23, జనవరి 2011, ఆదివారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - సాధించెనే ఓ మనసా

ఘన రాగ పంచ రత్న కీర్తనలలో మూడవది సాధించెనే ఓ మనసా.  ఈ కీర్తనలో త్యాగరాజు వారు శ్రీ కృష్ణుని నిందా స్తుతి  చేస్తున్నట్టు అనిపిస్తుంది. కృష్ణావతారములో ఆ శ్రీహరి ఎన్నో లీలలను దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు నాటకీయంగా, సామాన్యులకు అందని పద్ధతిలో సాగిస్తాడు. సామ దాన భేద దందోపాయములతో సందర్భోచితంగా మాయా వినోదం చేస్తాడు ఆ కృష్ణుడు. లీల ఏదైనా, సందేశం మాత్రం ధర్మ సంస్థాపనే. అందుకనే, త్యాగరాజు వారు ఈ కృతిలో కొంత నింద, కొంత గుణగణ వర్ణన చేశారు (మన తెలుగు భాషలో సాధన అనే పదానికి ఎన్నో అర్థాలు - అనుకున్న పని చేయుట, ఏదో ఒక కారణముతో ఆడిపోసుకొనుట, ఆధ్యాత్మిక సాధన మొదలైనవి. వీటిలో మొదటిది, రెండవది ఈ కృతికి ఉచితం).  ఆరభిరాగం ఆది తాళంలో ఈ కృతి కూర్చబడినది.


సాహిత్యము:

సాధించెనే ఓ మనసా

బోధించిన సన్మార్గ వచనముల బొంకు జేసి తా బట్టిన పట్టు

సమయానికి తగు మాట లాడనే

దేవకి వసుదేవుల నేగించినటు

రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు

గోపి జన మనోరథ మొసంగ లేకనే గేలియు జేసే వాడు

వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడదియు గాక
యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి

పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండా జన్మ మనఘు డీ కలి
బాధలు దీర్చు వాడనుచు నే హృదంబుజమున జూచు చుండగ

హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష
శేష శయన పర నారి సోదర అజ విరాజతురగ రాజ
రాజనుత నిరామయా అపాఘన సరసీరుహ దళాక్ష
యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను

శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస
నికేతన కనకాంబర ధర లసన్మకుట కుండల విరాజిత
హరే అనుచు నే పొగడగ త్యాగరాజ గేయుడు
మానవేంద్రుడయిన రామచంద్రుడు

సద్భక్తుల నడత లిట్ల నెనే
అమరికగా నా పూజ కొనెనే, అలుగ వద్దననే
విముఖులతో జేర బోకు మననే వెత గలిగిన తాళుకొమ్మననే
దమశమాది సుఖ దాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే
 

అర్థము:

ఓ మనసా! శ్రీ కృష్ణుడు తాను తలపెట్టిన కార్యములను సాధించెనే.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో సన్మార్గమును బోధించెను. కానీ తానే ఆ మాటలను కల్లచేసి, వాటికి భిన్నముగా తాను పట్టిన మొండి పట్టును సాధించుకునెను .

శ్రీ కృష్ణుడు అవసరానికి తగినట్లు, సమయానుకూలముగా మాట్లాడుచు, రాజకీయమును, తన లీలను ప్రకటిస్తున్నట్లు పైకి కనిపించును. (కానీ, దుష్ట శిక్షణ/శిష్ట రక్షణలో తాను తలచిన పనిని నిర్విఘ్నముగా కొనసాగించు కొను సామర్థ్యము కల వాడు). 

కారాగారములో దేవకీ వసుదేవుల బాధకు కారకుడైనట్లు తోచును కాని అది సత్యము కాదు. అది కేవలం దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగం మాత్రమే.

శ్రీ రంగనాథుడు, గంగానదికి జనకుడు అయిన విష్ణువు సంగీత సాంప్రదాయము కలవాడు.

గోపికల మనోరథం తీర్చకుండా (శ్రీ రాముని కౌగిలించుకోవాలన్న మునుల కోరికను ఆయన మరు జన్మలో, వారు గోపికల అవతారము ఎత్తినప్పుడు తీరుస్తానని వాగ్దానం చేస్తాడు. శ్రీ కృష్ణావతారములో గోపికల ఆ కోరిక తీర్చవలసినది), తిరిగి అపహాస్యము చేసాడు. ఆ విధముగా శ్రీ కృష్ణుడు సమయానికి తగు మాటలాడి తన తలపులను సాధించు కొనెను. (అని త్యాగరాజుల వారు శ్రీకృష్ణుని నిందాస్తుతి చేశారు ఈ చరణంలో)

శ్రీకృష్ణుడు గోపికలను శృంగార పరమైన ఆశలతో అలసిపోవునట్లు చేసి, అలాగే, తాను యశోద తనయుడు కాదు అనే సత్యము తెలిసి కూడా యశోద తనను తల్లిలా భావించి ముద్దు పెట్టగా శ్రీ కృష్ణ పరమాత్మ యశోద అమాయకత్వమును చూచి నవ్వుచుండును.

శ్రీకృష్ణుడు తన భక్తులను వాత్సల్యముతో కాపాడుతున్నాడు. సుగుణముల సాగరమైన వాడు, జన్మ జన్మలకు పుణ్యమూర్తి, కలియుగములో మన బాధలను తీర్చేవాడు  అని మనమందరమూ మనసులో భావిస్తున్నప్పుడు, దానికి భిన్నముగా ఆయన మనలను కాపాడుట లేదు (అని త్యాగరాజు నిందాస్తుతి చేస్తున్నాడు).

ఓ శ్రీరామా! నీవు పాపలను హరించే వాడవు. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, వెలుగును ఇస్తూ చంద్రునిలా ప్రకాశించే వాడవు. రఘువంశమునకు నాయకుడవు. మృదు భాషివి. ఆదిశేషుని పై శయనింతువు. పరస్త్రీలను సోదరుని వలె కాపాడుడువు. పుట్టుక లేని వాడవు. వాహనమైన గరుత్మంతునిపై విహరిస్తూ ప్రకాశించేడవు. రారాజులచే పొగడబడిన వాడవు. అసమానమైన శరీర కాంతి కలవాడవు. కమలదలముల వంటి కనులు కలవాడవు అని అనేక విధముల నేను నిన్న వేడుకొనుచుండగా నీవు నన్ను రక్షించక సాధించుచున్నావు.

ఓ రామా! నీవు వేంకటేశ్వరుడవు. సుప్రకాశకుడవు. సర్వోన్నతుడవు. మంచివారి హృదయములలో నివసించే వాడవు. పీతాంబరమును ధరించిన వాడవు. మెరిసే కిరీటము, కర్నాభారమునులు కలిగి ప్రకాశించువాడవు. ఓ శ్రీహరీ! నిన్ను పైవిధముగా అనేక విధముల నిత్యము కీర్తించు చున్నాను. నీవు నా కీర్తన రూపుడవు. మానవులలో శ్రేష్ఠుడవు. ఇట్టి నా కీర్తనలు నీవు పెడచెవిన పెట్టి నన్ను సాధించుచున్నావు.

శ్రీరాముడు త్యాగరాజుని దగ్గరకు రాక, దూరముగా ఉండి, ఎన్నో బోధనలు చేసి, త్యాగరాజు యొక్క ప్రవర్తనను మెచ్చు కొనెను. సద్భక్తుడని మెచ్చు కొనెను. అలుగవద్దని చెప్పెను. నాస్తికులతో కూడవద్దని, శాంతము, ఇంద్రియ నిగ్రహము కలిగియుండమని, కష్టమును ఓర్చుకోమని శ్రీరాముడు స్వయముగా త్యాగరాజు తో మాట్లాడినట్లు భావము.


పరిశీలన: 

నిందాస్తుతి కావ్య, కృతి రచనలో ఒక శైలి. మానవునిలో సహజమైన ద్వంద్వ భావమునకు అక్షర రూపము ఈ నిందాస్తుతి. సాధనలో ధ్యేయ ప్రాప్తి ఆలస్యమవుతున్న కొలదీ ఆవేదన, అసహనము, ప్రశ్న మొలకెత్తటం  మానవ జన్మకు సహజం. అది కావ్య రూపములో ఒక పక్క ప్రశంస మరొక పక్క ప్రశ్నార్థకమైన నింద. ఈ ప్రక్రియను త్యాగరాజు వారు ఈ   కృతిలో ఉపయోగించారు.

ఆ శ్రీ కృష్ణుని పుట్టుకే ఒక నాటకం. కంసుని చంపటానికి దేవకికి ఏడు గర్భములు, ఆ బిడ్డల చంపబడుట ఏల? చెల్లెలి అష్టమ గర్భము తనను చంపుతాడనే భయముతో మొత్తము మధురా పట్టణములో ఆ వయసు పిల్లలను చంపించుట ఏల?  అసలు దేవకీ వసుదేవలంతటి మంచి వారికి కారాగార వాసమేల?  ఇన్ని జరిగిన తరువాత - నడి రేయి వసుదేవునిచే మోయబడి యమునను దాటి నందగోకులం చేరుట ఏల?. ఒక్క కంసుని చంపుట అనే దుష్ట శిక్షణకు ఇంత రంగము ఎందుకో? ఇవన్నీ మానవాళికి పాఠములే. భూమి, మానవాళి భరించలేని క్రౌర్యము, దౌష్ట్యము, రాక్షసత్వమును అంతమొందాలంటే దానికి అవతారము, సరైన పరిస్థితులు కావాలి. అవి ఆయన స్వయంగా కావలసినట్టుగా ఏర్పరచుకుంటాడు. దానికి ప్రతి అవతారము ఒక ఉదాహరణ.

ఒక పక్క ఆ శ్రీ కృష్ణుని, రాముని గుణ గణములను, మహిమలను వర్ణిస్తూనే  మరొక పక్క నేను ఎన్నో విధముల పొగడుతున్న నన్ను బ్రోవుట లేదు అని నిందిస్తున్నారు త్యాగరాజుల వారు.మాయ మానుష రూపుడైన శ్రీ కృష్ణుడి లీలను ఎన్ని? విశ్వాత్మ యైన శ్రీ హరి బాలుడిలా యశోదను మురిపిస్తూ, అల్లరి పనులు చేస్తూ, తల్లిచే దండను పొంది, మరల వెంటనే లాలన పొంది, మరల అంతలోనే నోట విశ్వమును చూపించి ఆ యశోద జన్మను ధన్యము చేసినాడు. అట్టి లీలను చూస్తే ఆయన అంతరార్థము తెలుసుకొనుట ఎంతో కష్టం. పాలు తాగుతున్నట్టు నటిస్తూ పూతనను సంహరించటం, తల్లి తన అల్లరిని భరించలేక రోకటికి కట్టి వేస్తే, రోకటితో సహా పాకుతూ వెళ్లి సాల వృక్షములను కూల్చి నలకూబరుల శాపము తీర్చాడు.

అలాగే, గోపికలు, గోపబాలకులు, గోప స్త్రీలతో రాసలీలలు, వస్త్రాపహరణము, కాళీయ మర్దనం, గోవర్ధనోద్ధరణ, ద్రౌపదీ మాన రక్షణ - ఇలా, ఎన్ని లీలలో? చేసే పని ఒకటి వాటి వెనక కార్యం, అంతరార్థము ఇంకొకటి. అందుకనే ఆయనను లీలా వినోదుడు అయ్యాడు. ఈ లీలను తెలియాలంటే ఆ పరమాత్మను తెలుసుకోవాల్సిందే. భాగవత, మహాభారతాల్లో ఆ శ్రీకృష్ణుని అంతరార్థము మనకు పూర్తిగా చెప్పబడింది. ఇన్ని జరిగిన తరువాత కూడా, అర్జునుడు తన కర్తవ్యమును మరచి యుద్ధభూమి నుండి వెను దిరిగే సమయములో, ఆయన పూర్తి కర్తవ్య బోధ, జనన మరణ రహస్యము, యోగము, సిద్ధి గురు రూపములో 'గీత'గా తెలిపి, విశ్వరూపమును చూపిస్తాడు.  అందుకే కృష్ణ తత్త్వము తెలుసుకుంటే మోక్షము ముంగిట ఉన్నట్లే అని పెద్దలు చెప్పారు.

ఈ భావనను నిందాస్తుతి రూపంలో అందంగా కృతి రూపం చేశారు త్యాగయ్య. కీర్తన చివరలో, మళ్లీ ఆ శ్రీరాముడే తనకు మార్గము చూపినట్లుగా, తనను ఉద్ధరించినట్లుగా ముగిస్తారు త్యాగయ్య.  ఒకరకంగా ఈ కీర్తన పూర్తి మాయా మానుష తత్త్వమును వివరిస్తుంది. ఆ మహానుభావునికి మరోసారి నీరాజనాలు.  ఈ కీర్తనను మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి.

(తెలుగు తెలియని చాలా మంది కళాకారులు 'సమయానికి తగువు మాటలాడెనే' అని ఆలపిస్తారు. అది అర్థాన్ని పూర్తిగా మార్చేసి విపరీతార్థం తెస్తుంది. కాబట్టి, తెలుగు భాష నేర్చుకుని,  'సమయానికి తగు మాటలాడెనే' అని పాడవలసినదిగా విజ్ఞప్తి).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి