రాముని పట్ల అనుపమానమైన భక్తి, అచంచలమైన విశ్వాసము కలిగిన వారు త్యాగరాజ స్వామి. రామతారక మంత్రాన్ని గురువుల వద్దనుండి పొంది, దానిని సాధన చేసి మంత్ర సిద్ధి పొందిన తరువాత రాముని గుణవైభవములను వర్ణిస్తూ వేల కీర్తనలను రచించారు. పరిపూర్ణమైన యోగులు ఆయన. పోతన గారి లాగానే రాజాశ్రయాన్ని తిరస్కరించి రామచరణాలే శరణు అన్న మార్గాన్ని ఎన్నుకొని తరించారు. తద్వారా వచ్చిన దారిద్య్రం వారిని ఏ మాత్రం చలింపజేయలేదు. ఉంఛవృత్తి, అందులోనూ భుక్తి దొరకక పోతే తులసిదళములు, నీళ్లు ఇదీ ఆయన జీవితం. మరి రామభక్తి సామ్రాజ్యంలో ఊరికే ఉన్నతమైన స్థానం లభిస్తుందా? ప్రేయమైనవన్నీ వదులుకొని శ్రేయమైన రాముని నామాన్నే ఆశ్రయించిన ఆయన ఈ భువిని వదిలి ఎంతో కాలం కాలేదు. కేవలం 169 ఏళ్లు మాత్రమే.
ఆయన ద్వైత భావమునుండి అద్వైతానికి ఏ విధంగా సోపానం చేశారో ఆయన కీర్తనలలోనే అర్థమవుతుంది. భక్తిలో రూపలక్షణాల వర్ణన ఒక ఎత్తైతే, ఆ దివ్యత్వంతో రమించటం, దానికి మార్గాలను చెప్పగలగటం మరింత ఉన్నతమైన మెట్టు. దీనికి ఒక మచ్చుతునక బంటురీతి కొలువీయవయ్య రామా అనే కృతి. ఉత్తముడైన ఆ హనుమంతునివలె రామభక్తి సామ్రాజ్యంలో తనకు కూడా కొలువు ఈయవయ్యా ఎంత ఆర్తితో వేడుకున్నాడు? రాముని నామము జపిస్తుంటే హనుమంతునికి రోమాంచమట. రోమాలు నిక్కబొడుచుకొని, ఆనందబాషాపాలు రాలాయట. ఆ రోమాంచమే ఆయనకు గొప్ప రక్షణ కవచం, హనుమంతుడికి చిరునామ ఏమిటి? రామభక్తి. రామనామమే అన్నిటికి కన్నా పెద్ద ఆయుధమట. ఇవన్నీ ఇచ్చింది ఆ రాముడే కదా? ఇలా ఒకటా రెండా? వేల కృతులు ఆ రమునిపై, రామభక్తిపై...
హనుమంతుని బలము ఏమిటి? కేవలం రామభక్తి, ఆ ప్రభువుకు పూర్తి దాస్యము. ఆ నిరంతర రామ నామ కీర్తనా బలంతో హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, లంకను గెలిచాడు, సంజీవనిని తెచ్చాడు. అంతటి మహత్తు గల రామ భక్తి, అటువంటి దాస్యము తనకు అనుగ్రహించ వలసిందిగా త్యాగయ్య ఆ రాముని వేడుకునే కీర్తన బంటు రీతి. ఈ కీర్తన సాహిత్యము, అర్థము, పరిశీలన.
సాహిత్యము:
బంటు రీతి కొలువీయవయ్య రామా ||బంటు||
తుంట వింటివాని మొదలైన మదా
దుల బట్టి నేల కూలజేయు నిజ ||బంటు||
రోమాంచమనే ఘన కంచుకము
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు
రామనామమనే వరఖడ్గమీవి
రాజిల్లునయ్య త్యాగరజునికే ||బంటు||
ఓ రామా! నీ కొలువులో నీ బంటుగా సేవించుకునే భాగ్యము కలిగించు స్వామీ!
మన్మథుడి ప్రభావము వలన కలిగే కామము, మరియు - లోభ, మోహ, మద, మాత్సర్యములనే నా శత్రువులను బట్టి నేల కూల్చు నిజమైన భక్తి వలన కలిగే శక్తిని నాకు ప్రసాదించు నీ బంటుగా నన్ను అనుగ్రహించుము.
నీపై కల భక్తితో కలిగే రోమాంచము (రోమములు నిక్కబొడుచుట) గొప్ప కవచమై, 'రామ భక్తుడు' అనే ముద్ర బిళ్ళ (చిహ్నము/చిరునామా) ధరించి, రామనామము అనే వరము ఖడ్గముగా ధరించి నీ రామభక్తి సామ్రాజ్యమునందు రాజిల్లుదును. నాకు (త్యాగరాజునకు) అంటి బంటు వంటి కొలువు ఈయుము రామా!
పరిశీలన:
సంపదలను, లౌకిక సుఖాలను వదులుకుని పరదైవాన్ని పరమావధిగా సాధన చేయటానికి త్యాగరాజు భక్తి, కీర్తన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ మార్గమేమి పూల బాట కాదు. విషయ వాంఛలను వదులుకొనుట మానవ జీవితానికి ఆధ్యాత్మిక మార్గములో అతి కష్టమైన పరీక్ష. తన విద్యకు మహారాజులు గుర్తింపు, సన్మానాలు, సత్కారాలు మొదలైనవి ఇంటికి వచ్చినా కూడా వాటిని తిరస్కరించి, పూట గడవటానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కూడా ఆయన రాముని పాదములను విడువలేదు. ఈ మనుజుల కాళ్ళ పట్టుకోలేదు, తన నైతిక విలువలకు పూర్తిగా కట్టుబడి ఆదర్శ ప్రాయుడైనాడు. అందుకే ఆయన కీర్తనలలో అంత భక్తి, అసామాన్య వర్ణన, సంపూర్ణ నిజ దాస్యము, శరణాగతి కనిపిస్తాయి. ఎందరు వాగ్గేయ కారులు వచ్చిన, త్యాగయ్య భక్తి, వినమ్రత, దాస్య చిత్తము ముందు దిగదుడుపే.
అటువంటి బంటు లాంటి కొలువు తనకు ఆ శాశ్వత రామ భక్తి సామ్రాజ్యములో ఇవ్వమని ఆ త్యాగబ్రహ్మం హంసనాద రాగంలో కృతి చేశారు. ఎంతోప్రాచుర్యం పొందిన ఈ కీర్తన రామభక్తిని చిహ్నముగా, రామనామమును ఒక మహత్కరమైన ఖడ్గముగా, ఆ భక్తిలో మునుగుట కలిగిన రోమాంచమును ఒక గొప్ప కవచముగా వర్ణిస్తారు. అరిషడ్వర్గములు అనే శత్రువులను నాశనము చేయుటకు రామభక్తి సామ్రాజ్యానికి దాస్యమే ఏకైక సాధనము అని మనకు సందేశాన్ని ఇచ్చారు త్యాగయ్య.
ఈ త్యాగరాజ స్వామి కీర్తన (ఆలాపన కూడా ఉంది) డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి (సహకార గాత్రం ఆయన ప్రియ శిష్యులు శ్రీ డి.వి. మోహన కృష్ణ గారు).కొంత తెలుగు ఉచ్చారణలో లోపమున్నా, మహారాజపురం సంతానం గారు రాగాన్ని శ్రావ్యంగా ఆలాపించారు.
బంటు రీతి కొలువు కావాలి అని వేడుకున్న ఆ త్యాగ రాజుల వావి మీద చక్కటి వ్యాసం. రాజాశ్రయం త్యజించి, అత్యంత సామాన్య జీవనాన్ని ఎంచుకుని, అనేక శిష్యప్రశిష్యుల ద్వారా తమ సంగీతాన్ని, కృతులను అజరామరం చేసుకున్న త్యాగయ్య గారి మీద మంచి పరిశీలనా వ్యాసం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు వదినా
రిప్లయితొలగించండితప్పని సరిగా అందరూ చదివి ఆనందించె విధంగా రాసారు
రిప్లయితొలగించండి