20, జనవరి 2011, గురువారం

శ్రీమచ్ఛంకరభగవత్పాద కృత సాధనా పంచకం - తాత్పర్యము

మానవ జన్మ పరమార్థము మనము ఏమిటో తెలుసుకొని, పాప ప్రక్షాళన చేసుకొని, పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, ఆ పరబ్రహ్మమును అనుభూతి పొంది, ఆ సచ్చిదానంద స్థితిలో ఉండటం. ఇది ఒకరోజులో అలవాటు అయ్యేది కాదు, అనుభూతి పొందేది కాదు. నిరంతర కఠోర సాధన అత్యంత ఆవశ్యకం. మరి ఈ అనంతమైన భవసాగరంలో మునిగి తేలే మనకు ఏది సరైన మార్గము?.

దీనికోసమే శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

జగద్గురువు అనుగ్రహమే నేటి భారతదేశ ఆధ్యాత్మిక ఔన్నత్యము

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.

కాబట్టి, ఈ సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. దీన్నే షిర్డీ సాయిబాబా వంటి సద్గురువులు మనకు అరటి పండులా ఒలిచి చెప్పారు. వివేకానంద వంటి వేదాంతులు ఘోషించారు. ఆధ్యాత్మిక సంపాదకు మనకు ఏమి కొరత లేదు. కానీ, దానిని ఉపయోగించుకుని, ఆచరణలో పెట్టే చిత్తశుద్ధి, త్యాగనిరతి లేదు. వీటిని దాటితే, మనకు ఎదురు లేదు.

ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.  జయ జయ శంకర! హర హర శంకర!

ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మా 

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసంధీయతాం
ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం  ౧

వేదములను నిత్యము అధ్యయనం చేద్దాము. వాటిలో చెప్పబడిన కర్మలను అనుష్ఠిద్దాం. వాటిని అనుసరించి దేవతలను పూజించుదాం, కర్మలను ఫలాపేక్ష లేకుండా చేద్దాము. మనం చేసే తప్పులను తెలుసుకుందాం, పాపములనుండి దూరముగా ఉందాము. ఆత్మజ్ఞానమును పొందుదాం. గృహ బంధనముల నుండి దూరముగా ముక్తి మార్గములో  పయనిద్దాం.

సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాఽఽధీయతాం
శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతాం
సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతాం  ౨

సత్సాంగత్యమును ఆచరిద్దాం. భగవంతునిపై దృఢమైన భక్తీ భావాన్ని పెంపొందిన్చుకుందాం. శాంతి మొదలగు మానసిక స్థితులను తెలుసుకుందాం, కర్మలను దృఢ సంకల్పముతో నిర్వర్తిద్దాము. సద్గురువును ఆశ్రయిద్దాం, శరణాగతి కోరుదాం, గురు పాదుకలను నిత్యము పూజిద్దాం. ఏకాక్షర బ్రహ్మమును (ఓం)  ధ్యానిద్దాం, శ్రుతులలో చెప్పిన వాటిని శిరోధార్యముగా విందాం.

వాక్యార్థ్యశ్చ విచార్యతాం శ్రుతిశిరపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసంధీయతాం
బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహంమతిరుఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం  ౩

వేదాలలోని గొప్ప వాక్యములను అర్థం చేసుకొనుటకు ప్రయత్నిద్దాం, వేద సారాన్ని తెలుసుకుందాం. చేదు వాగ్వివాదములకు దూరంగా ఉందాము, వేదములపై సంవాదములలో మాత్రమే పాల్గొందాము. నేనే బ్రహ్మను అనే భావనను వీలైనంత కలిగి ఉందాము,  అహంకారాన్ని వీడుదాం. నేను అనగా శరీరం అనే భావనను వీడుదాం, పండితులతో వాదనలు పరిత్యజిద్దాము.

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతాం  ౪

ఆకలి అనే రోగానికి చికిత్స చేద్దాము, ప్రతిదినము భిక్షలో దొరికిన దానినే ఔషధంగా భుజిద్దాం. రుచికరమైన భోజనము కొరకు యాచించ కుండా ఉందాము, విధివశాత్తు దొరికిన దానితో సంతృప్తి చెందుదాం. శీతోష్ణములను ఓర్చుకుందాము, వృథా వాక్యములను మాట్లాడకుందాము.  ఉదాసీనమును ఇష్ట పడదాం (విషయముల పట్ల ఉదాసీనముగా ఉండుట  - సంతోషము, విచారము లేకుండా), జనులు మన పట్ల చూపించే కృప, నిష్ఠూరములను మనలకు అంటకుండా ఉందాము.

ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధం త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం  ౫

ఏకాంతంలో సుఖాసీనులమై, ఆత్మ యొక్క సత్యముపై మనసు లగ్నము చేద్దాము. పూర్ణాత్మను దర్శించుదాం. ఆ సత్యముతో నిండిన విశ్వాన్ని దర్శించటానికి ప్రయత్నిద్దాము. పూర్వ కర్మల ఫలములను నాశనము చేద్దాము, కొత్త కర్మలలో చిక్కుకొన కుండా ఉందాము. ప్రారబ్ధమును ఇక్కడే వదిలివేద్దాము, పరబ్రహ్మ స్థితిలో ఉందాము.

19, జనవరి 2011, బుధవారం

శ్రీ బుధకౌశిక ఋషి విరచిత శ్రీరామరక్షా స్తోత్రం - తాత్పర్యము

'రాం' అనే అక్షరం అగ్ని స్వరూపం. అంతటి మహిమాన్వితమైన బీజాక్షరం మరొకటి లేదని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి దీనికి దేవత అయిన శ్రీ రాముడు ఎంత మహిమాన్వితుడో మనకు వాల్మీకి మహర్షి విపులంగా రామాయణ మహాకావ్యంలో చెప్పాడు.

మానవునిగా పుట్టి,  ధర్మ సంరక్షణకోసం, సత్య వాక్పరిపాలన కోసం ఆదర్శ జీవనాన్ని గడిపిన ఆ ధర్మమూర్తి రామచంద్రుని స్మరిస్తే సకల భయాలు, ఆపదలు,  పాపాలు తొలగుతాయని, మోక్షము కలుగుతుందని ఎన్నలేని నిదర్శనాలు ఈ భారత భూమిపై కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి. ఎందరో ఋషులు, యోగులు, కవులు, పండితులు, పరమ భక్తులు, వాగ్గేయ కారులు ఈ రామ నామ మహిమను వివరించారు, నుతించారు. స్వయంగా పరమశివుడే పార్వతికి ఈ రామ నామ మహత్తును చెప్పాడుట.


ఆ రాముని నుతిస్తూ బుధ కౌశిక ముని ఈ రామ రక్షా స్తోత్రాన్ని రచించారు. ఇది ఎంతో ఫలదాయకమైనది, మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఇందులో వేర్వేరు మూలాలనుంచి రామ మహిమను చెప్పే శ్లోకాలను పొందు పరచారు.

రామ రక్షా స్తోత్రము, తాత్పర్యము. శ్రవణం అనురాధా పోడ్వాల్ గారి గాత్రంలో.

ఓం శ్రీగణేశాయ నమః

వినియోగః

అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య  బుధకౌశిక ఋషిః
శ్రీసీతారామచంద్రో దేవతా  అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః  శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః

బుధకౌశికఋషి రచించిన రామరక్షా స్తోత్రము, సీతా రామచంద్రుడు దేవత,  సీత శక్తి, హనుమంతుడు కీలకం (మూల స్థంభం అని అర్థం), అనుష్టుప్ ఛందములో చెప్పబడింది. శ్రీరాముని ప్రీతి కొరకు ఈ రామరక్షా స్తోత్రము వినియోగము.

అథ ధ్యానం

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం
వామాంకారూఢ సీతాముఖకమలమిళల్లోచనం నీరదాభం
నానాలంకారదీప్తం దధతమురుజటామండనం రామచంద్రం

మోకాళ్ళ వరకు ఉండే పొడవైన చేతులు కలవాడు, ధనుస్సు, శరములు ధరించిన వాడు, పద్మాసనములో కూర్చుని ఉన్నవాడు, పసుపు పచ్చని వస్త్రము ధరించిన వాడు, నవ కలువలతో పోటీ పదే  కన్నులు కలవాడు,   ప్రసన్నుడు, తన ఎడమ తొడపై కూర్చుని ఉన్న కమలము వంటి ముఖము కల సీతపై చూపులు కలవాడు, మేఘ శ్యాముడు, అనేకమైన ఆభరణములు ధరించిన వాడు, పొడవైన కేశములు తొడలవరకు కలవాడు అయిన శ్రీ రాముని ధ్యానించుము.

ఇతి ధ్యానం

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం  ౧

శ్రీరాముని చరితము ఎంతో విస్తారమైనది. ఇందులోని ప్రతి అక్షరము మానవుని మహా పాతకములను నాశనము చేయగలిగిన శక్తి కలది.
 
ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం
జానకీలక్ష్మణోపేతం జటాముకుటమండితం  ౨

కలువల వంటి కన్నులు, నీలి మేఘము వంటి శరీర ఛాయ, అందమైన కేశములు కిరీటముగా కలిగి, సీతా లక్ష్మణులు చెరొక వైపు కలిగి ప్రకాశిస్తున్న రాముని ధ్యానించుదాము.
 
సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకం
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుం  ౩

ఖడ్గము, ధనుస్సు, అమ్ముల పొదిలో బాణములు ధరించిన వాడు, నిశాచరులైన రాక్షసులను సంహరించిన వాడు, జన్మ లేని వాడు, దుష్ట శిక్షణ కోసమే అవతారమెత్తిన వాడు, ప్రకాశించే ప్రభువును ధ్యానించుదాము.

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః  ౪

రామ రక్షా స్తోత్రము పఠించే జ్ఞానులకు పాపములన్ని నశించి అని కోరికలు తీరును. రఘువంశములో పుట్టిన రాముడు నా శిరస్సును కాపాడు గాక, దశరథ కుమారుడైన రాముడు నా నుదురును కాపాడు గాక.

కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియఃశ్రుతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః  ౫

కౌసల్యా సుతుడైన రాముడు నా కన్నులను కాపాడు గాక. విశ్వామిత్రుని ప్రియుడైన రాముడు నా కర్ణములను కాపాడు గాక. యజ్ఞమును కాపాడిన రాముడు నా  నాసికమును కాపాడు గాక.  లక్ష్మణుని పట్ల ప్రేమతో ఉండేవాడు నా ముఖమును కాపాడు గాక.

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః  ౬

విద్యా నిధి యైన రాముడు నా నాలుకను కాపాడు గాక. భరతునిచే పూజించ బడిన రాముడు నా  కంఠమును కాపాడు గాక. దివ్యాయుధములు ధరించే రాముడు నా భుజములను కాపాడు గాక. శివుని విల్లుని విరిచిన రాముడు నా బాహువులను కాపాడు గాక.

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః  ౭

సీతాపతి యైన రాముడు నా కరములను కాపాడు గాక. పరశురాముని గర్వము అణచిన రాముడు నా హృదయమును కాపాడు గాక. ఖర దూషణ రాక్షసులను సంహరించిన రాముడు నా ఉదరమును కాపాడు గాక. జామ్బవంతునికి ఆశ్రయమిచ్చిన రాముడు నా నాభిని కాపాడు గాక.

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్  ౮

సుగ్రీవునికి ప్రభువైన రాముడు నా నడుమును కాపాడు గాక. హనుమంతునికి ప్రభువైన రాముడు నా తుంటెను కాపాడు గాక.  రఘు కులములో ఉత్తముడు, రాక్షసులను వినాశనము చేసినవాడైన  రాముడు  నా రెండు తొడలను కాపాడు గాక.

జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః  ౯

సేతువును నిర్మించిన రాముడు నా మోకాళ్లను కాపాడు గాక. రావణుని సంహరించిన రాముడు నా పిక్కలను కాపాడు గాక. విభీషణునికి ఆశ్రయమిచ్చిన రాముడు నా పాదములను కాపాడు గాక. ఈ విధముగా రాముడు నా శరీరము నంతటినీ కాపాడు గాక.

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్  ౧౦

రాముని అంత బలం కల ఈ స్తోత్రమును పఠించిన సత్పురుషునికి   దీర్ఘాయుష్షు, సుఖము, సంతానము, విజయము, వినయము కలుగు గాక.

పాతాలభూతలవ్యోమచారిణ శ్ఛద్మచారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః  ౧౧

రూపమును మార్చుకుంటూ, భూమిపైన, పాతాళములో, ఆకాశములో, అదృశ్య రూపులై  తిరిగేవారికి (దుష్టశక్తులు) రామనామముచే రక్షించబడిన వారు కనబడక యుందురు.

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి  ౧౨

రామ, రామభద్ర, రామచంద్ర అని ఆ దేవుని స్మరించే మానవులకు ఎటువంటి పాపము అంటదు. వారికి భుక్తి, ముక్తి కలుగును.

జగజైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః  ౧౩

ప్రపంచాన్ని జయించిన రామ నామ మనే ఈ మంత్రమును ధరించిన వారికి సర్వ కార్య సిద్ధి కలిగి, సిద్ధులు వారి కనుసన్నలలో యుండును.

వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం  ౧౪

వజ్రపంజరమనే ఈ రామ కవచాన్ని స్మరించే వారికి ఓటమి యుండదు. వారికి ఎల్లవేళలా జయము, శుభము కలుగును.

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షాంమిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రభుద్ధో బుధకౌశికః  ౧౫

పరమ శివుడు బుధ కౌశిక మునిని ఈ స్తోత్రము రచించుమని స్వప్నములో ఆదేశించెను. మరునాడు ఉదయము ఆ ఋషి ఈ స్తోత్ర రచన చేసెను.

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః  ౧౬

అన్ని కోరికలు తీర్చే కల్పవ్రుక్షమైన వాడు,  అన్ని ఆపదలను పోగొట్టేవాడు, మూడులోకములచే వందితుడు అయిన రాముడే  నిస్సంశయముగా మన ప్రభువు.

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ  ౧౭

యువకులు, సుందరమైన వారు, సుకుమారులు, మహాబలము కలవారు, కలువలవంటి విశాలమైన కన్నులు కలవారు, నార వస్త్రములు, జింక చర్మము ధరించిన ఆ రామలక్ష్మణులు మనలను ఎల్లప్పుడూ కాపాడుదురు  గాక.

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ  ౧౮

దశరథుని పుత్రులైన ఈ రామలక్ష్మణులు కందమూల ఫలములు భుజించి, నిగ్రహముతో, తపస్సు చేస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్నారు.


శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం
రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ  ౧౯

రఘువంశ రాజ కుమారులు, ధనుర్విద్యలో ఆరితేరిన వారు, రాక్షసులను సంహరించిన వారు, అందరి రక్షకులు అయిన రామ లక్ష్మణులు మనలను ఎల్లప్పుడూ కాపాడు గాక.

ఆత్తసజ్జధనుషావిషుస్పృశౌ అక్షయాశుగనిషంగసంగినౌ
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతాం  ౨౦

ధనుర్బాణములు ధరించి తయారుగా ఉన్న, వారి చేతులు నిండుగా ఉన్న అమ్ములపొదిలోని బాణములపై కలిగిన రామ లక్ష్మణులు మనలను మన మార్గములో ఎల్లవేళలా కాపాడెదరు గాక. 

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః  ౨౧

ఖడ్గము, కవచము, బాణములు, ధనుస్సుతో ఎల్లప్పుడూ సన్నద్ధుడై యుండి, లక్ష్మణుడు అనుసరించగా, మన మనోరథము తీర్చుటకై వచ్చిన రామ చంద్రుడు లక్ష్మణ సమేతుడై మనలను కాపాడు గాక.

రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః  ౨౨

దశరథ మహారాజు, కౌసల్యల తనయుడు, శూరుడు, లక్ష్మణునిచే అనుగమించ బడిన వాడు,  బలవంతుడు, సూర్యవంశమున జన్మించిన వాడు, పూర్ణ పురుషుడు, రఘు కులములో ఉత్తముడు ఈ రాముడు.

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః  ౨౩

వేదాంతములచే గ్రహించబడే వాడు,  యజ్ఞములకు అధిపతి, సనాతనుడు, పురుషోత్తముడు, సీతాప్రియుడు, శుభకరుడు, అనంతమైన పరాక్రమము కలవాడు ఈ రాముడు.

ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః  ౨౪

పరమ శివుడు ఇలా అన్నాడు - నా భక్తులారా! రాముని ఈ నామములను శ్రద్ధతో జపించేవారికి సంశయం లేకుండా అశ్వమేధ యాగము చేసిన దాని కన్నా ఎక్కువ ఫలము లభించును.

రామం దుర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరాః  ౨౫

కలువల వంటి కన్నులు కలవాడు, నీల మేఘ శ్యాముడు, పీతాంబరములు ధరించిన వాడు అయిన రాముని దివ్య నామములు స్తుతించే వారు ఇంక ఈ సంసార సాగరములో చిక్కుకొని యుండరు (వారికి మోక్షము కలుగును).

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం  ౨౬

మనోహరుడు, లక్ష్మణుని అగ్రజుడు, సీతాపతి, రఘుకులములో ఉత్తముడు, కరుణా సాగరుడు, సర్వ సులక్షణ సంపన్నుడు, బ్రాహ్మణులకు ప్రియుడు, ధర్మ రక్షకుడు, సత్య సంధుడు, రాజేంద్రుడు, దశరథ పుత్రుడు, నల్లని వాడు, శాంతమూర్తి, రావణుని సంహరించిన వాడు, లోకాభిరాముడు అయిన రామునికి వందనములు.


రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః  ౨౭

 శుభకరుడు, రక్షకుడు, చంద్రుని వలె చల్లనైన వాడు, సీతాపతి, లోక నాథుడు యైన రామునికి నమస్కారములు.

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ  ౨౮

రఘునందనుడు, భరతునికి అగ్రజుడు, యుద్ధములో అరివీర భయంకరుడు అయిన రాముని నేను శరణు కోరుచున్నాను.

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే  ౨౯

శ్రీరామచంద్రుని పాదములను - మనసులో స్మరిస్తున్నాను. మాటలలో పొగడుతున్నాను, శిర్స్సుతో నమస్కరిస్తున్నాను, శరణు కోరుతున్నాను.

మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాఽన్యం జానే నైవ జానే న జానే  ౩౦

శ్రీరాముడే నాకు తల్లి, తండ్రి, ప్రభువు, స్నేహితుడు. నా సర్వస్వం ఆ దయాళువైన రామచంద్రుడే. అటువంటి వారు నాకు ఇంక ఎవ్వరు లేరు, లేరు గాక లేరు.

దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం  ౩౧

కుడి పక్కన లక్ష్మణుడు, ఎడమ పక్కన సీత, ముంగిట హనుమంతుడు కలిగిన రామునికి వందనములు.

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే  ౩౨

కన్నులకు ఇంపైన వాడు, సమరములో శత్రుజన భయంకరుడు, అందమైన కన్నులు కలవాడు, రఘువంశ నాథుడు, కరుణా రూపుడు, కరుణాకరుడు అయిన రాముని శరణు కోరుతున్నాను.

మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే  ౩౩

 మనస్సు అంత వేగము కలవాడు, వేగమున తండ్రియైన వాయువుతో సమానమైన వాడు, ఇంద్రియములను జయించిన వాడు,  బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయు పుత్రుడు, వానరసేనలో ముఖ్యుడు, శ్రీరాముని దూత అయిన హనుమంతుని శరణు కోరుతున్నాను.

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం  ౩౪

రామాయణ కావ్యం ద్వారా మధురమైన రామ నామమును చెట్టుపై యున్న కోయిల వలె గానం చేసిన వాల్మీకి మహర్షికి వందనములు.

ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం  ౩౫

అన్ని ఆపదలు తొలగించే వాడు, సకల సంపదలను ఇచ్చే వాడు, లోకాభిరాముడు అయిన శ్రీరామునికి నేను పరి పరి నమస్కారములు చేయుచున్నాను.

భర్జనం భవబీజానాం అర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం  ౩౬

రామనామ ఉచ్చారణ, గర్జన పునర్జన్మ యనే బీజమును నాశనము చేయును (మోక్షము కలిగించును). అది సకల సంపదలను ఇచ్చును, యమ దూతలను పారద్రోలును.

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోఽస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర  ౩౭

రాజులలో మణి వంటి వాడు, రాక్షసులను సంహరించిన వాడు అయిన రామున్ని భజిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఆ రాముని మించిన కొలువు, దైవము లేదు, నేను అతని సేవకుడను. నా మనసు ఆ రాముని యందే లయమై యున్నది. ఓ రామా! నన్ను ఉద్ధరించుము, తరించుము. 

శ్రీరామ రామేతి రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే  ౩౮

పరమశివుడు ఇలా అన్నాడు - ఓ పార్వతీ దేవీ! నేను రామ నామ ఉచ్చరణను ఆస్వాదిస్తున్నాను. అది నాకు ఎంతో ప్రియమైనది. ఈ నామమును ఒక్కసారి ఉచ్చరించుట పరమాత్ముని ఇతర సహస్ర నామములను ఉచ్చరించినంత ఫలము నిచ్చును.

ఇతి శ్రీ బుధకౌశికఋషి విరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణం

18, జనవరి 2011, మంగళవారం

శ్రీమచ్ఛంకరభగవత విరచిత మనీషాపంచకం - తాత్పర్యము

శంకర భగవత్పాదులు కాశీలో నివసిస్తున్నప్పటి సంఘటన ఇది. ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు  వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన మనీషా పంచకం.

అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.  ఈ పంచకము, తాత్పర్యము.



అన్నమయాదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాథ్
యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి

ఓ యతివరా! దూరము వెళ్ళుము దూరము వెళ్ళుము అని అంటున్నావు నన్ను. అది ఒక ఆహారము తిన్న శరీరము ఇంకొక ఆహారము తిన్న శరీరమును అంటున్న మాటయా? లేక  ఒక చైతన్యము ఇంకొక చైతన్యమునా? దేనిని పొమ్మని అంటున్నావు?  చెప్పుము.

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావభోధాంబుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాంకోఽయం  విభేధభ్రమః
కిం గంగాంబుని బింబితేఽంబరమణౌ చాండాలవీథీపయః
పూరే వాఽంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాఽంబరే

ఎలాగైతే సూర్యుని ప్రతిబింబము నిశ్చలమైన నీటిపై స్పష్టంగా కనిపిస్తుందో అలాగే పరబ్రహ్మము ఈ చరాచర సృష్టిలోని ప్రతి వస్తువులోను స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ అయోమయము? సందిగ్ధము? పవిత్ర గంగానదిలో కనిపించే సూర్యుని ప్రతిబింబానికి, ఒక చండాలుడు ఉండే వీధిలోని నీటిలో కనిపించే సూర్యుని ప్రతిబింబానికి తేడా ఏమైనా ఉందా? అలాగే నీటిని కలిగిన ఉన్న బంగారు మరియు మట్టి పాత్రల వలన ఈ రెండిటిలో ఉన్న నీటికి ఏమైనా భేదము కలదా?

          మనీషాపంచకం

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ  ౧

ఎవరైతే - తనలో ఉన్న ఆత్మ పరబ్రహ్మ రూపమై జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థలలో అవగతమవుతుందో, అదే ఆత్మ చీమలో కూడా ఉందని, అది చేతనమై, అగోచరమై, సాక్షియై ఉన్నదని - తెలుసుకున్నాడో వాడే అత్యుత్తమమైన గురువు/తత్త్వవేత్త - వాడు చండాలుడైన నేమి బ్రాహ్మణుడైన నేమి.

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఽశేషం మయా కల్పితమ్
ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే
చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ  ౨

అజ్ఞానము, త్రిగుణముల (సత్త్వ, రజస్,  తమో గుణములు) వలన ఈ విశ్వము వేర్వేరు రకములైన జీవులతో ఉన్నట్లు అనిపించినప్పటికీ, ఏ పరబ్రహ్మ రూపమున ఈ విశ్వమున్నదో, నిరంతర ఆ పరబ్రహ్మ ధ్యాసతో, తానే పరబ్రహ్మమని గ్రహించిన వాడే ఉత్తమైన గురువు - వాడు చండాలుడైన నేమి బ్రాహ్మణుడైన నేమి.

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ  ౩

ఈ విశ్వము ఒక అశాశ్వతమైన మాయయని, ఈ శరీరము ఆ పరమాత్మను శాంతముతో, సంపూర్ణ విశ్వాసముతో ధ్యానించుటకు, తద్వారా పాపములను ఆ పవిత్రమైన అగ్ని యందు దాహించుటకు ఇవ్వబడినదియని సెప్పిన గురువుల మాటను నేను పూర్తిగా నమ్ముతున్నాను.
 
యా తిర్యఙ్నరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతోఽచేతనాః
తాం భాస్యైః పిహితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయ-
న్యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ  ౪

మేఘములచే కప్పబడిన సూర్యుని వలె అజ్ఞానము జీవిని పరమాత్ముని కానకుండా చేయుచున్నది. ఆ పరబ్రహ్మము వలన ఈ చరాచర సృష్టి యందు కార్యములు జరుగుతున్నవని, ఆ సత్యమును తనయందే గ్రహించిన యోగి  ఉత్తమమైనవాడు అని నా అభిప్రాయము.

యత్సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః
యస్మిన్నిత్యసుఖాంబుధౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్
యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ  ౫

ఇంద్రాది దేవతలచే పూజించబడే పరబ్రహ్మముపై నిరంతర ధ్యానము కలిగిన వాడు, పరిపూర్ణ శాంతుడై యుండును. అట్టివాడు ఆ పరబ్రహ్మమును తెలిసికొని యున్నాడు అని, అతడే ఆ పరబ్రహ్మ అని నా పూర్తి నమ్మకము.

దాసస్తేఽహం దేహదృష్ట్యాఽస్మి శంభో
జాతస్తేంఽశో జీవదృష్ట్యా త్రిదృష్టే
సర్వస్యాఽఽత్మన్నాత్మదృష్ట్యా త్వమేవే-
త్యేవం మే ధీర్నిశ్చితా సర్వశాస్త్రైః

ఓ శంభో! నేను ఈ శరీర రూపముతో  నీ సేవకుడను. ఓ త్రినేత్రా! జీవ రూపములో నేను నీలో ఒక భాగమును. ఆత్మ రూపములో నీవు నా యందు, మరి సమస్త జీవకోటి యందు యున్నావు. నేను నా బుద్ధి ద్వారా, శాస్త్రముల ద్వారా ఈ విషయమును గ్రహించి యున్నాను.

 ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మనీషాపంచకం సంపూర్ణమ్

15, జనవరి 2011, శనివారం

శ్రీమన్నారాయణీయం - సప్తమ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం - సప్తమ స్కంధము


ఇరువది నాలుగవ దశకము - ప్రహ్లాద చరితము

హిరణ్యాక్షే పోత్రీప్రవరవపుషా దేవ భవతా
హతే శోకక్రోధగ్లపితఘృతిరేతస్య సహజః |
హిరణ్యప్రారంభః కశిపురమరారాతిసదసి
ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మురరిపో || ౨౪-౧||

నారాయణా! యజ్ఞ వరాహరూపమును ధరించి నీవు హిరణ్యాక్షుని వధించితివి. అందువలన అతని సోదరుడైన హిరణ్యకశిపునకు విపరీతమైన దుఃఖము, కోపము కలుగగా పరమాత్మవగు నిన్ను వధింతునని రాక్షసులందరూ ఉన్న మహా సభలో అతడు ప్రతిజ్ఞ చేసెను.


విధాతారం ఘోరం స ఖలు తపసిత్వా నచిరతః
పురః సాక్షాత్కుర్వన్సురనరమృగాద్యైరనిధనమ్ |
వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం
పరిక్షుందన్నింద్రాదహరత దివం త్వామగణయన్ || ౨౪-౨||

హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. బ్రహ్మ ప్రత్యక్షమై అతడు కోరుకున్నట్లు దేవతలు, మానవులు, మృగములు మొదలగు వాని చేత చావు లేకుండునట్లువరమొసగెను . ఇట్లు దుర్లభమైన వరమును పొంది గర్వముతో హిరణ్యకశిపుడు నీవు నాయకుడిగా ఉన్న ఈ భువనములన్నిటినీ బాధలకు గురిచేయుచు నిన్ను కూడా లెక్క చేయక ఇంద్రుని నుండి స్వర్గాదిపత్యమును లాగు కొనెను. 


నిహంతుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చ రిపోః
బహిర్దృష్టేరంతర్దధిథ హృదయే సూక్ష్మవపుషా |
నదన్నుచ్చైస్తత్రాప్యఖిలభువనాంతే చ మృగయన్
భియా యాతం మత్వా స ఖలు జితకాశీ నివవృతే || ౨౪-౩||

ప్రభూ! పిమ్మట హిరణ్యకశిపుడు నిన్ను చంపదలచి చతుర్దశ భువనములను వెదకియు, నీ ఉనికిని కనుగొనలేక పోయెను. అప్పుడు నీయెడ శత్రుభావము వహించి యున్న హిరణ్యకశిపుని హృదయమందు నీవు సూక్ష్మ రూపమున ప్రవేశించి యుంటివి. నీవుఎచ్చటను కనబడనందున భయముచే పారిపోయితివని తలచి ఆ రాక్షసుడు తాను అజేయుడనను గర్వముతో వికటాట్టహాసము చేయుచు వెనుకకు మరలెను. 


తతోఽస్య ప్రహ్లాదః సమజని సుతో గర్భవసతౌ
మునేర్వీణాపాణేరధిగతభబద్భక్తిమహిమా |
స వై జాత్యా దైత్యః శిశురపి సమేత్య త్వయి రతిం
గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతామ్ || ౨౪-౪||

వరదా! గురువాయుపురాధీశా! ఆ హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడను కుమారుడు కలిగెను. అతడు తల్లి గర్భమున ఉన్నప్పుడే నారదముని వలన నీ భక్తి మహిమను కనుగొనెను. దైత్య వంశములో పుట్టినప్పటికినీ ప్రహ్లాదుడు నీ భక్త శిఖామణియై బాల్యమునుండి ఖ్యాతి వహించెను.

సురారీణాం హాస్యం తవ చరణదాస్యం నిజసుతే
స దృష్ట్వా దుష్టాత్మా గురుభిరశిశిక్షచ్చిరమముమ్ |
గురుప్రోక్తం చాసావిదమిదమభద్రాయ దృఢమి-
త్యపాకుర్వన్ సర్వం తవ చరణభక్త్యైవ వవృధే || ౨౪-౫||

దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు తన పుత్రుడు నీ భక్తుడు అయితే రాక్షసుల మధ్య అది అపహాస్యమగునని తలచి అతనిని విద్యాభ్యాసము కొరకు తన గురువుల వద్దకు పంపించెను. ప్రహ్లాదుడు తనకు గురువులు బోధించునది శ్రేయస్కరమైన విద్య కాదని భావించి నీ పాద పద్మముల సేవయే అన్నిటి కన్నా మిన్న అని తలంచెను.


అధీతేషు శ్రేష్ఠం కిమితి పరిపృష్టేఽథ తనయే
భవద్భక్తిం వర్యామభిగదతి పర్యాకులధృతిః |
గురుభ్యో రోషిత్వా సహజమతిరస్యోత్యభివిదన్
వధిపాయానస్మిన్ వ్యతత్నుత భవత్పాదశరణే || ౨౪-౬||

ప్రహ్లాదుడు కొంతకాలము విద్యాభ్యాసము చేసిన తరువాత అతడు నేర్చుకున్న విద్య తెలిసికొన దలచి హిరణ్యకశిపుడు అతనిని తన వద్దకు రప్పించు కొనెను. హిరణ్యకశిపుడు పుత్రునితో నీవు నేర్చుకున్న విద్యలలో ఉత్తమమైనదిగా ఏది తోచినది? అని అడిగెను. అప్పుడు పరమ భక్త శిఖామణి యైన ప్రహ్లాదుడు శ్రీహరి సేవయే అన్నిటి కన్నా మిన్న అనిచెప్పెను . అప్పుడు హిరణ్యకశిపుడు కోపముతో గురువులను ప్రశ్నించగా వారు 'అది అతనికి సహజముగా కలిగిన బుద్ధి' అని చెప్పిరి. అప్పుడు హిరణ్యకశిపుడు నీపై కోపముతో ఆ ప్రహ్లాదుని చంపుటకు ఎన్నోవిధముల ప్రయత్నించెను.
 

స శూలైరావిద్ధః సుబహు మథితో దిగ్గజగణైః
మహాసర్పైర్దష్టోఽప్యనశనగరాహారవిధుతః |
గిరీంద్రావక్షిప్తోఽప్యహహ పరమాత్మన్నయి విభో
త్వయి న్యస్తాత్మత్వాత్ కిమపి న నిపీడామభజత || ౨౪-౭||

దేవా! ఆ రాక్షసులు ప్రహ్లాదుని శూలములతో పొడిచిరి, మదించిన ఏనుగులతో తొక్కిన్చిరి, మహా సర్పములచే కరిపించిరి, తిండి లేక మాడ్చిరి, విషాహారమును పెట్టిరి.  ఎత్తైన ప్రదేశముల నుండి అగాధములలోకి నెట్టిరి. ఇన్ని బాధలు పెట్టినను, ప్రహ్లాదుని మనసు నీపై లగ్నమై ఉండుటచేత, నీ మహిమ వలన అతనికి ఏ బాధ కలుగ లేదు. ఇది యెంత ఆశ్చర్యకరము.


తతః శంకావిష్టః స పునరతిదుష్టోఽస్య జనకో
గురూక్త్యా తద్గేహ కిల వరుణపాశైస్తమరుణత్ |
గురోశ్చాసాన్నిధ్యే స పునరనుగాన్ దైత్యతనయాన్
భవద్భక్తేస్తత్త్వం పరమపి విజ్ఞానమశిషత్ || ౨౪-౮||

ఈ విధముగా దండములన్ని విఫలమగుటచే హిరణ్యకశిపునికి అనుమానము వచ్చెను. అందువలన గురువు ఆశ్రమములోనే ప్రహ్లాదుని వరుణ పాశములచే బంధించెను. అయినను, గురువు దగ్గర లేనప్పుడు ఇతర దైత్య కుమారులకు పరమ విజ్ఞానమైన నీ తత్త్వమును ఉపదేశించెను.


పితా శృణ్వన్ బాలప్రకరమఖిలం త్వత్స్తుతిపరం
రుషాంధః ప్రాహైనం కులహతక కస్తే బలమితి |
బలం మే వైకుంఠస్తవ చ జగతాం చాపి స బలం
స ఏవ త్రైలోక్యం సకలమితి ధీరోఽయమగదీత్ || ౨౪-౯||

తన కుమారుడు దైత్యపుత్రులకు నీ భక్తిజ్ఞానమును బోధించిన విషయము తెలిసిన హిరణ్యకశిపుడు 'ఓరీ దైత్యుల శత్రువా! నీకు ఇంత బలము ఎక్కడినుంచి వచ్చింది' అని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు 'వైకుంఠ నాథుడు అయిన శ్రీ హరి నాకు, నీకే కాదు ఈ జగత్తు మొత్తానికి బలమైన వాడు. అతడే సమస్త లోక స్వరూపుడు' అని చెప్పెను.


అరే క్వాసౌ క్వాసౌ సకలజగదాత్మా హరిరితి
ప్రభింతే స్మ స్తంభం చలితకరవాళో దితిసుతః |
అతః పశ్చాద్విష్ణో న హి వదితుమీశోఽస్మి సహసా
కృపాత్మన్ విశ్వాత్మన్ పవనపురవాసిన్ మృడయ మామ్ || ౨౪-౧౦||

అప్పుడు హిరణ్యకశిపుడు 'ఆ హరి ఎక్కడ - ఇక్కడ అక్కడా దానిలోనా దీనిలోనా'  అని కోపావేశముతో తన కరవాలముతో ఒక స్థంభమును దూసెను. అప్పుడు ఏమి జరిగినదో వర్ణింప అలవి కాదు. ఓ ప్రభు! కృపాకరా! గురువాయురప్పా! నా బాధలను తొలగించి నాకు ఆనందము కలుగ చేయుము.
 
ఇరువది ఐదవ దశకము - శ్రీ నృశింహావతార వర్ణనము

స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపోః కర్ణౌ సమాచూర్ణయన్
నాధూర్ణజ్జగదందకుండకుహరో ఘోరస్తవాభూద్రవః |
శ్రుత్వా యం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం
కంపః కశ్చన సఫ్పపాత చలితోఽప్యంభోజభూర్విష్టరాత్ || ౨౫-౧||

ప్రభూ! హిరణ్యకశిపుడు స్థంభముపై కొట్టగానే భయంకర ధ్వనితో దానినుండి నీవు ఆవిర్భవించితివి. ఆ శబ్దమునకు చెవులు బద్దలు అయ్యెను. బ్రహ్మాండమంతా గిర్రున తిరిగినట్లాయెను. ఆ ధ్వనిని వినగానే హిరణ్యకశిపుని హృదయము కంపించెను. పద్మము నందు ఆసీనుడైన బ్రహ్మ కూడా ఆ భీకర ధ్వనికి చలించి పోయెను.

దైత్యే దిక్షు విసృష్టచక్షుషి మహాసంరంభిణీ స్తంభతః
సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో |
కిం కిం భీషణమేతదద్భుతమితి వ్యుద్భ్రాంతచిత్తేఽసురే
విస్ఫూర్జద్ధవలోగ్రరోమవికసద్వర్ష్మా సమాజృంభథాః || ౨౫-౨||

భయంకరమైన ఆ ఫెళఫెళ ధ్వనులకు హడలిపోయి హిరణ్యకశిపుడు అన్ని దిక్కులు చూచు చుండగా అంతులేని తేజస్సులను విరజిమ్ముతూ స్తంభము నుండి నీవు ఆవిర్భవించితివి. అప్పుడు నీవు పూర్తిగా సింహము గానీ మానవుడు గానీ గాక నరసింహ రూపుడవై యుంటివి. అంతట ఆ రాక్షస రాజు మిక్కిలి విభ్రాంతుడై 'భయంకరముగా, అద్భుతముగా ఉన్న ఈ రూపము ఏమిటి? ఏమిటి?' అని వణికి పోసాగెను. అంతట అతని ధైర్యము సడలి పోయెను. అప్పుడు నీవు తెల్లని నీ జూలును విదుల్చుచు విరాడ్రూపముతో విజృంభించితివి.


తప్తస్వర్ణసవర్ణఘూర్ణదతిరూక్షాక్షం సటాకేసర-
ప్రోత్కంపప్రనికుంబితాంబరమహో జీయాత్తవేదం వపుః |
వ్యాత్తవ్యాప్తమహాదరీసఖముఖం ఖద్గోగ్రవల్గన్మహా-
జిహ్వానిర్గమదృశ్యమానసుమహాదంష్ట్రాయుగోడ్డామరమ్ || ౨౫-౩||

ప్రభూ! నీ నరసింహ రూపమున కనుగ్రుడ్లు పుటం పెట్టిన బంగారము వలె పచ్చగా ఉండి మహా భయంకరముగా తిరుగుచున్నవి. జూలు నిక్క పొడుచుకుని ఆకాశమంతా వ్యాపించియున్నది. నీ నోరు చాల భయంకరమైన గుహవలె ఒప్పుచున్నది. నోటినుండి బయటకు వచ్చి అటు ఇటు కదులుచున్న నాలుక కత్తివలె భయంకరముగా నున్నది, భీకరమైన కోరలతో విలసిల్లు చున్నది.  అట్టి నీ నరసింహ రూపమునకు జయమగు గాక.


ఉత్సర్పద్వలిభంగభీషుణహనుం హ్రస్వస్థవీయస్తర-
గ్రీవం పీవరదోశ్శతోద్గతనఖకౄరాంశుదూరోల్బణమ్ |
వ్యోమోల్లంఘిఘనాఘనోపమఘనప్రధ్వాననిర్ధావిత-
స్పర్ధాలుప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః || ౨౫-౪||

స్వామీ! నీవు అట్టహాసము చేసినప్పుడు నీ చెక్కిళ్ళు ముడుతలు పడుచున్నవి. నీ కంఠ భాగము పొట్టిగా దృఢమైనది. బాగుగా పుష్టి గలిగి యున్న నీ హస్తముల యొక్క గోళ్ళు మిక్కిలి వాడిగా మహా భయంకరముగా నున్నవి. నీ శరీరము ఆకాశమును అంటుకొనునట్లు చాల ఎత్తుగా నున్నది. నీ అట్టహాసము భయంకరమైన మేఘ గర్జన వలె ఉండి శత్రువులను తరిమి తరిమి కొట్టుచున్నది. ప్రభూ! అట్టి నీ నృసిమ రూపమునకు నేను భక్తితో నమస్కరింతును.


నూనం విష్ణురయం నిహన్మ్యముమితి భ్రామ్యద్గదాభీషణం
దైత్యేంద్రం సముపాద్రవంతమధృథా దోర్భ్యాం పృథుభ్యామముమ్ |
వీరో నిర్గళితోఽథ ఖడ్గఫలకౌ గృహ్ణన్విచిత్రశ్రమాన్
వ్యావృణ్వన్పునరాపపాత భువనగ్రాసోద్యతం త్వామహో || ౨౫-౫||

దేవా! అంతట హిరణ్యకశిపుడు 'నిజముగా ఇతడే విష్ణువు. ఇతనిని నేను సంహరించెదను' అని పలుకుచు, గదను భయంకరముగా తిప్పుచు నీ మీదికి విజృంభించెను. అప్పుడు నీవు బలమైన నీ బాహువులతో ఒడుపు చూపి ఆ రాక్షసుని పట్టుకొంటివి. కానీ ఆ దుర్మార్గుడు నీ బాహు బంధములనుండి తప్పించుకొని, ఖడ్గమును, దలును చేబూని, చిత్రవిచిత్రములుగా తిరుగుచుండెను. పిమ్మట సమస్త లోకములను మ్రింగ బోవుచున్నట్లు మహా భయంకరముగా నున్న నీపైకి అతడు విరచుకొని పడెను.


భ్రామ్యంతం దితిజాధమం పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాం జవాత్
ద్వారేఽథోరుయుగే నిపాత్య నఖరాన్వ్యుత్ఖాయ వక్షోభువి |
నిర్భిందన్నధిగర్భనిర్భరగళద్రక్తాంబు బద్ధోత్సవం
పాయం పాయముదైరయో బహుజగత్సంహారిసింహారవాన్ || ౨౫-౬||

రాక్షసాధముడైన హిరణ్యకశిపుడు కత్తిని విచిత్రముగా త్రిప్పుచున్నను  నీవు అతని గట్టిగా పట్టుకొని సభాద్వారము దగ్గర కడప మీద నీ తొడలపై చేర్చుకుని, నీ వాడియైన గోళ్ళతో గ్రుచ్చి అతని వక్షస్థలమును చీల్చితివి. అతని కడుపులో నుండి వచుచున్న వేడి రక్తముతో ఆనందముతో త్రాగి సమస్త లోకములను సంహరించు చున్నట్లు మిక్కిలి భయంకర సింహనాదము చేసితివి.

త్యక్త్వా తం హతమాశు రక్తలహరీసిక్తోన్నమద్వర్ష్మణి
ప్రత్యుత్పత్య సమస్తదైత్యపటలీం చాఖాద్యమానే త్వయి |
భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోలశైలోత్కరం
ప్రోత్సర్పత్ఖచరం చరాచరమహో దుఃస్థామవస్థాం దధౌ || ౨౫-౭

స్వామీ! నీవు ఆ రాక్షసుని చంపి, అతనిని వదిలి పెట్టి రక్తపు మడుగులో తడిసి యున్న నీవు చెంగున ముందుకు దూకి, మిగిలిన రాక్షసులను చంపి తినుచున్నప్పుడు భూమిఅంతా గుండ్రముగా తిరిగి పోయినది. సముద్రములు అల్లకల్లోలము అయినవి. మహా పర్వతములు కడలి పోయినవి. ఆకాశమున నున్న నక్షత్రములు అటు ఇటు చెల్లా చెదురు అయిపోయినవి. ఈ విధముగా చరాచర ప్రపంచము దురవస్థకు గురైనది.

తావన్మాంసవపాకరాళవపుషం ఘోరాంత్రమాలాధరం
త్వాం మధ్యేసభమిద్ధరోషముషితం దుర్వారగుర్వారవమ్ |
అభ్యేతుం న శశక కోఽపి భువనే దూరే స్థితా భీరవః
సర్వే శర్వవిరించవాసవముఖాః ప్రత్యేకమస్తోషత || ౨౫-౮||

స్వామీ! నీవు హిరణ్యకశిపుని సంహరించి, అతని మాంసము, వాప మొదలైన వాటిచే మహా భయంకరముగా నుంటివి. ఆ దుష్ట రాక్షసుని ప్రేగులను మెడలో ధరించి మిక్కిలి కోపముతో గర్జిన్చుచు సభామధ్యమున కూర్చుంటివి. అట్టి నీ ఆకారమును చూచి ఎవ్వరును నీ దగ్గరకు వచ్చుటకు సాహసము చేయలేక పోయిరి. బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రుడు, మొదలైన దేవతలు కూడా భయముతో చాల దూరముననే ఉండిపోయి నిన్ను వేరువేరుగా స్తుతించ సాగిరి.

భూయోఽప్యక్షతరోషధామ్ని భవతి బ్రహ్మాజ్ఞయా బాలకే
ప్రహ్లాదే పదయోర్నమత్యపభయే కారుణ్యభారాకులః |
శాంతస్త్వం కరమస్య మూర్ధ్ని సమధాః స్తోత్రైరథోద్నాయత-
స్తస్యాకామధియోఽపి తేనిథ వరం లోకాయ చానుగ్రహమ్ || ౨౫-౯||

దేవతలందరూ విడివిడిగా నిన్ను స్తుతించినను నీ కోపము చల్లారలేదు. అప్పుడు బ్రహ్మ దేవుని ప్రేరణతో బాలుడైన ప్రహ్లాదుడు నిర్భయముగా నీ పాదములకు నమస్కరించెను. అంతట పరమ దయాళువైన నీవు శాంతించి ప్రహ్లాదుని శిరస్సుపై మంగళకరమైన నీ హస్తమును ఉంచితివి. అప్పుడా ప్రహ్లాదుడు నిన్ను అనేక విధముల స్తుతించెను. అతనికిఎట్టి కోరికలు లేకున్నను లోకములను అనుగ్రహించుటకై అతనికి వరములను ఇచ్చితివి. 

ఏవం నాటితరౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయాభిధ-
శ్రుత్యంతస్ఫుటగీతసర్వమహిమన్నత్యంతశుద్ధాకృతే |
తత్తాదృఙ్నిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరో లంఘయేత్
ప్రహ్లాదప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్పాహి మామ్ || ౨౫-౧౦||

ప్రభూ! నీవు సహజముగా పరమ శాంతుడ వైనను ఈ విధముగా క్రోధమును ప్రదర్శించితివి. నీ గొప్పతనమంతా శ్రీతాపనీయోపనిషత్తునందు చక్కగా నిరూపించబడెను.   నీవు మిక్కిలి పరిశుద్ధమైన ఆకారము కలవాడవు. అందరికంటేను ఉన్నతమైన వాడవు. నిన్ను అధిగమించు వారు లేరు. ప్రహ్లాద ప్రియా! గురువాయురప్పా! దయతో నా సమస్త రోగములనునివారింపుము.

14, జనవరి 2011, శుక్రవారం

శ్రీమన్నారాయణీయం - షష్ఠ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం - షష్ఠ స్కంధము, తాత్పర్యము



ఇరువదిరెండవ దశకము - అజామిళోపాఖ్యానం

అజామిళో నామ మహీసురః పురా చరన్విభో ధర్మ పథాన్ గృహాశ్రమీ |
గురోర్గిరా కాననమేత్య దృష్టవాన్సుఘృష్టశీలాం కులటాం మదాకులామ్ || ౨౨-౧


ప్రభూ! పూర్వ కాలమందు అజామిళుడను బ్రాహ్మణుడు వివాహము చేసుకుని గృహస్థ ధర్మము చక్కగా నిర్వర్తించు చుండెను. ఒకరోజు అతని తండ్రి అతనిని అడవికి పంపగా అక్కడ ఒక దుర్మార్గురాలు, కులట, మదించి యున్న స్త్రీని చూసెను.

స్వతః ప్రశాంతోఽపి తదాహృతాశయః స్వధర్మముత్సృజ్య తయా సమారమన్ |
అధర్మకారీ దశమీ భవన్పునర్దధౌ భవన్నామయుతే సుతే రతిమ్ || ౨౨-౨


అజామిళుడు మంచివాడైనప్పటికీ ఆ స్త్రీని చూడగానే మరులు గొని, స్వధర్మము వీడి ఆమెతో రమింప సాగెను. తరువాత అధర్మపు పనులు చేస్తూ తొంబది ఏళ్ల ముసలి వాడయ్యెను. తనకు పుట్టిన కొడుకునకు నారాయణుడను పేరు పెట్టి అతనిని ఎంతో ప్రేమించు చుండెను.

స మృత్యుకాలే యమరాజకింకరాన్ భయంకరాంస్త్రీనభిలక్షయన్భియా |
పురా మనాక్త్వత్స్మృతివాసనాబలాజ్జుహావ నారాయణనామకం సుతమ్ || ౨౨-౩

తన అవసాన దశ సమీపించినపుడు భయంకరులైన ముగ్గురు యమదూతలు  అతని ప్రాణాలు తీసికొని పోవుటకు వచ్చిరి. ఆ యమదూతలను చూసి భయపడి, పూర్వము నిన్ను ధ్యానిన్చియున్న పుణ్య ప్రభావము వలన నారాయణుడను తన పుత్రుని పేరు పెట్టి పిలిచెను.

దురాశయస్యాపి తదాత్వనిర్గతత్వదీయనామాక్షరమాత్రవైభవాత్ |
పురోఽభిపేతుర్భవదీయపార్షదాశ్చతుర్భుజాః పీతపటా మనోరమాః || ౨౨-౪


దేవా! అజామిళుడు దుర్మార్గుడైనప్పటికీ అతని ముఖము నుండి నీ నామము వెలువడిన వెంటనే నీ సేవకులు అక్కడకు వచ్చిరి. వారందరూ నాలుగు భుజములతో పీతాంబరములు ధరించి చాలా మనోహరముగా ఉన్నారు.

అముం చ సంపాశ్య వికర్షతో భతాన్ విముంచతేత్యారురుధుర్బలాదమీ |
నివారితాస్తే చ భవజ్జనైస్తదా తదీయపాపం నిఖిలం న్యవేదయన్ || ౨౨-౫

యమభటులు పాశములతో అజామిళుని లాగుచుండగా విష్ణుభటులు వదలి పెట్టుమని వారిని వారిన్చిరి. అప్పుడు వారు అజామీళుడు చేసిన పాపములన్నిటినీ విష్ణు దూతలకు నివేదిన్చిరి. 

భవంతు పాపాని కథం తు నిష్కృతే కృతేఽపి భో దండనమస్తి పండితాః |
న నిష్కృతిః కిం విదితా భవాదృశామితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౬

ప్రభూ! అప్పుడు నీ భటులు ఆ యమదూతలతో యిట్లనిరి. 'దండనీతి పండితులారా! యితడు చాలా పాపములు చేసే ఉండవచ్చు. కానీ, వాటికి ప్రాయశ్చిత్తము చేసికొన్న పిదప దండనము విధించవలసిన అవసరము ఎట్లుండును? మీ వంటి వారికి ఈ ప్రాయశ్చిత్తము గురించి తెలియదా ఏమి?"

శ్రుతిస్మృతిభ్యాం విహితా వ్రతాదయః పునంతి పాపం న లునంతి వాసనామ్ |
అనంతసేవా తు నికృంతతి ద్వయీమితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౭

"యమభటులారా! వేదాలు, ధర్మ శాస్త్రాలలో చెప్పబడిన వ్రతములు మొదలైనవి పాపములను రూపుమాపును కానీ పాపముల వాసనలను మాత్రము తొలగించ జాలవు. అయితే శ్రీమన్నారాయణుని సేవ పాపములను, వాటి వాసనలు కూడా అంతరిమపజేయును " అని నీ భటులు వారితో పలికిరి.   

అనేన భో జన్మసహస్రకోటిభిః కృతేషు పాపేష్వపి నిష్కృతిః కృతా |
తదగ్రహీన్నామ భయాకులో హరేరితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౮

 "ఈ అజామీళుడు మృత్యు భయముతో నైనను శ్రీహరి నామమును ఉచ్చరించెను. దాని వలన వేల కోట్ల జన్మములలో చేసిన పాపములకన్నిటికీ ప్రాయశ్చిత్తము చేసికోన్నట్లు అయినది. " అని విష్ణు భటులు యమదూతలతో పలికిరి.

నృణామబుద్ధ్యాపి ముకుందకీర్తనం దహత్యఘౌఘాన్మహిమాస్య తాదృశః |
యథాగ్నిరేధాంసి యథౌషధం గదానితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౯

"మానవులు బుద్ధి పూర్వకముగా కాకున్నను హరియొక్క నామ కీర్తన చేసినచో అగ్ని కట్టెలను దహించినట్లు, ఔషధము  రోగములను రూపుమాపినట్లు, అది వారి పాపములను నాశనము చేయును. శ్రీ హరి నామ కీర్తన మహిమ అంత గొప్పది" అని విష్ణు భటులు యమదూతలతో పలికిరి.

ఇతీరితైర్యామ్యభటైరపాసృతే భవద్భటానాం చ గణే తిరోహితే |
భవత్స్మృతిం కంచన కాలమాచరన్భవత్పదం ప్రాపి భవద్భటైరసౌ || ౨౨-౧౦


ఈ విధముగా విష్ణు భటులు పలికినందు వలన యమభటులు అజామీళుని వదలి పెట్టి వెళ్లి పోయిరి. అప్పుడు విష్ణు భటులు కూడా తమ లోకమునకు వెళ్ళిపోయిరి. అందువలన అజామీళుడు కొంత కాలము శ్రీహరిని ధ్యానించుచు కాలము గడపి, చివరకు నీ భటులు వెంటరాగా నీలోకమైన వైకుంఠము చేరుకునెను.

స్వకింగరావేదనశంకితో యమస్త్వదంఘ్రిభక్తేషు న గమ్యతామితి |
స్వకీయభృత్యానశిశిక్షదుచ్చకైః స దేవ వాతాలయ పాహి మామ్ || ౨౨-౧౧

తన కింకరులు ఈ వృత్తాంతము అంతా యమధర్మ రాజుకు తెలియపరచిరి. అందువలన యమధర్మ రాజు భయపడి విష్ణుభక్తుల దగ్గరకు పోరాదని తన భటులను హెచ్చరించెను. అట్టి మహిమ గల గురువాయురప్పా! నన్ను నీవు రక్షింపుము.

ఇరువదిమూడవ స్కంధము - చిత్రకేతూపాఖ్యానం
ప్రాచేతస్తు భగవన్నపరోఽపి దక్షః
త్వత్సేవనం వ్యధిత సర్గవివృద్ధికామః |
ఆవిర్బభూవిథ తదా లసదష్టబాహుః
తస్మై వరం దదిథ తాం చ వధూమసిక్నీమ్ || ౨౩-౧||


ఓ నారాయణా! ప్రాచేతసులకు దక్షుడను పుత్రుడు ఉండెను. యితడు బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షుడు కాదు. అతడు సంతానాభివ్రుద్ధికై నిన్ను సేవించెను. అప్పుడు నీవు ఎనిమిది చేతులతో ప్రత్యక్షమై ఆ దక్షునకు అసిక్ని అను భార్యను, అతడు కోరిన వరమును కూడా ఇచ్చితివి.

తస్యాత్మజాస్త్వయుతమీశ పునః సహస్రం
శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః |
నైకత్రవాసమృషయే స ముమోచ శాపం
భక్తోత్తమస్త్వృషిరనుగ్నహమేవ మేనే || ౨౩-౨||


దక్షునకు అసిక్ని యందు పదకొండు వేలమంది పుత్రులు కలిగిరి. వారిని దక్షుడు ప్రజావృద్ది చేయుమని కోరగా వారు సత్సంతానము కొరకు తపస్సు చేయ సాగిరి. అప్పుడు నారదుడు వచ్చి ఉపదేశము చేసినందు వలన వారందరూ నిన్ను ధ్యానించుచు తత్త్వమార్గమున ఉండిరి. ఈ విధముగా తన పుత్రులు సంతానాభివ్రుద్ద్ది చేయుటకు విముఖులైనందు వలన దక్షుడు కోపముతో నారదుని ఒకచోట ఉండవద్దని శపించెను. నారదుడు దానిని తనకు వరముగా భావించెను.

షష్ట్యా తతో దుహితృభిః సృజతః కులౌఘాన్
దౌహిత్రసూనురథ తస్య స విశ్వరూపః |
త్వత్స్తోత్రవర్మితమజాపయదింద్రమాజౌ
దేవ త్వదీయమహిమా ఖలు సర్వజైత్రః || ౨౩-౩||

అనంతరము దక్షుని కుమార్తెలైన అదితి మొదలగు అరువది మంది ద్వారా చరాచర సృష్టి జరిగెను. అదితి కుమారుడైన త్వష్ట ప్రజాపతికి అతని భార్యయైన రచన యందు విశ్వరూపుడు జన్మించెను. అతడు నీ స్తోత్రమైన నారాయణ కవచమును ఇంద్రునకు ఉపదేశించెను. దాని ప్రభావమున దేవాసుర యుద్ధములో ఇంద్రునకు విజయము కలిగెను. ప్రభూ! నీ అనుగ్రహము ఉన్నచో అందరికి జయము కలుగును కదా!

ప్రాక్శూరసేనవిషయే కిల చిత్రకేతుః
పుత్రాగ్రహీ నృపతిరంగిరసః ప్రభావాత్ |
లబ్ధ్వైకపుత్రమథ తత్ర హతే సపత్నీ-
సంఘైరముహ్యదవశస్తవ మాయయాసౌ || ౨౩-౪||



పూర్వ కాలమున శూరసేన రాజ్యమునకు చిత్రకేతుడను రాజు పరిపాలించు చుండెను. అతనికి చాలా కాలము సంతానము కలుగలేదు. అంగీరసుడను ముని అనుగ్రహము వలన అతనికి ఒక పుత్రుడు కలిగెను. కాని అసూయ కలిగిన అతని యొక్క ఇతర భార్యలు ఆ శిశువును చంపివేసిరి. అందువలన చిత్రకేతు మనోనిగ్రహము లేక నీ మాయ వలన బాధ పడుచుండెను.

తం నారదస్తు సమమంగిరసా దయాళుః
సంప్రాప్య తావదుపదర్శ్య సుతస్య జీవమ్ |
కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం
త్యక్త్వా త్వదర్చనవిధౌ నృపతిం న్యయుంక్త || ౨౩-౫||

ఆ సమయంలో నారద మహర్షి అంగీరస మహర్షితో కలిసి చిత్రకేతు మహారాజు వద్దకు వచ్చెను. రాజు దుస్థితి చూసి చనిపోయిన పుత్రుని యొక్క ఆత్మను అక్కడకు రాప్పించెను. ఆ ఆత్మ 'నేనెవ్వరి పుత్రుడను' అని ఎదురు ప్రశ్న వేయుటచే చిత్రకేతువు మోహమును వదులుకొని పర్మాత్మవాగు నిన్నే ఆరాధించ సాగెను. ఇది అంతయు నీ భక్తుడైన నారదమహర్షి అనుగ్రహము వలన జరిగినది. 

స్తోత్రం చ మంత్రమపి నారదతోఽథ లబ్ధ్వా
తోషాయ శేషవపుషో నను తే తపస్యన్ |
విద్యాధరాధిపతితాం స హి సప్తరాత్రే
లబ్ధ్వాప్యకుంఠమతిరన్వభజద్భవంతమ్ || ౨౩-౬||

నారదమహర్షి చిత్రకేతు మహారాజునకు స్తోత్రమును, మంత్రమును ఉపదేశించెను. వాటిచేత ఆ మహారాజు ఆదిశేషుని రూపమున నున్న నిన్ను ఆరాధిస్తూ ఏడు రాత్రులలో విద్యాధరులకు అధిపతి అయ్యెను. తరువాత కూడా ఆ చిత్రకేతువు ఏకాగ్ర చిత్తముతో నిన్నే సేవించుచుండెను.

తస్మై మృణాళధవళేన సహస్రశీర్ష్ణా
రూపేణ బద్ధనుతిసిద్ధగణావృతేన |
ప్రాదుర్భవన్నచిరతో నుతిభిః ప్రసన్నో
దత్త్వాత్మతత్వమనుగృహ్య తిరోదధాథ || ౨౩-౭||

స్వామీ! అంతంత నీవు వేయి పడగలు గల ఆదిశేషుని రూపముతో ఆ మహారాజునకు ప్రత్యక్షమైతివి. అప్పుడు తెల్లని పద్మనాలము వలె శోభిల్లుచుండివి. సిద్ధులు, మునులు మొదలగు వారు నీ చుట్టును చేరి అంజలి ఘటించి, నిన్ను నుతించు చుండిరి. అంతట నీవు చిత్రకేతువు యొక్క స్తుతులకు ప్రసన్నుడవై ఆయనకు ఆత్మ తత్త్వమును ప్రసాదించి అంతర్ధానమైతివి. 

త్వద్భక్తమౌలిరథ సోఽపి చ లక్షలక్షం
వర్షాణి హర్షులమనా భువనేషు కామమ్ |
సంగాపయన్ గుణగణం తవ సుందరీభిః
సంగాతిరేకరహితో లలితం చచార || ౨౩-౮||


ప్రభూ! నా భక్తశిఖామణియైన చిత్రకేతువు మిక్కిలి ఆనందముతో నీ దివ్య గుణగణములను, గాథలను కీర్తించుచు గాంధర్వ స్త్రీలతో కలిసియున్నప్పటికి సంగరహితుడై అనేక లక్షకోట్ల సంవత్సరములు భూమండలమున సంచరించెను.

అత్యంతసంగవిలయాయ భవత్ప్రణున్నో
నూనం స రూప్యగిరిమాప్య మహత్సమాజే |
నిశ్శంకమంకకృతవల్లభమంగజారిమ్
తం శంకరం పరిహసన్నుమయాభిశేపే || ౨౩-౯||

చిత్రకేతువు సర్వసంగ పరిత్యాగి కాదలచి నీ ప్రేరణచే కైలాసగిరికి పోయెను. అప్పుడు దేవతలు మహర్షులు మొదలైన వారు ఎందరో సేవించు చుండగా పార్వతీదేవి ఒడిలోనున్న శంకరుని చూచి చిత్రకేతువు పరిహసింపగా అందుకు పార్వతీదేవి కోపించి అతనిని శపించినది. 
 
నిస్సంభ్రమస్త్వయమయాచితశాపమోక్షో
వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధీ |
భక్త్యాత్మతత్త్వకథనైస్సమరే విచిత్రం
శత్రోరపి భ్రమమపాస్య గతః పదం తే || ౨౩-౧౦||


నీపై పరిపూర్ణ భక్తి గల చిత్రకేతువు పార్వతీదేవి శాపమునకు భయపడలేదు, శాపవిమోచనము చేయుమని ప్రార్థించలేదు. అందువలన అతడు వ్రుత్రాసునిగా జన్మించి ఇంద్రునితో యుద్ధము చేయుచు అతనికి ఆత్మ తత్త్వమును తెలిపెను. ఈ విధముగా అతడు శత్రువు యొక్క మోహమును కూడా దూరము చేసి చివరకు వైకుంఠము చేరుకోనేను. ఇది ఎంత విచిత్రము!

త్వత్సేవనేన దితిరింద్రవధోద్యతాఽపి
తాన్ప్రత్యుతేంద్రసుహృదో మరుతోఽభిలేభే |
దుష్టాశయేఽపి శుభదైవ భవన్నిషేవా
తత్తాదృశస్త్వమవ మాం పవనాలయేశ || ౨౩-౧౧||

పరమాత్మా! గురువాయురప్పా! ఇంద్రుని చంపవలెనను కోరికతో దితి నిన్ను ఆరాధించెను. ఆమెకు కలిగిన మరుత్తులు ఇంద్రునకు మిత్రులైరి. చెడు భావనతో నైనా నిన్ను సేవించినను శుభములే కలుగును కదా! ఈ విధముగా శుభములను కలిగించు స్వామీ! నన్ను రక్షింపుము.

బాలముకుందాష్టకం - తాత్పర్యము

అందానికి, ఆనందానికి రూపము ఆ బాల కృష్ణుడే. ఆయనను ఎంత వర్ణించినా తనివితీరదు. యశోద ముద్దుల బిడ్డగా, గోకుల బాల బృంద నాయకుడిగా, గోపికలకు నాథునిగా, పూతనాది రాక్షస సంహారునిగా, దధి నవనీత చోరునిగా ఆ కొంటె కృష్ణుని లీలలు అనంతము, అనిర్వచనీయము. చిన్న కృష్ణుని వర్ణిస్తూ రచించ బడిన మనోజ్ఞమైన అష్టకం ఈ బాలముకుందాష్టకం. ఆయన కన్నులు, చేతులు, పాదములు, దేహము, ముఖము, చిరునవ్వు, కొంటె చేష్టలు, గోకులంలో లీలలు ఈ స్తోత్రములో వర్ణించ బడ్డాయి. దీన్ని రచించింది ఎవరో తెలియలేదు.  అష్టకము, తాత్పర్యము, శ్రవణం.


కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం |
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || ౧||

కలువల వంటి చేతులతో పద్మముల వంటి పాదములు పట్టుకొని తన కలువ వంటి ముఖము వద్దకు తీసుకువచ్చి మనలను అలరించే, వట పాత్ర శాయి అయిన ఆ బాల ముకుందుని (మొక్షానందాన్ని కలిగించే వాడు) మనసులో స్మరిస్తున్నాను.


సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || ౨||

ప్రళయాన్తరమున వటపత్రముపై శయనించే వాడు, ఆద్యన్తములు లేని రూపము కలవాడు, సర్వేశ్వరుడు, అందరి మంచి కొరకై అవతిరించిన వాడు అయిన బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.



ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మం |
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || ౩||

నీలి కలువవలె నల్లని మేని కలవాడు, దేవతలు, ఇంద్రునిచే కొలవబడిన పాద పద్మములు కలవాడు, ఆశ్రితుల కోరికలు తీర్చె కల్పవృక్షము వంటి వాడు అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.


 
లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిం |
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౪||

ముఖముపై వాలుతున్న కేశములు కలవాడు, పొడవైన హారములు ధరించే వాడు, ప్రేమతో ప్రకాశించే అమృతమును కురిపించే పలువరుస కలవాడు, దొండపండు వంటి ఎర్రని పెదవులు కలవాడు, సమ్మోహన పరిచే నయనములు కలవాడు అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.



శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయాం |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || ౫||

యశోద వెన్న, పాలు, పెరుగు ముంతలలో దాచి బయటికి వెళ్లిన తరువాత, తన కోరికే తీరే మీర వెన్నను తిని నిదురిస్తున్నట్లు నటించే వాడు అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.



కళిందజాంతస్థితకాళియస్య ఫణాగ్రరంగే నటనప్రియంతం |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౬||

శరత్కాలములో చంద్రునివంటి ముఖము కలవాడు, కాళింది మడుగున కాళీయుని తోకను ఒక చేత పట్టి, దాని పడగపై నాట్యము చేస్తూ ఉండే వాడు అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.



ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలం |
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౭||

రోకలికి కట్టబడిన వాడు, ఉదారము, శౌర్యము కలవాడు, అర్జున వృక్షములను పడగొట్టి నలకూబరులనే యక్షుల శాపము తీర్చిన వాడు, విచ్చిన ఎర్రని కలువల వంటి విశాలమైన నేత్రములు కలవాడు అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను.



ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షం |
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || ౨||

పాలు తాగేటప్పుడు తల్లివంక ప్రేమతో చూసేవాడు, కలువల వంటి కన్నులు కలవాడు, సత్యము, నిత్యము అయిన వాడు, అనంతమైన రూపము కల దేవుడు  అయిన  బాల ముకుందుని మనసులో స్మరిస్తున్నాను. 

7, జనవరి 2011, శుక్రవారం

శ్రీమన్నారాయణీయం - పంచమ స్కంధము, తాత్పర్యము

 శ్రీమన్నారాయణీయం - పంచమ స్కంధము


ఇరువదియవ దశకము - ఋషభుని చరితము

ప్రియవ్రతస్య ప్రియపుత్రభూతాదాగ్నీధ్రరాజాదుదితో హి నాభిః |
త్వాం దృష్టవానిష్టదమిష్టమధ్యే తవైవ తుష్ట్యై కృతయజ్ఞకర్మా || ౨౦-౧

మనువు యొక్క తనయులలో రెండవవాడు ప్రియవ్రతుడు. అతని పుత్రుడు అగ్నీధ్రుడు. అతని యొక్క కుమారుడు నాభి. అతడు నీ అనుగ్రహముకై అనేక యజ్ఞ యాగములు చేసెను. అప్పుడు నీవు సంతోషించి యజ్ఞము చేయు చున్నప్పుడే ప్రత్యక్షమైతివి.

అభిష్టుతస్తత్ర మునీశ్వరైస్త్వం రాజ్ఞః స్వతుల్యం సుతమర్థ్యమానః |
స్వయం జనిష్యేఽహమితి బ్రువాణస్తిరోదధా బర్హిషి విశ్వమూర్తే || ౨౦-౨

ఓ నారాయణా! అప్పుడు మునీశ్వరులందరూ నిన్ను స్తుతించిరి. అట్లే నాభి మహారాజుకు నీవంటి పుత్రుడు కలుగవలయునని ఋత్విక్కులు ప్రార్థించగా నీవు స్వయముగా "పుత్రుడనై జన్మింతును" అని వరమిచ్చి అదృశ్యమైతివి.

నాభిప్రియాయామథ మేరుదేవ్యాం త్వమంశతోఽభూరృషభాభిధానః |
అలోకసామాన్యగుణప్రభావప్రభావితాశేషజనప్రమోదః  || ౨౦-౩||

నాభి యొక్క పట్టపురాణి అయిన మేరుదేవికి  నీ అంశతో ఋషభుడను పేర నీవు జన్మించితివి. అలౌకికములు, అసామాన్యములు అయిన నీ గుణగణములను చూచినా జనులందరూ అంతులేని సంతోషమును పొందిరి.

త్వయి త్రిలోకీభృతి రాజ్యభారం నిధాయ నాభిః సహ మేరుదేవ్యా |
తపోవనం ప్రాప్య భవన్నిషేవీ గతః కిలానందపదం పదం తే || ౨౦-౪

ముల్లోకములను అవలీలగా ఋషభునిపై నాభి రాజ్యభారం మోపి తన భార్య ఐన మేరుదేవితో కలసి వానప్రస్థమునకు వెళ్ళెను. అక్కడ నిన్ను ధ్యానించుచు ముక్తిని పొందెను.

ఇంద్రస్త్వదుత్కర్షకృతాదమర్షాద్వవర్ష నాస్మిన్నజనాభవర్షే |
యదా తదా త్వం నిజయోగశక్త్యా స్వవర్షమేనద్వ్యదధాః సువర్షమ్ || ౨౦-౫

నీ గొప్పతనము విని సహించలేని ఇంద్రుడు అసూయపడి అజనాభ వర్షమను పేరు గల ఈ భారత దేశంలో వర్షములు కురిపించలేదు. అప్పుడు ఋషభుడను పేరు గల నీవు నీయొక్క యోగశక్తిచే మంచి వానలు కురిసేలా చేసితివి.

జితేంద్రదత్తాం కమనీం జయంతీమథోద్వహన్నాత్మరతాశయోఽపి |
అజీజనత్తత్ర శతం తనూజాన్యేషాం క్షితీశో భరతోఽగ్రజన్మా || ౨౦-౬

స్వామీ! ఋషభుడు యోగ సాధన వలన ఆత్మానందమున మునిగి యున్నప్పటికీ ఇంద్రుడు ఇచ్చిన జయంతి అను అందమైన కన్యను వివాహమాడి ఆమె ద్వారా వంద మంది పుత్రులకు జన్మ ఇచ్చెను. వారిలో భరతుడు అందరికన్నా పెద్దవాడు.

నవాభవన్యోగివరా నవాన్యే త్వపాలయన్భారతవర్షఖండాన్ |
సైకా త్వశీతిస్తవ శేషపుత్రాస్తపోబలాద్భూసురభూయమీయుః || ౨౦-౭

ఈ వందమంది పుత్రులలో తొమ్మిది మంది యోగీశ్వరులు. భరతుడు కాక ఇంకా తొమ్మిది మంది భారతవర్షములో ఆయా ఖండములను పరిపాలించారు. మిగిలిన ఎనభై ఒక్క మంది పుత్రులు తపస్సు చేసి బ్రాహ్మణులు అయ్యారు. భరతుడు భారత దేశమునకు చక్రవర్తి అయ్యెను.

ఉక్త్వా సుతేభ్యోఽథ మునీంద్రమధ్యే విరక్తిభక్త్యన్వితముక్తిమార్గమ్ |
స్వయం గతః పారమహంస్యవృత్తిమధా జడోన్మత్తపిశాచచర్యామ్ || ౨౦-౮

ఋషభుడు మునీన్ద్రులున్న సభలో తన పుత్రులందరికి విరక్తి, భక్తి కలిసిన ముక్తి మార్గమును బోధించెను. తరువాత జడుని వలె, ఉన్మత్తుని వలె, పిశాచమువలె ప్రవర్తిన్చుచు సన్యాసము స్వీకరించెను.

పరాత్మభూతోఽపి పరోపదేశం కుర్వన్భవన్సర్వనిరస్యమానః |
వికారహీనో విచచార కృత్స్నాం మహీమహీనాత్మరసాభిలీనః || ౨౦-౯||

స్వామీ! ఋషభుని అవతారమున నీవు సన్యాసము స్వీకరించి నప్పటికీ, ఇతరులకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుచుంటివి. అట్లే, అందరిచే తిరస్కరిన్చబడుచును రాగా ద్వేషములు లేక ఆత్మానంద రసములో మునిగిపోయి భూమి యంతా తిరుగుచుంటివి.

శయువ్రతం గోమృగకాకచర్యాం చిరం చరన్నాప్య పరం స్వరూపమ్ |
దవాహృతాంగః కుటకాచలే త్వం తాపాన్మమాపాకురు వాతనాథ || ౨౦-౧౦

స్వామీ! నీవు ఋషభుడి అవతారములో అజగర వ్రతమును పూని, గోవు, లేడి, కాకి మొదలగు వాటివలె అన్నపానముల విషయమున విధినిషేధములు, శుద్ధి, ఆశుద్ధి అనే వాటిని పట్టించుకొనక ఎక్కడ కూడా ఆశ్రమమును ఏర్పరచుకొనక తిరుగుచు కుటకాచలమున దావాగ్నికి గురియై పరబ్రహ్మ భావమును పొందితివి. అట్టి గురువాయుపురాధీశ! నా బాధలనన్నిటినీ దూరము చేయుము.

ఇరువదియొకటవ దశకము - జంబూద్వీపాదులయందు భగవదుపాసనము


మధ్యోద్భవే భువ ఇళావృతనామ్ని వర్షే
గౌరీప్రధానవనితాజనమాత్రభాజి |
శర్వేణ మంత్రనుతిభిః సుముపాస్యమానం
సంకర్షణాత్మకమధీశ్వర సంశ్రయే త్వామ్ || ౨౧-౧||

ఓ జగన్నాథా! భూమికి మధ్య భాగమున గౌరి మొదలైన స్త్రీలు మాత్రమే ఉండు ఇళావృత వర్షమున్నది. అక్కడ శంకరుడు వేదమంత్రములచే సంకర్షణ రూపమున ఉన్న నిన్న సదా స్తుతించుచుండును. అట్టి నిన్ను ఆశ్రయింతును.

భద్రాశ్వనామక ఇళావృతపూర్వవర్షే
భద్రశ్రవోభిరృషిభిః పరిణూయమానమ్ |
కల్పాంతగూఢనిగమోద్ధరణప్రవీణం
ధ్యాయామి దేవ హయశీర్షతనుం భవంతమ్ || ౨౧-౨||


దేవా! ఇళావృత దేశమునకు తూర్పు దిక్కున భద్రాశ్వము అను ప్రదేశము కలదు. కల్పాంతమున అపహరించబడిన వేదములను హయగ్రీవ రూపమున ఉద్ధరించిన నీవు అచట విలసిల్లు చుందువు. అచట భద్రశ్రవులు అను మహర్షులు నిన్ను స్తుతించుచుందురు. అట్టి నిన్ను నేను సర్వదా ధ్యానిన్చుదును.


ధ్యాయామి దక్షిణగతే హరివర్షవర్షే
ప్రాహ్లాదముఖ్యపురుషైః పరిషేవ్యమాణమ్ |
ఉత్తుంగశాంతధవలాకృతిమేకశుద్ధ-
జ్ఞానప్రదం నరహరిం భగవన్ భవంతమ్ || ౨౧-౩||

భగవాన్! ఇళావృత వర్షమునకు దక్షిణ దిక్కున హరివర్శ దేశము అను ప్రదేశము కలదు. అక్కడ నృసింహ స్వామి రూపమున పరమ శాంత రూపుడవై తెల్లని ఆకారములో నీవు విరాజిల్లు చుందువు. పరిశుద్ధమైన జ్ఞానము నొసగు నిన్ను ప్రహ్లాదుడు మొదలైన భక్తులు సదా స్తుతించు చుందురు. అట్టి నిన్ను నేను నిరంతరమూ ధ్యానింతును.

వర్షే ప్రతీచి లలితాత్మని కేతుమాలే
లీలావిశేషలలితస్మితశోభనాంగమ్ |
లక్ష్మ్యా ప్రజాపతిసుతైశ్చ నిషేవ్యమాణం
తస్యాః ప్రియాయ ధృతకామతనుం భజే త్వామ్ || ౨౧-౪||

ఇళావృతమునకు పశ్చిమ భాగమున అందమైన కేతుమాలమను ప్రదేశమున్నది. అక్కడ లక్ష్మీదేవికి ప్రియము కలిగించుటకై నీవు అందమైన చిరునవ్వుతో మన్మథుని రూపమున ఉన్నావు. అట్టి నిన్ను అక్కడ లక్ష్మీదేవి మరియు ప్రజాపతి యొక్క పుత్రులు ఎల్లప్పుడూ సేవించు చుందురు. అట్టి నిన్ను సదా నేను ధ్యానింతును.

రమ్యేహ్యుదీచి ఖలు రమ్యకనామ్ని వర్షే
తద్వర్షనాథమనువర్యసపర్యమాణమ్ |
భక్తైకవత్సలమమత్సరహృత్సు భాంతం
మత్స్యాకృతిం భువననాథ భజే భవంతమ్ || ౨౧-౫||

జగన్నాథా! శ్రీ కృష్ణా! ఇళావృత వర్షమునకు ఉత్తరభాగమున అందమైన రమ్యకమను ప్రదేశామున్నది. దానికి అధిపతియైన వైవస్వత మనువు మత్స్యావతార రూపుడవైన నిన్ను సదా ధ్యానించు చుండును. నీవు భక్త జనమును విశేషముగా ఆదరింతువు. మాత్సర్యములేని వారి హృదయములందు నీవు సదా భాసిల్లు చుందువు. అట్టి దివ్య రూపుడవైన నిన్ను నేను ఎల్లప్పుడూ భజింతును.

వర్షం హిరణ్మయసమాహ్వయమౌత్తరాహ-
మాసీనమద్రిధృతికర్మఠకామఠాంగమ్ |
సంసేవతే పితృగణప్రవరోఽర్యమాయం
తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్ || ౨౧-౬||

పరమానంద స్వరూపా! శ్రీ కృష్ణా! రమ్యక వర్శమునకు ఉత్తర దిక్కున హిరణ్మయమను ప్రదేశము కలదు. అచ్చట పితృ గానమందు ఉత్తముడైన ఆర్యముడు మందరాచలమును ఎత్తిన కూర్మ రూపుడవైన నిన్ను సేవించు చుండును. అట్టి నిన్ను ఎల్లపుడు నేను ధ్యానింతును.

కిం చోత్తరేషు కురుషు ప్రియయా ధరణ్యా
సంసేవితో మహితమంత్రనుతిప్రభేదైః |
దంష్ట్రాగ్రఘృష్టఘనపృష్ఠగరిష్ఠవర్ష్మా
త్వం పాహి విజ్ఞనుతయజ్ఞవరాహమూర్తే || ౨౧-౭||

జ్ఞానులైన రుషులచేత స్తుతించబడిన యజ్ఞ వరాహమూర్తీ! ఉత్తర కురు దేశముల యందు నీకు ప్రియమైన భూదేవి అనేక విధములైన స్తోత్రములచే నిన్ను నుతించు చుండును. వరాహమూర్తివైన నీ యొక్క కోరల చివరలు మేఘములను తాకునంత ఎత్తుగా ఉన్నవి. అట్టి ఉన్నత రూపుడవైన నీవు అనను రక్షించుము.

యామ్యాం దిశం భజతి కింపురుషాఖ్యవర్షే
సంసేవితో హనుమతా దృఢభక్తిభాజా |
సీతాభిరామపరమాద్భుతరూపశాలీ
రామాత్మకః పరిలసన్పరిపాహి విష్ణో || ౨౧-౮||

ఇళావృత దేశమునకు దక్షిణముననున్న కింపురుషమను ప్రదేశమునందు హనుమంతుడు మిగుల అద్భుతమైన అందచందములతో విరాజిల్లేది సీతా రామచంద్రమూర్తిని సేవించు చుండును. అట్టి శ్రీరాముడవైన శ్రీ మహావిష్ణూ! నీవు నన్ను దయతో రక్షించుము.

శ్రీనారదేన సహ భారతఖండముఖ్యైస్
త్వం సాంఖ్యయోగనుతిభిః సముపాస్యమానః |
ఆకల్పకాలమిహ సాధుజనాభిరక్షీ
నారాయణో నరసఖః పరిపాహి భూమన్ || ౨౧-౯||

స్వామీ! భారత ఖండమున నీవు నరనారాయణుల రూపమున వెలసి ఎల్లప్పుడును సజ్జనులను రక్షించు చుందువు. ప్రముఖులైన నారదాది మహర్షులు సాంఖ్య యోగ స్తుతులచే నిన్ను స్తుతించు చుందురు. అట్టి పరమాత్ముడ వైన నీవు నన్ను రక్షించుము.

ప్లాక్షేఽర్కరూపమయి శాల్మల ఇందురూపం
ద్వీయే భజంతి కుశనామని వహ్నిరూపమ్ |
క్రౌంచేఽంబురూపమథ వాయుమయం చ శాకే
త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనామ్ని లోకాః || ౨౧-౧౦||

ప్రభూ! నీవు ప్లక్ష ద్వీపమునందు సూర్య రూపమునను, శాల్మల ద్వీపమునందు చంద్ర రూపమునను, కుశ ద్వీపమున అగ్నిరూపమునను, క్రౌంచ ద్వీపమున జలాధిదేవత రూపమునను, శాక ద్వీపమున వాయుదేవతా రూపమునను, పుష్కర ద్వీపమున బ్రహ్మ రూపమునను విరాజిల్లు చున్నావు. ఈ విధముగా సర్వ దేవతా రూపుడవైన నిన్ను మానవులందరూ సేవించు చున్నారు.

సర్వైర్ధ్రువీదిభిరుడుప్రకరైర్గ్రహైశ్చ
పుచ్ఛాదికేష్వవయవేష్వభికల్ప్యమానైః |
త్వం శింశుమారవపుషా మహతాముపాస్యః
సంధ్యాసు రుంధి నరకం మమ సింధుశాయిన్ || ౨౧-౧౧||


క్షీర సాగరమున శయనించు చున్న నారాయణా! శింశుమార రూపమున నున్న నీ యొక్క పుచ్చము మొదలైన అవయవాములందు ద్రువాడి నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు మొదలైన గ్రహములున్నట్లు కల్పిన్చ బడుచున్నవి.  ఆ శింశుమార రూపమున నున్న నిన్ను మహాత్ములు మూడు సంధ్యా సమయములందు ఉపాసించు చున్నారు. అట్టి శింశుమార రూపా! పాపములను దూర మొనర్చి నాకు నరకము కలుగ కుండునట్లు అనుగ్రహించుము.


పాతాళమూలభువి శేషతనుం భవంతం
లోకైకకుండలవిరాజిసహస్రశీర్షమ్ |
నీలాంబరం ధృతహలం భుజగాంగనాభిః
జుష్టం భజే హర గదాన్గురుగేహనాథ || ౨౧-౧౨||

దేవా! పాతాళమున నీవు ఆదిశేషుని రూపమున ఉన్నావు. అక్కడ నీవు విలాసముగా కదలుతున్న కుండలములు గల వేయి శీర్శములతో రాజిల్లు చుందువు. ఎల్లప్పుడూ నీవు నీల వస్త్రమును ధరించి యుందువు. చేతిలో నాగలి ఉందును. నాగాన్గనలు ఎల్లపుడు నిన్ను కొలుచు చుందురు. అట్టి ఆదిశేషుని రూపముననున్న గురువాయురప్ప! నిన్ను నేను ఎల్లప్పుడును సేవింతును. కావున నా రోగములనన్నిటినీ సమూలముగా నాశనము చేయుము.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...