17, మే 2015, ఆదివారం

పాండవులు అజ్ఞాత వాసం - ధౌమ్యుని ఉపదేశం


మహారాజులైన పాండవులు జూదంలో ఓడి 12 ఏళ్ల వనవాసం ముగించుకొని 13వ ఏట అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో మారు పేరుతో వివిధ వృత్తులలో ఉండాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు వారి ఇంటి పురోహితుడైన ధౌమ్యుడు ఇలా ఉపదేశిస్తాడు:

"పాండవులారా! మీకు విషయాలు తెలిసినా హితులు చెప్పటం వారి ధర్మం. మీరు రాజ మందిరంలో నివసించవలసిన తీరును గురించి చెబుతాను.

అగౌరవం జరిగినా, గౌరవం కలిగినా, అజ్ఞాతంలో ఈ సంవత్సరం గడిపి పదునాలుగో సంవత్సరంలో సుఖంగా జీవించండి.

1. రాజు గారిని చూడటానికి ముందు ద్వారపాలకుని అనుమతి పొందాలి. రాజ సంపదల మీద మక్కువ పడరాదు. ఇతరులు ఆశించని ఆసనాన్నే కోరుకోవాలి
2. నేను రాజు ఇష్టుడను కదా అని రాజుగారి వాహనం కాని, శయ్య కాని, పీఠం కాని, ఏనుగు కాని, రథం కాని అధిరోహించరాదు. అలా ఉన్న నిపుణుడే రాజు దగ్గర నివసించ గలుగుతాడు
3. రాజు అడుగకుండా ఎప్పుడూ ఆయనకు కర్తవ్యం బోధించకూడదు. మౌనంగానే సేవించాలి, సమయం తెలిసికొని ప్రశంసించాలి
4. అసత్యం పలికే వారిని రాజులు దోషులుగా చూస్తారు. వాడు మంత్రి అయినా అవమానిస్తారు.
5. రాజు గారి భార్యలతో ఎన్నడూ సాంగత్యం చేయకూడదు. అలా అంతఃపురంలో తిరిగే వారితోనూ, రాజుగారిని ద్వేషించేవారితోనూ, ఆయన శత్రువులతోనూ స్నేహం ఉండకూడదు
6. ఎంత చిన్న పని అయినా రాజుగారికి చెప్పిన తరువాతే చెయ్యాలి. ఇలా ఉండేవాని ఎప్పుడూ హాని కలుగదు
7. కూర్చోటానికి ఉత్తమ ఆసనం లభించినా రాజు ఆజ్ఞాపించేంతవరకూ రాజ మర్యాదను పాటిస్తూ, రాజాజ్ఞకై ఎదురు చూడాలి. మర్యాద మీరి ప్రవర్తించేవారు పుత్రులైనా, సోదరులైనా సరే శత్రుసంహారకులైన రాజులు గౌరవించరు.
8. రాజును అగ్నివలె (దేవుని వలె) శ్రద్ధతో సేవించాలి. ఈ సేవలో ఏ మాత్రం కల్మషము ఉన్నా రాజు అతనిని చంపి తీరుతాడు. అందులో సందేహం లేదు
9. రాజు నియోగించిన పనినే సేవకుడు చేయాలి. సేవలో ఏమరుపాటు, గర్వం, కోపం ఏ మాత్రం ఉండరాదు.
10. ఇది కార్యము, అది అకార్యము అని నిశ్చయించవలసినపుడు సేవకుడు రాజుకు హితము, ప్రియమైనదే చెప్పాలి. రెండూ కలిపి కుదరక పోతే ప్రియాన్ని విడచి హితమే చెప్పాలి
11. నేను రాజుకు హితుడనే అని పండితుడు స్వేచ్ఛగా ప్రవర్తించరాదు.
12. తెలివి గల పండితుడు రాజుకు కుడివైపు కానీ, ఎడమ వైపు కానీ కూర్చోవాలి. ఎదుట కూర్చొన కూడదు. రాజు గారు చూస్తుండగా సేవకుడు ఏ చిన్న పురస్కారమూ స్వీకరించ కూడదు.
13. రాజు యొక్క అసత్య భాషణను ఎక్కడా బయటపెట్టకూడదు.
14. రాజు దగ్గర పెదవులు కొరక రాదు, చేతులు, కాళ్లను చాచరాదు. సాగదీసి కూర్చొన రాదు. ఆవులింత, అపానవాయువు విసర్జన కాని, ఉమ్మివేయటం కాని ఇతరులకు తెలియకుండా మెల్లగా చేయాలి.
15. ఇతరులెవరైనా నవ్వులపాలు అవుతున్నప్పుడు సంతోషించరాదు, నవ్వరాదు. అతిధైర్యంతో ప్రవర్తించరాదు.
16. లాభం కలిగితే పొంగిపోకుండా, అవమానం కలిగితే కుంగిపోకుండా, నిత్యం ఏకాగ్రతతో ఉండేవాడు రాజుగారి కొలువులో ఎక్కువకాలం ఉండగలడు.
17. ఎప్పుడైనా, తన శ్రేయస్సుకు భంగం కలిగే పక్షంలో రాజుతో ఇతరులను కలువనీయ కూడదు. సంవాదం చేయనీయరాదు.
18. రాజు ఎవరినైనా ఎక్కడికైనా పంపాలనుకొన్నప్పుడు తానే ముందుకు వచ్చి 'నేనేమి చేయగలను ' అని రాజుకు ఉత్సాహంగా తెల్పిన వాడు రాజు ఆస్థానంలో చిరకాలం ఉంటాడు.
19. సర్వకాల సర్వావస్థలయందు చలించకుండా, సంశయము లేకుండా వర్తించేవాడు రాజుగారి ఆస్థానంలో చిరకాలం ఉండగలడు
20. సేవకుడు రాచకార్యం మీద ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు భార్య బిడ్డలను, భోగాలను స్మరించరాదు.
21. రాజుతో సమానంగా ఆభరణాలు, వేషభూషణలు ధరించరాదు.
22. రాజుగారి ద్రవ్యం ఎట్టిపరిస్థితులలోనూ తాకరాదు.
23. రాజు గారు ఇచ్చిన కానుకలను ధరిస్తే రాజు సంతోషిస్తాడు

పాండు కుమారులారా! ఈ విధంగా మీ మనస్సులను చిక్కబట్టుకొని ఈ సంవత్సరం ప్రవర్తించండి."

అని ధౌమ్యుడు హితవులు పలుకుతాడు. పాండవులు గురువుగారి మంచిమాటలకు గౌరవ వాక్యాలు పలికి, కార్యసిద్ధికై హోమం చేసి, బ్రాహ్మణులకు, తాపసులకు దానం చేసి ముందుకు పయనమవుతారు.

విలువలు, ధర్మాచరణకు రామాయణం దర్పణమైతే నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ రకాలైన వ్యక్తిత్వాలను, మంచి-చెడులతో కూడిన సందర్భాలలో మనిషి ఎలా మెలగాలో, తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో, ఏయే వ్యక్తులు ఎలా మెలగి ఏమి ఫలితాన్ని పొందారో తెలిపేది మహాభారతం. పాండవులు పరిస్థితులకు అనుగుణంగా తమ క్షత్రియ లక్షణాలను మరచి, మారువేషంలో సేవకులుగా ఉండాలంటే ఎంతో మానసిక శిక్షణ, సంయమనం కలిగి తమ జ్ఞానంతో, కార్య కౌశలంతో రాజుగారి ఆస్థానంలో మెలిగారు. అన్నదమ్ములు, ద్రౌపది విలక్షణమైన లక్షణాలు, ప్రావీణ్యాలు, వ్యక్తిత్వాలు కలిగిన వారు. తదనుగుణంగా వృత్తులను ఎన్నుకున్నారు. ఎంతో సమర్థవంతంగా, ఒక పక్కా ప్రణాలికతో ఏడాది కాలాన్ని గడిపారు. కురు సార్వభౌముడు ఎంతటి పరాక్రమ సంపన్నుడైనా, తమ ఉనికిని తెలుసుకోనీకుండా అజ్ఞాతవాసాన్ని గడిపారు. ఈ కష్టకాలంలో ధర్మరాజు మేధస్సు, గురువుల బోధలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత, శ్రీకృష్ణుని ఆశీస్సులు వారికి అండగా నిలిచాయి.  రచరికపు వైభవంలో మెలగిన క్షత్రియులు ఇంకొకరి ఇంట సేవకులుగా ఉన్నారంటే అది వారి వ్యక్తిత్వాలకు ప్రతిబింబం. అన్ని విషయాలు తెలిసినా గురువుగా తన ధర్మాన్ని నిర్వర్తించి పాండవుల అజ్ఞాతవాస విజయానికి ధౌమ్యులు తోడ్పడ్డారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి