20, మార్చి 2016, ఆదివారం

సీతారామ వైభవం-5: రామచంద్రుడితడు (అన్నమాచార్యుల వారి రచన)



శ్రీరాముని వైభవాన్ని త్యాగరాజు, రామదాసు వంటి రామభక్తులు అద్భుతంగా తమ సంకీర్తనలలో చాటారు. వారి జీవితమంతా రామభక్తి సామ్రాజ్యంలోనే సాగిపోయింది. సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు వీరిద్దరికన్నా ముందే తిరుమల శ్రీవేంకటేశ్వరునిపై కొన్ని వేల సంకీర్తనలు రచించి పరమాత్మను నుతించారు. ఆయన సంకీర్తనలలో ఎన్నో శ్రీరామునిపై కూడా ఉన్నాయి. రాముని వైభవాన్ని అద్భుతంగా ఈ సంకీర్తనలలో ఆయన వర్ణించారు. వాటిలో ఒకటి రామచంద్రుడితడు. శ్రీరాముడు ఎవరెవరిని ఎలా అనుగ్రహించాడో ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు.


రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలము లియ్యగలిగె నిందరికి

గౌతము భార్యపాలిటి కామధేను వితడు
ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి యితడు
ఈతడు దాసుల పాలిటి ఇహపర దైవము

పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు
సరి హనుమంతు పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు
గరిమ జనకు పాలి ఘనపారిజాతము

తలప శబరి పాలి తత్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలడన్న వారి పాలి కన్ను లెదటి మూరితి
వెలయ శ్రీ వేంకటాద్రి విభుడితడు

తాత్పర్యము:

రఘువీరుడైన శ్రీరామచంద్రుడు ఎందరికో ఈ విధముగా కామ్యములను ఇచ్చాడు. భర్త గౌతమముని శాపానికి గురై వేల సంవత్సరాలు నిర్జీవంగా ఉన్న అహల్యను తన పాద స్పర్శతో ఉద్ధరించినవాడు ఆయన. లోకకళ్యాణార్థం యాగం చేయ తలపెట్టిన విశ్వామిత్రునికి రాక్షసుల బెడద కలగటంతో ఆయన కోరిక మేరకు శ్రీరాముడు ఆ యాగ సంరక్షణ చేశాడు. సీతకు కోరుకున్న వెంటనే కోర్కెలు తీర్చేవాడు ఆ రాముడు. దాసులకు ఇహమునందు పరమునందు దైవము ఈ రాముడు. అన్నచే మోసగించబడిన సుగ్రీవునికి ఇతడు ఒప్పుగా పరమ బంధువైనాడు. తననే నిరంతరము కొలిచే హనుమంతునికి ఈయనే సామ్రాజ్యం. చెడును వీడి మంచి కోరి వచ్చి శరణనన్న విభీషణునికి నిధి ఈ రాముడు. తన బిడ్డకు ఎటువంటి భర్త దొరుకుతాడో అని ఆలోచనలో ఉన్న రాజర్షి జనకుని పాలిట శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడి గొప్ప పారిజాతమైనాడు రాముడు. తన గురువుల మాట ప్రకారం తనను ఉద్ధరించటానికై వేచి ఉన్న శబరికి మోక్షాన్ని ప్రసాదించిన వాడు రాముడు. గుహుని పాలిట సనాతనుడు ఈ రాముడు. కలడు అనుకునే వారికి కన్నులెదుట నిలిచే ప్రభువు శ్రీవేంకటాద్రిలో వెలసిన వాడు.

వివరణ:


అన్నమాచార్యుల వారి సాహిత్యంలో ఉన్న గొప్పతనం అందులోని లోతైన ఆధ్యాత్మిక సౌరభం. రాముడు ఎవెరెవరి కోర్కేలను ఎలా తీర్చాడు అన్నది ఈ సంకీర్తన ప్రధాన ప్రాతిపదిక అయినా అందులో నిగూఢమైన తత్త్వనిధి ఉంది. ఇంద్రుని పన్నాగములో అపవిత్రమైన అహల్య గౌతముని శాపము వలన వేల సంవత్సరాలు భస్మ రూపములో వాయు భక్షణ చేస్తూ ఎవరికీ అగుపించక ఉంటుంది. అదే గౌతముడు రామచంద్రుడు ఈ ఆశ్రమంలోకి వచ్చినంతనే పునీతవై తిరిగి రూపాన్ని పొందుతావు ఆమెకు శాపవిముక్తి చెబుతాడు. వేల సంవత్సరాలు అలా భస్మశాయినివై ఉన్న అహల్య రాముడు ఆ ఆశ్రమంలో ప్రవేశించగానే పవిత్రయై తన దివ్యరూపాన్ని తిరిగి పొందుతుంది. అంటే రాముడు ఎంతటి ధర్మాతుడో ఊహించండి. జీవహీనమైన ప్రాణికి జీవాన్నిచ్చే అద్భుత పురుషుడు రాముడు. ధర్మ రక్షణలో తిరుగులేని వాడు కాబట్టే విశ్వామిత్రుడు లేతవయసులోనే రాముడిని అడవులకు తీసుకువెళతాడు. అందులో ఆ ధర్మ రక్షణ లోక కళ్యాణార్థం చేయటం రాజుల విధి, దానిని సఫలీకృతం కావించుట మునుల కర్తవ్యం. అందుకే ఆయన విశ్వామిత్రుని పాలిట కల్పవృక్షమైనాడు. ఆదర్శ పతిగా సీతాదేవి కోరికలను తీర్చినవాడు రాముడు. ఇక్కడ చింతామణి అనగా కామ్యములను తీర్చే మణి అని అర్థము. సీతారాముల మధ్య ఎక్కడా లేదు, కుదరదు అన్న వాటికి తావే లేదు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని ఒకరి కోసం ఒకరు జీవించారు. లోకానికే ఆదర్శమైనారు. భర్తగా తన ధర్మాన్ని ముమ్మాటికీ పాటించిన రాముడు అందుకే సీతమ్మ పాలిట చింతామణి అయినాడు. మొదటి చరణంలో అతి ముఖ్యమైన వాక్యం - దాసుల పాలిట ఇహము పరము రెండిటా దైవము అన్నారు. జన్మను తరించటానికి, భవసాగరాన్ని దాటటానికి రామనామమే శరణము, అలాగే పరములో కూడా అనంతమైన శక్తినిచ్చేవాడు రాముడు.


తమ్ముడైన సుగ్రీవుడిని వాలి మోసం చేసి ఆతని భార్యను చెరబట్టి కిష్కింధను ఏలుతాడు. ధర్మం కాపాడటానికి రాముడు సుగ్రీవునికి బాసటగా నిలచి వాలిని వధిస్తాడు. తారకు విముక్తి కలిగిస్తాడు. బంధువనే వాడి ప్రథమ కర్తవ్యం తోడునీడగా నిలబడటం. అది రాముడు పాటించిన ధర్మం వలన ఏర్పడిన బంధం. అన్నీ తానే అనుకుని రాముడిని కొలిచిన వాడు హనుమంతుడు. రామనామమే అతనికి శ్వాస. రాముడే స్వామి. అందుకే హనుమ ఉత్తమ భక్తుడు అని రాముడు చెప్పాడు. ఆ హనుమంతుడికి వేరే సామ్రాజ్యం అక్కరలేదు. రామభక్తే అతని సామ్రాజ్యం. విభీషణుడు హరిభక్తుడు, ధర్మ పరాయణుడు.  అన్న రావణుడు అధర్మానికి ఒడిగడితే అతనిని హెచ్చరించి హితబోధ చేశాడు. దూతగా వచ్చిన హనుమను సంహరించమని రావణుడు ఆదేశిస్తే అది అధర్మమని తెలిపి అతని ఆలోచనను సరిచేశాడు. రామరావణ యుద్ధంలో ధర్మం వైపు నిలచి ధర్మ విజయానికి తోడ్పడిన వాడు విభీషణుడు. రావణుని వధ తరువాత రాముడు అతనిని లంకకు రాజుగా చేస్తాడు. అందుకే అన్నమాచార్యుల వారు విభీషణుని పాలిట పెన్నిధి అని రాముని నుతించారు. ఇక జనకుడి వంటి ఉత్తమునికి రాముడు ఘన పారిజాతం ఎలా అయ్యాడు? సమస్త శాస్త్రములు, ధర్ములు తెలిసిన జనకుడు తన వంశం వారికి శివుని ద్వారా అందిన ధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడే తన బిడ్డ అయిన సీతను పెండ్లాడటానికి తగిన వరుడు అని నిశ్చయించుకుంటాడు. శివ ధనుర్భంగం తరువాత జనకునికి విశ్వామిత్రుడు ఇక్ష్వాకు వంశ వృత్తాంతము తెలిపి ఆ వంశజుల కీర్తిని చాటుతాడు. అటువంటి శ్రీరాముడు అయోనిజ అయిన సీతను చేపట్టి జనుకుడి వంశాన్ని కూడా ఉద్ధరించాడు. అలాగే సీతమ్మ నిమి వంశంలో జన్మించి ఇక్ష్వాకు వంశానికి వచ్చి ఆ పూర్వీకులు ఘన కీర్తిని ఇనుమడింపజేసింది. రాముని సత్యవాక్పరిపాలన, ధర్మపరాయణత జనకుని పాలిట పారిజాతం.


శబరి మతంగమహర్షి శిష్యురాలు. సన్యాసం స్వీకరించి గురువులను ఎంతో భక్తిప్రపత్తులతో సేవిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. సీతారామలక్ష్మణులు చిత్రకూటం చేరుకున్నప్పుడు మతంగమహర్షి పరమపదానికి చేరుకుంటారు. దేహాన్ని విడిచే ముందు ఆయన శబరితో నువ్వు చేసిన సేవలు చాల గొప్పవి. శ్రీరాముడు ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు నీ సేవకు సాఫల్యం కలిగి నీకు ముక్తిని ప్రసాదించును అని చెబుతాడు. ఆ మహర్షి మాటల ఫలాన శ్రీరాముడు మతంగవనానికి వచ్చి శబరి చేసిన పూజలు స్వీకరించి ఆమెకు కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. ఇదీ, శబరి తత్త్వ రహస్యము. గుహుడు శ్రీరాముడు దేవుడని ఎరిగిన వాడు. అతని రామభక్తి అనుపమానమైనది. రాముడు అరణ్యవాసానికి వెళ్లేటపుడు, భరతుడు శ్రీరాముని కోసం అరణ్యానికి వచ్చినపుడు గుహుని పాత్ర ఎంతో ముఖ్యమైనది. అతని సేవకు మెచ్చి శ్రీరాముడు అతని అనుగ్రహిస్తాడు. అందుకే గుహుని పాలిట ఆది మూలము అన్నారు అన్నమాచార్యుల వారు. ఇక కలడు అని తలచిన వారికి కళ్లెదుటి దైవము రాముడు అన్నారు.  ఎలా? ఎంత మంది రామభక్తులు ఆయన నామస్మరణతో ఆయన పదచింతనతో భవసాగరాన్ని దాటి ముక్తిని పొందలేదు? తులసీదాసు మొదలైన మహాభక్తులు ఈ కోవకు చెందిన వారు. మరి ఆ శ్రీరాముడే కలియుగంలో మనకు దగ్గరగా శ్రీవేంకటాద్రిలో వెలసిన ప్రభువు అని అన్నమాచార్యుల వారు తగురీతిన కొనియాడారు.

అన్నమాచార్యుల వారు అందించిన ఈ శ్రీరామవైభవ వర్ణన పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. అందుకే ఆయన సంకీర్తనలు మంత్రసమానమై అలరారుతున్నాయి. రామచంద్రుడితడు అనే కీర్తన ద్విజావంతి రాగంలో కూర్చబడింది. దీనిని శ్రావ్యంగా ఆలపించిన కళాకారుల పేరు తెలియదు. 

16, మార్చి 2016, బుధవారం

అత్త-కోడలు - ఆధిపత్యపు పోరు

కోడలు: అత్తయ్యా పెళ్లై ఇన్నేళ్లయ్యింది. మీకు ఏది ఇష్టమో తెలుసుకోవటం నా వల్ల కాలేదు...
అత్తగారు: అది మీ మామగారి వల్లే కాలేదు. ఇంక నీ వల్ల ఏమవుతుంది. అయినా, ఇష్టాలు అయిష్టాలు ఇష్టమున్న మనుషులతోనే లేమ్మా.

అత్తగారు: కోడలు పిల్లా! డబ్బేమన్నా దాస్తున్నారా? వాడికి వచ్చింది వచ్చినట్లు స్వాహాయేనా?
కోడలు: ఆ మీరు మామయ్యగారి జీతమంతా ఏం చేశారో మీ బీరువాల్లో చీరలే చెబుతాయి. నేను మాత్రం తక్కువ తిన్నానా?

అత్తగారు: పిల్ల కళ్లు ముక్కు అన్ని నావేనే. చక్కగా తీరుగా ఉంటాయి మా వాళ్ల పోలికలు.
కోడలు: అందరూ పిల్ల నలుపు మీదే వచ్చిందంటున్నారు అత్తయ్యా!
అత్తగారు: అమ్మాయ్! నలుపు అదృష్టమే. తెల్లతోలుంటేనే అందముటే...
కోడలు:  మరి మీ అబ్బాయి నన్ను చేసుకుంది నా తెల్లతోలు చూసేగా?

కోడలు: వెధవ పోలికలు, వద్దనుకుంటే వస్తాయి. ఆ కోపం, ఆ హఠం వేయటం అన్నీ దిగిపడ్డాయి.
అత్తగారు: ఆ నిజమే. మీ అమ్మ పోలికే అని నేను మీ మామగారు ఎప్పుడూ అనుకుంటాం.

అత్తగారు: వెధవ గోదారి వంటలు, ప్రతి దాంట్లోనూ బెల్లం, ఆవ కూరలు. ఒంటికి వాతం, వేడి. తినలేక చస్తున్నా.
కోడలు: ముదనష్టపు గుంటూరు వంటలు. నోట్లో పెట్టుకుంటే నాలు ఊడాల్సిందే. ఒక రుచా పచా!

అత్తగారు: ఈ తూగోజీ వాళ్లున్నారు చూడండీ, భలే మాటలు చెబుతారండీ. అండీ అండీ అంటూనే వెనకాతల గోతులు తవ్వుతారు.
కోడలు: అబ్బో ఈ గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్లతో పడలేము తల్లో. యమ టెక్కు, ఓ మాట పడలేరు, నోట్లోంచి మాట వస్తే విరిచినట్లే. మా అహంబోతులండీ.

13, మార్చి 2016, ఆదివారం

అసమాన సాహస మహిళ నీరజ భనోత్


మానవత్వం కోసం, తన ధర్మం కోసం ప్రాణాలొడ్డి పోరాడి వందలాది మంది ప్రాణాలు కాపాడిన వీర వనిత, భరతజాతి గర్వంతో చెప్పుకోగలిగిన ధీర నారి, ఊహించలేని సంక్లిష్టకరమైన సమయంలో సమయస్ఫూర్తి, తెగింపు, ఓర్పు చూపి విలువైన ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తి....ఇలా ఆమె కనబరచిన ధైర్య సాహసాలను ఎన్ని రీతుల చెప్పినా అవి తక్కువే. ఎవరని ఆలోచిస్తున్నారా? స్త్రీ శక్తిని, మానవ జన్మ లక్ష్యాన్ని తన అసమాన సాహసోపేతమైన చర్యలతో ప్రపంచానికి చాటిన మహిళ నీరజ భనోత్. తీవ్రవాదులతో పోరాడి విమాన ప్రయాణికులను కాపాడి తన ప్రాణాలను కోల్పోయిన ఈ అసమాన మహిళ వివరాలు తెలుసుకుందాం.

1963 సెప్టెంబర్ 7న పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్‌లో హరీష్ మరియు రమా భనోత్ దంపతులకు నీరజ జన్మించింది. అప్పటికే అఖిల్ మరియు అనీష్ అనే ఇద్దరబ్బాయిలు వారికి పుట్టారు. నీరజ చండీగఢ్‌లోని సేక్రెడ్  హార్ట్ స్కూల్, ముంబైలోని బాంబే స్కాటిష్ స్కూల్‌లో చదివిన తరువాత అక్కడే సెయింట్ క్సేవియర్స్ కళాశాలలో చదువు పూర్తి చేసింది. తరువాత మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టింది. అప్పుడే పాన్ ఆం ఎయిర్లైన్స్ వాళ్లు ఫ్లైట్ అటెండెంట్స్ పోస్టులకు పత్రికలలో ప్రకటన చేస్తే నీరజ అప్ప్లై చేసి అమెరికాలోని మయామీలో శిక్షణ పొందింది. ఆమె ప్రతిభకు మెచ్చి ఆ సంస్థ వాళ్లు ఆమెను ఛీఫ్ ఫ్లైట్ అటెండెంట్‌గా నియమించారు.

1986వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన పాన్ ఆం 73 విమానం 361 మంది ప్రయాణికులు 19 మంది సిబ్బందితో ముంబై నుండి కరాచీ మరియు ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా న్యూయార్కుకు బయలు దేరింది. ముంబై నుండి కరాచీ విమానాశ్రయం చేరుకున్న విమానాన్ని నలుగురు అబు నిదల్ సంస్థకు చెందిన తీవ్రవాదులు హైజాక్ చేశారు. దానిని సైప్రస్ మళ్లించాలని అనుకున్నారు. ప్రయాణికుల విడులకు బదులుగా తమ సంస్థకు చెందిన ఖైదీలను విడుదల చేయాలని వారి డిమాండ్లు.

నీరజ సమయస్ఫూర్తితో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లకు హైజాక్ గురించి తెలియజేసింది. విమానం ఇంకా రన్‌వే మీదనే ఉండటంతో పైలట్లు కాక్‌పిట్ నుండి సురక్షితంగా బయట పడ్డారు. దీనితో విమానాన్ని నడిపే పరిస్థితిని నీరజ వలన తప్పింది. కానీ, విమానంలో ఉన్న మిగిలిన ఉద్యోగులలో నీరజే సీనియర్ కావటంతో భారమంతా ఆమెపై పడింది. ఆ తీవ్రవాదులు తమ డిమాండ్లకై అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావటానికి నీరజను విమానంలో ఉన్న అమెరికన్ పౌరసత్వమున్న ప్రయాణికుల పాస్‌పోర్టులన్నీ సేకరించమని చెప్పారు. నీరజ చాలా తెలివిగా అమెరికన్ పాస్‌పోర్టులన్నీ సీట్ల కింద కొన్ని, చెత్త బుట్టలో కొన్ని దాచమని సిబ్బందిని నిర్దేశించింది. తాను కూడా అదే చేసింది. మొత్తం మీద 41 మంది అమెరికన్ ప్రయాణీకులు ఉన్నా నీరజ కనబరచిన సమయ స్ఫూర్తితో తీవ్రవాదులు వారిని వేరు చేయలేకపోయారు.

17 గంటలు దాటినా విమానం నడిపించటానికి విమానాశ్ర్య అధికారులు పైలట్లను పంపక పోవడంతో తీవ్రవాదులు పేలుడు పదార్థాలు, గన్లను ఉపయోఇంచటం మొదలు పెట్టారు. వారి వద్ద ఇక ఆయుధాలలో తూట్లు, పేలుడు పదార్థాల నిల్వలు నిండుకున్నాయి. అప్పుడు, ప్రాణాలకు తెగించి నీరజ ప్రయాణికుల సాయంతో ఎమెర్జెన్సీ డోర్లు తెరుస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవటానికి తాను ముందు దూకవచ్చు, కానీ ముగ్గురు చిన్నపిల్లలను ఆ తీవ్రవాదుల కాల్పులనుండి రక్షించటానికి వారితోనే ఉంటుంది. తీవ్రవాదుల కాల్పుల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు మరణించారు. అందులో 12 మంది భారతీయులు ఇద్దరు అమెరికన్లు మిగిలిన వారు పాకీస్తాన్, యూకే మరియు మెక్సికోకు చెందినవారు. మిగిలిన 340 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి నీరజ తన ప్రాణాలను కోల్పోయింది. పసిపిల్లల కోసం, తోటి ప్రయాణికుల కోసం సాహసోపేతంగా పోరాడి వీరమరణం పొందింది. పాకిస్తానీ సైన్యానికి చెందిన స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుకు చెందిన సైనికులు ఆ తీవ్రవాదులను చెరబట్టారు.

అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన నీరజకు భారత ప్రభుత్వం 1987లో మరణానంతరం ఆశోకచక్ర అవార్డును ప్రకటించింది. నీరజ తల్లి రమ అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే నాడు ఆ అవార్డును స్వీకరించింది. అటు తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు తంఘా-ఎ-ఇన్సానియత్ అవార్డును, అమెరికా ప్రభుత్వం జస్టిస్ ఫర్ క్రైంస్ మరియు  స్పెషల్ కరేజ్ అవార్డును ప్రదానం చేసింది. 2004వ సంవత్సరంలో భారత తపాలా శాఖ ఆమె సంస్మరణార్థం ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుల చేసింది.


నీరజ తల్లిదండ్రులు ఆమె మరణాంతరం జీవిత భీమాతో వచ్చిన డబ్బుతో నీరజ భనోత్ -పాన్ ఆం అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. విమానయానంలో డ్యూటీని మించి సేవాదృక్పథాన్ని కనబరచే వారికి ఒక అవార్డును, వరకట్నం వంటి సామాజిక అంశాలపై పోరాడే వారికి నీరజ భనోత్ అవార్డును ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఈ రెండవ అవార్డుకు కూడా కారణం ఉంది. నీరజకు 1985లో గల్ఫ్‌లో ఉన్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ, వరకట్న వేధింపులతో రెండు నెలలకే నీరజ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చి తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఆ దురాచారానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు ఈ అవార్డును ఇస్తున్నారు. నీరజ కాపాడిన పిల్లలలో ఒకరు ఇప్పుడు పైలట్. ఇది నీరజ చేసిన సాహసానికి ఉత్తమమైన సాఫల్యము మరియు సార్థకత.

నీరజ తండ్రి హరీష్ 2007లో, తల్లి రమ 2015 డిసెంబరులో మరణించారు. ఇటీవలే నీరజ సాహస చరిత్రను తెరకెక్కించారు.  సోనం కపూర్ నీరజగా నటించింది. ప్రఖ్యాత నటి షబనా అజ్మీ నీరజ తల్లి రమగా నటించారు. నీరజ సోదరులు అఖిల్ మరియు అనీష్ ఈ చిత్రాన్ని చూసి ఎంతో సంతోషించారు. వాస్తవాన్ని యథాతథంగా తీసినందుకు నిర్మాతను, దర్శకుడిని అభినందించారు. ఈ చిత్రం ప్రతి మహిళ, ప్రతి బాలిక చూడవలసినది. ఆడది అబల కాదు అని మరో సారి చాటి చెప్పిన నీరజ సాహస గాథ తరతరాల పాటు మార్గదర్శకం. ఆమె కథను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలలో చేర్చి దేశ పౌరులను మరింత సాహసవంతులుగా, దేశభక్తులుగా, మానవత్వంతో నిండిన మనుషులుగా తీర్చిదిద్దటానికి తోడ్పడాలి.

11, మార్చి 2016, శుక్రవారం

వేణువాద్య సమ్మోహనం - ప్రతిభామూర్తి జయప్రద రామమూర్తి


సంగీతం కొంతమందికి దైవానుగ్రహమైతే కొంతమందికి వంశపారంపర్యంగా వచ్చే వారసత్వం. రెండూ కలగలిపితే ఇక అది అద్భుతమైన ప్రతిభావిష్కరణే అవుతుంది. సంగీతం వారసత్వంగా వస్తే అది జీవితంలో ఒక అంతర్భాగమై ప్రత్యేకంగా నేర్చుకున్నట్లు అనిపించదు. ఎలాగైతే మాట్లాడటం, ఆడటం నేర్చుకుంటారో, అలాగే కొన్ని సంగీత కుటుంబాలలో సంగీతన్ని కూడా పిల్లలు చిన్నప్పటినుంచే నేర్చుకుంటారు. అటువంటి ఒక అసమాన కళాకారిణి జయప్రద రామమూర్తిగారు. తెలుగుగడ్డపై పుట్టిన తొలి వేణువాద్య ఏ గ్రేడ్ కళాకారిణిగా జయప్రదగారు ఈరోజు ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆవిడ వివరాలు తెలుసుకుందాం.

గతంలో నేను ప్రముఖ వేణు వాద్య కళాకారిణులు సిక్కిల్ సోదరీమణులు నీల కుంజుమణి గార్ల గురించి రాసినప్పుడు వాయిద్యాలలో వేణువు ఎందుకు కష్టమైనదో తెలిపాను. శ్వాసకు సంబంధించిన వాయిద్యం ఇది. ఆ శ్వాసలో స్వరాలను పలికించాలంటే తప్పకుండా ప్రత్యేకమైన సాధన కావాలి. అందులో వేర్వేరు కాలాలలో వాయించేటప్పుడు ఊపిరిని నియంత్రించటానికి ఎంతో శ్రమ పడాలి. అందుకే వేణుగాన విద్వాంసులు చాలా తక్కువమంది ఉంటారు. మరి జయప్రదగారు ఎంతటి పరిశ్రమ, సాధన చేసుంటే ఈనాడు విద్వాంసులయ్యుంటారో ఊహించండి.

జయప్రద గారు గురుముఖత విద్య నేర్చుకోక మునుపే సంగీతంలో మెళకువలన్నీ తల్లి వద్ద నేర్చుకున్నారు. జయప్రద గారు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ప్రేమా రామమూర్తి గారు. తండ్రి కీర్తిశేషులు శ్రీ ఓవీ రామామూర్తిగారు. ప్రేమ గారి తాత గారు బళ్లారి జమీందారు గారు శ్రీనివాస శాస్త్రిగారు వేణువాద్య విద్వాంసులు. ప్రేమ గారు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యురాలు, ఆలిండియా రేడియోలో ఏ గ్రేడ్ కళాకారిణిగా పనిచేశారు. జయప్రద గారు చిన్ననాడే సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి ఆకాశవాణిలో దూరదర్శన్‌లో కచేరీలు చేసినా,  తల్లి సలహా మేరకు ప్రఖ్యాత వేణువాద్య విద్వాంసులు డాక్టర్ ఎన్. రమణి గారి వద్ద చెన్నైలో, హైదరాబాదులో శ్రీ శ్రీనివాసన్ వద్ద నేర్చుకున్నారు. తరువాత శ్రీ సుదర్శనాచార్యుల వద్ద మృదంగం కూడా నేర్చుకున్నారు. తరువాత బంగ్లాదేశ్‌లో జరిగిన భారతీయ ఉత్సవాలలో ప్రఖ్యాత హిందూస్థానీ వేణువాద్య విద్వాంసులు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారితో పరిచయం ఏర్పడింది. ఆయన సలహా మేరకు హిందూస్థానీ వేణువాదనం కూడా నేర్చుకున్నారు. కళతో పాటు తన విద్యాభ్యాసాన్ని కూడ అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లారు. కామర్స్‌లో పీహేచ్‌డీ పూర్తి చేశారు జయప్రదగారు. తన చదువును సంగీతంతో ముడిపెట్టి పీహెచ్‌డీని మార్కెటింగ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనే అంశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆ విధంగా తనను డాక్టర్ జయప్రదగా చూడాలనుకున్న తల్లి ప్రేమ గారి ఆకాంక్షను నెరవేర్చారు.

జయప్రద గారు పాశ్చాత్య మరియు భారతీయ శాస్త్రీయ సంగీతాల మేళనను శాస్త్రీయత కోల్పోకుండా చేయటాన్ని ఇస్టపడతారు. ఆమె వేణువాద్యానికి కావలసిన శక్తిని యోగా మరియు ప్రాణాయం ద్వారా పొందారు. ఊపిరితిత్తుల మరియు చేతి వేళ్ల దృఢత్వాన్ని వీటి ద్వారా పొందారు. వేణువాద్యం సహజ ప్రాణాయామం కాబట్టి దానివలన నాడీమండలం ఆరోగ్యంగా ఉంటుంది అని మానసిక రోగులకు ఈ వాద్యాన్ని నేర్చుకోమని  జయప్రదగారు సలహా ఇస్తారు. శబ్దానికి మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని జయప్రదగారు అందరికీ చెప్పాలన్న యోచనతో దానిపై పరిశోధన చేస్తున్నారు.

జయప్రద గారు నవీనతకు చిహ్నంగా వేగంగా వాయించే రోలింగ్ ఫింగర్స్ అని కొత్త విధానాన్ని కనిపెట్టి ప్రపంచ మరియు జాతీయ రికార్డులను సొంతం చేసుకున్నారు. రకరకాల వేణువులలో రాగాలను ఆయా వేణువుల ధర్మానికి అనుగుణంగా మలచుకుంటూ వేలి కదలికను సృజనాత్మకంగా చేయటంలో జయప్రదగారు రికార్డులను సొంతం చేసుకున్నారు. దీనిని ట్రాన్స్పోస్ ఫింగరింగ్ అంటారు. మనోధర్మాన్ని ఈ ప్రక్రియ ద్వారా వాయించి ఈ రికార్డులకెక్కారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం, ఢిల్లీ ప్రభుత్వం వారి పురస్కారం వంటి ఎన్నో గుర్తింపులు పొందారు. ఎన్నో దేవస్థానాలలో వీరి వేణువాద్యం అక్కడి దేవతామూర్తుల సేవలలో వినియోగిస్తున్నారు.  పండిట్ రవిశంకర్ గారు వీరిలోని ప్రతిభను గుర్తించి ఎంతో ప్రశంసించి ఆశీర్వదించారు. విజయాలు సాధించినప్పుడు బాధ్యత పెరుగ్తుంది అన్న సత్యాన్ని జయప్రదగారు పరిపూర్ణంగా నమ్ముతారు.

సంగీతం అంటే ధ్యానం, దానితో వేరే ఆలోచనలన్నీ తొలగి మనసు ప్రశాంతతను పొందుతుందని పరిపూర్ణంగా విశ్వసించే నిష్ణాతురాలు జయప్రదగారు. ఆవిడ వేణువాదన వింటుంటే మనసు తేలిపోతుంది, తేలికపడుతుంది. శ్రీకృష్ణుడు ఎదుట నిలచినట్లనిపిస్తుంది. మనోవికారాలన్నీ తొలగి ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఆవిడ పలికించే గమకాలు, ఆవిడ చేసే శబ్ద విన్యాసాలు మనసును కట్టి పడేస్తాయి. తన గురువుల వద్ద నేర్చుకున్న విద్యను, తన సాధన ద్వారా పరిపక్వత చెందిన సంగీతాన్ని జయప్రదగారు తన శిష్యులకు అందజేస్తున్నారు. దేశవిదేశాల్లో ఎన్నో కచేరీలు చేసిన జయప్రదగారు మాండోలిన్ వంటి తీగలతో కూడిన వాయిద్యాలను కూడ ఇష్ట పడతారు. ఛందస్సు లేని చుటుకులను స్వరపరచే అవకాశాన్ని మైసూర్ దత్తపీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామి వారు జయప్రద గారికి అనుగ్రహించారు.

ఫ్లూట్ ఐకాన్ ఆఫ్ ఏషియా, ఫ్లూట్ మేస్ట్రో, దివా ఆఫ్ డక్కన్, ఆస్థాన విదుషీ, వేణుగాన వినోదిని, మురళీధర మృదుపద మంజీరం, నాదయోగ వంటి బిరుదులు పొందారు. జయప్రదగారిని భారత రాష్ట్రపతులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు వేర్వేరు సందర్భాలలో సత్కరించారు. గ్లోబల్ వరల్డ్ రికార్డ్, యునిక్ రికార్డ్, ఏషియాస్ టాప్ 100 టాలెంట్, నేషనల్ ఫెలోషిప్, భారతి గౌరవ పురస్కార్, గోల్డెన్ బ్రేస్లెట్ అవార్డ్, బెస్ట్ ఫ్లూటిస్ట్, ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మర్ అవార్డులు పొందారు.

భగవంతుడు జయప్రదగారికి మరింత వేణువాద్య సేవాభాగ్యాన్ని, మరెన్నో గుర్తింపులను, పురస్కారాలను కలిగేలా అనుగ్రహించాలని ప్రార్థన. తెలుగుజాతి ముద్దుబిడ్డ జయప్రద గారి సంగీత సోపానం మరింత జయప్రదంగా సాగాలని ఆకాంక్షిద్దాం. వారి ప్రతిభ తరతరాలకు అందాలని ఆశిద్దాం. వారు వాయించిన కాంభోజి రాగ కీర్తనను వినండి. 

పాత్రం, అపాత్రం - యోగ్యం, అయోగ్యం


దాత, గ్రహీత ఇద్దరూ అయోగ్యులైతే ఎన్నో చిక్కులు - సహాయం పొందిన వాడికి, చేసినవాడికి ఆ సహాయం యొక్క విలువ ఒకటిగా ఉండదు, ఒకరిపై ఒకరికి అభిప్రాయాలూ అంత గొప్పగా కూడా ఉండవు. చేసినవాడికి గోరంత కొండంతైతే పొందిన వాడికి కొండంత గోరంత అవుతుంది. ఊరికే చేయలేదు అని పొందిన వాడనుకుంటే, పొందిన వాడు కృతఘ్నుడు అని చేసినవాడనుకుంటాడు. ఒక్కసారి సాయం చేస్తే జీవితాంతం దాసోహం కావాలా అని పొందిన వాడు అనుకుంటే నేను చేయకపోతే వాడి బతుకు బస్‌స్టాండే అనుకుంటాడు చేసిన వాడు. నేను చేశాను కాబట్టి నేను మహనీయుడిని అని చేసినవాడు భావిస్తే అది ఆయన ప్రతిఫలాపేక్షతో చేశాడు అని పొందినవాడనుకుంటాడు. చూశారా? మంచి కోసం జరగాల్సిన కర్మలో ఎన్ని వికృతాలో? వీటన్నిటిలో మనిషి చాలా సార్లు మరచిపోయే విషయం - ఇవ్వటం ఉపకారం కాదు, అది మానవ జన్మ ఎత్తినందుకు ఒక కనీస ధర్మం. ఈ విశ్వంలో ఎక్కువ నుండి తక్కువకు, తక్కువ నుండి ఎక్కువకు నిరంతరం బదిలీ జరుగుతూ ఉండాల్సిందే. లేకపోతే విశ్వ పరిణామమే ఆగిపోతుంది. అది ఆలోచన కావచ్చు, ధనం, వస్తువు, బంగారం, వాహనం, ఏదైనా కావచ్చు. అందుకే చాలా సార్లు మేము జీవితమంతా ఇతరులకు మంచే చేశాము అనుకునే వాళ్లకు కూడా చెప్పుకోలేని కష్టాలు, బాధలు, వ్యాథలు. చేసినవారి మనసులు బరువులు, పొందిన వారి మనసులు చీడ పురుగులు...అందుకే పాత్రం, అపాత్రం అనే విచక్షణ ఉపయోగించకపోతే, యోగ్యం, అయోగ్యం అన్నది ఆలోచించకపోతే ఇద్దరికీ మిగిలేది పాపమే. మరి కావలసింది ఏమిటి?

1. సాయం చేసేటప్పుడు యోగ్యునికి, పాత్రమైనది చేయటం
2. ఫలాపేక్ష లేకుండా ఉండటం
3. సాయం పొందినందుకు భగవంతునికి కృతజ్ఞత తెలుపటం, మరొకరికి ఫలాపేక్ష లేకుండా చేయటం.
4. భగవంతుడంటే రాయో, ఆకాశమో, నేలో కాదు. యోగ్యమైనది ఏదైనా భగవంతుడే. కాబట్టి యోగ్యుడైన మానవుడు భగవంతుడే.
5. మనం చేసేది భగవంతుని కోసం అన్న భావన. అన్నీ చెందినవానికి, అన్నీ తానైన వానికి తిరిగి ఇవ్వటం లెక్క పెట్టకూడదు కదా? ఇది అదే.

మంచి జరిగిన తరువాత నకారాత్మకమైన ఆలోచనలు వచ్చి దగ్గర కావలసిన మనుషులు దూరమెందుకు అవుతున్నరు అని మీరు ఆలోచిస్తే చాలా సార్లు అపాత్రము, అయోగ్యత మరియు ప్రతిఫలాపేక్షే కారణాలు. ఇది బయట వాళ్లతోనే కాదు, రక్తసంబంధీకుల మధ్య కూడా ఉంటుంది. అందుకే కుటుంబాలు విడిపోతాయి. ఎప్పుడైతే ఈ మూడు కారణాలు రంగంలో ఉంటాయో అప్పుడు అసలు లక్ష్యం, అసలు ధర్మం పక్కకు నెట్టబడుతుంది. అందుకే సనాతన ధర్మం ఫలాపేక్షకు, అపాత్రమునకు పాప ప్రమాణము నిర్ణయించింది.

కలియుగంలో అధర్మం పాళ్లు, తద్వారా మనుషులలో అయోగ్యం, అపాత్రము పాళ్లు, ప్రతిఫలాపేక్ష ఎక్కువ ఉంటాయి కాబట్టి నిజాయితీతో సాయం చేయదలచుకుంటే పాత్రమును బాగా నిశింతంగా పరిశీలించి, ఫలాపేక్షలేకుండా చేయాలి. అప్పుడు పాప సంచయము మనకు రాదు. ఈ విచక్షణ చేయాలంటే మంచి-చెడు, ధర్మం-అధర్మం వివరాలు బాగా తెలియాలి. మనస్తత్త్వం అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. వీటన్నిటికీ అంతర్ముఖమైన సాధన ఉండాలి. ఆచరంచి మరింత ముందుకు వెళ్లగలిగే ఓర్పు సహనం ఉండాలి. మొత్తం మీద శుద్ధమైన అంతఃకరణం ఉంటే ఈ పాత్రము-అపాత్రము విచక్షణ చేసే శక్తి వస్తుంది. మన పురాణ ఇతిహాసాలు, యోగుల చరిత్రలు, వారి రచనలు కూడా చాల ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి, కాలగమనం యొక్క పరీక్షలను తట్టుకొని ఎప్పటికీ సముచితంగా ఉండేలా రూపొందించబడినవి. ధర్మాధర్మ విచక్షణ నుండి పాత్రాపాత్ర విచక్షణ కలుగుతుంది. అప్పుడు అయోగ్యములైన వాటిని వీలైనంత త్వరగ మనకు దూరం చేసుకునే శక్తి కలుగుతుంది. యోగ్యములైన వాటిమీదే ధ్యాస ఉండి యత్నం సఫలమవుతుంది. కర్మ సాఫల్యం పొందుంతుంది. చేసే కర్మలు సఫలమైతే పాప పుణ్య సంచయం పటాపంచలై అకర్మ వైపు మనలను తీసుకువెళుతుంది.

ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం. ఎంతో దుర్లభమైన మానవ శరీరాన్ని ఇతరులకు సాయపడేలా ఉపయోగించితేనే మానవ జన్మ సార్థకము. 

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...