్డ బుద్ధి నన్ను చుట్టుకుని యున్నది. అటువంటి నన్ను ఏ దొర కొడుకు (రాజ కుమారుడైన రాముడు) బ్రోచును? 

ఓ శ్రీ రామా! నీవు లక్ష్మీ దేవి యొక్క హృదయ పద్మములా ఉన్నావు. వాక్కు చేతగాని, మనసుచేత గానీ గోచరము కావు నీవు. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

 ప్రపంచము నందు గల ప్రతి వస్తువులో నీవే యున్నావు. కానీ నాలో లేకపోవుట కేవలం నా దుర్మార్గపు ప్రవర్తన వలననే అని భావిస్తున్నాను. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

చిన్నతనము నుండి అమృత రసము వంటి నీ భజన యొక్క మహిమ తెలియలేక చేదు వాదనలు చేస్తున్న దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

ఇతరుల ధనము కొరకు వారి వద్ద చేరి ప్రియమైన మాటలతో, పొగడ్తలతో వారి మనసును సంతోషింప చేసి వారిచ్చు ధనమునకు ఆశపడే దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

మనసులో ఈ ప్రాపంచిక సుఖమే పరమావధిగా భావించి ఎల్లపుడు సమయము గడుపుతున్న దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

అమాయకులు, అజ్ఞానులు, నటులు, విటులు, క్షుద్రులు మొదలైన వారి వద్ద జ్ఞానిగా నటించి వారికి బోధలు చేసి వారిని తన శిష్యులుగా చేసుకుని వారిని తన అదుపులో ఉంచుకుని సంతోషముగా యున్నాను. తనకు స్వర లయ జ్ఞానములు లేకనే తానొక గొప్ప విద్వాంసుడని అనుకుని ఇతరులను తాను మహా భక్తుడనని కూడా భ్రమింప చేసినాను. ఇట్టి దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

ఓ దేవాది దేవ! అందమైన వనితా, ఇల్లు, పిల్లలు, సేవకులు, అమిత ధనము, ఆస్తి మొదలైన అశాశ్వతములైన ప్రాపంచిక కోరికల యందు ఆసక్తి కలిగి, అవియే సర్వస్వముగా భావించి  నీ పాదములను భక్తితో భజన చేయుట మరచిన, దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

గర్వముచే గుడ్డియైన వారితో స్నేహము చేసి, చెడ్డ పనులు చేయుచు, దురాశలను వదల లేక దుర్మార్గుడునై యుండుట చేత నీ చక్కని కమలము వంటి ముఖమును ఎల్లప్పుడూ నా మదిలో స్మరించ లేకుండుంటిని. నా ప్రవర్తనకు నేను చింతిస్తున్నాను. నా చపల చిత్తమును నిగ్రహించుకోలేకున్నాను. పశ్చాత్తాపము నన్ను దహించుచున్నది. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

మానవ జన్మను పొందుట ఎంతో కష్టము. అటువంటి అదృష్టము కలిగినందుకు సంతోషించక - గర్వము, ఈర్ష్య, కామము, క్రోధము, పిసినారి తనము, మొదలగు దురాలోచనలకు, చెడు కార్యములకు లొంగిపోయి మోసపోతిని. జ్ఞానమే పరమావధిగా కలిగిన కులములో పుట్టి కూడా అజ్ఞానినై ప్రవర్తిన్చితిని. ఇటువంటి విషయములను అసహ్యించుకొనక, మొత్తం తలక్రిందులై నేను కూడా వాటినే చేయు యున్నాను. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

యౌవనములో భార్యల కొరకు, మరి కొన్నాళ్ళు ఆస్తుల కొరకు, మరి కొన్నాళ్ళు పిల్లల కొరకు, ధనము కొరకు జీవన సమయమంతా వ్యర్థము చేస్తూ తిరిగితిని. ఓ త్యాగరాజునికి ఆప్తుడవైన రామా! దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

పరిశీలన: 
మానవ జన్మ ఎత్తుట మనకు భగవంతుడు ఆయనను తెలుసుకొనుటకు ఇచ్చిన మహదవకాశం.  కానీ, జీవిత సమయమంతా, విషయ వాంఛలలో, దుర్వ్యసనములలో, చెడు ఆలోచనలో దుర్వినియోగము చేసి, ఆ పరమాత్మను తెలుసుకునే గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని చేజేతులా పోగొట్టుకుని మరల మరల ఈ భువిపై పశువుల, క్రిమి కీటకములలా పుట్టి, మరణించి మళ్లీ మళ్లీ  జన్మలెత్తుతూ విషయ పాప చక్రములో బంధించ బడుతున్నాము. ఈ భావననే త్యాగరాజుల వారు ఈ కీర్తన ద్వారా, తననే ఉదాహరణగా, పాత్రగా తీసుకుని మానవ జన్మను వివరించారు. 

శారీరిక వాంఛలు, ధన సముపార్జన - వీటి కొరకు ఆరు దుర్లక్షణములకు (కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము) లోనై, ఇతరులను హింసించి, తాన దైవత్వమును మరింత దిగజార్చుకుని, మళ్లీ మళ్లీ అదే ఊబిలో చిక్కుకుని ఉన్నాడు మానవుడు. అస్థిరములైన యౌవనము, కామము, ధనము, భార్యా బిడ్డల కొరకు శాశ్వతమైన దేవుని తెలుసుకునే మార్గమును వదులుకోవాలా?. అలాగని మనకు మనము చేస్తున్నది తప్పని తెలియక కాదు. తెలిసి, లోపల పశ్చాత్తాప పడుతూ, అధిగమించటానికి ఆశక్తులమై ఉంటాము. ఇటువంటి సమయములోనే, మనకు దారి చూపటానికి గురువులు కావాలి. వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ మనలను సరైన మార్గములో నడిపించి, లోపాలను సరిదిద్దుతూ భగవంతుని మార్గములో నడిపిస్తుంది. 

మనలో ప్రతి వారికి ఒక గమ్యము ఉంది. అది మనము ఏమిటి, మనలో ఉన్న బ్రహ్మము ఏమిటి అని తెలుసుకొనుట. దాని కొరకే మనకు వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ, చదువు, సంస్కారములు, పురుషార్థములు కలిపించబడ్డాయి. వాటిని వదలి, ఆత్మ విమర్శ లేక, నిరంతరమూ నటిస్తూ, తనలోని శుద్ధ తత్త్వముపై తొలగించటానికి అతి కష్టమైన పొరలను కప్పివేస్తాడు మానవుడు. ఇంతటి దుడుకుతనము గల నన్ను (మనలను) ఏ రాముడు రక్షిస్తాడు? కాబట్టి మన ధర్మానికి కట్టుబడి, వాటిని నిర్వర్తిస్తూ, మనకు ఇచ్చిన జన్మను శాశ్వతమైన ఆ ప్రభువును తెలుసుకొనుటకు ఉపయోగిస్తే, ఆయనే మనలను కాపాడుతాడు అని త్యాగయ్య సందేశం.

నా ఉద్దేశంలో పంచరత్న కీర్తనలలో అత్యున్నత ఆధ్యాత్మిక సందేశము కలది ఈ కృతి. బాలమురళీకృష్ణ గారి గళంలో విని, సందేశాన్ని అర్థం చేసుకుని తరిద్దాం.

21, జనవరి 2011, శుక్రవారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన -జగదానంద కారక

వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః 
వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం 
బ్రహ్మా నారద వచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః
యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే 

సద్గురువు త్యాగరాజ స్వామి వారు వేదములను విప్పి చెప్పుట యందు వ్యాసుని వంటివారు, మధురమైన వాక్యములు రాయుటలో వాల్మీకి కవి వంటి వారు, వైరాగ్యములో శుకుని వంటి వారు, భక్తిలో ప్రహ్లాదుని వంటి వారు, సాహిత్యములో బ్రహ్మ వంటి వారు, సంగీతములో నారదుని వంటి వారు, రామ నామమనే అమృతమును గ్రోలుటలో పరమశివునికి సమానులు. అటువంటి సద్గురువులను భజిస్తున్నాను - అని ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు పై శ్లోక రూపంలో నుతించారు.


మహా వాగ్గేయకారుడు, అపర నారదుడు, అనుపమ రామభక్తుడు అయిన త్యాగరాజస్వామి వారు ఆ రామునిలో ఐక్యమైన రోజు పుష్య బహుళ పంచమి. ప్రతి సంవత్సరం దీన్ని పురస్కరించుకొని ఆయన జన్మ స్థలమైన తిరువాయూర్ తో పాటు ప్రపంచమంతా ఐదు రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుపుతారు. ఆయా ఊళ్లలో కళాకారులు ఆ మహానుభావుని సంకీర్తనలను గానం చేసి ఆయనకు నివాళులు అర్పిస్తారు. అందులో భాగంగా ఈ పుష్య బహుళ పంచమి నాడు ఆయన రచించిన ఘన రాగ పంచరత్న కృతులు బృంద గానం చేస్తారు.

ఈ ఘన రాగ పంచరత్న కీర్తనలలో మొదటిది జగదానంద కారక. ఇది నాట రాగం, ఆది తాళంలో  స్వర పరచబడినది. రాగ లక్షణాలను పక్కకు పెట్టి ఇందులోని సాహిత్యపు విలువలను, వర్ణనను పరిశీలిద్దాము. మొదట సాహిత్యము, అటు పిమ్మట అర్థము, చివర పరిశీలన.

సాహిత్యము:

జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయక

గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల |జగదానంద|

అమర తారక నిచయ కుముదహిత, పరిపూర్ణ అనఘ సుర, సురభూజ
దధి పయోధి వాస, హరణ, సుందరతర వదన సుధామయ వచో
బృంద, గోవింద సానంద, మావర, అజర, ఆప్త, శుభకరా అనేక |జగదానంద|

నిగమ నీరజా అమృతజ పోషకా అనిమిష వైరి వారిద, సమీరణ,
ఖగతురంగ, సత్కవి హృదాలయ అగణిత వానరాధిప నతాంఘ్రి యుగ |జగదానంద|

ఇంద్ర నీలమణి సన్నిభాఽపఘన చంద్రసూర్య నయన అప్రమేయ వా-
గీంద్ర జనక, సకలేశ సుభ్ర నాగేంద్ర శయన, శమన వైరి సన్నుత |జగదానంద|

కరధృత శరజాల, అసుర మదాపహరణ, అవనీసుర సురావన,
కవీన బిలజమౌని కృత చరిత్ర, సన్నుత శ్రీ త్యాగరాజనుత |జగదానంద|

సృష్టి స్థిత్యంతకారక, అమితకామిత ఫలద, అసమాన గాత్ర,
శచీపతి నుతా, అబ్ధి మదహర, అనురాగ రాగరాజిత కథాసార, హిత |జగదానంద|

పాద విజిత మౌనిశాప సవపరిపాల వరమంత్ర గ్రహణ లోల
పరమశాంత చిత్త జనకజ, అధిప సరోజభవ వరద, అఖిల |జగదానంద|

పురాణ పురుష, నృవరాత్మజాశ్రిత పరాధీన ఖర విరాధరావణ
విరావణ అనఘ పరాశర మనోహర అవికృత త్యాగరాజ సన్నుత |జగదానంద|

సజ్జన మానసాబ్ధి సుధాకర, కుసుమ విమాన, సురసారిపు కరాబ్జ
లాలిత చరణా అవగుణ అసురగణ మదహరణ సనాతన, అజనుత |జగదానంద|

ఓంకార పంజరకీర, పురహర, సరోజభవ, కేశవ, ఆదిరూప
వాసవరిపు జనకాంతక, కలాధర, కలాధరాప్త, ఘృణాకర,
శరణాగత జనపాలన, సుమనో రమణ, నిర్వికార నిగమ సారతర |జగదానంద|

అగణితగుణ, కనకచేల, సాల విదళన, అరుణాభ, అసమాన చరణ,
అపార మహిమ, అద్భుత సుకవిజన హృత్సదన, సుర మునిగణ విహిత,
కలశ నీరనిధిజ, రమణ పాపగజ, నృసింహ వర త్యాగరాజాధినుత |జగదానంద|


అర్థము:

(ఇక్కడ త్యాగరాజ సన్నుత/నుత అన్నప్పుడల్లా త్యాగయ్యగా  కన్నా శివునిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది)

జగము యొక్క ఆనందమునకు కారకుడా! సీతాపతీ! శ్రీరామా! నీకు జయము.

నింగికి రాజైన సూర్యుని వంశములో జన్మించిన ఓ శ్రీ రామా! రాజులకు రారాజువు నీవు.  సుగుణములకు రూపము నీవు, దేవతలచే సేవించబడిన వాడవు, ఎల్లప్పుడూ సకల ఆనందములను, శుభములను కలిగించే వాడవు.

ఓ శ్రీ రామా! నీవు దేవతలనే నక్షత్ర సమూహానికి చంద్రుని వంటి వాడవు, పరిపూర్ణుడవు. పాపములు లేని వాడవు. పుణ్య రూపుడవు, దేవతలకు కల్పతరువు వంటి వాడవు. పాలు, పెరుగుల మధ్య పెరిగిన వాడవు, వాటిని దొంగిలించిన బాల కృష్ణుడవు. అందమైన ముఖము కలవాడవు, అమృతము వంటి మాటలు పలికెడి వాడవు. ఆవులను రక్షించేవాడవు, గోపాలుడవు, లక్ష్మీ పతివి, నిత్య యౌవ్వనుడవు, దేవతలకు, సమస్త జీవ కోటికి ఆప్తుడవు,  శుభకరుడవు. అనేక విధముల జగదానంద కారకుడవు.

ఓ శ్రీరామ! నీవు వేదములను పద్మముల నుండి జన్మించిన అమృతమును (శ్రుతులు, ఉపనిషత్తులు, పురాణములు) పోషించు చున్నావు. దేవతలకు శత్రువులను మేఘాలను చెల్లాచెదరు చేసే గాలి వలె   వారించుచున్నావు. గరుత్మంతుని వాహనముగా కలవాడవు. గొప్ప కవుల హృదయములలో నివసించేవాడవు. వానర వీరులైన సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు మొదలగు వారిచే పూజించబడిన పాదములు కలిగిన వాడవు.  నీవు జగదానంద కారకుడవు.

ఓ శ్రీ రామా! ఇంద్రుని నీలమణి వంటి శరీర ప్రకాశముతో వెలుగుతున్నావు. సూర్యచంద్రులు నీ రెండు కన్నులుగా కలవాడవు.  సాటిలేని దైవము నీవు. వేదములను సృష్టించిన బ్రహ్మకు  తండ్రివి. సర్వేశ్వరుడవు. కల్మషము లేని వాడవు. ఆదిశేషుని పై శయనించిన వాడవు.కాలుడైన యమునికి కాలుడైన శివునిచే పూజించబడిన వాడవు. నీవు జగదానంద కారకుడవు.

ఓ రామా! నీవు భుజములపై బాణములు ధరించి  రాక్షసుల గర్వమును పోగొట్టుదువు. బ్రాహ్మణులను, దేవతలను రక్షించెదవు. కవికోకిలయైన వాల్మీకి రచించిన రామాయణమున నాయకునిగా ప్రకాశించి పొగడబడిన వాడవు. శుభకరుడైన శివునిచే (త్యాగరాజుచే) పొగడబడి పూజించ బడినవాడవు. నీవు జగదానంద కారకుడవు.

సృష్టి, జీవనము, అంతము నీవే సమర్థవంతముగా చేసెదవు. అశేషమైన కోరికలను తీర్చేదావు. అనుపమానమైన దేహకాంతి కలవాడవు. ఇంద్రునిచే పొగడబడిన వాడవు. సముద్రుని గర్వము అణచిన వాడవు. ప్రేమ, మధురమైన పదములు, అనురాగము మొదలైన వాటితో ప్రకాశించే రామాయణమునకు సారము నీవే. సమస్త లోకములకు హితుడవు నీవు. నీవు జగదానంద కారకుడవు.

ఓ శ్రీరామా! నీ పాద స్పర్శచే పతియగు గౌతమ మునిచే శాపము పొందిన అహల్యకు శాప విమోచనము కలిగించి బ్రోచితివి. విశ్వామిత్రుని యాగ రక్షణ సమయమున వారిచే మహామంత్ర రూపమున బల, అతి బల విద్యలను, అనేక అస్త్ర శాస్త్రములను స్వీకరించి విజయమును పొందితివి. నిరంతరము శాంత చిత్తుడవై యుందువు. నీవు సీతాపతివి. బ్రహ్మదేవునకు వరములు ప్రసాదిన్చితివి. నీవు సమస్త జగములకు ఆనందమును ఇచ్చుచున్నావు. నీవు జగదానంద కారకుడవు.

 ఓ రామా! నీవు పురాణ పురుషుడవు. నరపతి అయిన దశరథుని కుమారుడవు. నిన్ను శరణు కోరిన భక్తుల ఆధీనములో ఉందువు. ఖరుడు, విరాధుడు, రావణుడు మొదలగు రాక్షసులను సంహరించిన వాడవు, పాపములు లేని వాడవు, పరాశరుని మనస్సు దోచిన వాడవు. సుందరమైన రూపము కలవాడవు. పరమశివునిచే (త్యాగరాజుచే) నుతించ బడిన వాడవు. నీవు జగదానంద కారకుడవు.

ఓ శ్రీ రామా!  నీవు మంచి వారి మనసు అనే సముద్రమునకు చంద్రుని వంటి వాడవు. పుష్పక విమానము పొందిన వాడవు. సురస అనే రాక్షసిని జయించిన హనుమంతుని చేత లాలించబడు చరణయుగములు కలవాడవు. దుర్గుణములు కలిగిన రాక్షస సమూహముల గర్వమును అణచిన వాడవు. శాశ్వతుడవు. బ్రహ్మచే నుతించ బడిన వాడవు.

ఓ రామా! నీవు ప్రణవ నాద (ఓంకార) స్వరూపుడవు. నీవు జగత్తు అనే పంజరములో చిలుకగా పరమాత్మవై ఉన్నావు. త్రిమూర్తుల రూపము నీవు.త్రిమూర్త్యాత్మకుడవు. ఇంద్రుని శత్రువగు ఇంద్రజిత్తు తండ్రియైన రావణుని జయించిన వాడవు. కళారూపుడవు. చంద్రుని తలపై ధరించిన శివుని స్నేహితుడవు. దయాకరుడవు. శరణాగతులను రక్షించిన వాడవు. దేవతలకు అధిపతివి. వికృతిలేని వాడవు. వేదముల సారమును మించిన సారము కలవాడవు. నీవు జగదానంద కారకుడవు.

శ్రీరామా! నీవు ఎన్నో మంచి గుణములు కలవాడవు. బంగారు వస్త్రములు (పీతాంబరము) ధరించిన వాడవు. కృష్ణుని అవతారములో సాల వృక్షములను చేదించిన వాడవు. ఎర్రటి రంగు గల పాదములు కలవాడవు. గొప్ప మహిమ కలిగిన వాడవు. అద్భుతమైన మంచి కవుల హృదయ కమలములందు నివసించే వాడవు. దేవతలకు మునులకు హితము చేసే వాడవు. పాల సముద్రములో లక్ష్మీ రమణుడవు. పాపము అను ఏనుగును వధించిన నర శార్దూలము నీవు. మహానుభావుడైన శంకరునిచే (త్యాగరాజుచే) నుతించబడిన వాడవు.  నీవు జగదానంద కారకుడవు.

పరిశీలన: 

ఈ కీర్తనలో త్యాగరాజ స్వామి రాముని అనంతమైన గుణగణములను ప్రాకృత భాషలో వర్ణించారు. సంస్కృతం ఈ కీర్తనను మనోజ్ఞం చేసింది. విశేషమైన పదప్రయోగము, లోతైన భావ వ్యక్తీకరణ ఈ కీర్తన ప్రత్యేకత.

ఈ కీర్తన ద్వారా త్యాగయ్య ఆధ్యాత్మిక సంపదగా రాముని పర తత్త్వాన్ని, వేద సార రూపమును, వేదములలో నుతించబడుటను, ఏకాక్షర బ్రహ్మ స్వరూపమును, సచ్చిదానంద కారకమును, నిష్కల్మషమును, భక్తజన పరిపాలనను, శాంత చిత్తమును, త్రిమూర్త్యాత్మక రూపమును, సృష్టిస్థితిలయ కారకమును, నిత్య యౌవన, సనాతన తత్త్వమును ముందుంచారు .

ఈ కీర్తనలో త్యాగయ్య రాముని గుణగణ, మహిమల వర్ణనకు ఆయన శాంతమూర్తిని, సౌశీల్యమును, భక్తజన లోలతను, ఆనంద కారకమును, ఆ శ్రీహరి అవతారములైన కృష్ణుని లీలలో వెన్న దొంగతనాన్ని, గోపాలనమును, గోరక్షణను, ఉదాత్త హృదయతను, వానరముఖ్యులచే, శివునిచే, బ్రహ్మచే, వాల్మీకిచే,ఇంద్రునిచే నుతించ బడుటను, అహల్యా శాపవిమోచనమును మనోహరముగా మన ముందుంచారు. ఇక రూప వర్ణనకు వస్తే - ఆయన అసాధారణ లావణ్యము, అందమైన ముఖము, అమృత తుల్యమైన, తీయని మాటలు, నిత్య యౌవనము,  మృదు భాషణను, విశేష శరీర కాంతిని గొప్పగా చెప్పారు త్యాగయ్య.

రాముడు ఎంత శాంతుడో, ధర్మ రక్షణకు అంతే అరివీర భయంకరుడు అని చెప్పటానికి త్యాగయ్య ఈ కీర్తనలో కాల మేఘముల పాలిటి మారుతముగా, సూర్యచంద్ర నేత్రునిగా, బలాతిబాల విద్యలతో విశ్వామిత్రుని యాగ రక్షకునిగా, అఖండ శరసంపదతో రాక్షస సమూహాన్ని నాశనం చేసిన వాడిగా, లంక చేరుటకై సముద్రం దాటు సమయమున సముద్రుని గర్వము అణచుట, ఖర దూషణుల, రావణుని చంపిన శౌర్యము, సాల వృక్షముల చేదించిన ఏకాగ్రత, బలము, పాపమనే మహా ఏనుగును సంహరించే ఏకైక సాధమనే సింహముగా వర్ణించారు.

మొత్తం మీద - గుణములను, మహిమలను,పర తత్త్వమును అద్భుతముగా, సంపూర్ణముగా ప్రస్తుతించారు త్యాగయ్య. అందుకే ఇది ఘన రాగా పంచ కీర్తనగా పేరొందింది. సుస్వరలక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గళంలో ఈ కృతి వినండి. ఆ మహానుభావునికి ఆరాధనోత్సవాల సందర్భంగా  మహా నివాళి. సద్గురు త్యాగరాజ భక్తి సాహిత్యా సంగీత పరంపర అనంత గంగా ప్రవాహంలా ఎల్లప్పుడూ కొనసాగేల మనందరమూ ప్రయత్నిద్దాము.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...