21, మే 2015, గురువారం

హనుమత్ సేవిత నిజ పద రాం!

హనుమత్ సేవిత నిజ పద రాం!



పరిపూర్ణమైన స్వామి భక్తి, శరణాగతి మరియు ప్రభువు పట్ల ప్రగాఢ విశ్వాసమున్న హనుమంతుని వంటి భక్తుడు కలిగిన రాముడు, సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమైన రాముని వంటి దైవము యొక్క అనుగ్రహము కలిగిన హనుమంతుడు...ఈ ఇరువురి సంబంధం అనిర్వచనీయం, అపూర్వం. రోమ రోమమున రామ నామము ఆ భక్తుని లక్షణమైతే ఈ బంటు భక్తులను వెన్నంటి కాచే ప్రభుత ఆ స్వామిది....సుందరమైన ఈ బాంధవ్యం భక్తి-కరుణలకు ప్రామాణికం, తలమానికం. దాసోహం కోసలేంద్రస్య అని ఆ భక్తుడు తలచితే హనుమంతుని వంటి భక్తుడు మరొకడు లేడు అని ఆ ప్రభువు పొగడాడు. లక్ష్మణుడి ప్రాణాల కోసం సంజీవనిని తెచ్చినా, సీతమ్మ కోసం భీకరమైన లంకను దహనం చేసినా, రామ కార్యం కోసం శతయోజనాలు దాటినా, అన్నీ ప్రభు భక్తి కోసమే. రామ కార్యమే జీవనోపాధి, పరమావధి. అమ్మ సీతమ్మకు హనుమను చూస్తే అవ్యాజమైన మాతృప్రేమ. రామునికి కూడా హనుమ అంటే అమితమైన కరుణ వాత్సల్యము. అందుకే ఏకంగా ఆ భక్తుని హృదయంలో నివసించాడు.

సీతాన్వేషణ మొదలు రామపట్టాభిషేకము వరకూ హనుమంతుడు చేసిన ప్రతికార్యమూ రామనామ స్మరణతోనే. లంకలో వెదకి వెదకి అమ్మ జాడ దొరకక నిస్పృహకు గురై హనుమ విపరీతమైన ఆలోచనలోకి వెళుతుంటే రామనామ స్మరణతో  ఎక్కడ లేని మనో ధైర్యము, కార్యసిద్ధిపై ఉత్సుకత, విశ్వాసం కలిగాయి. హనుమంతునికి శుభశకునాలు కనిపించాయి. సంకల్పం గట్టిదై నోటినుండి అద్భుతమైన మంత్రాలు వెలువడ్డాయి.

నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యేచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః

"రామునికి, లక్ష్మణునికి, సీతమ్మకు, శివునికి, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునకు, సూర్యచంద్రులకు, మరుత్ గణాలకు నమస్కారము". అంతే! ఆయనకు ఆశోకవనము, సీతమ్మ జాడ తెలుస్తాయి. ఇక హనుమంతునికి ఎదురులేదు. అమ్మను కలిసి రాముని గుణగణములను, తాను వచ్చిన కార్యమును వివరించి, అమ్మకు సాంత్వన కలిగిస్తాడు. ఉత్సాహంతో ప్రమదావనాన్ని నాశనం చేసి రావణునికి హెచ్చరిక చేస్తాడు.


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః

అర్థయిత్వాం పురీం లంకాం అభివాద్య చ మైథిలీం
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం


"అతిబలుడైన రామునికి, మహాబలుడైన లక్ష్మణునికి, రామునిచే కాపాడబడిన సుగ్రీవునికి జయము జయము. వేయిమంది రావణులు వచ్చినా వారిని శిలలతోను, వృక్షములతోను ఎదుర్కొంటాను. రాక్షసులందరూ నిస్సహాయులై చూస్తుండగా, లంకను జయించి, సీతమ్మకు అభివాదం చేసిన తరువాతే ఇక్కడినుండి వెళతాను."

ఇదీ హనుమంతునికి రామునిపై గల విశ్వాసము, భక్తి, నమ్మకము. దాని ఫలితమే అతని కార్యసిద్ధి. యుధ్దంలోనూ, సంజీవని తీసుకురావటం లోనూ, రామనామమే అతనికి తారకము. రాముని పాదముల వద్ద నిలిచి, సేవించి, మనసులో ధ్యానించి, లోకవంద్యుడైనాడు హనుమ. రామభక్తి అతనిని భవిష్యత్ బ్రహ్మను చేసింది.
సీతమ్మ జాడను తీసుకొని రాముని వద్దకు వెళ్లి అమ్మ క్షేమంగా ఉన్నది అన్న వార్త తెలుపగానే రాముడు "హనుమంతుడు సీతాన్వేషణలో సాధించిన కార్యములు లోకములోనే అత్యద్భుతమైనవి, ఊహకు అందనివి, అనితర సాధ్యమైనవి. గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు తప్ప వేరేవ్వరూ ఈ సాగరాన్ని దాటలేరు. హనుమంతునితో సమానమైన తేజోబలసంపన్నుడు లేడు. మహావీరుడైన సుగ్రీవునికి నిజమైన సేవకునిగా ఆ ప్రభుకార్యము సఫలమొనర్చెను. ఈ సంతోష సమయమున ఈ మహాత్మునికి గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఇవ్వగలను. ఇది అతనికి పరమసుఖానుభవమును కలిగిస్తుంది. ప్రస్తుతము నేను ఈయగల సర్వస్వము ఇదే." అని తన ఆనందాన్ని తెలిపి హనుమకు అనుపమానమైన ఆలింగనమనే బహుమతిని ఇస్తాడు.

రామపట్టాభిషేక సమయంలో సీత హనుమంతునికి దివ్యమైన వస్త్రములను, ఆభరణములను కానుకగా ఇస్తుంది. తన మెడలోని కంఠాభరణము తీసి అక్కడ ఉన్న వానర సమూహాన్ని పదే పదే చూస్తుండగా రాముడు ఆమె అంతరంగాన్ని గ్రహించి "ఓ సీతా! అసమానమైన పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదలగు లక్షణములు కలిగి నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహుకరింపుము" అని పలుకుతాడు. అప్పుడు సీత ఆ హారమును హనుమంతునికి కానుకగా ఇస్తుంది.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం

ఎక్కడ రాముని నామ కీర్తనం జరుగుతుందో అక్కడ మారుతి తలవంచి ఆనందబాష్పములతో నిండిన కన్నులతో రాక్షసనాశకుడైన రామునికి నమస్కరించి నిలుస్తాడు. రాత్రి పగలు రామధ్యానమే ఆయనకు. శ్రీరాముడు కూడా హనుమద్భక్తులపై అత్యంత కరుణతో దృష్టి కలిగి వారిని అనుగ్రహిస్తాడు. రామభక్తులకు హనుమ బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, రోగనివారణ, ఉత్సాహం, వాక్పటిమ కలిగించి వారికి తోడుగా నిలుస్తాడు. హనుమను కొలిస్తే రాముడు సంతుష్టుడు, రామభక్తులకు హనుమ అసమానమైన అండ.

రామ-హనుమల మధ్య అనిర్వచనీయమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శప్రాయం.

సియావర్ రామచంద్ర కీ జై !!!
పవన సుత హనుమాన్ కీ జై!!!

20, మే 2015, బుధవారం

శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ - దేవులపల్లి వారి రామభక్తి

శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ - దేవులపల్లి వారి రామభక్తి


రామచరణమె త్రోవయని నామభజనమె నావయని
స్వామిని మౌని మనోహరుని కనులారగని మది పదిలపరచుకొని
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ!

తాళలేని హృదయాలదహించే తాపకీల చల్లారాలంటే
నీలమేఘ మోహనుడే కరిగి జాలివాన కురిపించాలంటే
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ!

రానై యున్నాడు శ్రీహరి రానై యున్నాడు
తానే వైకుంఠం భూమికి తేనై యున్నాడు
పిలిచే దరి హరి పదముల మదిలో మానక నిలిపి ధ్యానము సలిపి
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

రామయని గుణధామయని రాముని తీయని గాథ విని
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

బ్రతుకుల వేసారి శ్రీహరి పదముల కడ చేరి
పరమ దయానిధి శౌరి భవ హారి యని ఒకసారి
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

- దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు 'భక్త శబరి' చలన చిత్రానికి, పెండ్యాల వారి సంగీతం.

రాముని చరణాలే దారి, ఆ రాముని నామాన్ని భజించటమే మనకు నావ. ఆ స్వామిని, మునుల మనసు గెలిచిన వానిని, కనులారా చూచి, మనసులో పదిలపరచుకొని, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

కోరికల వలన కలిగే తాపమనే అగ్నిని తాళలేక బాధ పడుతున్న హృదయాల బాధలు చల్లారాలంటే, నీలి మేఘాలవంటి శరీరఛాయ కలిగిన మోహనాకారుడు రాముడే కరిగి మనపై కరుణావృష్టిని కురిపించాలంటే, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

శ్రీహరి రాబోతున్నాడు! తానే వైకుంఠాన్ని భూమికి తేనున్నాడు! మనలను పిలుస్తున్న హరి పాదములను మనసులో ఎల్లప్పుడూ నిలిపి ధ్యానము చేసి, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

రామా అని, గుణములకు నివాసమా అని, రాముని తీయనైన కథను విని, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

జీవితంలో విసిగి పోయి, శ్రీహరి పాదముల వద్దకు చేరి, పరమ దయకు నిధి, మహావీరుడు, పాపములను హరించే వాడు అని, ఒకసారి అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

ఎంత అద్భుతమైన సాహిత్యం! చరణాలు త్రోవగా, నామమె నావగా అభివర్ణించారు ఈ కవిశ్రేష్ఠులు. తెలుగుదనం, భక్తి, యతి ప్రాసలు సంపూర్ణంగా ఉట్టిపడే ఇటువంటి సాహిత్యం ఒకప్పుడు సినీజగత్తులో ప్రకాశించేది. ఈ పాట దేవులపల్లి వారి రామభక్తికి మరో ఉదాహరణ. రాముని భక్తిసాగరంలో మునిగితే కానీ ఇటువంటి సాహిత్యం కలంలో పండదు. రామభక్తి సామ్రాజ్యంలో ఒకరైతే ఇటువంటి గీతాలు మనసులో జనిస్తాయి. కవి హృదయంలో కలిగే భావనలకు ఆ దైవానుగ్రహం తోడైతే, భక్తి సోపానంలో ఆ ఆత్మ పరమాత్మతో అనుసంధానమైతే ఇటువంటి మధుర రస భావ సుమాలు వికసిస్తాయి. రాముని నామ మహిమ ఒకసారి రుచి చూస్తే ఇక వేరే ఏదీ రుచించదు.

రాముని అడుగులే మనకు త్రోవ అని కవి విశ్వాసం. ఎందుకు? రామో విగ్రహవాన్ ధర్మః. ఆయన పలికిన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు ధర్మం కోసం. ఆయన చేసిన ప్రతి పని ధర్మాన్ని కాపాడటం కోసం. అన్నీ త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు ఆ మానవావతారుడు. సమస్త గుణములలో ఉత్తముడు రాముడు. సామాన్య మానవుడు దైవంగా ఎలా మారగలడో అన్నదానికి రామావతారం మనకు అత్యుత్తమమైన ఉదాహరణ. అందుకే ఆయన నడిచే అడుగులు మనకు దారి. ఆయన నామ స్మరణ మనకు పాపహారి, తాపహారి, భవతారకము. బంధనాలతో కూడిన మానవజన్మలోని ప్రతి రోజూ ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు. మన బుద్ధి ప్రతి సారీ సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉండదు. అందుకే పెద్దలు రామాయణ, భారత భాగవతాలను మనకు సరైన మార్గదర్శకాలుగా నిర్ధారించారు.

కవిగా ఉదయించి, మునిగా తపము చేసి, యోగిగా పరమపదించారు కృష్ణశాస్త్రిగారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు!

పీబీ శ్రీనివాస్ గారు ఎంత మధురంగా పాడారో! రాముని ఎదుట నిలిపినట్లుగా ఉంటుంది ఆయన గళంలో ఈ పాట. 

19, మే 2015, మంగళవారం

శ్రీరామకర్ణామృతం - ప్రథమాశ్వాసము

శ్రీరామకర్ణామృతం - ప్రథమాశ్వాసము 


పేరులోనే ఉంది అర్థమంతా. చెవులకు అమృతంగా అనిపించే రామస్తుతి ఇది. లీలాశుకుడు శ్రీకృష్ణకర్ణామృతం రచిస్తే ఈ రామకర్ణామృతం ఎవరు రచించారో తెలియటం లేదు. సిద్ధకవి ఈ సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువదించారు. ఛందోబద్ధంగా సాగే ఈ ధార రాముని రూప గుణ మహిమల వర్ణనను మనకు ఎంతో మనోజ్ఞంగా అందిస్తుంది. రాముడంటేనే పరిపూర్ణ సులక్షణ సంపన్నుడు. ఆ ధర్మమూర్తి వైభవాన్ని ఎంత పొగిడినా, ఎందరు నుతించినా తనివితీరదు. 

రామకర్ణామృతంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, తాత్పర్యము: 

వామాంక స్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే
చక్రం చోర్ధ్వకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిం స్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం 

ఎడమతొడపై కూర్చున్న సీత సేవించుచుండగా, శోభించుచున్న ధనువునొక చేతిలో, పైచేతిలో చక్రము, కుడిచేతులలో శంఖము మరియు బాణములను ధరించియున్న, కలువరేకులవంటి కన్నులు కలిగిన, భద్రాచల శిఖరమందు వెలసిన, భుజకీర్తులు మొదలైన ఆభరణములతో అలంకరించబడిన, నల్లనైన రఘురాముని భజిస్తున్నాను.

వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః
శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయ్వాది కోణేష్వపి
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం

ఎడమవైపున సీత, ఎదుట హనుమంతుడు, వెనుక లక్ష్మణుడు, పక్కన భరతశత్రుఘ్నులు, వాయువ్యము మొదలైన దిక్కులందు సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, జాంబవంతుడు యుండగా మధ్యనందు నల్లని కలువవలె సుందరమైన కాంతి కలిగిన రాముని భజించుచున్నాను. 

వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం

కల్పవృక్షము క్రింద, బంగారుమంటపమందు, పుష్పకము నడుమ మాణిక్య పీఠమందు, సీతతో కూడి వీరాసనమందున్నట్టి, ఎదుట ఆంజనేయుడు పలుకుచుండగా, పరతత్త్వమును మునులకు చెప్పుచు, భరతుడు మొదలగువారిచే ఆచరించబడిన, నల్లని రాముని భజిస్తున్నాను.

జానక్యాః కమాలంజలిపుటే యాః పద్మరాగాయితా
న్యస్తా రాఘవ మస్తకే తు విలసత్కుంద ప్రసూనాయితాః
స్రస్తాః శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితాః
ముక్తా స్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా

ఏ ముత్యములు సీతమ్మ పద్మమువంటి నిర్మలమైన దోసిలియందు పద్మరాగ మణులవలెనున్నవో (ఆమె దోసిలు ఎరుపు గనుక ఎర్రగా యున్నవి అనుట), రాముని శిరముననుంచబడుచు మల్లెపూవువలె నున్నవో (దోసిలికి తలకు మధ్య పలువరుస వలె తెలుపుగా యుండుట), జారుచు రాముని నల్లని దేహకాంతితో కూడినవై ఇంద్రనీలము వలె నున్నవో (నల్లని దేహకాంతిచే నల్లగా నున్నవి యనుట), అట్టి రామ వివాహమందలి తలంబ్రాల ముత్యములు మనకు శుభము కలిగించు గాక!

రామయ్య నీలమేఘ శరీర చాయ, ధనుర్బాణాలు, పక్కన సీతమ్మ. వామభాగమున ఆ తల్లి, వెనుక మరియు ప్రక్కల సోదరులు, ఇతర హితులు, ముందర హనుమంతుడు. ఇదీ రామ పట్టాభిషేక సన్నివేశం. సోదరులు, హితులు, సేవకులు, దాసుల మధ్య రామయ్య సీతమ్మతో ప్రకాశించే చిత్రాన్ని మొదటి మూడు శ్లోకాలు వర్ణిస్తున్నాయి. శ్రీరామచంద్రుని కొలువుతీరిన రీతి చాలా సుందరంగా వర్ణించారు కర్త. మొదటి శ్లోకంలో భద్రాద్రి రాముని గురించి ప్రస్తావించారు. కాబట్టి ఈ రామకర్ణామృతం రచయిత భద్రాద్రి రాముని సేవించిన వారై ఉండాలి.

ఇక నాలుగవ శ్లోకం మనకు ప్రతి పెండి పిలుపుపై కనిపించేది. సీతారాముల ఆదర్శ దాంపత్యం మన భారతీయ జీవనశైలిపై ఎంత ప్రభావాన్ని చూపిందో! వివాహమనగానే సీతారాముల కళ్యాణమే గుర్తుకు వచ్చేలా మనకు పెద్దలు రామాయణాన్ని జీవితంలో పొందుపరచారు. సీతారాముల దేహకాంతులను బట్టి ముత్యాల తలంబ్రాలు ఏ విధంగా అగుపిస్తున్నాయో కవి తెలిపారు మనకు. ఈ తలంబ్రాల సాంప్రదాయం దక్షిణాది వారిదే కాబట్టి రచయిత ఇక్కడి వాడని నా అభిమతం. భాషను, శైలిని, నేపథ్యాన్ని బట్టి చూస్తే సీతారాముల కళ్యాణము మరియు పట్టాభిషేకము వంటి వేడుకల కళ్లారా కాంచి ఈ శ్లోకాలు రచించబడ్డాయి అని అర్థమవుతోంది. కవి ఎవరో కానీ, మనకు ఎప్పటికీ వివాహమహోత్సవాలలో, రాములవారి వేడుకలలో ఎప్పటికీ నిలిచిపోయే సాహిత్య వైభవాన్ని మనకు సంపదగా ఇచ్చారు. మరిన్ని శోకాలతో ముందు భాగాలలో

18, మే 2015, సోమవారం

బాలమురళీ రవం - శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం

బాలమురళీ రవం -  శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం



శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం
వరసిద్ధి వినాయక భక్త జనాళి పోష వర చంద్రమౌళి సుత

దాసార్చిత పాద భాసురాంగ కరుణాసముద్ర వర వాయుపుత్ర హనుమంత వరప్రద
శ్రీ సకల శివంకర మారుతి మామవతు
వర రామ సునామ సుధారస పాన దీన నిజ భక్త భయాపహ
శ్రి సకల శివంకర మారుతి మామవతు

నంద నందన వందనమస్తు తే కుంద రదన ముకుంద మురహర
మందరోద్ధర వందిత బుధజన బృంద హృదయ నివాస సుందర
మందహసిత వదనారవింద మకరంద పాన సంగీత సుధాకర

శ్రి సకల కళా పరిపూర్ణ దయాశరధే
వరదాభయదాయక మామవ మంగళాంగ మురళీరవ మోహన

శ్రీ సకలకళా పరిపూర్ణ దయాశరధే
శ్రి సకల శివంకర మారుతి మామవతు
శ్రి సకల గణాధిప పాలయమాం అనిశం

ఓ సకల గణములకు అధిపతియైన విఘ్నేశా! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము. నీవు కామ్యములను తీర్చి భక్తులను కాపాడే వాడవు! చంద్రుని ధరించే శివుని కుమారుడవు!

దాసులచే అర్చించబడిన పాదములు కలిగి, ప్రకాసించే దేహంగములు కలిగి వాయుపుత్రుడవైన ఓ హనుమంతా! వరాలను ప్రసాదించే వాడా! సకల శుభములను కలిగించే మారుతీ! నన్ను అనుగ్రహించుము! వరములిచ్చే రాముని దివ్య నామ రసామృత పానం చేసిన, దీనులైన నిజ భక్తుల భయాలను తొలగించే, సకల శుభాలను కలిగించే మారుతీ! నన్ను అనుగ్రహించుము!

నందుని కుమారా! నీకు వందనములు! మల్లెమొగ్గలవంటి పలువరుస కలవాడా! ముర అనే రాక్షసుని సంహరించిన వాడా! మందర పర్వతాన్ని మోసిన వాడా! నీకు నమస్కరించిన పండితుల హృదయాలలో నివసించే వాడా! అందగాడా! చిరునవ్వు చిలికిస్తూ తేనె వంటి సంగీతాన్ని పలికించే ఓ శ్రీకృష్ణా! ఓ సకల కళాపరిపూర్ణా! దయాసాగరా! మురళీరవముతో విశ్వాన్ని సమ్మోహనం చేసే కృష్ణా! నాకు వరములు, అభయము ఇమ్ము!

ఓ సకల కళాపరిపూర్ణా! దయాసాగరా!
సకల శుభములను కలిగించే మారుతీ! నన్ను అనుగ్రహించుము!
ఓ సకల గణములకు అధిపతియైన విఘ్నేశా! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము!

బాలమురళీకృష్ణగారి మరో ఆణిముత్యం ఈ ఆరభి రాగంలోని శ్రీ సకలగణాధిప...ఇందులో ముగ్గురు దేవతలను నుతిస్తున్నారు కృతికర్త - మొదట గణపతిని, తరువాత హనుమంతుడిని, చివర శ్రీకృష్ణుడిని. సంస్కృత భాషలో ఈ కృతి రచన జరిగింది. దైవముల గుణగణ వర్ణనకు ఆరభి రాగం సముచితమైనది అని మనకు సాధించెనే ఓ మనసా అనే త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తన ద్వారా అర్థమవుతుంది. ఘనమైన ఈరాగంలో ఈ సంకీర్తనను కట్టడం బాలమురళి గారి సంగీత మేధో సంపత్తికి సరస్వతీ కటాక్షానికి నిదర్శనం.

ఏ అర్చనలోనైనా తొలుత గణపతి పూజ తప్పనిసరి. అందుకే వాగ్గేయకారులు తొలుత ఆ విఘ్నవినాశకుడు, వరప్రదుడు, శివపుత్రుడైన గణపతిని మధురమైన పదాలలో కొలుస్తున్నారు. వాగ్గేయకారుల ప్రధాన లక్షణం దైవానికి దాసులవ్వటం. అందుకే ఆయన దాసులలో అగ్రగణ్యుడైన హనుమంతుని నుతిస్తున్నారు.  చివర అయన ముద్రకు మూలదైవమైన శ్రీకృష్ణుని నాలుగు ఎక్కువ పదాలతో నుతిస్తున్నారు. కృష్ణుడు అనగానే పదాలు, అందము, మురళీ గాన మాధుర్యము గుర్తుకు వచ్చేలా బాలమురళి గారు ఈ చరణాన్ని సాహిత్యంతో అలంకరించారు.

సకల కళా పరిపూర్ణ దయాశరథే అని పొగడటంలో ఆంతర్యం తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు గురువుల వద్ద అన్ని విద్యలను నేర్వటంతో పాటు బాలునిగా ఉన్నప్పుడు ఎన్నో చిలిపి చేష్టలను చేసి గోకులాన్ని మురిపించాడు. అటు తరువాత ప్రేమకు నిర్వచన కృష్ణ భక్తిగా నిర్వచనం కలిగించాడు. ప్రేమకు సంగీతము, నృత్యము ఉచ్చ్వాస నిశ్శ్వాసల వంటివి. వెదురుపొదలలో ఒదిగి ఆయన వేణువును పలికిస్తే గోపకులమంతా తమను తాము మరచి ఆయనతో ఏకమయ్యింది. అలాగే కురు పాండవ సంగ్రామంలో ఆయన ప్రదర్శించిన రాజనీతి, ఉపాయములు ఆయనను సకల కళా పరిపూర్ణతకు మచ్చుతునకలు. అందుకే ఈ చరణం ఈ కృతికి పతాకస్థాయినిచ్చింది.

పదప్రయోగం, రాగ-భావ సమ్మేళనం, భక్తి అన్నీ సమపాళ్లలో కలిసి ఈ కృతిని బాలమురళి గారి రచనలలో అగ్రగణ్యగా చేశాయి. ముందు తరాలవారికి బాలమురళిగారి కృతులు తప్పక మార్గదర్శకాలు.

ఈ కీర్తనను బాలమురళి గారి గళంలో వినండి.

17, మే 2015, ఆదివారం

పాండవులు అజ్ఞాత వాసం - ధౌమ్యుని ఉపదేశం


మహారాజులైన పాండవులు జూదంలో ఓడి 12 ఏళ్ల వనవాసం ముగించుకొని 13వ ఏట అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో మారు పేరుతో వివిధ వృత్తులలో ఉండాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు వారి ఇంటి పురోహితుడైన ధౌమ్యుడు ఇలా ఉపదేశిస్తాడు:

"పాండవులారా! మీకు విషయాలు తెలిసినా హితులు చెప్పటం వారి ధర్మం. మీరు రాజ మందిరంలో నివసించవలసిన తీరును గురించి చెబుతాను.

అగౌరవం జరిగినా, గౌరవం కలిగినా, అజ్ఞాతంలో ఈ సంవత్సరం గడిపి పదునాలుగో సంవత్సరంలో సుఖంగా జీవించండి.

1. రాజు గారిని చూడటానికి ముందు ద్వారపాలకుని అనుమతి పొందాలి. రాజ సంపదల మీద మక్కువ పడరాదు. ఇతరులు ఆశించని ఆసనాన్నే కోరుకోవాలి
2. నేను రాజు ఇష్టుడను కదా అని రాజుగారి వాహనం కాని, శయ్య కాని, పీఠం కాని, ఏనుగు కాని, రథం కాని అధిరోహించరాదు. అలా ఉన్న నిపుణుడే రాజు దగ్గర నివసించ గలుగుతాడు
3. రాజు అడుగకుండా ఎప్పుడూ ఆయనకు కర్తవ్యం బోధించకూడదు. మౌనంగానే సేవించాలి, సమయం తెలిసికొని ప్రశంసించాలి
4. అసత్యం పలికే వారిని రాజులు దోషులుగా చూస్తారు. వాడు మంత్రి అయినా అవమానిస్తారు.
5. రాజు గారి భార్యలతో ఎన్నడూ సాంగత్యం చేయకూడదు. అలా అంతఃపురంలో తిరిగే వారితోనూ, రాజుగారిని ద్వేషించేవారితోనూ, ఆయన శత్రువులతోనూ స్నేహం ఉండకూడదు
6. ఎంత చిన్న పని అయినా రాజుగారికి చెప్పిన తరువాతే చెయ్యాలి. ఇలా ఉండేవాని ఎప్పుడూ హాని కలుగదు
7. కూర్చోటానికి ఉత్తమ ఆసనం లభించినా రాజు ఆజ్ఞాపించేంతవరకూ రాజ మర్యాదను పాటిస్తూ, రాజాజ్ఞకై ఎదురు చూడాలి. మర్యాద మీరి ప్రవర్తించేవారు పుత్రులైనా, సోదరులైనా సరే శత్రుసంహారకులైన రాజులు గౌరవించరు.
8. రాజును అగ్నివలె (దేవుని వలె) శ్రద్ధతో సేవించాలి. ఈ సేవలో ఏ మాత్రం కల్మషము ఉన్నా రాజు అతనిని చంపి తీరుతాడు. అందులో సందేహం లేదు
9. రాజు నియోగించిన పనినే సేవకుడు చేయాలి. సేవలో ఏమరుపాటు, గర్వం, కోపం ఏ మాత్రం ఉండరాదు.
10. ఇది కార్యము, అది అకార్యము అని నిశ్చయించవలసినపుడు సేవకుడు రాజుకు హితము, ప్రియమైనదే చెప్పాలి. రెండూ కలిపి కుదరక పోతే ప్రియాన్ని విడచి హితమే చెప్పాలి
11. నేను రాజుకు హితుడనే అని పండితుడు స్వేచ్ఛగా ప్రవర్తించరాదు.
12. తెలివి గల పండితుడు రాజుకు కుడివైపు కానీ, ఎడమ వైపు కానీ కూర్చోవాలి. ఎదుట కూర్చొన కూడదు. రాజు గారు చూస్తుండగా సేవకుడు ఏ చిన్న పురస్కారమూ స్వీకరించ కూడదు.
13. రాజు యొక్క అసత్య భాషణను ఎక్కడా బయటపెట్టకూడదు.
14. రాజు దగ్గర పెదవులు కొరక రాదు, చేతులు, కాళ్లను చాచరాదు. సాగదీసి కూర్చొన రాదు. ఆవులింత, అపానవాయువు విసర్జన కాని, ఉమ్మివేయటం కాని ఇతరులకు తెలియకుండా మెల్లగా చేయాలి.
15. ఇతరులెవరైనా నవ్వులపాలు అవుతున్నప్పుడు సంతోషించరాదు, నవ్వరాదు. అతిధైర్యంతో ప్రవర్తించరాదు.
16. లాభం కలిగితే పొంగిపోకుండా, అవమానం కలిగితే కుంగిపోకుండా, నిత్యం ఏకాగ్రతతో ఉండేవాడు రాజుగారి కొలువులో ఎక్కువకాలం ఉండగలడు.
17. ఎప్పుడైనా, తన శ్రేయస్సుకు భంగం కలిగే పక్షంలో రాజుతో ఇతరులను కలువనీయ కూడదు. సంవాదం చేయనీయరాదు.
18. రాజు ఎవరినైనా ఎక్కడికైనా పంపాలనుకొన్నప్పుడు తానే ముందుకు వచ్చి 'నేనేమి చేయగలను ' అని రాజుకు ఉత్సాహంగా తెల్పిన వాడు రాజు ఆస్థానంలో చిరకాలం ఉంటాడు.
19. సర్వకాల సర్వావస్థలయందు చలించకుండా, సంశయము లేకుండా వర్తించేవాడు రాజుగారి ఆస్థానంలో చిరకాలం ఉండగలడు
20. సేవకుడు రాచకార్యం మీద ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు భార్య బిడ్డలను, భోగాలను స్మరించరాదు.
21. రాజుతో సమానంగా ఆభరణాలు, వేషభూషణలు ధరించరాదు.
22. రాజుగారి ద్రవ్యం ఎట్టిపరిస్థితులలోనూ తాకరాదు.
23. రాజు గారు ఇచ్చిన కానుకలను ధరిస్తే రాజు సంతోషిస్తాడు

పాండు కుమారులారా! ఈ విధంగా మీ మనస్సులను చిక్కబట్టుకొని ఈ సంవత్సరం ప్రవర్తించండి."

అని ధౌమ్యుడు హితవులు పలుకుతాడు. పాండవులు గురువుగారి మంచిమాటలకు గౌరవ వాక్యాలు పలికి, కార్యసిద్ధికై హోమం చేసి, బ్రాహ్మణులకు, తాపసులకు దానం చేసి ముందుకు పయనమవుతారు.

విలువలు, ధర్మాచరణకు రామాయణం దర్పణమైతే నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ రకాలైన వ్యక్తిత్వాలను, మంచి-చెడులతో కూడిన సందర్భాలలో మనిషి ఎలా మెలగాలో, తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో, ఏయే వ్యక్తులు ఎలా మెలగి ఏమి ఫలితాన్ని పొందారో తెలిపేది మహాభారతం. పాండవులు పరిస్థితులకు అనుగుణంగా తమ క్షత్రియ లక్షణాలను మరచి, మారువేషంలో సేవకులుగా ఉండాలంటే ఎంతో మానసిక శిక్షణ, సంయమనం కలిగి తమ జ్ఞానంతో, కార్య కౌశలంతో రాజుగారి ఆస్థానంలో మెలిగారు. అన్నదమ్ములు, ద్రౌపది విలక్షణమైన లక్షణాలు, ప్రావీణ్యాలు, వ్యక్తిత్వాలు కలిగిన వారు. తదనుగుణంగా వృత్తులను ఎన్నుకున్నారు. ఎంతో సమర్థవంతంగా, ఒక పక్కా ప్రణాలికతో ఏడాది కాలాన్ని గడిపారు. కురు సార్వభౌముడు ఎంతటి పరాక్రమ సంపన్నుడైనా, తమ ఉనికిని తెలుసుకోనీకుండా అజ్ఞాతవాసాన్ని గడిపారు. ఈ కష్టకాలంలో ధర్మరాజు మేధస్సు, గురువుల బోధలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత, శ్రీకృష్ణుని ఆశీస్సులు వారికి అండగా నిలిచాయి.  రచరికపు వైభవంలో మెలగిన క్షత్రియులు ఇంకొకరి ఇంట సేవకులుగా ఉన్నారంటే అది వారి వ్యక్తిత్వాలకు ప్రతిబింబం. అన్ని విషయాలు తెలిసినా గురువుగా తన ధర్మాన్ని నిర్వర్తించి పాండవుల అజ్ఞాతవాస విజయానికి ధౌమ్యులు తోడ్పడ్డారు. 

16, మే 2015, శనివారం

రామలక్ష్మణ-హనుమత్సమాగమం - మనస్తత్వ శాస్త్ర గని


రాముని భక్తులలో హనుమంతుడు శ్రేష్ఠుడు. మరి వారు ఈ రామావతారంలో మొట్టమొదట ఎప్పుడు ఎలా కలిశారు? ఈ ఘట్టాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలోని కిష్కింధ కాండ రెండవ సర్గంలో వివరించారు.

వారులకు ప్రభువైన సుగ్రీవుడు బలశాలి ఐన సోదరుడు వాలికి భయపడి ఋష్యమూక పర్వత సమీపంలో తిరుగుతూ అద్భుత రూపవైభవం గల రామలక్ష్మణులను చూస్తాడు. వారిద్దరూ వాలి పంపగా వచ్చిన వారేమో అని చాలా భయపడి, వణికి విచారగ్రస్తుడౌతాడు. ఆ ప్రాంతం మతంగాశ్రమ ప్రదేశం. చాలా పవిత్రమైనది, సుఖప్రదమైనది.వాలి ఆ మతంగ ముని శాపగ్రస్తుడు. వాలికి భయపడిన సుగ్రీవాది వానర సమూహం మతంగాశ్రమాన్ని ఆశ్రయించి ఉంటారు. రామలక్ష్మణులను చూచి ఆ వానరులంతా ఆశ్రమంలోకి పరుగిడుతారు. వారిని వాలి మనుషులుగా భావించి సుగ్రీవుడు ఒకచోట నిలువలేక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.  తన మంత్రులతో "సహచరులారా! ఈ దట్టమైన అడవిలో నారబట్టలు ధరించిన వీరెవరో వాలి పంపగా వచ్చిన గూఢచారులే" అని అంటాడు. వానర సమూహమంతా రక్షణ కోసం అక్కడ ఒక కొండ నుండి ఇంకొక కొండకు పరుగులు తీస్తూ, వృక్ష సంపదను ధ్వంసం చేస్తూ ఋష్యమూక పర్వతముపై ఉన్న సుగ్రీవుని చూట్టూ చేరుతారు. సుగ్రీవుని మంత్రులు అతని చుట్టూ అంజలి ఘటించి నిలబడతారు.

అప్పుడు మాటనేర్పరి (వాక్యకోవిదుడని వాల్మీకి మహర్షి పదం) అయిన హనుమంతుడు సుగ్రీవునితో ఇలా అంటాడు "ఓ వానరశ్రేష్ఠుడా! వాలి భయంతో నీవు ఆందోళనలో ఉన్నావు. కానీ, ముని శాపకారణంగా వాలి ఈ ప్రాంతానికి రాలేడు. నీ అన్న నీ భార్యను అపహరించిన దుష్టుడు. ఆ దుష్టాత్మునకు నీవు భయపడుతున్నావు. కానీ, ఇది నీకు సురక్షిత ప్రదేశము. ఇక్కడ నీకు వాలి వలన ఎటువంటి ఆపదా కలుగదు. వానరులకు ప్రభువువై ఉండి నీవు చంచలత్వమును ప్రకటించటం ఆశ్చర్యకరముగా ఉంది. నీ భయము వలన బాగా ఆలోచించవలసిన విషయముపై కూడా నీ బుద్ధి స్థిరముగా నిలుపుట లేదు. నీ బుద్ధిని ఇంగితమును ఉపయోగించి ఇతరుల వ్యవహారమును బట్టి వారి స్వభావమును గుర్తించి సముచితమేదో దాని ఆచరింపుము. బుద్ధికి పని చెప్పని రాజు ప్రజలను పరిపాలించలేడు".

ఇది విన్న సుగ్రీవుడు "వారిరువురు ధనుర్బాణములు ధరించి, ఖడ్గమును ధరించిన ఆజానుబాహువులు. ఇంద్రునిలా పరాక్రమవంతులుగా కనిపిస్తున్నారు. అట్టి వారిని చూసిన ఎవరికి భయము కలుగదు? వీరిద్దరూ వాలి పంపగా వచ్చిన వారే అని నా అభిప్రాయం. రాజుకు రకరకాల మిత్రులు ఉంటారు. ఈ విషయంలో వారిరువురినీ నమ్మరాదు. శత్రువులు మారువేషంలో వచ్చినప్పుడు వారిని గురించి లోతుగా విచారించవలెను. వారు నమ్మిన వారి బలహీనతలను తెలిసికొని దెబ్బతీస్తారు. వాలి ఇట్టి కార్యములలో సమర్థుడు. సామాన్యుల రూపంలో వచ్చిన వారి గురించి లోతుగా తెలుసుకోవలెను. కాబట్టి, నీవు కూడా సామాన్య రూపములో వారి వద్దకు వెళ్లి, ఇంగితమును ఉపయోగించి వారి మంచి-చెడు లక్షణములను తెలుసుకో. వారు మనకు అనుకూలురుగా కనిపిస్తే వారిని ప్రశంసలతో ముంచెత్తి, చేష్టలతో తృప్తి పరచి వారి విశ్వాసమును చూరగొని వారి నిజమైన అంతర్యమును కనుగొనుము. ఇక్కడకు ధనుర్ధారులై వచ్చుటకు కారణము కనుగొనుము. వారి మాటల పద్ధతిని బట్టి, ముఖ కవళికలను బట్టి వారు సజ్జనులా కాదా అని తెలుసుకొనుము" అని ఆదేశిస్తాడు. ఎదురులేని వాడు, రాజనీతి కుశలుడు అయిన హనుమ సరే అని రామలక్ష్మణుల వద్దకు బయలుదేరుతాడు. ఒక్క గెంతులో ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులున్న ప్రాతానికి చేరుకుంటాడు.

వాయుసుతుడైన హనుమంతుడు వారికి తన పట్ల నమ్మకం ఏర్పడటానికి వానర రూపాన్ని త్యజించి భిక్షువు రూపం ధరిస్తాడు. వారి మనస్సులను ఆకట్టుకొనునట్లుగా మధుర వచనాలను పలుకుతూ వారి వద్దకు చేరతాడు. వారికి ప్రణమిల్లి, భక్తి ప్రపత్తులతో కొనియాడుతూ తగిన విధంగా సంభాషితాడు.

"ఓ స్ఫురద్రూపులారా! మీరిద్దరూ రాజర్షులవలె, దేవతల వలె కనబడుతున్నారు. తీవ్రమైన వ్రతదీక్షను చేపట్టిన తాపసుల వలె ఉన్నారు. ఈ పంపాతీర ప్రాంతమునకు ఎందుకు వచ్చినారు? ఓ సజ్జనులారా! మీరు నారబట్టలను ధరించి తాపసులవలె ఉన్నారు. బంగారు వన్నె గల మీ రాక వలన మధురజలములు గల పంపా తీత్రం ఎంతో శోభిల్లుచున్నది. మీరెవరు? బలపరాక్రమ సంపన్నులు, బాహుబలురు అయిన మీ చూపులకు ఇక్కడి ప్రాణులన్నీ భయపడుతున్నవి. ఇంద్రధనుస్సు వంటి చాపములను ధరించిన మీరు శత్రువులను సంహరించుటలో దక్షులు. అతిలోక సుందరులైన మీ కాంతులు అపూర్వము. శ్రేష్ఠమైన వృషభమువలె మీరు గంభీరముగా యున్నారు. ఏనుగు తొండము వంటి భుజములు కలిగిన మీ తేజస్సు వలన ఈ మహాపర్వతము దివ్యకాంతిమంతమై ప్రకాశిస్తున్నది.

దేవతల వలె పరాక్రమవంతులు, తామర రేకుల వంటి కన్నులు కలవారు, జటావల్కములు ధరించి యున్నను మీరు మహావీరులు. శౌర్యపరాక్రమములలో మీకు సాటి లేరు. దేవలోకము నుండి దిగి వచ్చినట్లున్నారు. విశాల వక్షః స్థలము, సింహము వలె చూపులు, ఉత్తమ రాజలక్షణములు కలిగిన మీరు రాజ్య భోగములను త్యజించి నారబట్టలను ధరించి ఈ దుర్గమమైన అరణ్య ప్రాంతమునకు వచ్చుటకు గల కారణమేమిటి? మీ ఆయుధములు అపూర్వము, ఆశ్చర్యకరముగా ఉన్నవి. మీ తూణీరములు చూడముచ్చటగా పదునైన బాణములు కలిగి ఉన్నాయి.  పొడవైన మీ ఖడ్గములు మేలిమి బంగారముతో అలంకృతమై ఉన్నాయి. అవి కుబుసము విడిచిన పామువలె వెలుగుతున్నాయి.

ఓ సత్పురుషులారా! నేను ఇంతగా మాట్లాడుచున్నను మీరు పెదవి విప్పరేల? వానరులకు ప్రభువైన సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు బుద్ధిశాలి. అతడు తన అన్నయగు వాలిచే వంచించ బడి దుఃఖించుచు ఈ ప్రాంతమంతా తిరుగుతున్నాడు. అతడు పంపగా నేను మీ వద్దకు వచ్చాను. నేను హనుమంతుడు అను పేరు గల వానరుడను, వాయుసుతుడను. సుగ్రీవుని మంత్రిని, కామరూపుడను. కోరిన చోటికి వెళ్లి రాగలను. సుగ్రీవునికి ప్రీతి కలిగించుటకై సన్యాసి రూపంలో ఋష్యమూకపర్వతము నుండి ఇక్కడకు వచ్చాను" అని పలికి వారి సమాధానం కోసం వేచియుంటాడు.

అప్పుడు రాముడు లక్ష్మణునితో "లక్ష్మణా! ఇతడు సుగ్రీవుని మంత్రి. మనం ఆ సుగ్రీవుని కలియుటకు కోరుకొనుచుండగా అతడే మన వద్దకు తన మంత్రిని పంపించాడు. ఈతడు మాటలలో కుశలుడు. నాయందు, సుగ్రీవుని యందు ప్రీతి కలవాడు. కనుక తగు విధముగా మాట్లాడుము. ఋక్సామయజుర్వేదములలో సుశిక్షితుడైన వాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు. ఇతటు చాలా విషయాలు మాట్లాడాడు. కానీ, అపశబ్దము ఒక్కటి కూడాలేదు. కనుక ఇతడు సమస్త వ్యాకరణములను కూలంక్షముగా నేర్చినవాడు. ఇతడు మాట్లాడినప్పుడు ముఖములో, కనులలో, ఫాలభాగమునందు, ఇతర అవయవములందు ఎట్టి వికారమూ కనబడలేదు. ఇతడు సంక్షిప్తంగా, సందిగ్ధతకు తావు లేకుండా మాట్లాడాడు. ఆగుచు గాని, అర్థరహితమైన పదములను కానీ ఉపయోగించలేదు. తొందరపాటు లేకుండా, ఆత్మవిశ్వాసముతో మాట్లాడినాడు. మనసులోని మాటను స్పష్టముగా తెలిపినాడు. మరీ బిగ్గరగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మధ్యమ స్వరముతో ఉచ్చరించాడు.

ఇతడు పలికిన మాటలు వ్యాకరణ సమ్మతములు. స్పష్టముగా, క్రమమును అనుసరించి యున్నవి. లోకసహజమైన వేగము కలవి. శుభదాయకములు. ఆకర్షణీయములు. ఈ మారుతి వచనములు భావములను స్పష్టముగా ప్రకటించుటకు అనుగుణమైన స్వరస్థానములో ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈతని మధుర వచనాలు కత్తి దూసి పైకి వచ్చే శత్రువునైనా చల్ల బరచుతాయి. ఇట్టి బుద్ధి కుశలుడు, కార్య సాధకుడు దూతగా కలిగియున్న రాజు అదృష్టవంతుడు. ఇటువంటి వారి వలన రాజు కార్యములన్నీ సిద్ధించును" అని పలుకుతాడు.

లక్ష్మణుడు అన్న మాటలు విని హనుమంతునితో "ఓ విద్వాంసుడా! (విద్వన్ అన్నది వాల్మీకి మహర్షి ఉపయోగించిన పదము). కబంధుని ద్వారా సుగ్రీవుని గుణగణాలు విన్నాము. అతని కొరకు వెదుకుతూ ఇక్కడకు చేరాము. సత్పురుషుడవైన ఓ మారుతీ!  సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలు మాకు సమ్మతము. మేము మీ సూచనలను పాటించెదము" అని పలుకుతాడు.

హనుమంతుడు లక్ష్మణుని సమయోచితమైన పలుకులకు సంతోషపడి సుగ్రీవ కార్యము సఫలమైనది అని  నమ్మి సుగ్రీవునికి రామలక్ష్మణులకు మైత్రిని ఏర్పరచుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుని ద్వారా సీతాపహరణ వృత్తాంతము తెలిసుకుని వారికి సుగ్రీవుని సాయాన్ని ఆశ్వాసిస్తాడు. సన్యాసి రూపం త్యజించి, తన వానర రూపాన్ని వారికి చూపి, సీతమ్మను వెదకి కనుగొనుటలో సుగ్రీవుని సాయం కోరవచ్చిన రామలక్ష్మణులకు, సోదర బాధితుడైన సుగ్రీవునికి మైత్రీ బంధం ఏర్పరచుటకు వారివురిని తన భుజములపై తీసుకొని సుగ్రీవుడున్న ఋష్యమూక పర్వతానికి చేరుకుంటాడు.
ఈ ఘట్టంలో ఎంతో రాజనీతి, బుద్ధి కుశలత, మనస్తత్వశాస్త్రము మనకు కనబడుతుంది.

1. సోదరుడి వంచనకు గురైన సుగ్రీవుడు పరాక్రమవంతులైన ఇద్దరిని చూసి శత్రువులుగా భావించటం - ఇది మనలో ఎందరికో నిత్యం జరుగుతునే ఉంటుంది. పరిస్థితుల ప్రభావానికి లోనై విచక్షణను కోల్పోయే స్థితి ఇది. భయం మనిషి ఆలోచనను వ్యతిరేక దృక్పథం వైపు నెడుతుంది. మరి అప్పుడు ఏమి జరగాలి? మంత్రి అన్న వాడు బాధ్యత రాజును హెచ్చరించి, ఆ మతంగాశ్రమానికి వాలి రాడు అని సాంత్వనను కలిగించి, అతనిని కార్యోన్ముఖుడిని చేయటం. సుగ్రీవుని హితుడైన హనుమంతుడు తన మాటలలో రాజు లోపాన్ని అతనిని నొప్పించకుండా తెలియజేసి ఆలోచింపజేస్తాడు.

2. శత్రువులను ఏ రూపంలో వచ్చినా నమ్మరాదు. వారిని కూలంకషంగా పరిశీలించి అడుగు ముందుకు వేయాలి అన్న సుగ్రీవుని ఆదేశం - మంత్రి హనుమంతుని ఆశ్వాసనతో కార్యోన్ముఖుడైన రాజు తిరిగి తన విచక్షణను ఉపయోగించి కొత్త వారితో ఎలా మెసలి వారి ఉద్దేశాలను కనుక్కోవాలో హనుమంతునికి ఆదేశిస్తాడు. ఇక్కద మనకందరికీ ఒక పాఠం ఉంది. మన అసలు రూపం తెలియకుండా, మధుర వచనాలు పలికితే ఎదుటు వాని ఉద్దేశం బయటపడుతుంది. వారి గురించి తెలుసుకున్న తరువాత మైత్రిని పెంపొందించుకోవాలి అన్నది.

3. రామలక్ష్మణులతో హనుమంతుని పలుకులు - వారి నిజలక్షణాలను వివరంగా, వైభవంగా పొగడి హనుమ వారిని సంతుష్టులను చేస్తాడు. తాను దర్శించిన రూపలక్షణాలను, ధైర్య పరాక్రమాలను వివరంగా, స్పష్టతతో పలికి వారి రాకకు గల కారణాన్ని అడుగుతాడు. శుభలక్షణాల వలన అక్కడ కలిగిన మార్పులను తన అనుభూతిగా పలికి వారి మనసులను చూరగొంటాడు. ఇది దూత లక్షణం. బుద్ధి కుశలతకు తార్కాణం. హనుమంతుని జ్ఞానం ఒక ఎత్తైతే అతని సమయస్ఫూర్తి, బుద్ధి కౌశలము మరో ఎత్తు.

4. హనుమంతునిపై రాముని విశ్లేషణ - ఈ సందర్భంలో రాముని సంభాషణలు మనస్తత్వశాస్త్రానికి ప్రమాణాలు. మనం మాట్లాడేటప్పుడు ఉచ్చారణ, ధ్వని హెచ్చు తగ్గులు, వ్యాకరణము, పలుకులకు గల జ్ఞాన నేపథ్యము - ఇవన్నీ రాముని మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. మాట్లాడేటప్పుడు మన ముఖ కవళికలు, అవయవాలలో ప్రతిక్రియలు, కంటి సంజ్ఞలు ఇవన్నీ మన అంతరార్థాన్ని తెలియజేస్తాయి. పొగడ్తలలోని అంతర్యాన్ని కూడా ఇవి తెలియజేస్తాయి. పూర్తిగా అర్థవంతంగా, సంధిగ్ధత లేకుండా మాట్లాడతం ఒక పెద్ద శుభలక్షణం. దీనిని రాముడు లక్ష్మణునికి వివరిస్తాడు. హనుమనుంతుని ప్రతి పలుకూ కూలంకషంగా గమనించి, విశ్లేషించిన తరువాతే రాముడు అతనిని నమ్మవచ్చు అని లక్ష్మణునికి తెలియజేస్తాడు. హనుమంతుని వంటి జ్ఞాని, కుశలునితో ఎలా సంభాషించాలో కూడా చెబుతాడు.

5. దూతగా హనుమంతుని కార్యసిద్ధిపై ఏకాగ్రత - మొత్తం సంభాషణలలోనూ హనుమంతుని లక్ష్యం ఒక్కటే. సుగ్రీవుని కార్యం నెరవేర్చటం. అణువణువులోనూ దానిపై దృష్టి, శ్రద్ధ. ఆ లక్ష్యం గుర్తు పెట్టుకునే ప్రతి పలుకూ, ప్రతి అడుగూ. ఇది దౌత్య కార్యాలయాలలో పని చేసే వారికి, ప్రభుత్వ ఉన్నత అధికారులకు, రాయబారులకు పెద్ద నిఘంటువు.

ఈ సర్గలలో వాల్మీకి మనకు రెండు ముఖ్యమైన కార్యములు పరస్పర అవగాహనతో, సహకారంతో ఎలా సాధించుకోవచ్చో, దానికొరకు ఎలా ప్రణాళిక వేసుకోవాలో అద్భుతంగా వివరించారు. భయాందోళనలో ఉన్న వానరులకు, వారి ప్రభువుకు హనుమంతుడు తన బుద్ధి కుశలతతో ఊరట కలిగిస్తాడు. సుగ్రీవుడు తన విచక్షణను తిరిగి పొంది కర్తవ్యం గురించి ఆలోచిస్తాడు. రామ లక్ష్మణులు తమ కార్యసిద్ధికై హనుమంతుడు, సుగ్రీవుని సహాయం తప్పని సరి అని గ్రహించి ముందుకు అడుగు వేస్తారు. మొత్తం మీద ఈ రామలక్ష్మణ-హనుమత్ సంవాదం నిరంతరం కొత్త మనుషులతో, కొత్త వ్యక్తిత్వాలతో వ్యవహరించే వారికి ఒక గొప్ప మనస్తత్వ శాస్త్ర గని. కార్యసిద్ధి కలిగించే సాధనం. అందుకే రామాయణం మానవ జన్మ సాఫల్యతకు గొప్ప ఆయుధం.

శ్రీరామశ్శరణం మమ! జై హనుమాన్! వందే వాల్మీకి కోకిలం! 

15, మే 2015, శుక్రవారం

రససిద్ధి - భక్తి



రససిద్ధి - ఆ రసాన్ని పూర్తిగా అనుభూతి చెంది దానిలో రమించటం. ఇదీ కళాకారుడి సాధనకు పతాక స్థాయి. రససిద్ధి పొందిన కళాకారుడికి తరువాత వేరే ఏదీ రుచించదు. అమృతత్వమంటే ఇదే. ఒక గాయకుడికి ఇది భావములో జీవించటం, దానిలో లయించి స్వరాలు పలికించటం. ఒక చిత్రకారుడికి గీయవలసిన బొమ్మలోని భావములో జీవించటం, దానికి జీవమివ్వటం రససిద్ధి. ఆస్వాదించగానే కళ్లు చెమర్చటం ఆ రససిద్ధికి సాఫల్యత. ఒక కవికి భావాన్ని పదప్రయోగంతో, శబ్ద శక్తితో, వ్యాకరణ శుద్ధితో రంగరించి ఒలికించటం రససిద్ధి. ఒక నాట్యకళాకరుడికి భావం ఆంగికంలో, ముఖ కవళికలలో, ముద్రలలో ప్రదర్శించి రసాస్వాదనలో ఎల్లలు లేకుండా నర్తించటం రససిద్ధి.

ఇలా ప్రతి కళకూ రససిద్ధి అత్యున్నతమైన లక్ష్యం. భక్తి ప్రాధాన్యమైన కళలలో రససిద్ధి ఎందుకు సులభం?

1. పరిపూర్ణమైన, నిర్వచించలేని, సర్వోన్నతమైన దివ్యత్వాన్ని ఒక కళ ద్వారా వ్యక్త పరచటం కాబట్టి. అన్ని భావనలలోని 'నేను' అన్న అహంకారాన్ని పక్కకు పెట్టి ఇంకొక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సమస్త రసాలను పండించగలిగే అవకాశం కాబట్టి
2. యుగ యుగాలుగా రససిద్ధి పొందిన వారి అనంతమైన దివ్య శక్తి ఆయా ఉపకరణాలలో ఒదిగి ఉంటుంది కాబట్టి
3. అనంతమైన దివ్యత్వాన్ని సూక్ష్మ రూపంలో ఒక కళ ద్వారా సేవించటం కాబట్టి. దైవానికి మానవ రూపమిచ్చి, మనలో ఒకనిగా భావించి, మన భావనలను సమర్పించి, తనలో ఏకమయ్యే సదవకాశం కాబట్టి.

భగవంతుని కోసం కాని కళ అసంపూర్ణమే. కొంత యాంత్రికంగానే గోచరిస్తుంది. పోతనగారు దీనిని చాలా అద్భుతంగా వివరించారు.

కంజాక్షునకుగాని కాయంబు కాయమే? పవనగుంభిత చర్మ భస్త్రి గాక;
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమధ్వనితోడి ఢక్కగాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్విగాక;
కమలేశు జూడని కన్నులు కన్నులే? తనుకుడ్యజాల రంధ్రములు గాక;
చక్రి చింత లేనిజన్మంబు జన్మమే? తరళసలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు, విబుధుడే? పాదయుగముతోడి పశువు గాక...

"భగవంతుని కోసం కాని శరీరము గాలితో నింపబడిన చర్మపు సంచీ మాత్రమే. శ్రీహరిని పొగడని కంఠం ఢమ ఢమ శబ్దములు చేసే డప్పు మాత్రమే. నారాయణుని పూజించని చేతులు ఆకులతో కూడిన కొమ్మలు మాత్రమే. లక్ష్మీపతిని చూడని కన్నులు గోడలోని రంధ్రాలు మాత్రమే. చక్రధారిని స్మరించని జన్మ కేవలం నీటి బుడగ మాత్రమే. విష్ణుభక్తి లెని పండితుడు రెండు కాళ్లున్న పశువు మాత్రమే."

కళను పరమాత్మకు సమర్పించి రససిద్ధి పొందిన నాదయోగులు ఎందరో. వాగ్గేయకారుల దగ్గరినుండి మహాకళాకారిణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి వరకు ఈ కళ ద్వారా పరమాత్ముని సేవ కొనసాగుతునే ఉంది.

అధరం మధురం అని సుబ్బులక్ష్మి గారు ఆ శ్రీకృష్ణుని నుతిస్తూ మధురాష్టకం పాడితే ఎదురుగా ఆ పరమాత్మ దివ్యమంగళ స్వరూపం ముందు నిలిచిందా అనిపిస్తుంది. భావయామి గోపాల బాలం అని పాడితే ఆ చిన్ని కృష్ణుడు ముద్దుగా ఎదుట నిలిచినట్లే. ఇలా ఎన్నో. కారణం ఆమెకు ఆ సంకీర్తనలోని భావం మనసులో నిలిచి ఆ దేవతా స్వరూపం కళ్లముందున్నంత విశ్వాసం. తాదాత్య్మత కలిగిన కళాకారిణి ఆమె. ఇలా రససిద్ధి పొందిన వారే కాలగమనంలో శాశ్వతమైన స్థానం పొంద గలిగారు. రససిద్ధికి భాష, దానిలోని మాధుర్యం, శబ్దాలలోని శక్తి, విశాలమైన హృదయము, భావ ప్రాధాన్యత, స్పష్టమైన వ్యక్తీకరణ, త్యాగశీలత, నిరాడంబరత ఎంతో ముఖ్యం.

ఇటీవలి కాలంలో శాస్త్రీయ సంగీత కళాకారులలో ఈ రససిద్ధి లోపించింది. అందుకే నేటి కళాకారుల గళాలలో ఆ సంగీతం మాధుర్యం లేక ఢమ ఢమల్లాగానే ఉంటోంది. శాస్త్రీయత పేరిట భావాన్ని ఖూనీ చేసి శబ్ద కాలుష్యంగా చేస్తున్నారు మన ప్రాచీన సంగీతాన్ని. భావయుక్తంగా, సాహిత్యోచితంగా పాడితే సంకీర్తనకు సంగీతం ప్రాణ వాయువులా నిలిచి పరమాత్మ మెడలో హారమవుతుంది. కళాకారులు ఈ రససిద్ధికి ప్రయత్నించకపోతే శాస్త్రీయ సంగీతాన్ని ప్రజలు ఆస్వాదించలేరు. దానికి గల పవిత్రత, ప్రాభవం తగ్గుతుంది. నేటి కళాకారులు దీనిని గమనించి సరిదిద్దుకుంటారని ఆశిద్దాం

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు అన్నారు త్యాగరాజుల వారు. స్వాంతము ఒక సరోజమని గ్రహించటానికి, దర్శించటానికి ఎంతో సాధన కావాలి. గాత్ర సేవ ద్వారా రససిద్ధి పొందిన మహా కళాకారిణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు..

ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు!!

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...