తెలుగు గడ్డ మీద పుట్టిన మధుర కర్నాటక సంగీత విద్వాంసులలో వోలేటి వేంకటేశ్వర్లు గారు అగ్రగణ్యులు. 1928లో రాజమహేంద్రవరంలో జన్మించిన వీరు అయిదవ ఏటనే సంగీత అభ్యాసాన్ని మొదలుపెట్టారు. చతుర్వేదుల అచ్యుతరామయ్యశాస్త్రి గారు, మునుగంటి వేంకటరావు పంతులు, ఆ తరువాత శ్రీపాద పినాకపాణి గారి వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పట్టభద్రులయ్యారు. 1951లో ఆకాశవాణిలో విజయవాడ కేంద్రంలో చేరారు. లలిత భక్తి సంగీతపు స్వర్ణయుగంలో బాలాంత్రపు రజనీకాంతరావు గారితో పాటు వోలేటి వారికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఆకాశవాణిలో సంగీత కార్యక్రమాలకు ప్రొడ్యూసార్‌గా పని చేసి ఎంతో పేరొందారు. ఎన్నో ఏళ్ల పాటు భక్తిరంజని, సంగీత శిక్షణ కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. కూచిపూడి యక్షగానాలు, ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు, నారాయణ తీర్థ తరంగాలు, అన్నమాచార్యుల కీర్తనలు..ఇలా ఎన్నో వోలేటి వారి సంగీత విద్వత్తు ద్వారా ప్రచారం పొందాయి. అంతే కాదు, లింగాష్టకం, మధురాష్టకం, హనుమాన్ చాలీసా వంటి స్తుతులకు సంగీతం కూర్చి ఆకాశవాణి ద్వారా ప్రచారం చేశారు.
రంజని, బేగడ, పంతువరాళి, వరాళి రాగాలు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా చెప్పబడతాయి. వెల్లూరు రామభద్రన్, దండమూడి రామమోహనరావు, కారైకుడి ఆర్. మణి వంటి మహా విద్వాంసులు తన గానానికి సహకరించిన సందర్భాలను వోలేటి ఎంతో ఆనందంగా భావించేవారు.
ప్రముఖ సంగీత విద్వాంసులు మల్లాది సూరిబాబు, అలాగే ఆయన కుమారులైన మల్లాది సోదరులు కూడా వోలేటి గానశైలిని ఆచరించి, ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. వోలేటి అసాధారణ ప్రతిభ, అపార సంగీతజ్ఞానం కలగలసిన మహా గాయకుడు. మూడు స్థాయిల్లోనూ నిర్మలమైన శ్రుతిశుద్ధితో, పరిపూర్ణమైన లయజ్ఞానంతో ఆయన ఆలపించగలిగేవారు. సంగీతం విషయంలో ఆయన ఆసక్తికి ఎలాంటి హద్దులూ ఉండేవి కావు. కర్ణాటక సంగీతంతో పాటు హిందుస్థానీ సంగీతం, గజల్ గానం పట్ల కూడా ఆయనకు అపారమైన అభిమానం ఉండేది. వివిధ్ భారతి వంటి రేడియో ప్రసారాలను గంటల తరబడి వింటూ బడే గులాం అలీ ఖాన్, మెహదీ హసన్ తదితర మహానుభావుల గానాన్ని ఆస్వాదించేవారు.
కొంతమంది సంగీతాభిమానులు, విద్వాంసులు వోలేటిని "దక్షిణాది బడే గులాం అలీ" అని ప్రశంసించేవారు. రాగాలాపన చివరి భాగంలో అప్పుడప్పుడు హిందుస్థానీ సంగీతంలోని అలంకారాలను, భావప్రకటనను సహజంగా మేళవించడం ఆయన ప్రత్యేకత. ఈ వినూత్న ప్రయోగం కొందరు సంప్రదాయవాదులలో ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ, సంగీతరసికులలో మాత్రం అపారమైన ఆనందాన్ని రేకెత్తించేది.
హిందుస్తానీ సంగీతం మీద ఉన్న మక్కువతో బడే గులాం అలీ ఖాన్ వంటి వారి సంగీతాన్ని బాగా విని కొంత ఆ శైలిని తన కర్ణాటక సంగీత శైలిలో కనబరచేవారు. గురువులు శ్రీపాద పినాకపాణి గారు వోలేటి వారిని ఓ మహామేధావిగా, తెలుగుగడ్డపై పుట్టిన అత్యంత ఉన్నతమైన ప్రతిభామూర్తిగా వర్ణించారు. సంగీత శిక్షణ ద్వారా గురువుగా ఎంతో పేరొందిన వోలేటి వారి శిష్యులలో ఎన్‌సీ్‌వీ జగన్నథాచార్యులు, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు గారు ప్రముఖులు. సంగీత నాటక అకాడెమీ అవార్డు, సంగీత చూడామణి, సుర్ సింగార్ వంటి బిరుదులను పొందారు. సంగీత శిక్షణపై ఉన్న అభిలాషతో ముందుగానే రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాద్ వచ్చి అక్కడ తన శైలిలో శిక్షణనిద్దామనుకున్నారు, ఆ ప్రయత్నం ఎక్కువ కాలం నడవలేదు. 1989వ సంవత్సరంలో మరణించిన వోలేటి వారి వ్యక్తిత్వం గురించి ఎందరో చెప్పుకునే వారు. ఆయన నిరాడంబరత, నిర్మలమైన మనసు, నిజాయితీ నేటి కళాకారులకు ఆదర్శం కావాలి.
వోలేటి వేంకటేశ్వర్లు గారు ఆలపించిన అన్నమాచార్యుల వారి కృతి నగవులు నిజమని నమ్మేదా విని ఆనందించండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి