21, జనవరి 2011, శుక్రవారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన -జగదానంద కారక

వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః 
వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం 
బ్రహ్మా నారద వచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః
యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే 

సద్గురువు త్యాగరాజ స్వామి వారు వేదములను విప్పి చెప్పుట యందు వ్యాసుని వంటివారు, మధురమైన వాక్యములు రాయుటలో వాల్మీకి కవి వంటి వారు, వైరాగ్యములో శుకుని వంటి వారు, భక్తిలో ప్రహ్లాదుని వంటి వారు, సాహిత్యములో బ్రహ్మ వంటి వారు, సంగీతములో నారదుని వంటి వారు, రామ నామమనే అమృతమును గ్రోలుటలో పరమశివునికి సమానులు. అటువంటి సద్గురువులను భజిస్తున్నాను - అని ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు పై శ్లోక రూపంలో నుతించారు.


మహా వాగ్గేయకారుడు, అపర నారదుడు, అనుపమ రామభక్తుడు అయిన త్యాగరాజస్వామి వారు ఆ రామునిలో ఐక్యమైన రోజు పుష్య బహుళ పంచమి. ప్రతి సంవత్సరం దీన్ని పురస్కరించుకొని ఆయన జన్మ స్థలమైన తిరువాయూర్ తో పాటు ప్రపంచమంతా ఐదు రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుపుతారు. ఆయా ఊళ్లలో కళాకారులు ఆ మహానుభావుని సంకీర్తనలను గానం చేసి ఆయనకు నివాళులు అర్పిస్తారు. అందులో భాగంగా ఈ పుష్య బహుళ పంచమి నాడు ఆయన రచించిన ఘన రాగ పంచరత్న కృతులు బృంద గానం చేస్తారు.

ఈ ఘన రాగ పంచరత్న కీర్తనలలో మొదటిది జగదానంద కారక. ఇది నాట రాగం, ఆది తాళంలో  స్వర పరచబడినది. రాగ లక్షణాలను పక్కకు పెట్టి ఇందులోని సాహిత్యపు విలువలను, వర్ణనను పరిశీలిద్దాము. మొదట సాహిత్యము, అటు పిమ్మట అర్థము, చివర పరిశీలన.

సాహిత్యము:

జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయక

గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల |జగదానంద|

అమర తారక నిచయ కుముదహిత, పరిపూర్ణ అనఘ సుర, సురభూజ
దధి పయోధి వాస, హరణ, సుందరతర వదన సుధామయ వచో
బృంద, గోవింద సానంద, మావర, అజర, ఆప్త, శుభకరా అనేక |జగదానంద|

నిగమ నీరజా అమృతజ పోషకా అనిమిష వైరి వారిద, సమీరణ,
ఖగతురంగ, సత్కవి హృదాలయ అగణిత వానరాధిప నతాంఘ్రి యుగ |జగదానంద|

ఇంద్ర నీలమణి సన్నిభాఽపఘన చంద్రసూర్య నయన అప్రమేయ వా-
గీంద్ర జనక, సకలేశ సుభ్ర నాగేంద్ర శయన, శమన వైరి సన్నుత |జగదానంద|

కరధృత శరజాల, అసుర మదాపహరణ, అవనీసుర సురావన,
కవీన బిలజమౌని కృత చరిత్ర, సన్నుత శ్రీ త్యాగరాజనుత |జగదానంద|

సృష్టి స్థిత్యంతకారక, అమితకామిత ఫలద, అసమాన గాత్ర,
శచీపతి నుతా, అబ్ధి మదహర, అనురాగ రాగరాజిత కథాసార, హిత |జగదానంద|

పాద విజిత మౌనిశాప సవపరిపాల వరమంత్ర గ్రహణ లోల
పరమశాంత చిత్త జనకజ, అధిప సరోజభవ వరద, అఖిల |జగదానంద|

పురాణ పురుష, నృవరాత్మజాశ్రిత పరాధీన ఖర విరాధరావణ
విరావణ అనఘ పరాశర మనోహర అవికృత త్యాగరాజ సన్నుత |జగదానంద|

సజ్జన మానసాబ్ధి సుధాకర, కుసుమ విమాన, సురసారిపు కరాబ్జ
లాలిత చరణా అవగుణ అసురగణ మదహరణ సనాతన, అజనుత |జగదానంద|

ఓంకార పంజరకీర, పురహర, సరోజభవ, కేశవ, ఆదిరూప
వాసవరిపు జనకాంతక, కలాధర, కలాధరాప్త, ఘృణాకర,
శరణాగత జనపాలన, సుమనో రమణ, నిర్వికార నిగమ సారతర |జగదానంద|

అగణితగుణ, కనకచేల, సాల విదళన, అరుణాభ, అసమాన చరణ,
అపార మహిమ, అద్భుత సుకవిజన హృత్సదన, సుర మునిగణ విహిత,
కలశ నీరనిధిజ, రమణ పాపగజ, నృసింహ వర త్యాగరాజాధినుత |జగదానంద|


అర్థము:

(ఇక్కడ త్యాగరాజ సన్నుత/నుత అన్నప్పుడల్లా త్యాగయ్యగా  కన్నా శివునిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది)

జగము యొక్క ఆనందమునకు కారకుడా! సీతాపతీ! శ్రీరామా! నీకు జయము.

నింగికి రాజైన సూర్యుని వంశములో జన్మించిన ఓ శ్రీ రామా! రాజులకు రారాజువు నీవు.  సుగుణములకు రూపము నీవు, దేవతలచే సేవించబడిన వాడవు, ఎల్లప్పుడూ సకల ఆనందములను, శుభములను కలిగించే వాడవు.

ఓ శ్రీ రామా! నీవు దేవతలనే నక్షత్ర సమూహానికి చంద్రుని వంటి వాడవు, పరిపూర్ణుడవు. పాపములు లేని వాడవు. పుణ్య రూపుడవు, దేవతలకు కల్పతరువు వంటి వాడవు. పాలు, పెరుగుల మధ్య పెరిగిన వాడవు, వాటిని దొంగిలించిన బాల కృష్ణుడవు. అందమైన ముఖము కలవాడవు, అమృతము వంటి మాటలు పలికెడి వాడవు. ఆవులను రక్షించేవాడవు, గోపాలుడవు, లక్ష్మీ పతివి, నిత్య యౌవ్వనుడవు, దేవతలకు, సమస్త జీవ కోటికి ఆప్తుడవు,  శుభకరుడవు. అనేక విధముల జగదానంద కారకుడవు.

ఓ శ్రీరామ! నీవు వేదములను పద్మముల నుండి జన్మించిన అమృతమును (శ్రుతులు, ఉపనిషత్తులు, పురాణములు) పోషించు చున్నావు. దేవతలకు శత్రువులను మేఘాలను చెల్లాచెదరు చేసే గాలి వలె   వారించుచున్నావు. గరుత్మంతుని వాహనముగా కలవాడవు. గొప్ప కవుల హృదయములలో నివసించేవాడవు. వానర వీరులైన సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు మొదలగు వారిచే పూజించబడిన పాదములు కలిగిన వాడవు.  నీవు జగదానంద కారకుడవు.

ఓ శ్రీ రామా! ఇంద్రుని నీలమణి వంటి శరీర ప్రకాశముతో వెలుగుతున్నావు. సూర్యచంద్రులు నీ రెండు కన్నులుగా కలవాడవు.  సాటిలేని దైవము నీవు. వేదములను సృష్టించిన బ్రహ్మకు  తండ్రివి. సర్వేశ్వరుడవు. కల్మషము లేని వాడవు. ఆదిశేషుని పై శయనించిన వాడవు.కాలుడైన యమునికి కాలుడైన శివునిచే పూజించబడిన వాడవు. నీవు జగదానంద కారకుడవు.

ఓ రామా! నీవు భుజములపై బాణములు ధరించి  రాక్షసుల గర్వమును పోగొట్టుదువు. బ్రాహ్మణులను, దేవతలను రక్షించెదవు. కవికోకిలయైన వాల్మీకి రచించిన రామాయణమున నాయకునిగా ప్రకాశించి పొగడబడిన వాడవు. శుభకరుడైన శివునిచే (త్యాగరాజుచే) పొగడబడి పూజించ బడినవాడవు. నీవు జగదానంద కారకుడవు.

సృష్టి, జీవనము, అంతము నీవే సమర్థవంతముగా చేసెదవు. అశేషమైన కోరికలను తీర్చేదావు. అనుపమానమైన దేహకాంతి కలవాడవు. ఇంద్రునిచే పొగడబడిన వాడవు. సముద్రుని గర్వము అణచిన వాడవు. ప్రేమ, మధురమైన పదములు, అనురాగము మొదలైన వాటితో ప్రకాశించే రామాయణమునకు సారము నీవే. సమస్త లోకములకు హితుడవు నీవు. నీవు జగదానంద కారకుడవు.

ఓ శ్రీరామా! నీ పాద స్పర్శచే పతియగు గౌతమ మునిచే శాపము పొందిన అహల్యకు శాప విమోచనము కలిగించి బ్రోచితివి. విశ్వామిత్రుని యాగ రక్షణ సమయమున వారిచే మహామంత్ర రూపమున బల, అతి బల విద్యలను, అనేక అస్త్ర శాస్త్రములను స్వీకరించి విజయమును పొందితివి. నిరంతరము శాంత చిత్తుడవై యుందువు. నీవు సీతాపతివి. బ్రహ్మదేవునకు వరములు ప్రసాదిన్చితివి. నీవు సమస్త జగములకు ఆనందమును ఇచ్చుచున్నావు. నీవు జగదానంద కారకుడవు.

 ఓ రామా! నీవు పురాణ పురుషుడవు. నరపతి అయిన దశరథుని కుమారుడవు. నిన్ను శరణు కోరిన భక్తుల ఆధీనములో ఉందువు. ఖరుడు, విరాధుడు, రావణుడు మొదలగు రాక్షసులను సంహరించిన వాడవు, పాపములు లేని వాడవు, పరాశరుని మనస్సు దోచిన వాడవు. సుందరమైన రూపము కలవాడవు. పరమశివునిచే (త్యాగరాజుచే) నుతించ బడిన వాడవు. నీవు జగదానంద కారకుడవు.

ఓ శ్రీ రామా!  నీవు మంచి వారి మనసు అనే సముద్రమునకు చంద్రుని వంటి వాడవు. పుష్పక విమానము పొందిన వాడవు. సురస అనే రాక్షసిని జయించిన హనుమంతుని చేత లాలించబడు చరణయుగములు కలవాడవు. దుర్గుణములు కలిగిన రాక్షస సమూహముల గర్వమును అణచిన వాడవు. శాశ్వతుడవు. బ్రహ్మచే నుతించ బడిన వాడవు.

ఓ రామా! నీవు ప్రణవ నాద (ఓంకార) స్వరూపుడవు. నీవు జగత్తు అనే పంజరములో చిలుకగా పరమాత్మవై ఉన్నావు. త్రిమూర్తుల రూపము నీవు.త్రిమూర్త్యాత్మకుడవు. ఇంద్రుని శత్రువగు ఇంద్రజిత్తు తండ్రియైన రావణుని జయించిన వాడవు. కళారూపుడవు. చంద్రుని తలపై ధరించిన శివుని స్నేహితుడవు. దయాకరుడవు. శరణాగతులను రక్షించిన వాడవు. దేవతలకు అధిపతివి. వికృతిలేని వాడవు. వేదముల సారమును మించిన సారము కలవాడవు. నీవు జగదానంద కారకుడవు.

శ్రీరామా! నీవు ఎన్నో మంచి గుణములు కలవాడవు. బంగారు వస్త్రములు (పీతాంబరము) ధరించిన వాడవు. కృష్ణుని అవతారములో సాల వృక్షములను చేదించిన వాడవు. ఎర్రటి రంగు గల పాదములు కలవాడవు. గొప్ప మహిమ కలిగిన వాడవు. అద్భుతమైన మంచి కవుల హృదయ కమలములందు నివసించే వాడవు. దేవతలకు మునులకు హితము చేసే వాడవు. పాల సముద్రములో లక్ష్మీ రమణుడవు. పాపము అను ఏనుగును వధించిన నర శార్దూలము నీవు. మహానుభావుడైన శంకరునిచే (త్యాగరాజుచే) నుతించబడిన వాడవు.  నీవు జగదానంద కారకుడవు.

పరిశీలన: 

ఈ కీర్తనలో త్యాగరాజ స్వామి రాముని అనంతమైన గుణగణములను ప్రాకృత భాషలో వర్ణించారు. సంస్కృతం ఈ కీర్తనను మనోజ్ఞం చేసింది. విశేషమైన పదప్రయోగము, లోతైన భావ వ్యక్తీకరణ ఈ కీర్తన ప్రత్యేకత.

ఈ కీర్తన ద్వారా త్యాగయ్య ఆధ్యాత్మిక సంపదగా రాముని పర తత్త్వాన్ని, వేద సార రూపమును, వేదములలో నుతించబడుటను, ఏకాక్షర బ్రహ్మ స్వరూపమును, సచ్చిదానంద కారకమును, నిష్కల్మషమును, భక్తజన పరిపాలనను, శాంత చిత్తమును, త్రిమూర్త్యాత్మక రూపమును, సృష్టిస్థితిలయ కారకమును, నిత్య యౌవన, సనాతన తత్త్వమును ముందుంచారు .

ఈ కీర్తనలో త్యాగయ్య రాముని గుణగణ, మహిమల వర్ణనకు ఆయన శాంతమూర్తిని, సౌశీల్యమును, భక్తజన లోలతను, ఆనంద కారకమును, ఆ శ్రీహరి అవతారములైన కృష్ణుని లీలలో వెన్న దొంగతనాన్ని, గోపాలనమును, గోరక్షణను, ఉదాత్త హృదయతను, వానరముఖ్యులచే, శివునిచే, బ్రహ్మచే, వాల్మీకిచే,ఇంద్రునిచే నుతించ బడుటను, అహల్యా శాపవిమోచనమును మనోహరముగా మన ముందుంచారు. ఇక రూప వర్ణనకు వస్తే - ఆయన అసాధారణ లావణ్యము, అందమైన ముఖము, అమృత తుల్యమైన, తీయని మాటలు, నిత్య యౌవనము,  మృదు భాషణను, విశేష శరీర కాంతిని గొప్పగా చెప్పారు త్యాగయ్య.

రాముడు ఎంత శాంతుడో, ధర్మ రక్షణకు అంతే అరివీర భయంకరుడు అని చెప్పటానికి త్యాగయ్య ఈ కీర్తనలో కాల మేఘముల పాలిటి మారుతముగా, సూర్యచంద్ర నేత్రునిగా, బలాతిబాల విద్యలతో విశ్వామిత్రుని యాగ రక్షకునిగా, అఖండ శరసంపదతో రాక్షస సమూహాన్ని నాశనం చేసిన వాడిగా, లంక చేరుటకై సముద్రం దాటు సమయమున సముద్రుని గర్వము అణచుట, ఖర దూషణుల, రావణుని చంపిన శౌర్యము, సాల వృక్షముల చేదించిన ఏకాగ్రత, బలము, పాపమనే మహా ఏనుగును సంహరించే ఏకైక సాధమనే సింహముగా వర్ణించారు.

మొత్తం మీద - గుణములను, మహిమలను,పర తత్త్వమును అద్భుతముగా, సంపూర్ణముగా ప్రస్తుతించారు త్యాగయ్య. అందుకే ఇది ఘన రాగా పంచ కీర్తనగా పేరొందింది. సుస్వరలక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గళంలో ఈ కృతి వినండి. ఆ మహానుభావునికి ఆరాధనోత్సవాల సందర్భంగా  మహా నివాళి. సద్గురు త్యాగరాజ భక్తి సాహిత్యా సంగీత పరంపర అనంత గంగా ప్రవాహంలా ఎల్లప్పుడూ కొనసాగేల మనందరమూ ప్రయత్నిద్దాము.

4 కామెంట్‌లు:

  1. Great Post. The first sloka of Sri Valajhipeta Venkata ramanayya bhagavatar... Shared it on Buzz..

    Thanks for a great post on the occasion of Tyagaraja Aradhana....

    Carry on with good work!

    రిప్లయితొలగించండి
  2. ప్రసాద్ గారు - మీ అభిమానానికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. అద్భుతంగా ఉంది, కాని ఒక చిన్న మనవి
    చరణం కింద తాత్పర్యం పెడితే నాలాగ సాహిత్యం తెలియని వాళ్ళకి సులువుగా ఉంటుంది అన్నయ్య

    రిప్లయితొలగించండి