రాముని భక్తులలో హనుమంతుడు శ్రేష్ఠుడు. మరి వారు ఈ రామావతారంలో మొట్టమొదట ఎప్పుడు ఎలా కలిశారు? ఈ ఘట్టాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలోని కిష్కింధ కాండ రెండవ సర్గంలో వివరించారు.
వారులకు ప్రభువైన సుగ్రీవుడు బలశాలి ఐన సోదరుడు వాలికి భయపడి ఋష్యమూక పర్వత సమీపంలో తిరుగుతూ అద్భుత రూపవైభవం గల రామలక్ష్మణులను చూస్తాడు. వారిద్దరూ వాలి పంపగా వచ్చిన వారేమో అని చాలా భయపడి, వణికి విచారగ్రస్తుడౌతాడు. ఆ ప్రాంతం మతంగాశ్రమ ప్రదేశం. చాలా పవిత్రమైనది, సుఖప్రదమైనది.వాలి ఆ మతంగ ముని శాపగ్రస్తుడు. వాలికి భయపడిన సుగ్రీవాది వానర సమూహం మతంగాశ్రమాన్ని ఆశ్రయించి ఉంటారు. రామలక్ష్మణులను చూచి ఆ వానరులంతా ఆశ్రమంలోకి పరుగిడుతారు. వారిని వాలి మనుషులుగా భావించి సుగ్రీవుడు ఒకచోట నిలువలేక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తన మంత్రులతో "సహచరులారా! ఈ దట్టమైన అడవిలో నారబట్టలు ధరించిన వీరెవరో వాలి పంపగా వచ్చిన గూఢచారులే" అని అంటాడు. వానర సమూహమంతా రక్షణ కోసం అక్కడ ఒక కొండ నుండి ఇంకొక కొండకు పరుగులు తీస్తూ, వృక్ష సంపదను ధ్వంసం చేస్తూ ఋష్యమూక పర్వతముపై ఉన్న సుగ్రీవుని చూట్టూ చేరుతారు. సుగ్రీవుని మంత్రులు అతని చుట్టూ అంజలి ఘటించి నిలబడతారు.
అప్పుడు మాటనేర్పరి (వాక్యకోవిదుడని వాల్మీకి మహర్షి పదం) అయిన హనుమంతుడు సుగ్రీవునితో ఇలా అంటాడు "ఓ వానరశ్రేష్ఠుడా! వాలి భయంతో నీవు ఆందోళనలో ఉన్నావు. కానీ, ముని శాపకారణంగా వాలి ఈ ప్రాంతానికి రాలేడు. నీ అన్న నీ భార్యను అపహరించిన దుష్టుడు. ఆ దుష్టాత్మునకు నీవు భయపడుతున్నావు. కానీ, ఇది నీకు సురక్షిత ప్రదేశము. ఇక్కడ నీకు వాలి వలన ఎటువంటి ఆపదా కలుగదు. వానరులకు ప్రభువువై ఉండి నీవు చంచలత్వమును ప్రకటించటం ఆశ్చర్యకరముగా ఉంది. నీ భయము వలన బాగా ఆలోచించవలసిన విషయముపై కూడా నీ బుద్ధి స్థిరముగా నిలుపుట లేదు. నీ బుద్ధిని ఇంగితమును ఉపయోగించి ఇతరుల వ్యవహారమును బట్టి వారి స్వభావమును గుర్తించి సముచితమేదో దాని ఆచరింపుము. బుద్ధికి పని చెప్పని రాజు ప్రజలను పరిపాలించలేడు".
ఇది విన్న సుగ్రీవుడు "వారిరువురు ధనుర్బాణములు ధరించి, ఖడ్గమును ధరించిన ఆజానుబాహువులు. ఇంద్రునిలా పరాక్రమవంతులుగా కనిపిస్తున్నారు. అట్టి వారిని చూసిన ఎవరికి భయము కలుగదు? వీరిద్దరూ వాలి పంపగా వచ్చిన వారే అని నా అభిప్రాయం. రాజుకు రకరకాల మిత్రులు ఉంటారు. ఈ విషయంలో వారిరువురినీ నమ్మరాదు. శత్రువులు మారువేషంలో వచ్చినప్పుడు వారిని గురించి లోతుగా విచారించవలెను. వారు నమ్మిన వారి బలహీనతలను తెలిసికొని దెబ్బతీస్తారు. వాలి ఇట్టి కార్యములలో సమర్థుడు. సామాన్యుల రూపంలో వచ్చిన వారి గురించి లోతుగా తెలుసుకోవలెను. కాబట్టి, నీవు కూడా సామాన్య రూపములో వారి వద్దకు వెళ్లి, ఇంగితమును ఉపయోగించి వారి మంచి-చెడు లక్షణములను తెలుసుకో. వారు మనకు అనుకూలురుగా కనిపిస్తే వారిని ప్రశంసలతో ముంచెత్తి, చేష్టలతో తృప్తి పరచి వారి విశ్వాసమును చూరగొని వారి నిజమైన అంతర్యమును కనుగొనుము. ఇక్కడకు ధనుర్ధారులై వచ్చుటకు కారణము కనుగొనుము. వారి మాటల పద్ధతిని బట్టి, ముఖ కవళికలను బట్టి వారు సజ్జనులా కాదా అని తెలుసుకొనుము" అని ఆదేశిస్తాడు. ఎదురులేని వాడు, రాజనీతి కుశలుడు అయిన హనుమ సరే అని రామలక్ష్మణుల వద్దకు బయలుదేరుతాడు. ఒక్క గెంతులో ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులున్న ప్రాతానికి చేరుకుంటాడు.
వాయుసుతుడైన హనుమంతుడు వారికి తన పట్ల నమ్మకం ఏర్పడటానికి వానర రూపాన్ని త్యజించి భిక్షువు రూపం ధరిస్తాడు. వారి మనస్సులను ఆకట్టుకొనునట్లుగా మధుర వచనాలను పలుకుతూ వారి వద్దకు చేరతాడు. వారికి ప్రణమిల్లి, భక్తి ప్రపత్తులతో కొనియాడుతూ తగిన విధంగా సంభాషితాడు.
"ఓ స్ఫురద్రూపులారా! మీరిద్దరూ రాజర్షులవలె, దేవతల వలె కనబడుతున్నారు. తీవ్రమైన వ్రతదీక్షను చేపట్టిన తాపసుల వలె ఉన్నారు. ఈ పంపాతీర ప్రాంతమునకు ఎందుకు వచ్చినారు? ఓ సజ్జనులారా! మీరు నారబట్టలను ధరించి తాపసులవలె ఉన్నారు. బంగారు వన్నె గల మీ రాక వలన మధురజలములు గల పంపా తీత్రం ఎంతో శోభిల్లుచున్నది. మీరెవరు? బలపరాక్రమ సంపన్నులు, బాహుబలురు అయిన మీ చూపులకు ఇక్కడి ప్రాణులన్నీ భయపడుతున్నవి. ఇంద్రధనుస్సు వంటి చాపములను ధరించిన మీరు శత్రువులను సంహరించుటలో దక్షులు. అతిలోక సుందరులైన మీ కాంతులు అపూర్వము. శ్రేష్ఠమైన వృషభమువలె మీరు గంభీరముగా యున్నారు. ఏనుగు తొండము వంటి భుజములు కలిగిన మీ తేజస్సు వలన ఈ మహాపర్వతము దివ్యకాంతిమంతమై ప్రకాశిస్తున్నది.
దేవతల వలె పరాక్రమవంతులు, తామర రేకుల వంటి కన్నులు కలవారు, జటావల్కములు ధరించి యున్నను మీరు మహావీరులు. శౌర్యపరాక్రమములలో మీకు సాటి లేరు. దేవలోకము నుండి దిగి వచ్చినట్లున్నారు. విశాల వక్షః స్థలము, సింహము వలె చూపులు, ఉత్తమ రాజలక్షణములు కలిగిన మీరు రాజ్య భోగములను త్యజించి నారబట్టలను ధరించి ఈ దుర్గమమైన అరణ్య ప్రాంతమునకు వచ్చుటకు గల కారణమేమిటి? మీ ఆయుధములు అపూర్వము, ఆశ్చర్యకరముగా ఉన్నవి. మీ తూణీరములు చూడముచ్చటగా పదునైన బాణములు కలిగి ఉన్నాయి. పొడవైన మీ ఖడ్గములు మేలిమి బంగారముతో అలంకృతమై ఉన్నాయి. అవి కుబుసము విడిచిన పామువలె వెలుగుతున్నాయి.
ఓ సత్పురుషులారా! నేను ఇంతగా మాట్లాడుచున్నను మీరు పెదవి విప్పరేల? వానరులకు ప్రభువైన సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు బుద్ధిశాలి. అతడు తన అన్నయగు వాలిచే వంచించ బడి దుఃఖించుచు ఈ ప్రాంతమంతా తిరుగుతున్నాడు. అతడు పంపగా నేను మీ వద్దకు వచ్చాను. నేను హనుమంతుడు అను పేరు గల వానరుడను, వాయుసుతుడను. సుగ్రీవుని మంత్రిని, కామరూపుడను. కోరిన చోటికి వెళ్లి రాగలను. సుగ్రీవునికి ప్రీతి కలిగించుటకై సన్యాసి రూపంలో ఋష్యమూకపర్వతము నుండి ఇక్కడకు వచ్చాను" అని పలికి వారి సమాధానం కోసం వేచియుంటాడు.
అప్పుడు రాముడు లక్ష్మణునితో "లక్ష్మణా! ఇతడు సుగ్రీవుని మంత్రి. మనం ఆ సుగ్రీవుని కలియుటకు కోరుకొనుచుండగా అతడే మన వద్దకు తన మంత్రిని పంపించాడు. ఈతడు మాటలలో కుశలుడు. నాయందు, సుగ్రీవుని యందు ప్రీతి కలవాడు. కనుక తగు విధముగా మాట్లాడుము. ఋక్సామయజుర్వేదములలో సుశిక్షితుడైన వాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు. ఇతటు చాలా విషయాలు మాట్లాడాడు. కానీ, అపశబ్దము ఒక్కటి కూడాలేదు. కనుక ఇతడు సమస్త వ్యాకరణములను కూలంక్షముగా నేర్చినవాడు. ఇతడు మాట్లాడినప్పుడు ముఖములో, కనులలో, ఫాలభాగమునందు, ఇతర అవయవములందు ఎట్టి వికారమూ కనబడలేదు. ఇతడు సంక్షిప్తంగా, సందిగ్ధతకు తావు లేకుండా మాట్లాడాడు. ఆగుచు గాని, అర్థరహితమైన పదములను కానీ ఉపయోగించలేదు. తొందరపాటు లేకుండా, ఆత్మవిశ్వాసముతో మాట్లాడినాడు. మనసులోని మాటను స్పష్టముగా తెలిపినాడు. మరీ బిగ్గరగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మధ్యమ స్వరముతో ఉచ్చరించాడు.
ఇతడు పలికిన మాటలు వ్యాకరణ సమ్మతములు. స్పష్టముగా, క్రమమును అనుసరించి యున్నవి. లోకసహజమైన వేగము కలవి. శుభదాయకములు. ఆకర్షణీయములు. ఈ మారుతి వచనములు భావములను స్పష్టముగా ప్రకటించుటకు అనుగుణమైన స్వరస్థానములో ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈతని మధుర వచనాలు కత్తి దూసి పైకి వచ్చే శత్రువునైనా చల్ల బరచుతాయి. ఇట్టి బుద్ధి కుశలుడు, కార్య సాధకుడు దూతగా కలిగియున్న రాజు అదృష్టవంతుడు. ఇటువంటి వారి వలన రాజు కార్యములన్నీ సిద్ధించును" అని పలుకుతాడు.
లక్ష్మణుడు అన్న మాటలు విని హనుమంతునితో "ఓ విద్వాంసుడా! (విద్వన్ అన్నది వాల్మీకి మహర్షి ఉపయోగించిన పదము). కబంధుని ద్వారా సుగ్రీవుని గుణగణాలు విన్నాము. అతని కొరకు వెదుకుతూ ఇక్కడకు చేరాము. సత్పురుషుడవైన ఓ మారుతీ! సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలు మాకు సమ్మతము. మేము మీ సూచనలను పాటించెదము" అని పలుకుతాడు.
హనుమంతుడు లక్ష్మణుని సమయోచితమైన పలుకులకు సంతోషపడి సుగ్రీవ కార్యము సఫలమైనది అని నమ్మి సుగ్రీవునికి రామలక్ష్మణులకు మైత్రిని ఏర్పరచుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుని ద్వారా సీతాపహరణ వృత్తాంతము తెలిసుకుని వారికి సుగ్రీవుని సాయాన్ని ఆశ్వాసిస్తాడు. సన్యాసి రూపం త్యజించి, తన వానర రూపాన్ని వారికి చూపి, సీతమ్మను వెదకి కనుగొనుటలో సుగ్రీవుని సాయం కోరవచ్చిన రామలక్ష్మణులకు, సోదర బాధితుడైన సుగ్రీవునికి మైత్రీ బంధం ఏర్పరచుటకు వారివురిని తన భుజములపై తీసుకొని సుగ్రీవుడున్న ఋష్యమూక పర్వతానికి చేరుకుంటాడు.
ఈ ఘట్టంలో ఎంతో రాజనీతి, బుద్ధి కుశలత, మనస్తత్వశాస్త్రము మనకు కనబడుతుంది.
1. సోదరుడి వంచనకు గురైన సుగ్రీవుడు పరాక్రమవంతులైన ఇద్దరిని చూసి శత్రువులుగా భావించటం - ఇది మనలో ఎందరికో నిత్యం జరుగుతునే ఉంటుంది. పరిస్థితుల ప్రభావానికి లోనై విచక్షణను కోల్పోయే స్థితి ఇది. భయం మనిషి ఆలోచనను వ్యతిరేక దృక్పథం వైపు నెడుతుంది. మరి అప్పుడు ఏమి జరగాలి? మంత్రి అన్న వాడు బాధ్యత రాజును హెచ్చరించి, ఆ మతంగాశ్రమానికి వాలి రాడు అని సాంత్వనను కలిగించి, అతనిని కార్యోన్ముఖుడిని చేయటం. సుగ్రీవుని హితుడైన హనుమంతుడు తన మాటలలో రాజు లోపాన్ని అతనిని నొప్పించకుండా తెలియజేసి ఆలోచింపజేస్తాడు.
2. శత్రువులను ఏ రూపంలో వచ్చినా నమ్మరాదు. వారిని కూలంకషంగా పరిశీలించి అడుగు ముందుకు వేయాలి అన్న సుగ్రీవుని ఆదేశం - మంత్రి హనుమంతుని ఆశ్వాసనతో కార్యోన్ముఖుడైన రాజు తిరిగి తన విచక్షణను ఉపయోగించి కొత్త వారితో ఎలా మెసలి వారి ఉద్దేశాలను కనుక్కోవాలో హనుమంతునికి ఆదేశిస్తాడు. ఇక్కద మనకందరికీ ఒక పాఠం ఉంది. మన అసలు రూపం తెలియకుండా, మధుర వచనాలు పలికితే ఎదుటు వాని ఉద్దేశం బయటపడుతుంది. వారి గురించి తెలుసుకున్న తరువాత మైత్రిని పెంపొందించుకోవాలి అన్నది.
3. రామలక్ష్మణులతో హనుమంతుని పలుకులు - వారి నిజలక్షణాలను వివరంగా, వైభవంగా పొగడి హనుమ వారిని సంతుష్టులను చేస్తాడు. తాను దర్శించిన రూపలక్షణాలను, ధైర్య పరాక్రమాలను వివరంగా, స్పష్టతతో పలికి వారి రాకకు గల కారణాన్ని అడుగుతాడు. శుభలక్షణాల వలన అక్కడ కలిగిన మార్పులను తన అనుభూతిగా పలికి వారి మనసులను చూరగొంటాడు. ఇది దూత లక్షణం. బుద్ధి కుశలతకు తార్కాణం. హనుమంతుని జ్ఞానం ఒక ఎత్తైతే అతని సమయస్ఫూర్తి, బుద్ధి కౌశలము మరో ఎత్తు.
4. హనుమంతునిపై రాముని విశ్లేషణ - ఈ సందర్భంలో రాముని సంభాషణలు మనస్తత్వశాస్త్రానికి ప్రమాణాలు. మనం మాట్లాడేటప్పుడు ఉచ్చారణ, ధ్వని హెచ్చు తగ్గులు, వ్యాకరణము, పలుకులకు గల జ్ఞాన నేపథ్యము - ఇవన్నీ రాముని మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. మాట్లాడేటప్పుడు మన ముఖ కవళికలు, అవయవాలలో ప్రతిక్రియలు, కంటి సంజ్ఞలు ఇవన్నీ మన అంతరార్థాన్ని తెలియజేస్తాయి. పొగడ్తలలోని అంతర్యాన్ని కూడా ఇవి తెలియజేస్తాయి. పూర్తిగా అర్థవంతంగా, సంధిగ్ధత లేకుండా మాట్లాడతం ఒక పెద్ద శుభలక్షణం. దీనిని రాముడు లక్ష్మణునికి వివరిస్తాడు. హనుమనుంతుని ప్రతి పలుకూ కూలంకషంగా గమనించి, విశ్లేషించిన తరువాతే రాముడు అతనిని నమ్మవచ్చు అని లక్ష్మణునికి తెలియజేస్తాడు. హనుమంతుని వంటి జ్ఞాని, కుశలునితో ఎలా సంభాషించాలో కూడా చెబుతాడు.
5. దూతగా హనుమంతుని కార్యసిద్ధిపై ఏకాగ్రత - మొత్తం సంభాషణలలోనూ హనుమంతుని లక్ష్యం ఒక్కటే. సుగ్రీవుని కార్యం నెరవేర్చటం. అణువణువులోనూ దానిపై దృష్టి, శ్రద్ధ. ఆ లక్ష్యం గుర్తు పెట్టుకునే ప్రతి పలుకూ, ప్రతి అడుగూ. ఇది దౌత్య కార్యాలయాలలో పని చేసే వారికి, ప్రభుత్వ ఉన్నత అధికారులకు, రాయబారులకు పెద్ద నిఘంటువు.
ఈ సర్గలలో వాల్మీకి మనకు రెండు ముఖ్యమైన కార్యములు పరస్పర అవగాహనతో, సహకారంతో ఎలా సాధించుకోవచ్చో, దానికొరకు ఎలా ప్రణాళిక వేసుకోవాలో అద్భుతంగా వివరించారు. భయాందోళనలో ఉన్న వానరులకు, వారి ప్రభువుకు హనుమంతుడు తన బుద్ధి కుశలతతో ఊరట కలిగిస్తాడు. సుగ్రీవుడు తన విచక్షణను తిరిగి పొంది కర్తవ్యం గురించి ఆలోచిస్తాడు. రామ లక్ష్మణులు తమ కార్యసిద్ధికై హనుమంతుడు, సుగ్రీవుని సహాయం తప్పని సరి అని గ్రహించి ముందుకు అడుగు వేస్తారు. మొత్తం మీద ఈ రామలక్ష్మణ-హనుమత్ సంవాదం నిరంతరం కొత్త మనుషులతో, కొత్త వ్యక్తిత్వాలతో వ్యవహరించే వారికి ఒక గొప్ప మనస్తత్వ శాస్త్ర గని. కార్యసిద్ధి కలిగించే సాధనం. అందుకే రామాయణం మానవ జన్మ సాఫల్యతకు గొప్ప ఆయుధం.
శ్రీరామశ్శరణం మమ! జై హనుమాన్! వందే వాల్మీకి కోకిలం!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి