19, డిసెంబర్ 2010, ఆదివారం

మాతృమూర్తి - కనిపెంచే తల్లికి పిల్ల భారమా

కుపుత్రో జాయేతా క్వచిదపి కుమాతా నభవిష్యతి. చెడ్డ పుత్రుడు ఉండవచ్చేమో కానీ, చెడ్డ అమ్మ ఉండదు. ఇది అర్యోక్తి. ఎంత నిగూఢమైన అర్థముందో ఇందులో?. ప్రపంచంలో వెలకట్టలేని సంపద తల్లి ప్రేమ. ప్రత్యక్షదైవమైన ఈ మాతృమూర్తి రుణం తీర్చుకునేది కాదు. గర్భము దాల్చినంత మొదలు తాను తనువు చాలించే వరకు, పిల్లల శ్రేయస్సు, భవిష్యత్తు కోసం అహరహం మానసిక, శారీరిక పోరాటం చేసే దేవత అమ్మ. తన ప్రతి కదలికలో, ఉచ్ఛ్వాశ, నిశ్శ్వాసలలో, ప్రతి అడుగు, కర్మలో తన సంతానం రక్ష కోరుకునే కన్నతల్లి అందుకనే విశ్వవంద్యమైనది. అందుకనే, మన ధర్మ శాస్త్రాలు మాతృదేవోభవ అని ఆది పలికారు. 

ఎన్ని పాత్రలు ఆ తల్లికి? - తన మానసిక శక్తితో ఒక పిండానికి ఈ లోకంలో ప్రవేశం కలిపించే లోకపావని మన అమ్మ. తన రక్తం పంచి ఇచ్చి, తన శక్తినంతా పాలుగా అమృతం పంచి, బిడ్డను అణువణువు ప్రేమతో నింపి, ప్రపంచానికి పరిచయం చేసే కరుణామూర్తి అమ్మ. పారాడే బిడ్డకు లాలి పాడే ప్రేమరాశి అమ్మ. ఆడి, పాడే బిడ్డకు సంస్కారము, మొదటి విద్య నేర్పే సరస్వతి అమ్మ. ఆకలిగొన్న బాలునికి అన్నపూర్ణయైనది అమ్మ. జీవితంలో సన్మార్గము చూపే ఆదిగురువు అమ్మ. యుక్తవయస్సులో రక్షణ కలిపించే సైనికురాలు అమ్మ. పూర్ణ వ్యక్తిత్వం ఏర్పడే యవ్వనంలో ప్రాణ స్నేహితురాలు అమ్మ. నడివయస్సులో బాధ్యతను గుర్తు చేసే దయామయి అమ్మ. కాలాతీతమైన ఈ మాతృప్రేమ అజరామరం, అనుపమానం, అవ్యక్తం, వర్ణనాతీతం. ఎంచలేని పాత్రలు పోషించే అమ్మకు మనం చేయగలిగింది ఒక్కటే: మనః పూర్వక పాదాభివందనం, మానసిక పూజ.

ఈ నేపథ్యంతో ఒక మంచి సందేశమున్న పాట రావు బాల సరస్వతి గారి గొంతులో మంచి మనసుకు మంచి రోజులు చిత్రంలోనిది మీకోసం.  తల్లి యొక్క విశిష్టను, ప్రాముఖ్యతను సరళమైన తెలుగు భాషలో అందించారు సముద్రాల రాఘవాచార్య గారు. తల్లి అనే దీవెనలో ఆ భగవంతుడు స్త్రీకి ఎటువంటి బాధ్యతను, మాధుర్యాన్ని ఇచ్చాడో ఈ పాట చెపుతుంది. తల్లిని ఈ భూదేవితో, చెట్టుతో పొలిచి మాతృమూర్తి గొప్పతనాన్ని ప్రకృతితో సమం చేస్తుంది ఈ పాట.ఎంత ధైర్యము, స్థైర్యము, ఓర్పు ఉంటే పిల్లలను పెంచగలదో ఆ తల్లి అని ఈ గీతం నుతిస్తుంది. పుట్టిన్చటంతో ఆ తల్లి బాధ్యత తీరదు, ప్రేమతో పెంచకపోతే నిజమైన తల్లి కానట్టే అని చిత్రంలో సందర్భోచితంగా సందేశాన్ని ఇస్తుంది ఈ అమ్మ పాట. 

తల్లి ప్రేమ, బాధ్యత

అలనాటి మేటి గాయని బాలసరస్వతి గారు ఎంతో గొప్పగా, భావము, ఆర్తితో పాడారు ఈ పాట.  1958 లో  విడుదలైన ఈ చిత్రానికి ఘంటసాల వారు సంగీతం అందించారు. ఎన్టీఆర్, రాజసులోచన నాయక నాయికలు.

ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా 
తరువుకు కాయ భారమా కనిపెంచే తల్లికి పిల్ల భారమా కనిపెంచే తల్లికి పిల్ల భారమా |ధరణికి|


మును నే నోచిన నా నోము పండగా 
నా వడిలో వెలిగే నా చిన్ని నాయనా 
పూయని తీవేననే అపవాదు రానీకా
తల్లిననే దీవెనతో తనియించినావయ్య |తరువుకు|


ఆపద వేళల అమ్మ మనసు చెదరునా 
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్త్రీ విధి
ప్రియముగా ఆ పాపలను పెంచనిదొక  తల్లియా  |తరువుకు|

15, డిసెంబర్ 2010, బుధవారం

నారాయణ సూక్తం - తాత్పర్యము

తైత్తిరీయ అరణ్యకంలో చెప్ప బడిన నారాయణ సూక్తంలో ఈ స్థూల శరీరంలో ఆ పరమాత్ముని చిరునామా, ఆయన ధ్యానించే పధ్ధతి విస్పష్టంగా చెప్పబడింది. నారాయణ సూక్తం పురుష సూక్తానికి ఉత్తర పీఠిక లాంటింది. పురుష సూక్తంలోని విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపాన్ని నారాయణ సూక్తం నారాయణుని రూపంలో విశదీకరిస్తుంది. ఆ విశ్వమంతటా ఉన్నవాడిని అణురూపంలో విశ్లేషించి చెపుతుంది. వైదిక విధులలో పురుష సూక్తము, నారాయణ సూక్తము, మంత్ర పుష్పము కలిపి చదవటం ఆనవాయితీ.

ధ్యానము చేయటానికి ముందు ఈ సూక్తాన్ని పారాయణ చేసి దీని భావాన్ని చింతన చేస్తూ ఉండటం ప్రగాఢ ధ్యానానికి దోహదం చేస్తుందిట. ఇందులో మొదట భగవంతుని మహిమ తెలుప బడినది. పిదప ఆయనను ఎక్కడ, ఎలా ధ్యానిన్చాలో, క్రమంగా ధ్యానంలో మనస్సును ఎలా లగ్నం చేయాలో అన్న విషయం ఈ సూక్తంలో అద్భుత రీతిలో వివరించబడింది. 

నారాయణ సూక్తం, తాత్పర్యము, శ్రవణం
 
విశ్వం నారాయణం దేవం

అథ శ్రీ నారాయణ సూక్తం
ఓం | సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం |
విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం ||

విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిం |
విశ్వ మేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి ||

పతిం విశ్వస్య ఆత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతం |
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ||

నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః |
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః |
నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః ||

యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా |
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ||

అనంతమవ్యయం కవిగ్ం సముద్రేఽన్తం విశ్వ శంభువం |
పద్మ కోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖం ||

అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యా ముపరి తిష్ఠతి |
జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాఽయతనం మహత్ ||

సంతతగ్ం శిలాభిస్తు లంబత్యా కోశసన్నిభం |
తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం ||

తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః |
సోఽగ్రభుగ్విభజన్ తిష్ఠన్నాహార మజరః కవిః ||

తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయ స్తస్య సంతతా |
సంతాపయతి స్వం దేహమాపాదతల మస్తకః |
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితాః ||

నీలతో యదమధ్యస్థ ద్విద్యుల్లేఖేవ భాస్వరా |
నీవారశూకవత్తన్వీ పీతాభా స్వత్యణూపమా ||

తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |
స బ్రహ్మ స శివః స హరిః స్సేన్ద్ర స్సోఽక్షరః పరమ స్స్వరాట్ ||

ఓం తద్బ్రహ్మ | ఓం తద్వాయుః | ఓం తదాత్మా | ఓం తత్సత్యం | ఓం తత్సర్వం | ఓం తత్పురోర్నమః |

అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు |
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగ్ం
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః |

త్వం తదాప ఆపో జ్యోతి రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి |
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ||

తాత్పర్యము:

వేలాది తలలు కలవాడు, ప్రకాశిస్తున్న వాడు, సమస్తాన్ని చూస్తున్న వాడు, యావత్ప్రపంచానికీ మంగళకారుడు, నాశనము లేని వాడు, అత్యున్నత స్థితి అయిన వాడు అయిన నారాయణుడనే దైవాన్ని ధ్యానిస్తాను.

ఈ విశ్వాని కన్నా ఉన్నతుడు, నిత్యుడు, ఈ విశ్వమై ఉంటున్న వాడు, భక్తుల కష్టాలను బాపు వాడు అయిన నారాయణుని ధ్యానిస్తాను.

విశ్వానికి నాథుడు, జీవులకు ఈశ్వరుడు, శాశ్వతుడు, మంగళ రూపుడు, వినాశము లేని వాడు, విశిష్టముగా తెలుసుకోవలసిన వాడు, సమస్తానికి ఆత్మయైన వాడు, శరణు పొందదగిన ఉత్క్రుష్టుడు అయిన నారాయణుని ధ్యానిస్తున్నాను.

నారాయణుడే పరంజ్యోతి, నారాయణుడే పరమాత్మ, నారాయణుడే పరబ్రహ్మం, నారాయణుడే పరతత్త్వము, ధ్యానించే వారిలో శ్రేష్ఠుడు నారాయణుడే. నారాయణుడే ఉత్ర్క్రుష్టమైన ధ్యానం.

ఈ ప్రపంచం అంతటా కనిపిస్తూ ఉన్నది ఏదైనా, వినిపిస్తూ ఉన్నది ఏదైనా, వాటన్నిట లోపల వెలుపల పరివ్యాపించి నారాయణుడే నెలకొని ఉన్నాడు.

(ఇది ధ్యానం తదుపరి మెట్టు. మొదట మనస్సు సర్వవ్యాపియైన భగవంతుని స్మరించడంలో నిమగ్నం అయింది. ఇప్పుడు దాని పరిధి సంకోచింప బడింది. వ్యాపితమైన మనస్సు మనలో ఒకటిగా కలిసిపోయింది. ధ్యానం తుది మెట్టు మనస్సు హృదయ సీమలో కేంద్రీకృతం కావడం).

అనంతుడు, అవినాశుడు, సర్వజ్ఞుడు, సంసార సాగర అంతాన ఉండే వాడు, ప్రపంచం మొత్తానికీ మంగళ కారుడు అయిన నారాయణుని అదోముఖమైన తామర మొగ్గలా ఉన్న హృదయంలో ధ్యానిస్తాను.

(సముద్రే అంతం అనే పదం ఇక్కడ గమనించ దగినది  - సంసార సాగరాంతన భగవంతుడు ఉన్నట్లుగా తెలుపబడింది. కోరికలు భావోద్వేగాలు అనే అలలతో అల్లకల్లోలమైన జీవితమే సంసార సాగరంగా పేర్కొన బడింది. ఈ అలలు ఉధృతమై ఉన్నంత వరకు ధ్యానం మూలంగా భగవంతుని దరి చేరలేము. మనస్సు ప్రశాంత మైనప్పుడే ధ్యానము కుదురుతుంది).

అధో నిష్ట్యా....అనే మంత్రములో హృదయం గురించి చెప్పబడింది. లబ్ డబ్ అని కొట్టుకునే భౌతిక హృదయం కాదు ఇది. ఇది పారమార్థిక హృదయం. దీనికి మూడు లక్షణాలు. ఒకటి, నాభికి జానెడు దూరంలో ఉండి. భౌతిక హృదయము కూడా అంటే దూరంలో ఉండి కాని అది కాస్త ఎడమ వైపు ఉంది. కానీ, ఆధ్యాత్మిక హృదయం మధ్యలో ఉంది. రెండవది, దీపశిఖల వరుసతో ఆవృతమై ఉంది. మూడవది, ఆ హృదయం దేదీప్యమానమైనది. ఈ మూడు లక్షణములు భౌతిక హృదయానికి వర్తించవు. కానీ దీనిని మనము గ్రహించకున్నాము. గ్రహించకున్నప్పటికీ అది అక్కడ ఉండనే ఉంది.

తామర మొగ్గ వంటి ఈ హృదయం నలువంకల నాడులతో ఆవృతమై వ్రేలాడుచున్నది. దాని లోపల సూక్ష్మాకాశము ఉన్నది. అంతా దానిలో నెలకొని ఉన్నది.

సర్వత్రా ప్రకాశిస్తూ, అన్ని దిశలా వ్యాపిస్తున్న మహోన్నతమైన అగ్ని ఆకాశానికి నడుమన ఉన్నది. ప్రాణం అయిన ఆ అగ్ని మొట్టమొదట భుజించేదిగాను, ఆహారాన్ని విభజించి ఇచ్చేదిగాను, దృఢమైనది గాను, పాతపడనిది గాను, అన్నింటినీ చూసేదిగాను ఉంది.

ఆ ప్రాణం యొక్క కిరణాలు అడ్డదిడ్డంగా, ఊర్ధ్వంగా, అధోముఖంగా ప్రసరిస్తూ, సర్వత్రా వ్యాపించి ఉన్నాయి, పాదం నుండి తల వరకు తన శరీరాన్ని వెచ్చగా ఉండేట్లు చేస్తుంది. దీని మధ్య అణుప్రమాణమైన అగ్ని జ్వాల ఊర్ధ్వ ముఖంగా అమరి ఉంది.

కారు మేఘం మధ్యనుండి వెలుగును విరజిమ్మే మెరపు తీగలా, వరి మొలకలా, సన్నమైనదిగా, బంగారు చాయగాను, అనువులా సూక్ష్మమైనదిగాను ఆ ఆత్మ ప్రకాశిస్తూ ఉంది.

ఆ అగ్నిశిఖ మధ్యన పరమాత్మ సుప్రతిష్ఠుడై  ఉన్నాడు. ఆయనే బ్రహ్మ, శివుడు, విష్ణువు. ఆయనే ఇంద్రుడు. ఆయన నాశనము లేని వాడు, స్వప్రకాశుడు. ఆయన కంటే అధికుడు ఎవరూ లేని వాడు.

కానవచ్చే వస్తుజాతాన్ని అందంగాను, దృశ్యానికి ఆధారం గాను ఉన్న భగవంతుని ప్రతి శరీరం అంతటా నిండిఉన్న వాణ్ణి, నల్లని మేను విష్ణువు తెల్లని మేని శివుడు ఒకరుగా మిశ్రితమైన రూపాన్ని, పూర్ణ పవిత్రుని, త్రినేత్రుని, సమస్తాన్ని తన స్వరూపంగా పరిగ్రహించిన వానిని పదే పదే నమస్కరిస్తున్నాను.

నారాయణుని తెలుసుకుందాము. అందుకోసం ఆ వాసుదేవుని ధ్యానిద్దాము. ఆ విష్ణువు మనలను ఈ ధ్యాన ప్రయత్నములో ప్రేరేపించు గాక!

ఓం శాంతి శాంతి శాంతి

14, డిసెంబర్ 2010, మంగళవారం

క్షీరసాగర శయన - దేవగాంధారిలో త్యాగరాజు వారి విన్నపము

రామ భక్తి సామ్రాజ్యములో ఓలలాడి మనకు విలువ కట్టలేని ఆధ్యాత్మిక సంపదను సంగీత సాహిత్యము ద్వారా ఇచ్చిన మహానుభావులలో అగ్రగణ్యుడు త్యాగయ్య. తన కృతులు కేవలము రామునివే అని మహారాజు ఇవ్వదలచిన సంపదలను తృణప్రాయముగా తిరస్కరించి ఆ సీతా రాముల సేవలో భౌతికంగా పేదవానిగా బ్రతికి,  ఆధ్యాత్మికంగా మహోన్నతమైన ఎత్తుకు ఎదిగి ఆ రామునిలో ఐక్యమైన త్యాగబ్రహ్మం ఈ భారత దేశానికి చేసిన సేవ ఎనలేనిది. తెలుగు భాష ఇంకా దక్షిణాది సంగీతములో ఇంక బ్రతికి ఉండి అంటే అది వీరి చలవే.

గజేంద్ర మోక్షము

విన్నపానికి దేవగాంధారి అద్భుతమైన రాగం. అందులో ఆవేదన, నివేదన, భక్తి, తాదాత్మ్యత ఇట్టే కనిపిస్తాయి. మరి అటువంటి రాగానికి త్యాగయ్య ఒక ఆర్తితో రాసిన కృతి కూడితే?. దానికి ఏసుదాస్ గారి గళము కలిస్తే? అది ఒక విన్నప రాజము అవుతుంది. అద్భుతంగా ఆలపించారు ఏసుదాసు గారు. ఆర్తి ఆయన గొంతులో తోనికిస లాడి భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది.

ఈ కీర్తనలో త్యాగరాజు రాముని - రామా! నీ కీర్తి, దయ, కరుణ అన్ని తెలిసినవే. నన్ను త్వరగా బ్రోవుము - అని వేడుకుంటాడు. దీనికి ఉదాహరణలుగా గజేంద్ర మోక్షము, ద్రౌపదీ మాన రక్షణ (సభలో చీరలు ఇచ్చి), కారాగారములో బందీ అయిన రామదాసుని బ్రోవటానికి తానీష ప్రభువుకు మారువేషంలో వచ్చి కప్పం చెల్లించటం, సీతా దేవి కోసం వారధిని దాటి లంకకు వెళ్లి రావణుని సంహరించటం - ఉపయోగించారు. వారందరినీ బ్రోచినట్టే, నన్ను కూడా బ్రోవుము అని ఆయన ఎంతో భక్తి, కరుణ రసాలతో రాముని వేడుకొంటారు. సాహిత్యం, శ్రవణం (ఏసుదాసు గారి గళంలో)

మాన సంరక్షణ

క్షీరసాగర శయన నన్ను చింతల బెట్ట వలెనా రామ (క్షీర)

వారణ రాజును బ్రోవను వేగమే వచ్చినది విన్నానురా రామ (క్షీర)

నారీమణికి జీర లిచ్చినది నాడే నే విన్నానురా
ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా
నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా
తారకనామ త్యాగరాజనుత దయతో నేలుకోర రామ (క్షీర)

పురుష సూక్తము - తాత్పర్యము

వేదమంత్రాలలో భావగర్భితమైనది, మంత్ర శక్తిలో అతి ప్రధానమైనది పురుష సూక్తం. పురుషుడంటే భగవంతుడు. భగవంతుని మహాత్మ్యమును కీర్తించే సూక్తం ఇది. దేవాలయాలలో, ఇంట్లో, భగవదారాధనలో, నిత్య పారాయణలో, వైదిక ప్రక్రియలలో పురుష సూక్త పఠనం కద్దు. పురుష సూక్తం హిందువుల జీవితంలో ఒక అంతర్భాగమై ఉందన వచ్చు.  పురుష సూక్తంలో సంహిత (దేవతా ప్రార్థన), బ్రాహ్మణం (యాగ వివరాలు), అరణ్యకం (ఉపనిషత్తులు) - సనాతన సత్యాన్ని తెలిపే సాధనాలు - ఈ మూడు గర్భితమై ఉన్నాయి. ఈ పురుష సూక్తం భగవంతుని మహాత్త్వాన్ని కీర్తించటంతో ప్రారంభమై, భగవంతుని త్యాగ ఫలంగా ఈ ప్రపంచము, జీవులు ఆవిర్భవించాయని చెబుతుంది.  తరువాత జీవుడు భగవంతుణ్ణి పొందటానికి అజ్ఞానాన్ధకారాన్ని దాటే మార్గం చెబుతూ అందుకైన హేతువును, దారిని వివరిస్తుంది. ఈ విధంగా పురుష సూక్తం ఒక పరిపూర్ణ శాస్త్రంగా ఒప్పారుతోంది.


పురుష సూక్తము -  సాహిత్యం (సంస్కృత మూలం sanskritdocuments.org వారి సౌజన్యముతో), తాత్పర్యము, శ్రవణం (హరి అచ్యుతరామ శాస్త్రి గారి గళంలో) .

అథ పురుషసూక్తమ్ ||
 
ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే | దైవీ స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శన్నో అస్తు ద్విపదే| శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః |

హరిః ఓం |
ఓం సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్దశాంగులమ్ | ౧
పురుష ఏవేదగ్ం సర్వమ్ | యద్భూతం యచ్చ భవ్యమ్|
ఉతామృతత్వస్యేశానః | యదన్నేనాతిరోహతి | ౨
ఏతావానస్య మహిమా | అతో జ్యాయాగ్‍శ్చ పూరుషః |
పాదోఽస్య విశ్వా భూతాని | త్రిపాదస్యామృతం దివి | ౩
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదోఽస్యేహాఽఽభవాత్పునః |
తతో విశ్వజ్‍వ్యక్రామత్ | సాశనానశనే అభి | ౪
తస్మాద్విరాడజాయత | విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత | పశ్చాద్భూమిమథో పురః | ౫
యత్పురుషేణ హవిషా | దేవా యజ్ఞమతన్వత |
వసంతో అస్యాసీదాజ్యమ్| గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః | ౬
సప్తాస్యాసన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్పురుషం పశుమ్ | ౭
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్| పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజంత | సాధ్యా ఋషయశ్చ యే | ౮
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | సంభృతం పృషదాజ్యమ్ |
పశూగ్‍స్తాగ్‍శ్చక్రే వాయవ్యాన్ | ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే | ౯
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
ఛన్దాగ్‍ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాదజాయత | ౧౦
తస్మాదశ్వా అజాయంత | యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్ | తస్మాజ్జాతా అజావయః | ౧౧
యత్పురుషం వ్యదధుః | కతిధా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదావుచ్యేతే | ౧౨
బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాగ్‍ం శూద్రో అజాయత | ౧౩
చంద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత |
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ |  ప్రాణాద్వాయురజాయత | ౧౪
నాభ్యా ఆసీదంతరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ | తథా లోకాగ్‍ం అకల్పయన్ | ౧౫
వేదాహమేతం పురుషం మహాంతమ్ | ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః | నామాని కృత్వాఽభివదన్ యదాస్తే| ౧౬
ధాతా పురస్తాద్యముదాజహార | శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా అయనాయ విద్యతే | ౧౭
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంతే | యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః | ౧౮

|| ఓం నమో నారాయణాయ ||

|| ఉత్తరనారాయణమ్ ||

అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే | ౧
వేదాహమేతం పురుషం మహాన్తమ్| ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా విద్యతేయఽనాయ | ౨
ప్రజాపతిశ్చరతి గర్భే అంతః | అజాయమానో బహుధా విజాయతే |
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్| మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః | ౩
యో దేవేభ్య ఆతపతి | యో దేవానాం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే | ౪
రుచం బ్రాహ్మమ్ జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే| ౫
హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ| అహోరాత్రే పార్శ్వే |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్|  ఇష్టమ్ మనిషాణ |
అముం మనిషాణ|  సర్వమ్  మనిషాణ | ౬

ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే | దైవీస్స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శన్నో అస్తు ద్విపదే| శం చతుష్పదే |

ఓం శాంతిః శాంతిః శాంతిః |

తాత్పర్యము: 

భగవంతుడు వేలాది తలలు కలవాడు, వేలాది కన్నులు కలవాడు, వేలాది పాదాలు కలవాడు; భూమండలం యావత్తూ వ్యాపించి పది అంగుళాలు అధిగమించి నిలిచాడు.

మునుపు ఏది ఉన్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే. మరణం లేని ఉన్నత స్థితికి అధిపతి యైన వాడూ ఆయనే. ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించిన వాడు కనుక.

ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే. కానీ, ఆ భగవంతుడు వీటికంటే శ్రేష్ఠుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావు భాగమే. ఆయన ముప్పాతిక భాగం వినాశములేని గగనములో ఉంది.

భగవంతుని ముప్పాతిక భాగం పైన నెలకొని ఉంది. తక్కిన పావు భాగం ఈ ప్రపంచంగా ఆవిర్భవించింది. తరువాత ఆయన ప్రాణుల జడ పదార్థాలన్నిటిలో చొరబడి వ్యాపించాడు.

ఆ ఆది పురుషుని నుండి బ్రహ్మాండం ఉద్భవించింది. దానితో పాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు. తదనంతరం ఆయన భూమిని సృజించాడు. ఆ పిదప ప్రాణులకు శరీరాలను సృష్టించాడు.

భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం  నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుకు గాను, శరత్కాలము నైవేద్యము గాను అయినవి.

ఈ యజ్ఞానికి పంచభూతాలు, రాత్రి, పగలు, కలిసి ఏడు పరిధులైనవి. ఇరవై ఒక్క తత్త్వాలు సమిధలయినాయి. దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను హోమ పశువుగా కట్టారు.

మొదట ఉద్భవించిన ఆ యజ్ఞ పురుషుడైన బ్రహ్మపై నీళ్ళు చలారు. పిదప దేవతలు, సాధ్యులు, ఋషులు, ఎవరవేరున్నారో ఆ యావన్మందీ యాగాన్ని కొనసాగించారు. (బ్రహ్మ పై నీళ్ళు చల్లి పవిత్రీకరించటం మొదలైన విధులతో యజ్ఞం ప్రారంభమవుతుంది).

ప్రపంచ యగ్నమైన ఆ యాగం నుండి పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించింది. పక్షులను, జింక, పులి వంటి వన్యమృగాలను, పశువు వంటి సాదు మృగాలను బ్రహ్మ సృష్టించాడు.

ప్రపంచ యగ్నమైన ఆ యాగంలో నుండి ఋగ్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, గాయత్రి మొదలగు ఛందస్సులు ఉద్భవించాయి. దాని నుండే యజుర్వేదము పుట్టినది.

అందులోనుండే గుర్రాలు, రెండు వరుసల దంతాలు గల మృగములు, పశువులు, గొర్రెలు, గేదెలు ఉద్భవించాయి.

బ్రహ్మను దేవతలు బలియిచ్చినప్పుడు ఆయనను ఏ ఏ రూపాలుగా చేశారు? ఆయన ముఖము ఏడిగా అయినది? ఆయన చేతులు ఎదిగా చెప్పబడినది? తోదలుగా, పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి? 

ఆయన ముఖము బ్రాహ్మణుడుగా అయినది. చేతులు క్షత్రియుడుగా, తొడలు వైశ్యునిగా, పాదాలు శూద్రునిగా ఉద్భవించారు.

మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. కాంతి నుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రాగ్నులు , ప్రాణం నుండి వాయువు ఉత్పన్నమైనారు.

నాభి నుండి అంతరిక్షము ఉద్భవించింది. శిరస్సునుండి స్వర్గము, పాదాల నుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్న మైనాయి. అట్లే సమస్త లోకాలు ఉద్భవించాయి.

సమస్త రూపాలను సృష్టించి, పేర్లను కూర్చి ఏ భగవంతుడు క్రియాశీలుడై ఉంటూ, మహిమాన్వితుడూ, సూర్యునిలా ప్రకాశించే వాడూ, అంధకారానికి సుదూరుడు అయిన భగవంతుని నేను తెలుసుకున్నాను.

ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో, ఇంద్రుడు నాలుగు దిశలలో అంతా చక్కగా చూసాడో, ఆయనను ఇలా గర్హించిన వాడు ఇక్కడే, అంటే ఈ జన్మలోనే ముక్తుడు అవుతాడు. మోక్షానికి మరో మార్గము లేదు.

దేవతలు ఈ యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమంగా ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభంలో ఎక్కడ యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించిన సాధ్యులు, దేవతలు వసిస్తున్నారో, ధర్మాన్ని ఆచరించే మహాత్ములు ఆ ఉన్నత లోకాన్ని ప్రాప్తిన్చుకొంటారు.

(ఇక్కడి వరకే పురుష సూక్తము. కానీ దక్షిణాదిలో పురుష సుక్తాన్ని ఉత్తర నారాయణం, నారాయణ సూక్తం, విష్ణు సూక్తం లోని మొదటి శ్లోకంతో పాటు కలిపి పారాయణం చేస్తారు. ఈ కిందవి అవి).

నీటినుండి, భూసారము నుండి ప్రపంచం ఉద్భవించింది. ప్రపంచాన్ని సృజించిన భగవంతుని నుండి శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ బ్రహ్మ రూపాన్ని చక్కదిద్ది దానిలో వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపు సృష్టి యొక్క ఆదిలో ఉద్భవించింది.

మహిమాన్వితుడు, సూర్యునిలా ప్రకాశమానుడు, అంధకారానికి దూరుడు అయిన భగవంతుని నేను ఎరుగుదును. ఆయనను ఇలా తెలుసుకోనేవాడు ఇక్కడ ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ముక్తికి మరో దారి లేదు.

భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై వెలుగు తున్నాడు. జన్మలేని వాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలలో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజ స్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మ వంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.

ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో,  దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.

భగవంతుని గురించిన సత్యాన్ని తెలిపేటప్పుడు దేవతలు ఆదిలో దానిని గురించి ఇలా అన్నారు: "భగవంతుణ్ణి అన్వేషించే వారు ఎవరైనప్పటికీ ఇలా తెలుసుకున్నాడంటే అతడికి దేవతలు వశులై ఉంటారు."

హ్రీ మరియు లక్ష్మీ దేవి నీ అర్ధాంగినులు. రేయింబవళ్ళు నీ పార్శ్వాలు. నక్షత్రాలు నీ దివ్య రూపం. అశ్వినీ దేవతలు నీ వికసిత వదనం.

ఓ భగవంతుడా! మేము కోరుకున్న దానిని ప్రసాదించి కరుణించు. ఈ ప్రపంచ సుఖాన్ని ఇచ్చి మమ్ము కరుణించు. ఇహపారాలలో సమస్తాన్ని ప్రసాదించి కరుణించు.

ఓం శాంతి శాంతి శాంతి

13, డిసెంబర్ 2010, సోమవారం

శంకరాచార్యవిరచిత షట్పదీ - తాత్పర్యము

ఆది శంకరులు రచించిన స్తోత్రాలలో విష్ణు షట్పది ఒకటి. మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం  ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

శంకర విరచిత విష్ణు షట్పదీ, తాత్పర్యము మీకోసం. శ్రవణం కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైట్ లో. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు అద్భుతమైన ప్రవచనం చెప్పారు ఈ షట్పది మీద. ప్రవచనం శ్రవణం డౌన్లోడ్ కొరకు వారి వెబ్ సైట్ చూడండి.



అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణాం
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః

దివ్యధునీమకరందే పరిమలపరిభోగసచ్చిదానందే
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే

సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః

మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధాం
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహం

దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు

ఇతి శ్రీమద్ శంకరాచార్యవిరచితం విష్ణుషట్పదీస్తోత్రం సంపూర్ణమ్

తాత్పర్యము

ఓ విష్ణో!  నాలోని అహంకారాన్ని తొలగించు. మనస్సును శాంతితో నింపుము. పాశవిక కోరికలనుంచి నన్ను దూరము చేయుము. సకల ప్రాణుల పట్ల నేను దయతో ఉండునట్లు చేయుము. ఈ భవసాగరాన్ని దాటుటకు చేయూతనీయుము.

సంసార సాగరములోని భయాన్ని, దుఖాన్ని పోగొట్టే, పవిత్రమైన పుప్పొడి నది వంటి, సచ్చిదానందాన్ని ఇచ్చే దివ్య సుగంధము వంటి నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను.

ఎలాగైతే సముద్రము అలలు ఒకటే అని అనిపించినా, సముద్రపు అల సముద్రములోని భాగమే కానీ సముద్రం అలలోని భాగం కాదో, అలాగే సత్యము గ్రహించు నపుడు కూడా, భేదము గ్రహించలేనప్పుడు, నేను నీలోని భాగమే కానీ నీవు నాలో భాగము కావు.

పర్వతమును ఎత్తిన వాడవు (కృష్ణుడవు, కూర్మావతారము కూడా), పర్వతరాజు శత్రువైన ఇంద్రుని సోదరుడవు, అసురుల శత్రువువు, సూర్య చంద్రులు కన్నులుగా చూసేవాడవు, నిన్ను చూసిననంత లోకపు శోకము పోవును. నిన్ను చూసిన తర్వాత ఇంకా జరుగ వలసినది ఏమైనా ఉందా?

మత్స్య రూపము మొదలకొని వివిధ అవతారములతో ఈ భువిని కాపాడుతున్నావు. పరమేశ్వరా! ఈ భవసాగరమును చూసి భయపడుతున్న నన్ను కాపాడుము.

నడుమునకు త్రాడు కట్టుకున్న విష్ణో (దామోదరా)! సకల సద్గుణ సంపన్నా! కలువ వంటి అందమైన ముఖము కలవాడా! అందరి రక్షకుడా! ఈ భవ సాగరాన్ని మధించ అత్యుత్తమ సాధనమైన వాడా! ఈ జీవనసాగరంలో నా భయాలను పోగొట్టుము.

ఓ నారాయణా! కరుణామయా! నా చేతులు నీ పదములకు మ్రొక్కనీ! ఈ ఆరు శ్లోకములు నా వదనములో ఎల్లప్పుడూ నిలవనీ!

రామ రామ రామ రామ - పట్టాభి రాముని వర్ణన

శ్రీ రాముని నుతించటం అంటే అది త్యాగరాజునికే చెల్లు. ఆ నీల మేఘ శ్యాముని మానవావతారాన్ని త్యాగయ్య అనుభూతి పొందినట్లు బహుశ ఎవ్వరు పొంది ఉండక పోవచ్చు. అంతే అనుభూతితో సంగీతకారులు శ్రీ ఎం.డీ. రామనాథన్ గారు ఒక మంచి రచన చేశారు. సులువుగా అర్థమయ్యే పదాలతో, ఉయ్యాలలూపే నీలాంబరి రాగంలో ఈ రామ రామ రామ రామ అనే కీర్తన కూర్చారు ఎం.డీ.ఆర్.

కేరళలోని పాల్ఘాట్ జిల్లాలో జన్మించిన ఎం.డీ.ఆర్ రుక్మిణి దేవి అరుండేల్, మరియు టైగర్ వరదాచారి వద్ద శిష్యరికం చేసి శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులైనారు. ఆయన ఎన్నో అద్భుతమైన కీర్తనలను రచన చేశారు. పద్మశ్రీ, సంగీత కళానిధి బిరుదులను, సంగీత నాటక అకాడెమీ మరియు కలైమామణి పురస్కారములను పొందారు.  నేటికీ ఒక మంచి వాగ్గేయకారునిగా నిలిచిపోయారు రామనాథన్ గారు. 


పట్టాభిషిక్తుడైన శ్రీరాముని వర్ణించే ఈ కీర్తనలో లాలనా భావం చాలా కనిపిస్తుంది. శ్రీ రాముని పట్టాభిషేక సమయంలో వానరులు, విభీషణుడు, సనక సనందాదులు, బ్రహ్మ, శివుడు మొదలగు వారంతా దిగి వచ్చారుట. అంతంటి శుభ ఘట్టంలో మరి ఆ రాముని వైభవము ఎట్టిదో ఊహించండి.

నీలాంబరి రాగం ఊయలలూపే లాలిత్యము, ప్రశాంతత, మృదుత్వము ఉంటుంది. స్తుతికి, నుతికి ఇదొక అద్భుతమైన రాగం. ఈ కీర్తన శ్రవణం ఎం.డీ. రామనాథన్ గళంలో , రామ వర్మ గళంలో. రెండు, కొన్ని కొన్ని చరణాలు కలిగి ఉన్నాయి. ఎవరి శైలిలో వాళ్లు ఓలలూగించారు. నీలాంబరి వైశిష్ట్యాన్ని శాస్త్రీయంగా చూపించారు ఈ కళాకారులు. సాహిత్యం క్రింద.

రామ రామ రామ రామ  రాగం: నీలాంబరి తాళం: ఆది

రామ రామ రామ రామ రామ కోదండరామా రామ పట్టాభిరామ రామ రాఘవా

భామా  శ్రీ జానకీ భరత లక్ష్మణ రిపుఘ్న పవమాన సుత సహిత రామ రాఘవా
దశరథ రాజకుమార దశ ముఖాది సంహార విశదీకృత చరిత రామ రాఘవా
కౌసల్యా వర తనయ శ్రీ కౌశిక ముని తప పాల అచల  గరళ పూజ్య రామ రాఘవా
గుహ శబరీ ఆంజనేయ కపివర శ్రీ సుగ్రీవ రిపు సోదరాదుల బ్రోచిన రామ రాఘవా
సాకేత ధామ శ్రీ సీతా మనోల్లాస చాల భేదన నిపుణ రామ రాఘవా
త్యాగరాజాది నిజ దాసులు పొగడగ నాగశయన శ్రీ రామ రాఘవా

తాత్పర్యము:

శత్రున్జయుడైన, కోదండము ధరించిన పట్టాభిరాముడు భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సమేతుడై ఉన్నాడుట. ఆయనను కృతి కర్త, దశరథ తనయునిగా, రావణ సంహారిగా, గొప్ప చరిత్ర కలవానిగా, కౌసల్య వరపుత్రునిగా, విశ్వామిత్రుని తపము కాచిన వానిగా, బ్రహ్మ, శివులచే పూజించిన వానిగా, గుహుని, శబరిని, ఆంజనేయుని, ఇతర వానరులను, సుగ్రీవుడు, విభీషణుడు మొదలగు వారిని బ్రోచిన వానిగా, సాకేత పురాధిపునిగా, సీతా మనోల్లాసునిగా, తాటిచెట్ల వరుసను ఒకే బాణముతో కూల్చిన వానిగా, త్యాగరాజు మొదలగు నిజ దాసులు పొగడిన రాముని, రాఘవునిగా వర్ణించాడు.

జయదేవ కృత గీత గోవిందం - దశావతార స్తుతి, తాత్పర్యము

జయదేవుడు అనగానే అష్టపదులు, గీత గోవిందము వాటిలోని  గోపికలు, విరహము, బృందావనము, రాధ, దశావతారములు - వెంటనే తెర మీద చిత్ర సమూహంలా మన మస్తిష్కములో వ్యక్తమవుతాయి.  13 వ శతాబ్దపు కవి ఈ జయదేవుడు. ప్రస్తుతపు ఒడిషా పురీ ప్రాంతం లోని కేండులి గ్రామంలో జయదేవుడు జన్మించాడు. సరళమైన సంస్కృతములో గీతగోవిందము, అష్టపదులు రచించాడు. పురీ జగన్నాథుని దేవాలయము, భువనేశ్వర్ లోని లింగరాజ దేవాలయము ఇదే సమయములో నిర్మించబడి ఉంటాయని చరిత్రకారుల అభిప్రాయం. లింగరాజ స్వామి గుడిలో గీతగోవిందానికి సంబంధించిన దృశ్యాలు ఈ మందిర కుడ్యాలపై ఉన్నాయిట. గీతగోవిందము, జగన్నాథ దేవాలయానికి సంబంధించిన గాధలు కూడా ఉన్నాయి.


గీతగోవిందం లోని దశావతార స్తుతి చాలా ప్రాచుర్యం పొందింది. సంగీత, నాట్య రంగాలలో విరివిగా నుతిన్చబడి, ప్రదర్శించ బడినది.  సాహిత్యం, తాత్పర్యము మీకోసం. సుబ్బులక్ష్మి గారి గాత్రంలో శ్రవణం. ఈ వర్ణనలో బుద్ధుని ఒక దశావతారం గా చెప్పబడినది. కాబట్టి అప్పటికే బౌద్ధ మతం ప్రాచుర్యం బాగా చెందినదని తెలుస్తోంది.

ప్రళయపయోధిజలే ధృతవానసి వేదం
విహితవహిత్రచరిత్రమఖేదం
కేశవ ధృతమీనశరీర జయ జగదీశ హరే  ౧

క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే
ధరణిధరణకిణచక్రగరిష్ఠే
కేశవ ధృతకచ్ఛపరూప జయ జగదీశ హరే  ౨

వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంకకలేవ నిమగ్నా
కేశవ ధృతసూకరరూప జయ జగదీశ హరే  ౩

తవ కరకమలవరే నఖమద్భుతశృంగం
దళితహిరణ్యకశిపుతనుభృంగం
కేశవ ధృతనరహరిరూప జయ జగదీశ హరే  ౪

ఛలయసి విక్రమణే బలిమద్భుతవామన
పదనఖనీరజనితజనపావన
కేశవ ధృతవామనరూప జయ జగదీశ హరే  ౫

క్షత్రియరుధిరమయే జగదపగతపాపం
స్నపయసి పయసి శమితభవతాపం
కేశవ ధృతభృఘుపతిరూప జయ జగదీశ హరే  ౬

వితరసి దిక్షు రణే దిక్పతికమనీయం
దశముఖమౌళిబలిం రమణీయం
కేశవ ధృతరామశరీర జయ జగదీశ హరే  ౭

వహసి వపుషి విశదే వసనం జలదాభం
హలహతిభీతిమిళితయమునాభం
కేశవ ధృతహలధరరూప జయ జగదీశ హరే  ౮

నిందతి యజ్ఞవిధేరహహ శ్రుతిజాతం
సదయహృదయదర్శితపశుఘాతం
కేశవ ధృతబుద్ధశరీర జయ జగదీశ హరే  ౯

మ్లేచ్ఛనివహనిధనే కలయసి కరవాలం
ధూమకేతుమివ కిమపి కరాలం
కేశవ ధృతకల్కిశరీర జయ జగదీశ హరే  ౧౦

శ్రీజయదేవకవేరిదముదితముదారం
శృణు సుఖదం శుభదం భవసారం
కేశవ ధృతదశవిధరూప జయ జగదీశ హరే  ౧౧


తాత్పర్యము:

ప్రళయ కాలములో సాగర జల ఘోషలో వేదములను నావ వలె కాపాడిన మీనావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునికి జయము జయము.

మందర పర్వతాన్ని తన వీపుపై మోసి, ఆ పర్వతము ఒక చక్రం లాగ తిరిగి సాగర మథనం ముందుకు సాగేలా చేసిన కూర్మావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునికి జయము జయము.

నీట మునిగిన భూమిని తన ముక్కుపై చంద్రుని నెలవంక వలె నిలిపి కాపాడిన ఖడ్గమృగావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము.

దానవుడైన హిరణ్యకశిపుని తన చేతులకు ఉన్న గోళ్ళతో చీల్చి చెండాడి పురుగువలె నలిపి చంపిన నృసింహ అవతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము.

తన విశ్వవ్యాప్తమైన పదములతో బలిని పాతాళమునకు పంపి, ఆ పాదముల వద్ద నుండి ఉబికిన నీరు జనులను పావనం చేయగా, బడుగు బాపని రూపమైన ఆ వామనావతార రూప శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము.

క్షత్రియుల రక్తముతో భూదేవికి స్నానము చేయించి, భూమిపై ఉన్న పాపమును నాశనము చేసిన,  భూతాపమును తగ్గించిన పరశురామావతారమైన శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

దశ దిక్కులకు రావణుని పది తలలను బహుకరించిన రామావతారమైన  శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

యమునానది రంగులో తన తెల్లని శరీరము పై వస్త్రములు ధరించిన, తన నాగలి ధాటితో యమునను భయపెట్టి తన వైపు మళ్లించిన, బలరామావతారమైన శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

వేదములలో చెప్పబడిన యజ్ఞ విధి, దానిలో జరిగే జంతు బలిని వ్యతిరేకించిన, దయారూపమైన, బుద్ధ అవతారమైన  శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

తోకచుక్కవలె, ఆశ్వముని అధిరోహించి, తన ఖడ్గముతో మ్లేచ్ఛులను సంహరించి కలియుగాంతము చేసే కల్కి అవతారమైన  శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

ఈ జయదేవ విరచిత దశావతార స్తుతిని వినినంత శుభము, సుఖము కలిగించే శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...