20, సెప్టెంబర్ 2026, ఆదివారం

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి


వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి

పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి

శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ
కరమున శరచాపములును ఘనముగ మెరయ 
సురుచిర వాద్యములు మ్రోయ సురలెల్ల వినుతి చేయ
వరత్యాగరాజ నుతుడు వసుధ భారమును బాప

భావము:

సోదరుడైన లక్ష్మణుడు తోడు రాగా కోదండము ధరించిన శ్రీరాముడు యాగరక్షణకై వెళుతున్నాడు. భూమిపై ప్రజలందరూ పొగడుచుండగా వందనీయుడైన విశ్వామిత్రునితో కలసి శ్రీరాముడు వెళుతున్నాడు. తలపైనున్న పొడవైన జుట్టు జారగా, వక్షస్థలములో ఉన్న హారములు, చేతిలో ధనుర్బాణములు గొప్పగా మెరుస్తుండగా, మధురమైన వాద్యములు మ్రోగగా, దేవతలందరూ ప్రస్తుతించుచుండగా పరమశివునిచే నుతించబడిన శ్రీరాముడు భూభారాన్ని తొలగించుటకు యాగరక్షణకై లక్ష్మణునితో కూడి వెళుతున్నాడు.  

తోడి రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామి కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

శ్రీగణనాథం భజామ్యహం - త్యాగరాజస్వామి కృతి



శ్రీగణనాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం

శ్రీగురుగుహాగ్రజం అగ్రపూజ్యం
శ్రీకంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం 

రంజిత నాటకరంగతోషణం
శింజిత వర మణిమయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజరముఖం త్యాగరాజ పోషణం  

శుభములను ప్రసాదించే వాడవు, మనసులో కోరుకున్న కోరికలకు తగిన ఫలములను అనుగ్రహించే వాడవు అయిన గణనాథా! నిన్ను నేను భజిస్తున్నాను. సుబ్రహ్మణ్యునికి అన్నవైన నీవు, అన్ని పూజలలోనూ ముందుగా పూజింపదగిన అగ్రపూజ్యుడవు.  పరమశివుని కుమారుడవు, నిన్ను ఆశ్రయించిన వారికి సామ్రాజ్య వైభవాన్ని ప్రసాదించేవాడవు,నిన్ను నేను భజిస్తున్నాను.  నాటకరంగానికి సంతోషమును ప్రసాదించేవాడవు, కదులుతున్నప్పుడు మధురంగా మ్రోగే శ్రేష్ఠమైన రత్నమయ ఆభరణాలను ధరించినవాడవుం ఆంజనేయుని అవతారంగా వెలసినవాడవు, మంగళకరమైన, మంచి మాటలు పలికేవాడవు, ఏనుగు ముఖాన్ని కలిగిన వాడవు, త్యాగరాజును ఆదరించి, రక్షించి, పోషించేవాడవు. అటువంటి గణనాథుడవైన నిన్ను నేను భక్తితో భజిస్తున్నాను.

ఈ కృతిలోని ఆంజనేయావతారం అనే ప్రయోగం ప్రత్యేకంగా గమనించదగినది. ఇక్కడ త్యాగరాజస్వామి గణపతినే హనుమంతుని అవతారంగా పేర్కొంటున్నట్లు సాహిత్యం నేరుగా కనిపిస్తుంది. దీనికి ఒక సంప్రదాయ వివరణ ఏమిటంటే, గణపతి మరియు హనుమంతుడు ఇద్దరూ విఘ్నాలను తొలగించే శక్తి, అపారమైన బలం, బుద్ధి, కార్యసిద్ధి, భక్తుల రక్షణ వంటి లక్షణాలకు ప్రతీకలు. అందువల్ల ఆంజనేయుని తత్త్వమే గణపతిలో కూడా వ్యక్తమైందనే భావంతో ఈ ప్రయోగాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే గణపతి నిజంగా ఆంజనేయునిగా అవతరించాడనే కథ వాల్మీకి రామాయణం లేదా ప్రసిద్ధ పురాణాలలో ప్రత్యేకంగా చెప్పబడలేదు.  

కనకాంగి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు

శ్రీరామ పాదమా - త్యాజరాజస్వామి కృతి


శ్రీరామ పాదమా! నీ కృప జాలునే! చిత్తానికి రావే!

వారిజ భవ సనకసనందన వాసవ నారదాదులెల్ల పూజించే

దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరును రాల్చగ
శూర! అహల్యను చూచి బ్రోచినారీతి ధన్యుసేయవే త్యాగరాజ గేయమా!

శ్రీరాముని పాదమా! నీ కృప ఒక్కటే నాకు చాలును. నా చిత్తములోకి వచ్చి స్థిరముగా నిలువవే! పద్మములో జన్మించిన బ్రహ్మదేవుడు, సనకుడు, సనందనుడు మొదలైన మహర్షులు, దేవేంద్రుడు, నారదుడు మొదలైన వారందరూ నిన్ను భక్తితో పూజిస్తున్నారు. శ్రీరాముడు నడిచే దారిలో శిలగా పడి, శాపం వల్ల కలిగిన తాపాన్ని భరించలేక, ఎన్నో సంవత్సరాలుగా కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్న అహల్యను చూసి, ఓ వీరుడైన శ్రీరాముని పాదమా! ఆమెను కరుణతో కాపాడి, శాపవిముక్తురాలిని చేసి ధన్యురాలిని చేసిన విధంగానే, త్యాగరాజునిచే నుతించబడుతున్న శ్రీరామపాదమా! నన్ను కూడా కరుణించి, కాపాడి, ధన్యుడిని చేయవే! 

అమృతవాహిని రాగంలో స్వరపరచబడిన ఈ త్యాజరాజస్వామి కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

రా రా రాజీవ లోచన - మైసూరు వాసుదేవాచార్యుల కృతి



రా రా రాజీవ లోచన! రామా! నన్ను బ్రోచుటకు!

దీనాశ్రితజన మందార! కరుణాపారవార!

ఏరా నీ కరుణ కల్గని కారణమేమో! కానరా!
మారారి వినుత! శుభద! సుచరిత!
పరాత్పర! ధరణిజా మనోహరా!

నీవే నా విభుడని నిరతము నీ పాదములను నెర నమ్మితి!
నీవాడని నను కరుణించి ఈవేళ నా చేయి విడువకురా!
దేవ దేవా! దశరథ నృప నందన! దశముఖాది సకల రిపుజనహరణ!
నీవనాదరణ సేయకురా! పవనజాప్త! శ్రీ వాసుదేవ!

తామర రేకుల వంటి కన్నులు కలిగిన, దీనులైన ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమైన, కరుణాసముద్రుడవైన శ్రీరామా! నన్ను బ్రోచుటకు రారా! నాపై కరుణ ఇంకా కలుగకుండుటకు కారణమేమో! నన్ను కానరా! మన్మథుని శత్రువైన శివునిచే నుతించబడిన, శుభములను కలిగించే, సచ్చరిత్ర కలిగిన పరమాత్మా! సీతాదేవి మనోహరుడవు నీవు. నన్ను బ్రోచుటకు రారా! నీవే నా ప్రభువని ఎల్లప్పుడూ నీ పాదములను నమ్ముకొంటిని. నీవాడని నాపై కరుణ జూపి ఈ వేళ నా చేయి విడువకుము రామా! దేవ దేవా! దశరథ మహారాజుని కుమారా! రావణాది రాక్షసులను సంహరించిన రామా! నాపై నిరాదరణ సేయకుము రా! ఓ వాసుదేవా! వాయుపుత్రుడైన హనుమంతునికి నీవు ఆప్తుడవు! నన్ను బ్రోచుటకు రారా!

మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ కొలువులో ఆస్థాన విద్వాంసునిగా ఎంతో పేరొందిన మైసూరు వాసుదేవాచార్యుల వారు ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యులు. తెలుగు సంస్కృత భాషలలో 300కు పైగా వర్ణములు, కృతులను రచించిన వీరు తమ మలి జీవితంలో రుక్మిణీదేవి అరుండేల్ గారి కళాక్షేత్రలో కూడా ప్రధాన సంగీత అధ్యాపకునిగా పనిచేశారు. మైసూరులో మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో 1865వ సంవత్సరంలో జన్మించిన వీరు అక్కడి మహారాజా సంస్కృత కళాశాలలో సంస్కృత అధ్యయనం చేశారు. త్యాగరాజస్వామి వారి శిష్య పరంపరకు చెందిన వీరు మనసును కరిగించే కీర్తనలను తెలుగు, సంస్కృత భాషలలో రచించారు. బ్రోచేవారెవరురా అనే ఖమాస్ రాగ కీర్తనతో ఎంతో పేరు పొందారు. వీరి కీర్తనలు, భక్తికి, ఆర్తికి, శరణాగతికి ప్రతీక. 1959వ సంవత్సరంలో వీరికి పద్మ భూషణ్ అవార్డు బహుకరించబడింది. వీరు తమ కృతులలోని భావంతో అభినవ త్యాగరాజు అన్న బిరుదును కూడా పొందారు. సంగీత సాహిత్య సేవలో పరిపూర్ణమైన జీవితం గడిపిన తరువాత వీరు 1961వ సంవత్సరంలో చెన్నైలో పరమపదించారు. వీరి ముద్ర "వాసుదేవ".

మోహన రాగం మనోహరమైనది. జగన్మోహనుడైన శ్రీరాముని వర్ణించటానికి ఇంతకన్నా సముచితమైన రాగం ఏముంటుంది? చెవులకు ఇంపుగా, ఆర్తి, భక్తి, శరణాగతి ఉట్టిపడే రాగ లక్షణాలు కల్గినది మోహనం. భక్తులను రామభక్తి సామ్రాజ్యంలో సమ్మోహితులను చేసే రాగం ఇది. వాసుదేవాచార్యుల వారు ఈ కీర్తనలో విశేషమైన భావనలను గుప్పించి మోహనరాగంలో స్వరపరచారు. పుంసాం మోహన రూపాయ అని వేనోళ్ల రాముని పొగడారు మన ఆర్యులు. ఈ రారా రాజీవలోచన అనే కృతిలో ఆ రామ వైభవాన్ని మరింత పెంపొందించారు కృతికర్త. ఈ కృతి సాహిత్యాన్ని పరిశీలిస్తే త్యాగరాజస్వామి వారి సాహిత్యపు ఆనవాళ్లు ప్రస్ఫుటంగా కనబడతాయి. ఒకరకంగా తన మహా గురువుల సాహితీ వైభవాన్ని వాసుదేవాచార్యుల వారు తెలుగు భాషలోని తన కృతుల ద్వారా కొనసాగించారు. నిరాడంబరమైన, నిర్మలమైన జీవితం గడిపిన ధన్యజీవులు వీరు.

ఈ కృతిని విద్వన్మణి ఎమ్మెల్ వసంతకుమారి గారి శిష్యురాలు, కలైమామణి, పద్మశ్రీ మరియు పద్మభూషణ్ బిరుదాంకితురాలు శ్రీమతి సుధా రఘునాథన్ గారు ఆలపించగా వినండి.

19, సెప్టెంబర్ 2026, శనివారం

వామాంక స్థితయా - ముత్తుస్వామి దీక్షితుల కృతి



వామాంక స్థితయా వల్లభయాऽऽశ్లిష్టం
వారణ వదనం దేవం వందేऽహం

వామన స్వరూపం వరదం సచాపం
చామర కర్ణం శశి శేఖర తనయం
నామరూప ధరం అభినవ గురుగుహ హృదయం

అష్టాంగయోగ వర హఠాణవాది జయ వశిష్ఠాది తపోధన సేవిత గణనాథం
సృష్ట్యాది కారణం శ్రితపాలనం హేతు దృష్టాంత వర్జితం దేవతా పూజితం
దుష్టవిఘ్నహరణం శిష్టభక్తభరణం ఇష్టఫలదచరణం శిష్టహృద్విహరణం

ఎడమ తొడపై ఆసీనురాలైన వల్లభాదేవి ఆలింగనం చేసుకొని ఉన్న, గజముఖుడైన గణపతిని నేను పూజిస్తున్నాను. పొట్టివాడు, వ ప్రదాత, విల్లు ధరించినవాడు, చామరములవంటి విశాల కర్ణాలు కలవాడు, చంద్రశేఖరుడైన శివుని కుమారుడు, అనేక నామరూపాలను ధరించి, బాలస్వరూపుడైన సుబ్రహ్మణ్యుని హృదయంలో నివసించేవాడు అయిన గణపతిని పూజిస్తున్నాను. అష్టాంగయోగంలో శ్రేష్ఠుడు, హఠము, అహంకారము మొదలైన వాటిని జయించినవాడు, వశిష్ఠుడు మొదలైన తపోధనులచే సేవింపబడే గణనాథుడు, సృష్టి మొదలైన జగద్వ్యాపారాలకు కారణుడు, శరణు వచ్చినవారిని పాలించేవాడు, కారణమూ దృష్టాంతమూ లేని అనుపమ స్వరూపుడు, దేవతలచే పూజింపబడేవాడు, దుష్టశక్తులవల్ల కలిగే విఘ్నాలను తొలగించేవాడు, శిష్టభక్తులను పోషించేవాడు, తన పాదముల ద్వారా ఇష్టఫలాలను ఇచ్చేవాడు, సజ్జనుల మరియు పండితుల హృదయాలలో విహరించేవాడైన ఆ గణపతిని భక్తితో స్తుతిస్తున్నాను.

ఇది ముత్తుస్వామి దీక్షితుల వారి అఠాణా రాగం, ఖండ ఏకతాళంలో ఉన్న గణపతి కృతి. వల్లభాదేవి తన వామాంకంలో ఉండి గణపతిని ఆలింగనం చేసిన సౌమ్యమైన వల్లభగణపతి భావాన్ని ఈ కృతి చిత్రిస్తుంది. అదే సమయంలో ఆయనను విశ్వకారకుడిగా, యోగీశ్వరుడిగా, భక్తరక్షకుడిగా ప్రతిష్ఠిస్తుంది. హఠ–ఆణవాది జయ అనే పదబంధంలో అఠాణా రాగముద్ర సున్నితంగా నిక్షిప్తమై ఉంది. ఈ కృతి ద్వితీయావిభక్తిలో సాగుతుంది.

ఈ కృతిని టీఎస్ సత్యవతి గారు ఆలపించారు.  

శ్రీ మూలాధార చక్ర వినాయక - ముత్తుస్వామి దీక్షితుల కృతి



శ్రీ మూలాధార చక్ర వినాయక
అముల్యవర ప్రదాయిక 

మూలాజ్ఞాన శోక వినాశక
మూలకంద ముక్తి ప్రదాయక

సకళీకృత దేవాదిదేవ శబళీకృత సర్వజ్ణ స్వభావ
ప్రకటీకృత వైఖరి స్వభావ పరాభవ ప్రసిద్ధ గజగ్రీవ
వికట షట్శత శ్వాసాధికార విచిత్రాకార భక్తోపకార
అకళంక విభాస్వర విఘ్నేశ వర గురుగుహ సోదర లంబోదర 

శ్రీమూలాధారచక్రంలో విరాజిల్లే వినాయకా, అమూల్యమైన వరాలను ప్రసాదించేవాడా, మూలమైన అజ్ఞానం వల్ల కలిగే శోకాన్ని నాశనం చేసేవాడా, సృష్టికి మూలకారణుడవై ముక్తిని అనుగ్రహించేవాడా! దేవతలకే ఆదిదేవుడవై సాకారరూపాన్ని ధరించినవాడవు,  నీ సర్వజ్ఞస్వభావాన్ని సమస్త జీవులలో వివిధరీతులుగా విస్తరింపజేసినవాడవు, వినిపించే వాక్కైన వైఖరీరూప స్వభావాన్ని ప్రత్యక్షపరచినవాడవు, నీకంటే ఉన్నతుడు ఎవరూ లేడని ప్రసిద్ధుడవు, గజముఖుడవు, వికటస్వరూపుడవు, ఆరువందల శ్వాసలపై అధికారం కలిగిన యోగస్వరూపుడవు, అనేక విచిత్రరూపాలు ధరించి భక్తులకు ఉపకారం చేసేవాడవు, కళంకరహితమైన ప్రకాశస్వరూపుడవు, విఘ్నాలకు ఈశ్వరుడవు మరియు వరాలను ప్రసాదించేవాడవు. హరునికి గురువైన సుబ్రహ్మణ్యుని సోదరుడవు, లంబోదరుడవైన నిన్ను నేను భక్తితో స్మరిస్తున్నాను.

ఇది ముత్తుస్వామి దీక్షితుల వారి తిరువారూరు క్షేత్ర సంబంధ గణపతి కృతి. శ్రీరాగంలో ఆదితాళంలో రచించబడింది. గణపతిని మూలాధారచక్రాధిపతిగా ధ్యానించే యోగతత్త్వాన్ని ఇది కేంద్రీకరిస్తుంది. మూలాధారం ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రథమాధారమని సూచిస్తూ, అజ్ఞాననాశనం మరియు ముక్తిప్రదానం అనే అంతర్ముఖసాధనను కృతి ప్రతిపాదిస్తుంది. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగు వాక్స్థితులలో బాహ్యంగా వినిపించే వైఖరీ వాక్కును గణపతి స్వరూపంగా చెప్పడం దీని విశిష్టత. షట్‌శత శ్వాసాధికారమనే ప్రయోగం ప్రాణశక్తి, శ్వాసనియంత్రణ, యోగాధికార భావాలను సూచిస్తుంది. 

ఈ కృతిని ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.    

హస్తి వదనాయ నమస్తుభ్యం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


హస్తి వదనాయ నమస్తుభ్యం
హాటకమయ మంటపే సింహాసన స్థితాయ

హస్తి కృత్తి వసన ధరార్చిత మహా గణపాయ తత్వ స్వరూపాయ
సమస్త భక్తానుగ్రహాయ మాయాలింగిత విగ్రహాయ


కమలోత్పల పాశ శంఖ చక్రేక్షు కార్ముక వ్రీహ్యాగ్ర గదా నిజ విషాణ
మాతులంగ రత్న కలశ ధరణ కరాంబుజాయ పద పంకజాయ విమలాయ
విశ్వోత్పత్తి స్థితి విలయాయ కరుణాలయాయ
హిమాద్రితనయానన పంకజ హిరణ్య గర్భాయ సుమనసే
ఉమారమణ కుమార గురుగుహ సమాన వరౌజసే మహసే

గజముఖుడవైన మహాగణపతీ! నీకు నా నమస్సులు. బంగారుమయమైన మండపంలో సింహాసనంపై కొలువై ఉన్నవాడవు నీవు. ఏనుగు చర్మాన్ని వస్త్రముగా ధరించిన పరమశివునిచే పూజింపబడే మహాగణపతీ! పరమతత్త్వస్వరూపుడవు, సమస్త భక్తులపై అనుగ్రహం కురిపించేవాడవు, మాయాశక్తి ఆలింగనం చేసిన దివ్యవిగ్రహుడవు. కమలం, కలువ, పాశం, శంఖం, చక్రం, చెరకువిల్లు, వరికంకులు, గద, స్వదంతం, మాదీఫలము, రత్నకలశం ధరించిన కమలసదృశ హస్తాలు కలవాడవు, కమలాలవంటి పాదములు గల నిర్మలుడవు, జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయలకు కారణభూతుడై కరుణకు నిలయమైనవాడవు, హిమవంతుని కుమార్తె పార్వతీదేవి ముఖకమలాన్ని వికసింపజేసే సూర్యునివంటి హిరణ్యగర్భస్వరూపుడవు, సదాశయుడవు. ఉమారమణుడైన శివుని కుమారుడయిన సుబ్రహ్మణ్యునితో సమానమైన శ్రేష్ఠ పరాక్రమం, తేజస్సు, ప్రకాశస్వరూపుడవయిన నిన్ను భక్తితో స్తుతిస్తున్నాను. 

నవరోజు రాగంలో మిశ్రచాపు తాళంలో స్వరపరచబడిన ఈ కృతి తిరువారూరు క్షేత్ర సంబంధితమైనది. గణపతిని కేవలం విఘ్నేశ్వరునిగా కాక, మాయాశక్తితో ఏకమైన పరతత్త్వంగా, విశ్వసృష్టి–స్థితి–లయకర్తగా, అనేక దివ్యచిహ్నాలు చేతబూనిన మహావిగ్రహంగా దీక్షితులు ఇందులో దర్శింపజేస్తారు. గురుగుహునితో సమానమైన తేజఃపరాక్రమం అనే పదబంధంలోనే నవరోజు రాగముద్రను కూడా సున్నితంగా నిక్షిప్తం చేశారు.

ఈ ముత్తుస్వామి దీక్షితుల కృతిని విఘ్నేశ్ ఈశ్వర్ ఆలపించారు


మహాగణపతిం మనసా స్మరామి - ముత్తుస్వామి దీక్షితుల కృతి


మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత

మహాదేవ సుతం గురుగుహ నుతం మారకోటి ప్రకాశం శాంతం
మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం 

వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన మహర్షులచే పూజించబడే మహాగణపతిని నేను నా మనస్సులో నిరంతరం స్మరిస్తున్నాను. ఆయన మహాదేవుడైన పరమశివుని కుమారుడు, గురుగుహుడైన కుమారస్వామిచే స్తుతింపబడేవాడు, కోటి మన్మథుల సౌందర్యప్రకాశాన్ని మించిన తేజస్సు కలిగినా పరమశాంతస్వరూపుడు. మహాకావ్యాలు, నాటకాలు మొదలైన కళలను ప్రీతితో ఆదరించేవాడు, మూషికాన్ని వాహనంగా కలిగినవాడు, మోదకాలను ఎంతో ఇష్టపడే ఆ మహాగణపతిని మనసారా ధ్యానిస్తున్నాను.

మహాకావ్య నాటకాది ప్రియం అన్నారు దీక్షితుల వారు. దీనిని రెండు విశేషాలుగా చెప్పుకోవచ్చు. 

1. దీక్షితుల వారి ప్రత్యేకత రాగం యొక్క పేరును చాలా కృతులలో సాహిత్యానికి సముచితంగా ప్రస్తావించటం. ఇక్కడ నాట రాగ నామాన్ని నాటక అనే పదంలో పొందుపరచారు. 

2. గణపతి వ్యాసభగవానుడి నోట వెలువడ్డ మహాకావ్యమైన భారతాన్ని వ్రాయటానికి ఒప్పుకోవటానికి ఉన్న నేపథ్యం. శబ్దభావతాళాలతో ముడిపడి ఉన్న కళలన్నిటినీ ఆస్వాదించేవాడు గణపతి, బుద్ధిప్రదాత కాబట్టి.  

నాట రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

వినాయక విఘ్ననాశక - ముత్తుస్వామి దీక్షితుల కృతి


వినాయక విఘ్ననాశక మాం తారయ దయానిధే

అనాథ రక్షక ఆరూఢ మూషిక శివ గురుగుహ విధి పూజిత 

ఆశ్రితజన పరిపాలక దేవరాజపుర తోషిత వేగవాహినీ వర్ధిత
రవిశశివహ్నినేత్ర రతిపతి సన్నుత శుభగాత్ర పవనాత్మజానందకర రామ మిత్ర వర పవిత్ర

దయాసముద్రుడవు, విఘ్నములను నాశనము చేసే వినాయకా, సంసారసాగరము నుండి నన్ను దాటించుము. అనాథులకు రక్షకుడవై, మూషికాన్ని వాహనంగా అధిరోహించినవాడవు నీవు. శివుడు, గురుగుహుడైన కుమారస్వామి, బ్రహ్మదేవుడు పూజించే వాడవు, శరణు వచ్చిన జనులను పరిపాలించేవాడవు. దేవరాజపురమనే కాంచీపురంలో ఆనందంగా కొలువై, వేగవాహినీ నదిచే మహిమ వర్ధిల్లినవాడవు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే దివ్య నేత్రములు కలవాడవు, రతీపతియైన మన్మథునిచే కూడా స్తుతింపబడే శుభమంగళ స్వరూపుడవు, వాయుపుత్రుడైన హనుమంతునికి ఆనందాన్ని కలిగించేవాడవు, రామునికి మిత్రుడవు, సమస్త పావనకరులలో శ్రేష్ఠుడవైన వినాయకా, సంసారసాగరము నుండి నన్ను దాటించుము. 

వేగవాహిని రాగంలో స్వరపరచబడిన ముత్తుస్వామి దీక్షితుల కృతిని ప్రియా సోదరీమణులు ఆలపించారు


గణేశకుమార పాహి మాం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


గణేశకుమార పాహి మాం గజముఖ

మనోరథ సిద్ధి దాయకా
ఆగమపదాదినుత భవ శ్రీ గురుగుహనుత గజముఖ 

గజముఖుడవు, బాలస్వరూపుడవైన గణేశా! నన్ను కాపాడుము. నా మనోరథాలను సిద్ధింపజేసే వాడవు నీవు. ఆగమశాస్త్రాలలోని పవిత్రమైన పదములచే మొదటినుండి స్తుతింపబడేవాడవు, భవుడైన పరమశివునిచే వందింపబడేవాడవు, శ్రీ గురుగుహుడైన కుమారస్వామిచే కూడా నుతింపబడేవాడవు. నన్ను కాపాడుము.

ఝంఝూటి రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని స్కందశ్రీ శివప్రసాద్ గారు ఆలపించారు

ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం - మైసూరు వాసుదేవాచార్యుల కృతి



ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం
ఫణితల్ప వాసుదేవ భక్తం సతతం

గణనాథమమర బృంద సేవితం
ఫణిహార భూషితం ముని వర వందితమ్

ధృత చారు మోదకం గజ ముఖం
సితకరామిత గర్వ భంజకం
నతలోక సంతోష దాయకం
శ్రితభక్త పాలకం సిద్ధి వినాయకం 

గౌరీదేవి కుమారుడు, ఆదిశేషుని శయ్యగా కలిగిన వాసుదేవుడైన శ్రీమన్నారాయణుని ఎల్లప్పుడూ భక్తితో సేవించేవాడు అయిన శ్రీగణపతికి నేను ప్రణమిల్లుతున్నాను. గణములందరికీ నాయకుడు, దేవతాసమూహముచే సేవింపబడేవాడు, సర్పములను హారముగా ఆభరణంగా ధరించినవాడు, శ్రేష్ఠ మునులచే పూజించబడేవాడు, సుందరమైన మోదకాన్ని చేతబూని ఉన్న గజముఖుడు, చంద్రుని అపరిమిత గర్వాన్ని అణచినవాడు, నమస్కరించి శరణు వచ్చిన లోకజనులకు సంతోషాన్ని ప్రసాదించేవాడు, ఆశ్రయించిన భక్తులను కాపాడేవాడు, సకల సిద్ధులను అనుగ్రహించు సిద్ధివినాయకుడు అయిన గణపతిని నేను భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను.

గౌళ రాగంలో స్వరపరచబడిన ఈ మైసూరు వాసుదేవాచార్యుల కృతిని ఎం ఎల్ వసంతకుమారి గారు ఆలపించారు.  


గణనాయకం భజేహం భజే - ముత్తుస్వామి దీక్షితుల కృతి


గణనాయకం భజేహం భజే
కమలేశనుతం కామరిపుసుతం

అణిమాది సిద్ధి దాయకం సుముఖం

వాణీ రమణానందం వరదం
వదనేద్విరదం వరబాలగురుగుహం

గణములకు నాయకుడు, విష్ణువుచే నుతించబడినవాడు, మన్మథుని శత్రువైన పరమశివుని కుమారుడు అయిన గణపతిని భజిస్తున్నాను. అణిమాది అష్ట సిద్ధులను ప్రసాదించేవాడు, ప్రసన్నమైన ముఖము కలవాడు అయిన గణపతిని భజిస్తున్నాను. సరస్వతీదేవి పతి అయిన బ్రహ్మకు ఆనందం కలిగించేవాడు, వరములనొసగేవాడు, గజముఖము కలిగినవాడు, బాలుడైన కుమారస్వామిని అనుగ్రహించినవాడు అయిన గణపతిని భజిస్తున్నాను.

(అణిమ,మహిమ,గరిమ,లఘిమ,ప్రాప్తి,ప్రాకామ్యము, ఈశత్వము,వశిత్వము అనేవి అష్ట సిద్ధులు. రెండు దంతములు కలిగినది ఏనుగు అందుకే దానిని ద్విరదము అన్నారు) . రుద్రప్రియ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎం ఎల్ వసంతకుమారి గారు ఆలపించారు. 

రక్తగణపతిం భజేహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి



రక్తగణపతిం భజేహం
రత్న సింహాసన పతిం సురపతిం

రక్తాంబరధరం రాగ ద్వేషాది హరం
పార్వతీ ప్రియకరం మోహన కరం

పరశురామ క్షేత్ర ప్రభావం
పాయసాన్న హోమాది విభావం
పంచకృత్యాతీత స్వభావం
భక్తజనాది సమూహ వైభవం

సకల కార్యార్థ సిద్ధిదం స్థిరం
వామదేవాది పూజితం వరం
వారిజభవ వందిత వల్లభేశం
గురుగుహనుతం పరమశివ సుతం

రత్నసింహాసనానికి అధిపతియై దేవతలకు ప్రభువుగా విరాజిల్లే రక్తవరణములో ఉండే గణపతిని నేను భజిస్తున్నాను. ఎర్రని వస్త్రాలు ధరించి, రాగము, ద్వేషము మొదలైన అంతఃశత్రువులను తొలగించేవాడు, తన తల్లి పార్వతీదేవికి ప్రియమైనవాడు, మోహనమైన రూపం కలవాడు, పరశురామక్షేత్రమునందు ప్రత్యేక మహిమతో వెలసినవాడు; పాయసాన్నహోమము మొదలైన హోమారాధనలచే వైభవంగా పూజింపబడేవాడు, సృష్టి, స్థితి, సంహారము, తిరోభావము, అనుగ్రహము అనే పంచకృత్యాలకు అతీతమైన స్వభావం కలవాడు, భక్తజన సమూహాలచే చుట్టుముట్టబడి మహిమతో వెలిగేవాడు, సమస్త కార్యాల ఆశయాలను స్థిరంగా సిద్ధింపజేసే వరప్రదుడు, వామదేవుడు మొదలైనవారిచే పూజింపబడే శ్రేష్ఠుడు, కమలమున పుట్టిన బ్రహ్మచే పూజించబదే వల్లభేశుడు, సుబ్రహ్మణ్యునిచే స్తుతింపబడే పరమశివుని కుమారుడైన  రక్తగణపతిని నేను భక్తితో భజిస్తున్నాను.

ఇక్కడ పరశురామ క్షేత్రం అనగా పరశురాముడు సముద్రం నుండి తిరిగి పొందిన భూమిగా పురాణ సంప్రదాయంలో భావించే పశ్చిమతీర పవిత్ర ప్రాంతం — ప్రధానంగా కేరళ–కొంకణ తీరప్రాంతం. ఆ ప్రాంతంలో గణపతి ఆరాధన, హోమసంప్రదాయం విశేషంగా ఉండటాన్ని ఈ కృతి సూచిస్తుంది, అయితే కృతి స్వయంగా ఒక నిర్దిష్ట ఆలయనామాన్ని చెప్పదు.  

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

ఏకదంతం భజేహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


ఏకదంతం భజేహం ఏకానేక ఫల ప్రదం

పాకశాసనారాధితం పామర పండితాది నుత పదం 

కైలాసనాథ కుమారం కార్తికేయ మనోహరం
హాలాస్య క్షేత్ర వేగవతీ తట విహారం హరం
కోలాహల గురుగుహ సహితం కోటి మార లావణ్య హితం
మాలా కంకణాది ధరణం మాషా వల్లభాంబా రమణం 

ఏకదంతుడైన శ్రీగణపతిని నేను భజిస్తున్నాను. ఆయన పరమఫలమైన మోక్షాన్ని, అనేకమైన ఐహిక కోర్కెల ఫలాలను అనుగ్రహించేవాడు.

పాకాసురుణ్ణి సంహరించిన ఇంద్రునిచే ఆరాధింపబడేవాడు, పామరుల నుండి పండితుల వరకు అందరిచే నుతించబడే పాదములు కలవాడు, కైలాసనాథుడైన శివుని కుమారుడు, కార్తికేయునికి ఆనందము కలిగించే వాడూ అయిన ఏకదంతుడిని నేను భజిస్తున్నాను. హాలాస్యక్షేత్రమైన మదురైలో వేగవతి నది తీరాన విహరించేవాడు, భక్తుల దుఃఖాలు, విఘ్నాలు తొలగించేవాడు. ఉత్సవకోలాహలంలో గురుగుహుడైన సుబ్రహ్మణ్యునితో కలిసి ఉండేవాడు. కోటి మన్మథుల అందాన్ని మించే లావణ్యం కలిగి, లోకహితాన్ని చేసేవాడు. పూలమాలలు, కంకణాలు మొదలైన ఆభరణాలు ధరించినవాడు. నల్లని రూపము కలిగి, మాయాశక్తి స్వరూపిణియైన వల్లభాంబాదేవికి పతియైన గణపతిని నేను భక్తితో భజిస్తున్నాను.

మధురకు హాలాస్యక్షేత్రం అనే పేరు రావడం స్థలపురాణ సంబంధమైనది.

పారంపర్య కథనం ప్రకారం, మదురై నగర నిర్మాణానికి శివుడు ఒక సర్పాన్ని పంపాడు. ఆ సర్పం నగరానికి సరిహద్దులుగా చుట్టుకొని తన తల–తోకలను మధ్యభాగంలోని శివాలయ దిశగా ఉంచింది. ఆ సర్పానికే హాలాస్యమని పేరు. అందువల్ల ఆ పవిత్ర నగరం హాలాస్యం, తమిళంలో తిరువాలవాయ్, అని ప్రసిద్ధి చెందింది. అక్కడ వెలసిన శివుడు సోమసుందరేశ్వరుడు/హాలాస్యనాథుడు. అందుకే కృతిలో హాలాస్య క్షేత్రం అని ముత్తుస్వామి దీక్షితుల వారు ప్రస్తావించారు. 

బిలహరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని సిక్కిల్ గురుచరణ్ గారు ఆలపించారు.

శక్తి సహిత గణపతిం - ముత్తుస్వామి దీక్షితుల కృతి

శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం
విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం

భక్తాళి పోషకం భవసుతం వినాయకం
భుక్తిముక్తిప్రదం భూషితాంగం రక్తపదాంబుజం భావయామి

శంకరుడు మొదలైన దేవతలచే సేవింపబడేవాడు, వైరాగ్యాన్ని ఆచరించిన మునిశ్రేష్ఠులచే, దేవరాజైన ఇంద్రునిచే, గురుగుహుడైన సుబ్రహ్మణ్యునిచే స్తుతింపబడేవాడు, పార్వతీదేవితో కూడి ఉన్న గణపతిని నేను ధ్యానిస్తున్నాను. భక్తసమూహాన్ని పోషించి రక్షించేవాడు, భవుడైన శివుని కుమారుడు, విఘ్నాలను తొలగించే వినాయకుడు, భుక్తి అనగా లోకంలో లభించే సుఖసంపదలను, ముక్తి అనగా జననమరణ బంధవిముక్తిని ప్రసాదించేవాడుం దివ్యాభరణాలతో అలంకరింపబడిన దేహం, ఎర్రని కమలాలవంటి పాదాలు కలిగిన పార్వతీ సహిత గణపతిని నేను నా మనస్సులో ధ్యానిస్తున్నాను.

శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నొట్టుస్వరాలను నేర్పించటానికి వినియోగిస్తారు. దీనిని జొన్నలగడ్డ శ్రీరాం మరియు కల్యాణ్ వసంత్ ఆలపించారు

18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

గజాననయుతం గణేశ్వరం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


గజాననయుతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం

అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం గణాది సన్నుత పదపద్మకరం
కుంజర భంజన చతురతర కరం గురుగుహాగ్రజం ప్రణవాకారం

గజముఖము కలిగిన గణేశ్వరుడిని, దేవతలకు అధిపతియైన ఆ గణపతిని నేను ఎల్లప్పుడూ భజిస్తున్నాను. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారిచే పూజింపబడే వాడు, గణములు మొదలైనవారు స్తుతించే  కమలముల వంటి పాదాలు, హస్తాలు కలిగినవాడు,  కుంజరుడనే రాక్షసుడిని సంహరించడంలో అత్యంత సమర్థతను చూపినవాడు, సుబ్రహ్మణ్యస్వామికి అగ్రజుడు, ఓంకారస్వరూపుడు అయిన ఆయనను నేను నిరంతరం ఆరాధిస్తున్నాను.

ముత్తుస్వామి దీక్షితుల వారు చక్రవాకం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

హేరంబాయ నమస్తే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


హేరంబాయ నమస్తే హేరంబాయ నమస్తే
హరి బ్రహ్మేంద్రాది సేవిత శివకుమారాయ 

వీర గణాది ముదితాయ వీరాది వర ప్రదాయ

సూరిజనోపాసితాయ సుర గురుగుహ సేవితాయ
పరమేశ్వర కుమారాయ పంచ హస్తాయ పాశాంకుశ-
ధరాయ ప్రసిద్ధ గణ నాధాయ వినాయకాయ 

శొర్యముచే అతిశయించు గణపతికి నా నమస్సులు. హరి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలచే సేవింపబడే, శివుని కుమారుడైన గణపతికి నమస్సులు. వీరగణములు మొదలైనవారితో ఆనందించేవాడు, భక్తులకు వీరత్వము మొదలైన వరాలను ప్రసాదించేవాడు, జ్ఞానులచే ఉపాసింపబడేవాడు, దేవతలచేను తన సోదరుడైన సుబ్రహ్మణ్యుడి చేతను సేవింపబడేవాడు, పరమేశ్వరుని కుమారుడు, ఐదు హస్తములు కలవాడు, పాశమును, అంకుశమును ధరించినవాడు, సర్వగణాలకు ప్రసిద్ధుడైన అధిపతి, ఎవరికీ అధీనుడు కాని వినాయకుడు అయిన ఆ హేరంబ గణపతికి నేను నమస్కరిస్తున్నాను.  

అఠానా రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని సౌమ్యా పరశురామన్ ఆలపించారు

వల్లభ నాయకస్య - ముత్తుస్వామి దీక్షితుల కృతి


వల్లభ నాయకస్య భక్తో భవామి

వాంచితార్థదాయకస్య వరమూషిక వాహనస్య

పల్లవపద మృదుతరస్య పాశాంకుశాది ధరస్య
మల్లికాజాతి చంపక హారస్య మణిమాలస్య
వల్లీ వివాహ కారణస్య గురుగుహ పూజితస్య
కాళీ కళామాలినీ కమలాక్షి సన్నుతస్య   

భావం:

గణముల అధిపతి అయిన గణపతికి నేను భక్తుడనై ఉన్నాను. ఆయన కోరిన కోర్కెలను నెరవేర్చువాడు,  శ్రేష్ఠమైన మూషికాన్ని వాహనంగా కలిగినవాడు. ఆయన పాదాలు లేత చిగురులకన్నా మృదువైనవి. పాశము, అంకుశము మొదలైన ఆయుధాలను ధరించినవాడు; మల్లిక, జాజి, సంపెంగ పుష్పహారాలతోను మణిమాలలతోను అలంకరింపబడినవాడు. తన సోదరుడైన సుబ్రహ్మణ్యుడు వల్లితో వివాహం చేసుకొనుటకు కారణమైనవాడు, సుబ్రహ్మణ్యునిచే పూజింపబడినవాడు. కాళీదేవి, కళామాలినియైన సరస్వతీదేవి, కమలాక్షియైన లక్ష్మీదేవి చేత స్తుతింపబడినవాడు అయిన గణపతికి నేను భక్తుడనై ఉన్నాను.  

గణపతి వల్లీ-సుబ్రహ్మణ్యుల వివాహానికి కారణమైనాడు అని దీక్షితుల వారు ఈ కృతిలో ప్రస్తావించారు. దీని వెనుక ఉన్న గాథ ఏమిటి? 

సుబ్రహ్మణ్యుడు వల్లి ప్రేమను పరీక్షించటానికి వృద్ధుని వేషంలో ఆమె వద్దకు వెళతాడు. వల్లి ఆయనను గుర్తించదు. కొంత సంకోచంతో ఉంటుంది. అప్పుడు సుబ్రహ్మణ్యుని అభ్యర్థనపై గణపతి ఏనుగు రూపం ధరించి వల్లిని భయపెడతాడు. భయపడిన వల్లి, తనను రక్షించమని ఆ వృద్ధుని రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడిని ఆశ్రయిస్తుంది.

సుబ్రహ్మణ్యుడు, “నన్ను వివాహం చేసుకుంటానని ఒప్పుకుంటే ఈ ఏనుగును వెళ్లగొడతాను” అని అంటాడు. వల్లి అంగీకరించగానే గణపతి ఏనుగు రూపాన్ని విడిచి వెళ్తాడు. తరువాత సుబ్రహ్మణ్యుడు తన దివ్యస్వరూపాన్ని చూపుతాడు. వల్లి ఆయనను వివాహం చేసుకుంటుంది.

అందుకే దీక్షితుల వారు కృతిలో “వల్లీ వివాహ కారణస్య” అన్నారు.    

బేగడ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు అద్భుతంగా ఆలపించారు

గణరాజేన రక్షితోహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

గణరాజేన రక్షితోహం
గుణిజన నుత పల్లవ పదేన 

అణిమాద్యష్ట సిద్ధి ప్రదేన
మాణిక్య మకుటాది ధరేణ
మంత్రిణీ పూజిత సుముఖేన
మానిత గురుగుహ వందితేన
దినకర కోటి ప్రకాశేన
వినతాశ్రిత మందారేణ
మను పూజిత పాశాంకుశేన
కానన స్థిత బ్రహ్మచర్యేణ 

భావం:

సజ్జనులు స్తుతించే మృదువైన పాదములు గల గణాధిపతి నన్ను రక్షించుచున్నాడు. అణిమ, గరిమ మొదలైన అష్టసిద్ధులను అనుగ్రహించేవాడు, మణులు పొదిగిన కిరీటమును ధరించినవాడు, మంత్రిణీ దేవి ఆయిన రాజశ్యామలచే పూజించిన సుముఖుడు, సుబ్రహ్మణ్యునిచే పూజించబడే గణపతి నన్ను రక్షించుచున్నాడు. కోటి సూర్యుల వలె తేజోవంతుడు,  నమస్కరించి శరణు వచ్చినవారికి కల్పవృక్షము వంటి వాడు. మనువుచే పూజించబడిన పాశము మరియు అనుకుశము ధరించినబాడు, అరణ్యమునందు నివసించేవాడు, బ్రహ్మచారిరూపుడైన గణపతి నన్ను రక్షించుచున్నాడు. 

ఆరభి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఆర్ వేదవల్లి గారు ఆలపించారు.

శ్రీ గణపతిని సేవింపరారే - త్యాగరాజస్వామి కృతి

శ్రీ గణపతిని సేవింపరారే శ్రిత మానవులారా

వాగధిపతి సుపూజల జేకొని బాగా నటింపుచును వెడలిన 

పనస నారికేళాది జంబూ ఫలముల నారగించి
ఘన తరంబుగను మహిపై పదములు ఘల్లు ఘల్లు మననించి
అనయము హరి చరణ యుగములను హృదయాంబుజమున నుంచి
వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిత్తళాంగుమని వెడలిన  

శరణు కోరిన మానవులారా, శ్రీ గణపతిని సేవించటనికి విచ్చేయండి. వాక్కుకు అధిపతియైన బ్రహ్మదేవునిచే ఉత్తమమైన పూజలందుకొని లీలగా నటింపుచు వెళుతున్న గణపతిని సేవించటానికి విచ్చేయండి. పనస, కొబ్బరి, నేరేడు మొదలైన ఫలములను ఆరగించి, భూమిపై తన గంభీరమైన పాదములను “ఘల్లు ఘల్లు” మను శబ్దముతో మోపుచు, ఎల్లప్పుడూ తన హృదయకమలమున శ్రీహరి చరణయుగములను నిలుపుకొనినవాడు,  వినయముగా త్యాగరాజునిచే నుతించబడిన వాడు, వివిధ నడకలతో ధిత్తళాంగుమనే లయనాదమును పలికించుచు వెడలిన గణపతిని సేవించటానికి విచ్చేయండి.   

త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్తి విజయము అనే యక్షగానాన్ని రచించారు. అందులో ప్రహ్లాదుని జననము నుండి నరసింహావతారం వరకు కృతి-గద్య రూపంలో అద్భుతమైన సాహిత్యాన్ని ఐదు భాగాలుగా విభజించారు. మొత్తం 48 దాకా కృతులు ఈ యక్షగానంలో ఉన్నాయి. అందులో మొదటిది ఈ గణపతిని కొలిచే సందర్భంగా కృతి.సౌరాష్ట్ర రాగంలో స్వరపరచబడిన ఈ కృతి సాధారణంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పంచరత్న కృతుల బృందగానం ముందు ఆలపిస్తారు. 

ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...