14, డిసెంబర్ 2010, మంగళవారం

పురుష సూక్తము - తాత్పర్యము

వేదమంత్రాలలో భావగర్భితమైనది, మంత్ర శక్తిలో అతి ప్రధానమైనది పురుష సూక్తం. పురుషుడంటే భగవంతుడు. భగవంతుని మహాత్మ్యమును కీర్తించే సూక్తం ఇది. దేవాలయాలలో, ఇంట్లో, భగవదారాధనలో, నిత్య పారాయణలో, వైదిక ప్రక్రియలలో పురుష సూక్త పఠనం కద్దు. పురుష సూక్తం హిందువుల జీవితంలో ఒక అంతర్భాగమై ఉందన వచ్చు.  పురుష సూక్తంలో సంహిత (దేవతా ప్రార్థన), బ్రాహ్మణం (యాగ వివరాలు), అరణ్యకం (ఉపనిషత్తులు) - సనాతన సత్యాన్ని తెలిపే సాధనాలు - ఈ మూడు గర్భితమై ఉన్నాయి. ఈ పురుష సూక్తం భగవంతుని మహాత్త్వాన్ని కీర్తించటంతో ప్రారంభమై, భగవంతుని త్యాగ ఫలంగా ఈ ప్రపంచము, జీవులు ఆవిర్భవించాయని చెబుతుంది.  తరువాత జీవుడు భగవంతుణ్ణి పొందటానికి అజ్ఞానాన్ధకారాన్ని దాటే మార్గం చెబుతూ అందుకైన హేతువును, దారిని వివరిస్తుంది. ఈ విధంగా పురుష సూక్తం ఒక పరిపూర్ణ శాస్త్రంగా ఒప్పారుతోంది.


పురుష సూక్తము -  సాహిత్యం (సంస్కృత మూలం sanskritdocuments.org వారి సౌజన్యముతో), తాత్పర్యము, శ్రవణం (హరి అచ్యుతరామ శాస్త్రి గారి గళంలో) .

అథ పురుషసూక్తమ్ ||
 
ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే | దైవీ స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శన్నో అస్తు ద్విపదే| శం చతుష్పదే |
ఓం శాంతిః శాంతిః శాంతిః |

హరిః ఓం |
ఓం సహస్రశీర్షా పురుషః | సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా | అత్యతిష్ఠద్దశాంగులమ్ | ౧
పురుష ఏవేదగ్ం సర్వమ్ | యద్భూతం యచ్చ భవ్యమ్|
ఉతామృతత్వస్యేశానః | యదన్నేనాతిరోహతి | ౨
ఏతావానస్య మహిమా | అతో జ్యాయాగ్‍శ్చ పూరుషః |
పాదోఽస్య విశ్వా భూతాని | త్రిపాదస్యామృతం దివి | ౩
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః | పాదోఽస్యేహాఽఽభవాత్పునః |
తతో విశ్వజ్‍వ్యక్రామత్ | సాశనానశనే అభి | ౪
తస్మాద్విరాడజాయత | విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత | పశ్చాద్భూమిమథో పురః | ౫
యత్పురుషేణ హవిషా | దేవా యజ్ఞమతన్వత |
వసంతో అస్యాసీదాజ్యమ్| గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః | ౬
సప్తాస్యాసన్పరిధయః | త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః | అబధ్నన్పురుషం పశుమ్ | ౭
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్| పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజంత | సాధ్యా ఋషయశ్చ యే | ౮
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | సంభృతం పృషదాజ్యమ్ |
పశూగ్‍స్తాగ్‍శ్చక్రే వాయవ్యాన్ | ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే | ౯
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
ఛన్దాగ్‍ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాదజాయత | ౧౦
తస్మాదశ్వా అజాయంత | యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్ | తస్మాజ్జాతా అజావయః | ౧౧
యత్పురుషం వ్యదధుః | కతిధా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ | కావూరూ పాదావుచ్యేతే | ౧౨
బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ | బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః | పద్భ్యాగ్‍ం శూద్రో అజాయత | ౧౩
చంద్రమా మనసో జాతః | చక్షోః సూర్యో అజాయత |
ముఖాదింద్రశ్చాగ్నిశ్చ |  ప్రాణాద్వాయురజాయత | ౧౪
నాభ్యా ఆసీదంతరిక్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ | తథా లోకాగ్‍ం అకల్పయన్ | ౧౫
వేదాహమేతం పురుషం మహాంతమ్ | ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః | నామాని కృత్వాఽభివదన్ యదాస్తే| ౧౬
ధాతా పురస్తాద్యముదాజహార | శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా అయనాయ విద్యతే | ౧౭
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః | తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంతే | యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః | ౧౮

|| ఓం నమో నారాయణాయ ||

|| ఉత్తరనారాయణమ్ ||

అద్భ్యః సంభూతః పృథివ్యై రసాచ్చ | విశ్వకర్మణః సమవర్తతాధి |
తస్య త్వష్టా విదధద్రూపమేతి | తత్పురుషస్య విశ్వమాజానమగ్రే | ౧
వేదాహమేతం పురుషం మహాన్తమ్| ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ |
తమేవం విద్వానమృత ఇహ భవతి | నాన్యః పంథా విద్యతేయఽనాయ | ౨
ప్రజాపతిశ్చరతి గర్భే అంతః | అజాయమానో బహుధా విజాయతే |
తస్య ధీరాః పరిజానంతి యోనిమ్| మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః | ౩
యో దేవేభ్య ఆతపతి | యో దేవానాం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే | ౪
రుచం బ్రాహ్మమ్ జనయంతః | దేవా అగ్రే తదబ్రువన్ |
యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ | తస్య దేవా అసన్ వశే| ౫
హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ| అహోరాత్రే పార్శ్వే |
నక్షత్రాణి రూపమ్ | అశ్వినౌ వ్యాత్తమ్|  ఇష్టమ్ మనిషాణ |
అముం మనిషాణ|  సర్వమ్  మనిషాణ | ౬

ఓం తచ్ఛం యోరావృణీమహే | గాతుం యజ్ఞాయ| గాతుం యజ్ఞపతయే | దైవీస్స్వస్తిరస్తు నః |
స్వస్తిర్మానుషేభ్యః | ఊర్ధ్వం జిగాతు భేషజమ్ | శన్నో అస్తు ద్విపదే| శం చతుష్పదే |

ఓం శాంతిః శాంతిః శాంతిః |

తాత్పర్యము: 

భగవంతుడు వేలాది తలలు కలవాడు, వేలాది కన్నులు కలవాడు, వేలాది పాదాలు కలవాడు; భూమండలం యావత్తూ వ్యాపించి పది అంగుళాలు అధిగమించి నిలిచాడు.

మునుపు ఏది ఉన్నదో, ఇక ఏది రాబోతున్నదో సమస్తం భగవంతుడే. మరణం లేని ఉన్నత స్థితికి అధిపతి యైన వాడూ ఆయనే. ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించిన వాడు కనుక.

ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే. కానీ, ఆ భగవంతుడు వీటికంటే శ్రేష్ఠుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావు భాగమే. ఆయన ముప్పాతిక భాగం వినాశములేని గగనములో ఉంది.

భగవంతుని ముప్పాతిక భాగం పైన నెలకొని ఉంది. తక్కిన పావు భాగం ఈ ప్రపంచంగా ఆవిర్భవించింది. తరువాత ఆయన ప్రాణుల జడ పదార్థాలన్నిటిలో చొరబడి వ్యాపించాడు.

ఆ ఆది పురుషుని నుండి బ్రహ్మాండం ఉద్భవించింది. దానితో పాటు బ్రహ్మ ఆవిర్భవించి సర్వత్రా వ్యాపించాడు. తదనంతరం ఆయన భూమిని సృజించాడు. ఆ పిదప ప్రాణులకు శరీరాలను సృష్టించాడు.

భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించిన యజ్ఞానికి వసంతకాలం  నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుకు గాను, శరత్కాలము నైవేద్యము గాను అయినవి.

ఈ యజ్ఞానికి పంచభూతాలు, రాత్రి, పగలు, కలిసి ఏడు పరిధులైనవి. ఇరవై ఒక్క తత్త్వాలు సమిధలయినాయి. దేవతలు యాగాన్ని ఆరంభించి బ్రహ్మను హోమ పశువుగా కట్టారు.

మొదట ఉద్భవించిన ఆ యజ్ఞ పురుషుడైన బ్రహ్మపై నీళ్ళు చలారు. పిదప దేవతలు, సాధ్యులు, ఋషులు, ఎవరవేరున్నారో ఆ యావన్మందీ యాగాన్ని కొనసాగించారు. (బ్రహ్మ పై నీళ్ళు చల్లి పవిత్రీకరించటం మొదలైన విధులతో యజ్ఞం ప్రారంభమవుతుంది).

ప్రపంచ యగ్నమైన ఆ యాగం నుండి పెరుగు కలిసిన నెయ్యి ఉద్భవించింది. పక్షులను, జింక, పులి వంటి వన్యమృగాలను, పశువు వంటి సాదు మృగాలను బ్రహ్మ సృష్టించాడు.

ప్రపంచ యగ్నమైన ఆ యాగంలో నుండి ఋగ్వేద మంత్రాలు, సామవేద మంత్రాలు, గాయత్రి మొదలగు ఛందస్సులు ఉద్భవించాయి. దాని నుండే యజుర్వేదము పుట్టినది.

అందులోనుండే గుర్రాలు, రెండు వరుసల దంతాలు గల మృగములు, పశువులు, గొర్రెలు, గేదెలు ఉద్భవించాయి.

బ్రహ్మను దేవతలు బలియిచ్చినప్పుడు ఆయనను ఏ ఏ రూపాలుగా చేశారు? ఆయన ముఖము ఏడిగా అయినది? ఆయన చేతులు ఎదిగా చెప్పబడినది? తోదలుగా, పాదాలుగా ఏవి చెప్పబడ్డాయి? 

ఆయన ముఖము బ్రాహ్మణుడుగా అయినది. చేతులు క్షత్రియుడుగా, తొడలు వైశ్యునిగా, పాదాలు శూద్రునిగా ఉద్భవించారు.

మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. కాంతి నుండి సూర్యుడు, ముఖము నుండి ఇంద్రాగ్నులు , ప్రాణం నుండి వాయువు ఉత్పన్నమైనారు.

నాభి నుండి అంతరిక్షము ఉద్భవించింది. శిరస్సునుండి స్వర్గము, పాదాల నుండి భూమి, చెవి నుండి దిశలు ఉత్పన్న మైనాయి. అట్లే సమస్త లోకాలు ఉద్భవించాయి.

సమస్త రూపాలను సృష్టించి, పేర్లను కూర్చి ఏ భగవంతుడు క్రియాశీలుడై ఉంటూ, మహిమాన్వితుడూ, సూర్యునిలా ప్రకాశించే వాడూ, అంధకారానికి సుదూరుడు అయిన భగవంతుని నేను తెలుసుకున్నాను.

ఏ భగవంతుని బ్రహ్మ ఆదిలో పరమాత్మగా దర్శించి తెలిపాడో, ఇంద్రుడు నాలుగు దిశలలో అంతా చక్కగా చూసాడో, ఆయనను ఇలా గర్హించిన వాడు ఇక్కడే, అంటే ఈ జన్మలోనే ముక్తుడు అవుతాడు. మోక్షానికి మరో మార్గము లేదు.

దేవతలు ఈ యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమంగా ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభంలో ఎక్కడ యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించిన సాధ్యులు, దేవతలు వసిస్తున్నారో, ధర్మాన్ని ఆచరించే మహాత్ములు ఆ ఉన్నత లోకాన్ని ప్రాప్తిన్చుకొంటారు.

(ఇక్కడి వరకే పురుష సూక్తము. కానీ దక్షిణాదిలో పురుష సుక్తాన్ని ఉత్తర నారాయణం, నారాయణ సూక్తం, విష్ణు సూక్తం లోని మొదటి శ్లోకంతో పాటు కలిపి పారాయణం చేస్తారు. ఈ కిందవి అవి).

నీటినుండి, భూసారము నుండి ప్రపంచం ఉద్భవించింది. ప్రపంచాన్ని సృజించిన భగవంతుని నుండి శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ బ్రహ్మ రూపాన్ని చక్కదిద్ది దానిలో వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపు సృష్టి యొక్క ఆదిలో ఉద్భవించింది.

మహిమాన్వితుడు, సూర్యునిలా ప్రకాశమానుడు, అంధకారానికి దూరుడు అయిన భగవంతుని నేను ఎరుగుదును. ఆయనను ఇలా తెలుసుకోనేవాడు ఇక్కడ ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ముక్తికి మరో దారి లేదు.

భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై వెలుగు తున్నాడు. జన్మలేని వాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలలో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజ స్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు. బ్రహ్మ వంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.

ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో,  దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.

భగవంతుని గురించిన సత్యాన్ని తెలిపేటప్పుడు దేవతలు ఆదిలో దానిని గురించి ఇలా అన్నారు: "భగవంతుణ్ణి అన్వేషించే వారు ఎవరైనప్పటికీ ఇలా తెలుసుకున్నాడంటే అతడికి దేవతలు వశులై ఉంటారు."

హ్రీ మరియు లక్ష్మీ దేవి నీ అర్ధాంగినులు. రేయింబవళ్ళు నీ పార్శ్వాలు. నక్షత్రాలు నీ దివ్య రూపం. అశ్వినీ దేవతలు నీ వికసిత వదనం.

ఓ భగవంతుడా! మేము కోరుకున్న దానిని ప్రసాదించి కరుణించు. ఈ ప్రపంచ సుఖాన్ని ఇచ్చి మమ్ము కరుణించు. ఇహపారాలలో సమస్తాన్ని ప్రసాదించి కరుణించు.

ఓం శాంతి శాంతి శాంతి

2 కామెంట్‌లు:

  1. SASIKALA VOLETY, Visakhapatnam.23 నవంబర్, 2015 8:36 AMకి

    ధన్యవాదాలు. ఎంతో మహిమాన్వితమయిన , స్తోత్ర రాజము, మర్మ గర్భితము, వేద సంగ్రహము అయిన పురుష సూక్తము వివరించి, ఈ పణ్య దినాన్ని మరింత పరిపూర్ణం చేసిన ప్రసాద్ గారికి భగవంతుని ఆశీస్సులు సదా ఉండాలని ప్రార్ధిస్తున్నా

    రిప్లయితొలగించండి