శ్రీ కాంతిమతిం! శంకర యువతీం! శ్రీ గురుగుహ జననీ వందేహం!
హ్రీంకార బీజాక్షర వదనాం! హిరణ్య మణిమయ శోభ సదనాం!
పాకశాసనాది దేవ వినుతాం! పరశురామ నత! హిమశైల సుతాం!
శుక శౌనకాది సదారాధితాం! శుద్ధ తామ్రపర్ణీ తట స్థితాం!
శంఖాద్యష్టోత్తర సహస్ర కలశాభిషేకామోదం! సుర హితాం!
ఓ శంకరునిపత్ని అయిన కాంతిమతి అమ్మా! గురుగుహుని తల్లీ! నీకు నా వందనములు. హ్రీంకార బీజాక్షరములతో కూడిన వదనము కలిగి, స్వర్ణ మణిమయ శోభితమైన మందిరములో వసించే తల్లీ! ఇంద్రాది దేవతలచే నుతించబడే తల్లీ! పరశురామునిచే పూజించబడిన హిమవంతుని పుత్రీ! శుక శౌనకాది మునులచే ఎల్లప్పుడూ ఆరాధించబడే అమ్మా! శుద్ధమైన తామ్రపర్ణీ నదీ తీరమున వెలసిన అమ్మా! శంఖాది 1008 కలశములయందలి జలములతో అభిషేకాన్ని ఆనందించే తల్లీ! దేవతలకు హితురాలవు! నీకు నా వందనములు.
దీక్షితుల వారు క్షేత్ర కృతులు రచించారని గతంలో చెప్పుకున్నాం. ఈ కృతి కూడా ఆ కోవలోకి చెందినదే. తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్న నెల్లైఅప్పర్ దేవస్థానంలో నెల్లైఅప్పర్‌గా కొలువబడే శివుని అర్థాంగిగా అమ్మవారు కాంతిమతి పేరుతో కొలువబడుతుంది. ఈ దేవస్థానం అత్యంత పురాతనమైనది. దాదాపు 1400 ఏళ్ల చరిత్ర గల ఈ దేవాలయాన్ని పాండ్యులు, చోళులు, చేరులు, విజయనగర రాజులు, తంజావూరు నాయకులు అభివృద్ధి చేశారు. తామ్రపర్ణి నదీ తీరంలో 14 ఎకరాల సువిశాల ప్రాంగంలో నిర్మించబడింది. 850 అడుగులు పొడవు, 750 అడుగుల వెడల్పు గల గోపురం ఈ మందిరం ప్రత్యేకత. శివుడు నటరాజ రూపంలో నాట్యం చేసిన ఐదు మంటపాలలో ఈ తామ్రసభ ఒకటి. 7వ శతాబ్దపు నాయనారైన జ్ఞానసంబంధర్ ఈ క్షేత్రాన్ని తన రచనలలో ప్రస్తావించారు. ఇక్కడి కాంతిమతి అమ్మవారిని కూడా దీక్షితుల వారు ఉపాసన చేసి అమ్మ అనుగ్రహం పొందారు. ఈ కృతి హేమవతి రాగంలో కూర్చబడింది. దీనిని మహారాజపురం సంతానం గారు గానం చేశారు. చిత్రాలలో అమ్మవారు, అయ్యవారు, నెల్లైఅప్పర్ దేవస్థాన గోపురం, బంగారు రథం చూడవచ్చు.
హేమవతి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రాధ-జయలక్ష్మి గార్లు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి