19, డిసెంబర్ 2010, ఆదివారం

మాతృమూర్తి - కనిపెంచే తల్లికి పిల్ల భారమా

కుపుత్రో జాయేతా క్వచిదపి కుమాతా నభవిష్యతి. చెడ్డ పుత్రుడు ఉండవచ్చేమో కానీ, చెడ్డ అమ్మ ఉండదు. ఇది అర్యోక్తి. ఎంత నిగూఢమైన అర్థముందో ఇందులో?. ప్రపంచంలో వెలకట్టలేని సంపద తల్లి ప్రేమ. ప్రత్యక్షదైవమైన ఈ మాతృమూర్తి రుణం తీర్చుకునేది కాదు. గర్భము దాల్చినంత మొదలు తాను తనువు చాలించే వరకు, పిల్లల శ్రేయస్సు, భవిష్యత్తు కోసం అహరహం మానసిక, శారీరిక పోరాటం చేసే దేవత అమ్మ. తన ప్రతి కదలికలో, ఉచ్ఛ్వాశ, నిశ్శ్వాసలలో, ప్రతి అడుగు, కర్మలో తన సంతానం రక్ష కోరుకునే కన్నతల్లి అందుకనే విశ్వవంద్యమైనది. అందుకనే, మన ధర్మ శాస్త్రాలు మాతృదేవోభవ అని ఆది పలికారు. 

ఎన్ని పాత్రలు ఆ తల్లికి? - తన మానసిక శక్తితో ఒక పిండానికి ఈ లోకంలో ప్రవేశం కలిపించే లోకపావని మన అమ్మ. తన రక్తం పంచి ఇచ్చి, తన శక్తినంతా పాలుగా అమృతం పంచి, బిడ్డను అణువణువు ప్రేమతో నింపి, ప్రపంచానికి పరిచయం చేసే కరుణామూర్తి అమ్మ. పారాడే బిడ్డకు లాలి పాడే ప్రేమరాశి అమ్మ. ఆడి, పాడే బిడ్డకు సంస్కారము, మొదటి విద్య నేర్పే సరస్వతి అమ్మ. ఆకలిగొన్న బాలునికి అన్నపూర్ణయైనది అమ్మ. జీవితంలో సన్మార్గము చూపే ఆదిగురువు అమ్మ. యుక్తవయస్సులో రక్షణ కలిపించే సైనికురాలు అమ్మ. పూర్ణ వ్యక్తిత్వం ఏర్పడే యవ్వనంలో ప్రాణ స్నేహితురాలు అమ్మ. నడివయస్సులో బాధ్యతను గుర్తు చేసే దయామయి అమ్మ. కాలాతీతమైన ఈ మాతృప్రేమ అజరామరం, అనుపమానం, అవ్యక్తం, వర్ణనాతీతం. ఎంచలేని పాత్రలు పోషించే అమ్మకు మనం చేయగలిగింది ఒక్కటే: మనః పూర్వక పాదాభివందనం, మానసిక పూజ.

ఈ నేపథ్యంతో ఒక మంచి సందేశమున్న పాట రావు బాల సరస్వతి గారి గొంతులో మంచి మనసుకు మంచి రోజులు చిత్రంలోనిది మీకోసం.  తల్లి యొక్క విశిష్టను, ప్రాముఖ్యతను సరళమైన తెలుగు భాషలో అందించారు సముద్రాల రాఘవాచార్య గారు. తల్లి అనే దీవెనలో ఆ భగవంతుడు స్త్రీకి ఎటువంటి బాధ్యతను, మాధుర్యాన్ని ఇచ్చాడో ఈ పాట చెపుతుంది. తల్లిని ఈ భూదేవితో, చెట్టుతో పొలిచి మాతృమూర్తి గొప్పతనాన్ని ప్రకృతితో సమం చేస్తుంది ఈ పాట.ఎంత ధైర్యము, స్థైర్యము, ఓర్పు ఉంటే పిల్లలను పెంచగలదో ఆ తల్లి అని ఈ గీతం నుతిస్తుంది. పుట్టిన్చటంతో ఆ తల్లి బాధ్యత తీరదు, ప్రేమతో పెంచకపోతే నిజమైన తల్లి కానట్టే అని చిత్రంలో సందర్భోచితంగా సందేశాన్ని ఇస్తుంది ఈ అమ్మ పాట. 

తల్లి ప్రేమ, బాధ్యత

అలనాటి మేటి గాయని బాలసరస్వతి గారు ఎంతో గొప్పగా, భావము, ఆర్తితో పాడారు ఈ పాట.  1958 లో  విడుదలైన ఈ చిత్రానికి ఘంటసాల వారు సంగీతం అందించారు. ఎన్టీఆర్, రాజసులోచన నాయక నాయికలు.

ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా 
తరువుకు కాయ భారమా కనిపెంచే తల్లికి పిల్ల భారమా కనిపెంచే తల్లికి పిల్ల భారమా |ధరణికి|


మును నే నోచిన నా నోము పండగా 
నా వడిలో వెలిగే నా చిన్ని నాయనా 
పూయని తీవేననే అపవాదు రానీకా
తల్లిననే దీవెనతో తనియించినావయ్య |తరువుకు|


ఆపద వేళల అమ్మ మనసు చెదరునా 
పాపల రోదనకే ఆ తల్లి విసుగునా
పిల్లల కనగానే తీరేనా స్త్రీ విధి
ప్రియముగా ఆ పాపలను పెంచనిదొక  తల్లియా  |తరువుకు|

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి